కేరళలోని కొచ్చికి చెందిన శ్రుతి అందరిలాంటి అబ్బాయికాదు. అమ్మాయిలా మారిన అబ్బాయి. యుక్త వయసుకు రాగానే అబ్బాయినన్న సంగతి మర్చిపోయి అమ్మాయిలా వ్యవహరించేది. తన ఇబ్బందిని ఎవరికీ చెప్పుకోలేక, నలుగురి కంటా పడకుండా జాగ్రత్తపడేది. ఆ అబ్బాయి సమస్యను ఇంట్లో వాళ్లు అర్థం చేసుకున్నారు. పూర్తి అమ్మాయిగా మారేందుకు ఒప్పుకొన్నారు. దీంతో ఆ కుర్రాడు 2018లో పూర్తి అమ్మాయిగా మారిపోయాడు. శ్రుతి సితారగా పేరు మార్చుకున్నాడు.
ఇప్పుడు శ్రుతి అందమైన అమ్మాయి. ఆత్మవిశ్వాసం ఉన్న యువతి. ఇంతి రూపం తనకెంతో సౌకర్యవంతంగా ఉందంటున్నదామె. తన ఆశయ సాధనకు అడుగు ముందుకేసింది. ఒకప్పుడు గడప దాటడానికి జంకిన శ్రుతి ఇప్పుడు అంతర్జాతీయ యవనికపైకి జింకపిల్లలా దూసుకెళ్లింది. ‘మిస్ ట్రాన్స్ గ్లోబల్ ఇండియా’ టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు, లండన్‌లో జరుగనున్న అంతర్జాతీయ మిస్ ట్రాన్స్ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఈ నెల 12న జరిగే ఈ పోటీలను, కరోనా కారణంగా వర్చువల్‌గా నిర్వహిస్తున్నారు. అందాన్ని, తెలివితేటల్ని ప్రదర్శించి ఈ టైటిల్ నెగ్గుతానని చెబుతున్నది శ్రుతి. తన విజయం మరెందరో ట్రాన్స్జెండర్లకు స్ఫూర్తినిస్తుందని ఆమె నమ్మకం. అంతేకాదు, అవకాశం వస్తే సినిమాల్లో కూడా నటిస్తానని చెబుతున్నది శ్రుతి. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకోవాలన్నది తన ఆశ.