శనివారం 27 ఫిబ్రవరి 2021
Zindagi - Jan 20, 2021 , 00:02:26

కమలా హ్యారిస్‌ అను నేను..

కమలా హ్యారిస్‌ అను నేను..

వయోధికుడైన అధ్యక్షుడి కంటే..ప్రౌఢ అయిన ఉపాధ్యక్షురాలు ఎప్పుడూ శక్తిమంతురాలే! కమలా హ్యారిస్‌కు విజయాలు కొత్త కాదు. పదవులు తెలియనివి కాదు. నిజానికి, ఆమె జీవితంలో ఏ విజయమూ యాదృచ్ఛికం కాదు. ఏ పదవీ పైరవీలతో రాలేదు. రమ్మన్నారా కమలమ్ములున్న కొలనుకు భ్రమరమ్ములనచ్యుతేంద్ర రఘునాథ నృపా! అన్నట్టు, కమలాలు ఉన్న చోటికి భ్రమరాలు వాటంతట అవే వస్తాయి.ఎవరూ బొట్టుపెట్టి పిలవరు! పదవులనే భ్రమరాలు కూడా కమలా హ్యారిస్‌ను వెతుక్కుంటూనే వచ్చాయి, అమెరికా ఉపాధ్యక్ష పీఠం సహా! 

2021... అమెరికాకు పరీక్షా సమయం. కొవిడ్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థ, చైనాతో కయ్యం, హింసాత్మక సంఘటనలు, వలసల గొడవలు, నిరుద్యోగం, ఆరోగ్య రంగ సంస్కరణలు... ఒక్కొక్కటిగా ఉక్కిరిబిక్కిరి చేస్తూ అగ్రరాజ్యపు హోదాకే ఎసరు తెచ్చే పరిస్థితులు.

ఈ నేపథ్యంలో జో బైడెన్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనే వార్త అంత ప్రాధాన్యం సంతరించుకోలేదు. ట్రంప్‌ దూకుడు ముందు కురువృద్ధుడైన బైడెన్‌ మెతకదనం వెలవెలబోతుందనే భావించారంతా. కానీ, కాలం గడిచేకొద్దీ పోరు రసవత్తరంగా మారింది. బైడెన్‌ పరిణతితోపాటు కమలా హ్యారిస్‌ చురుకుదనం ఎన్నికలకు కొత్త జోష్‌ తీసుకొచ్చింది. ‘ట్రంప్‌కు ఓటేద్దామా, వద్దా’ అన్న అనిశ్చితిలో ఉన్న ప్రవాసులంతా బైడెన్‌ వైపు మళ్లడం వెనుక కమల అయస్కాంతత్వం ఉంది. ప్రస్తుతానికి ఎన్నికల ఘట్టం ముగిసింది. దేశాన్ని పట్టాలమీదకు ఎక్కించి, పాత వైభవాన్ని తీసుకురావడం అన్నది బైడెన్‌, కమల ద్వయానికి అతిపెద్ద సవాలు.

