గురువారం 25 ఫిబ్రవరి 2021
Zindagi - Feb 14, 2021 , 00:07:49

ప్రేమ ఒక ఉప్పెన

ప్రేమ ఒక ఉప్పెన

అందాలన్నీ రాసిగా పోసి, మేలిమి సొగసుల వన్నెలతో చక్కటి ఆకృతినిస్తే కృతిశెట్టి రూపంలో సాక్షాత్కరిస్తుంది. పెదాలపై తారాడే చిరునవ్వుతో, కండ్లలోని చిలిపి కాంతులతో తెలుగునాట యువతరాన్ని వలపు ‘ఉప్పెన’తో ముంచెత్తుతున్నది ఈ తుళు సుందరి. ‘ఉప్పెన’ చిత్రంతో కథానాయికగా అరంగేట్రం చేసిన కృతి.. అందం, అమాయకత్వం కలబోసిన పాత్రలో ఒదిగిపోయి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది. వైద్యవృత్తిలో స్థిరపడాలనుకొని, అనుకోకుండా చిత్రసీమలోకి ప్రవేశించిన ఈ కన్నడ కోమలి ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌లో ‘మోస్ట్‌ వాంటెడ్‌' కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది.

అమ్మానాన్నల ప్రోత్సాహంతో..

నేను బెంగళూరులో పుట్టాను. కానీ పెరిగింది, చదువుకున్నది అంతా ముంబయిలోనే. మా నాన్న వ్యాపారవేత్త. సినిమాల్లోకి వెళ్లాలనే నా నిర్ణయాన్ని అమ్మానాన్న స్వాగతించారు. నటనపై నాకున్న ఇష్టాన్ని గుర్తించి ప్రోత్సహించారు. నా కెరీర్‌ కోసం అమ్మ ఫ్యాషన్‌ డిజైనర్‌ ఉద్యోగాన్ని వదులుకుంది. ‘ఉప్పెన’ షూటింగ్‌ జరిగినన్నీ రోజులు నాతోనే ఉంది. తను లేకపోతే నేను ఈ సినిమా చేసుండేదాన్ని కాదు. నాదింకా చిన్న వయసే. సినీరంగం గురించి ఎలాంటి అవగాహనా లేదు. అయినా, నేను రాణిస్తున్నానంటే అమ్మ ఇచ్చిన ధైర్యమే కారణం.

‘ఉప్పెన’ంత ప్రేమ కథా చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. మీ దృష్టిలో ప్రేమంటే?

ప్రేమలో స్వచ్ఛత, దైవత్వం ఉండాలి. శరీరాలతో సంబంధం లేకుండా మనసుల కలయికతో ముడిపడిందే నిజమైన ప్రేమ. నేటి ప్రేమలన్నీ కృతిమ బంధాలుగానే కనిపిస్తున్నాయి. నిజాయతీ లోపిస్తున్నది. ప్రేమంటే లవర్స్‌ మధ్యనే ఉండాలనేం లేదు. స్నేహితులు, భార్యాభర్తలు, బ్రదర్స్‌-సిస్టర్స్‌ మధ్య కూడా అవ్యాజమైన ప్రేమ ఉంటుంది. ప్రేమకు ఎల్లలు ఉండవు.

సినిమాల్లోకి రావాలనే ఆలోచనకు బీజం ఎప్పుడు పడింది?

సెకండ్‌ క్లాస్‌ చదువుతున్నప్పుడే యాక్టింగ్‌పై ఇష్టం ఏర్పడింది. స్కూల్‌ డేస్‌లో ‘సినిమాల్లోకి వెళ్లాలి, హీరోయిన్‌ అవ్వాలి’ అని కలలు కన్నా. కానీ, పరిణతి వచ్చే కొద్దీ నా ఆలోచనలు మారాయి. వైద్య వృత్తిపై నాకు అపారమైన గౌరవముంది. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసే అవకాశం డాక్టర్స్‌కు ఉంది. కానీ, చాలా మంది వైద్యులు డబ్బుకు ప్రాధాన్యమివ్వడం గమనించా. సేవాగుణంతో ఆలోచించే వైద్యులు కనిపించడం లేదనిపించింది. అందుకే సినిమా ఆశలను పక్కనపెట్టి డాక్టర్‌ అవ్వాలనుకున్నా. కానీ, యాక్టర్‌ అయ్యా. సినిమాల కారణంగా ఆ కల నెరవేరలేదు.

‘ఉప్పెన’లో అవకాశం ఎలా వచ్చింది?

చదువును కొనసాగిస్తూనే పలు వాణిజ్య ప్రకటనల్లో నటించా. నటనపై ఆసక్తి ఉన్నా, ఏ రోజూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించలేదు. ఓ యాడ్‌ ఫిల్మ్‌ షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చా. ఆ సమయంలో దర్శకుడు బుచ్చిబాబు ‘ఉప్పెన’ సినిమా కోసం నన్ను సంప్రదించారు. కథ నచ్చడంతో అంగీకరించా.