నిర్భీతే నిచ్చెనగా

‘ఏ పనినైనా కృతనిశ్చయంతో చేయాలి’ అన్న తల్లి మాటే కమలకు వేదం. ఆమెను ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకోవడానికి బైడెన్‌ చెప్పిన తొలి కారణం కూడా అలాంటిదే. ‘దేన్నయినా ఎదుర్కోగల నిర్భీతి ఆమెలో ఉంది!’ అంటారాయన. సాక్షాత్తు దేశాధ్యక్షుడినే ఢీకొన్న చరిత్రా ఉంది తనకు. 2011లో కమల క్యాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు. ఆ పదవిని ఓ భారతీయురాలు అందుకోవడమే గొప్ప అని అందరూ సంతృప్తి పడుతున్న సమయంలో, ఆమె ఓ అనూహ్యమైన పోరు చేయాల్సి వచ్చింది. అప్పట్లో క్యాలిఫోర్నియాలో ‘సబ్‌ప్రైమ్‌ మార్ట్‌గేజ్‌' సమస్య వచ్చిపడింది. రియల్‌ ఎస్టేట్‌ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అప్పులు చేసి ఇండ్లను కొనుక్కున్న మధ్యతరగతివారు విలవిల్లాడుతున్న పరిస్థితి. వాళ్లపట్ల బ్యాంకులు ఎలాంటి కరుణా చూపలేదు. ఒబామా నేతృత్వంలోని ప్రభుత్వం కూడా సమస్య పరిష్కారానికి చొరవ ప్రదర్శించలేదు. కమల మాత్రం బాధితుల పక్షాన నిలబడ్డారు. బ్యాంకుల మెడలు వంచి, రుణభారాన్ని గణనీయంగా తగ్గించేలా కృషిచేశారు. ఓ దశలో, ‘ఆమెను ఓడించడం కష్టమే!’ అని ఒబామా సైతం అంగీకరించాల్సిన పరిస్థితిని సృష్టించారు. నిర్ణయాలు తీసుకోవడంలో, వాటిని అమలు చేయడంలో... కమల దూకుడు, పట్టుదల వివాదాస్పదం అయిన సందర్భాలూ ఉన్నాయి. కానీ, అనుభవం పెరిగే కొద్దీ ఆమెలో పరిణతి కూడా బలపడింది. సందర్భాన్నిబట్టి ఓ అడుగు వెనక్కి వేయడమూ నేర్చుకున్నారు. మరణ శిక్ష, నిర్బంధ విద్య లాంటి అంశాలమీద తన విధానాలను మార్చుకోవడమే ఇందుకు ఉదాహరణ. 

అధినేత్రిగా అన్ని అర్హతలూ

2017లో క్యాలిఫోర్నియా నుంచి అమెరికన్‌ సెనేట్‌లోకి అడుగుపెట్టారు కమల. ఆ స్థాయిని అందుకున్న తొలి దక్షిణాసియా మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘సెనేట్‌లో ఆమె ఏం సాధించగలదు?’ అని పెదవి విరిచిన వారు కూడా, కమల ప్రస్థానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. సెనేట్‌ కమిటీల్లో ఆమె వాక్చాతుర్యానికి అబ్బురపడిన ఉన్నతాధికారులు, ‘మీ దూకుడు చూస్తుంటే భయంగా ఉంది మేడమ్‌. కాస్త నిదానించండి’ అని అభ్యర్థించాల్సి వచ్చింది. వలస కుటుంబం నుంచి వచ్చిన అనుభవం, మధ్య తరగతి జీవితం, న్యాయశాస్త్రం మీద పట్టు, అటార్నీగా ప్రభుత్వ వ్యవస్థల పట్ల స్పష్టత... ఇవన్నీ కలిసి ఓ అధినాయకురాలికి అవసరమైన అస్త్రశస్ర్తాలను ఆమెకు అందించాయి. పైగా ఓ నేతగా ఎదిగేందుకు అవసరమైన కలుపుగోలుతనం కమలలో పుష్కలం. తన వృత్తిలో అంచెలంచెలుగా ఎదిగేందుకు, పార్టీలో అవకాశాలు దక్కించుకునేందుకు, ఎన్నికలకు నిధులు  సమీకరించేందుకు... ఈ చొరవే ఉపయోగపడింది.

వీటన్నిటినీ మించి బైడెన్‌ ఆమెను ఏరికోరి ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకోవడం వెనుకా ఓ ఉద్వేగ భరితమైన కారణం ఉంది. బైడెన్‌ కుమారుడు బ్యూ బైడెన్‌, కమలా హ్యారిస్‌ వృత్తిపరంగా స్నేహితులు. ‘సబ్‌ప్రైమ్‌ మార్ట్‌గేజ్‌' లాంటి అనేక సమస్యల పరిష్కారానికి  కలిసి కృషి చేశారు. బ్యూ దురదృష్టవశాత్తు బ్రెయిన్‌ ట్యూమర్‌తో  చనిపోయాడు. కానీ, తన కొడుకు నిత్యం కమల గురించి చెప్పిన మాటలూ, చేసిన ప్రశంసలూ బైడెన్‌ మనసులో అలానే ఉండిపోయాయి. అందుకే, ఆమె దూకుడు వల్ల ఊహించని సమస్యలు వస్తాయని సన్నిహితులు హెచ్చరించినా బైడెన్‌ పట్టించుకోలేదు.

మూడు తరాలు

ఓ విజేతలో వ్యక్తిత్వం మాత్రమే కాదు... తరాలుగా వస్తున్న అరుదైన లక్షణమేదో కనిపించకుండా దాగి ఉంటుంది. కమలను గమనిస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది. కమల అమ్మమ్మ రాజమ్‌ గోపాలన్‌ సాధారణ మహిళ కాదు. 1940లలోనే సొంతంగా కారు నడుపుతూ మారుమూల గ్రామాలకు వెళ్లేది. అక్కడి మహిళలకు కుటుంబ నియంత్రణ గురించి వివరించేది. ఎక్కడైనా ఆడవాళ్లను అణచివేస్తున్నట్టు తెలిస్తే, కొంగు బిగించి యుద్ధానికి బయల్దేరేది. నలుగురి ముందూ ఆ మొగుడికి చివాట్లు పెట్టేది, అవతలివాడు ఎంత మొనగాడైనా సరే. కమలా హ్యారిస్‌ శాన్‌ఫ్రాన్సిస్‌కో అటార్నీగా ఎంపికైన సందర్భంగా రాజమ్‌ భారత్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించింది. అందులో పాల్గొనడానికి కమల కూడా వచ్చింది. ‘మా అమ్మమ్మను చూసేందుకు తండోపతండాలుగా వచ్చిన జనాలనూ, ఆమె పట్ల ప్రజలకున్న గౌరవాన్నీ చూసి ఆశ్చర్యపోయాను’ అంటారు కమల. కమల తల్లి శ్యామలా గోపాలన్‌దీ విశిష్ట వ్యక్తిత్వమే! తన మనసుకు నచ్చిన చదువు కోసం పందొమ్మిదో ఏటే అమెరికాలో అడుగుపెట్టారు. పీహెచ్‌డీ సాధించి పరిశోధకురాలిగా స్థిరపడ్డారు. రొమ్ము క్యాన్సర్‌మీద ఆమె పరిశోధనలకు అమెరికాలో మంచి గుర్తింపే ఉంది. ‘సమయాన్ని వృథా చేయడం అమ్మకు అస్సలు నచ్చేది కాదు. పిల్లలు పరీక్షల్లో విజయం సాధించినా, అందరు అమ్మల్లా మురిసిపోయేది కాదు... నువ్వు చేయాల్సిన పని చేస్తే దానికి పొంగిపోవడం ఎందుకు? అనేది’ అంటూ తల్లిని తలచుకుంటారు కమల. తన వ్యక్తిత్వం మీద అమ్మమ్మ, అమ్మల ప్రభావం ఎక్కువని అంగీకరిస్తారు.


వ్యక్తిగతంగా! 

క్రమశిక్షణలో ఠంచనుగా ఉండే కమల, ఆహార్యం విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉంటారు. సందర్భానికి తగిన దుస్తులను ధరిస్తూ ఇప్పటికే ఫ్యాషన్‌ ఐకాన్‌గా మారిపోయారు. ఆమె కుటుంబ జీవితమూ ఆసక్తికరమే. 29 ఏండ్ల ప్రాయంలో, తనకంటే రెట్టింపు వయసు కలిగిన విలీ బ్రౌన్‌ అనే రాజకీయ నాయకుడితో డేటింగ్‌ చేశారు. ఆ పలుకుబడి ఆమె కెరీర్‌నే మార్చేసిందని చెబుతారు. తర్వాత, చాలారోజుల పాటు మరో బంధంలో ఇమడలేదు. కెరీర్‌లో ఎదుగుదలే తన ప్రథమ ప్రాధాన్యంగా మారిపోయింది. కానీ 50 ఏండ్ల వయసులో డగ్‌ ఎమ్‌హాఫ్‌ అనే ప్రముఖ లాయరును ప్రేమించి పెండ్లాడారు.