ఇందులో బేబమ్మ పాత్ర కోసం దర్శకుడు రెండువేల మందిని ఆడిషన్‌ చేసి మిమ్మల్ని తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి?

రెండు వేల మందిని ఆడిషన్‌ చేశారన్నది అవాస్తవం. నాలో ధైర్యాన్ని నింపడానికి, నేను మంచి నటన కనబరచడానికి చిత్రబృందం ఆ మాట చెప్పింది. చాలామంది ఔత్సాహికులను కాదని నాకు ఈ అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. కొత్త హీరోయిన్‌కు తొలి సినిమాలోనే అభినయానికి ప్రాధాన్యమున్న పాత్ర దొరకడం అరుదు. అలాంటి లక్కీచాన్స్‌ ఈ సినిమాతో నాకు లభించింది. 

నటనలో మీకు స్ఫూర్తి ఎవరు?

శ్రీదేవి, సమంత నా ఆరాధ్య కథానాయికలు. పాత్రలకు అనుగుణంగా సమంత తనను తాను కొత్తగా మలుచుకునే విధానం, క్యారెక్టర్స్‌లో ఒదిగిపోయి తెరపై అభినయాన్ని ప్రదర్శించే తీరు స్ఫూర్తినిస్తుంటుంది. సినిమాల కోసం ఆమె పడే కష్టం ప్రేరణగా నిలుస్తుంది. ఒద్దికైన హావభావాలతో తన పాత్రలన్నీ చాలా అందంగా కనిపిస్తుంటాయి.

కథానాయికగా మారిన తర్వాత పాత స్నేహితుల్ని, సంతోషాల్ని మిస్సయ్యాననే భావన ఎప్పుడైనా కలిగిందా?

సినిమాల వల్ల నా జీవితంలో ఎలాంటి మార్పులు రాలేదు. పాత స్నేహితుల తోనూ టచ్‌లో ఉన్నా.  ఇదివరకు నాతో ఎలా ఉండేవారో, అదే స్నేహభావన ఇప్పుడు కూడా వారిలో కనిపిస్తున్నది. మా స్నేహంలో ఎలాంటి తేడాలు రాలేవు. 

చదువు కొనసాగిస్తూనే సినిమాల్లో నటించడం ఎలా సాధ్యమవుతున్నది?

ప్రస్తుతం ఓపెన్‌ యూనివర్సిటీలో సైకాలజీ డిగ్రీ చదువుతున్నా. ఎగ్జామ్స్‌ రాసేప్పుడూ మాత్రమే కాలేజీకి వెళుతుంటా. సైకాలజీలో ప్రావీణ్యముంటే ఎదుటివారి మనోభావాలను సులభంగా గ్రహించగలమనే అపోహ ఉంది. కానీ, అది కొంతవరకు అబద్ధమని నా అభిప్రాయం. వ్యక్తిగతంగా మనలోని నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోవడమే కాకుండా, మనం ఎంచుకునే వృత్తిలో పరిణతి సాధించడానికి సైకాలజీ చదువు ఉపయోగపడుతుందని విశ్వసిస్తా.

వ్యక్తిగతంగా మీరు ఎలాంటి సినిమాల్ని ఇష్టపడుతారు?

రొమాంటిక్‌ కామెడీ సినిమాలు నచ్చుతాయి. ‘ఉప్పెన’ లాంటి ప్రేమకథలతోపాటు కుటుంబ ఇతివృత్తాల్లో నటించాలనుంది. విరామం దొరికితే ఎక్కువగా కామెడీ సినిమాలు చూస్తుంటా. వృత్తిపరమైన ఒత్తిడుల నుంచి దూరమవ్వడానికి హాస్యం చక్కటి ఔషధమని నా నమ్మకం.

సినిమా అవకాశాల్ని అందిపుచ్చుకోవడంలో ప్రస్తుతం సోషల్‌ మీడియా ఎలాంటి పాత్ర పోషిస్తున్నది?

సినీ పరిశ్రమలోకి రావాలని కలలు కనే కొత్తవారికి సోషల్‌మీడియా చక్కటి వేదికగా మారింది. ‘ఉప్పెన’ సినిమాలో హీరో స్నేహితుడి పాత్రధారిని టిక్‌టాక్‌లో చూసి ఎంపిక చేశారు. ప్రతిభను వెలుగులోకి తీసుకురావడంలో సోషల్‌ మీడియా కీలకంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో నేను యాక్టివే! నా నటనలోని తప్పొప్పుల్ని ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా తెలుసుకుంటా. నా వరకైతే సినిమాల్లోకి రావడానికి యాడ్స్‌ ఉపయోగపడ్డాయి. 

గ్లామర్‌ పాత్రల్లో నటిస్తారా?

గ్లామర్‌ అంటే కేవలం అందంగా కనిపించడమనే మాటను నేను విశ్వసించను. క్యారెక్టర్‌కు అనుగుణంగా తెరపై కనిపించడమే నిజమైన గ్లామర్‌. అలాంటి పాత్రలతోనే నా కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటా.

-నరేశ్‌ నెల్కి

VIDEOS

logo