సవాళ్లకు సవాల్‌!

ఇప్పటి వరకూ కమల ఎదుర్కొన్న సవాళ్లూ, పరిష్కరించిన సమస్యలూ ఒక ఎత్తు. ఇక ముందు చేయాల్సిన పోరాటమంతా మరో ఎత్తు. ‘దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’ అని భయపడిపోతున్న అమెరికన్లకు ధైర్యం ఇవ్వడం ఆమె  తక్షణ కర్తవ్యం. ఈ ప్రయత్నంలో కమల ప్రతి కదలికనూ ప్రపంచం గమనిస్తూ ఉంటుంది. తేడా వస్తే చీల్చి చెండాడేందుకు ప్రత్యర్థులు సిద్ధంగా ఉంటారు. మరొక్క మాట. జో బైడెన్‌ వయసు ఇప్పటికే 78 ఏండ్లు. అనుకోని ఆరోగ్య సమస్యల వల్ల బైడెన్‌ తన బాధ్యతలను నిర్వర్తించలేకపోతే, కమల పూర్తిస్థాయి అధ్యక్ష పాత్రలో ఒదిగిపోవాల్సి ఉంటుంది. అందుకేనేమో బైడెన్‌ కూడా ‘ఏ క్షణంలో అయినా అధ్యక్ష పదవిని చేపట్టగల సమర్థులే ఉపాధ్యక్షులుగా ఉండాలి’ అని తరచూ చెబుతూ వచ్చారు. వీరిద్దరి పదవీకాలం ఎలాంటి ఒడుదొడుకులూ లేకుండా సాగిపోయినా... వచ్చే ఎన్నికలలో డెమొక్రాటిక్‌ పార్టీ తరఫున కమల అధ్యక్షురాలిగా పోటీ పడటం దాదాపుగా ఖాయం. అదే జరిగితే, అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కబోయే తొలి భారతీయురాలు కూడా తనే అవుతుంది. చుట్టూ సవాళ్లు, ఆ సవాళ్లకు ఆవల అద్భుతమైన అవకాశాలు.. మధ్యలో కమలా హ్యారిస్‌! 

అధికార నివాసం లేదు!

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం.. శ్వేతసౌధం. ఉపాధ్యక్షుడికి మాత్రం ప్రత్యేకమైన నివాసం అంటూ ఏదీ లేదు. 1923లో యూఎస్‌ నావల్‌ అబ్జర్వేటరీ తమ ఉన్నతాధికారి కోసం నిర్మించిన భవనాన్నే ప్రస్తుతం ఉపాధ్యక్షుడి నివాసంగా వినియోగిస్తున్నారు. అంతకు ముందు ఉపాధ్యక్షులుగా ఎన్నికైనవాళ్లు తమ సొంత ఇళ్లలోనే ఉండాల్సి వచ్చేది. నావల్‌ అబ్జర్వేటరీ భవంతి కాస్త సౌకర్యంగానే ఉండటంతో ఎవరూ కొత్త భవనం గురించి ప్రతిపాదించ లేదు. మిగతా సౌకర్యాల విషయంలో మాత్రం ఉపాధ్యక్షులది అసూయ కలిగించే వైభోగమే. అధ్యక్షుడు ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌'లో ప్రయాణించినట్టు, తన కోసం ‘ఎయిర్‌ఫోర్స్‌ టూ’ అనే ప్రత్యేక విమానం సిద్ధంగా ఉంటుంది. అత్యాధునాతనమైన హెలికాప్ట్టర్లు, కాన్వాయ్‌  సాగిలపడతాయి. శ్వేతసౌధంలోని ఉపాధ్యక్ష కార్యాలయంలో 80 మంది ఉద్యోగులు పని చేస్తుంటారు. కళ్లు చెదిరే జీతమూ, అలవెన్సులూ సరేసరి!

VIDEOS

logo