రేడియో.. అలనాటి ఆణిముత్యం. టీవీ.. అందరిదీ! యూట్యూబ్.. సంచలన కెరటం. సామాజిక మాధ్యమాలు.. సునామీ!ఇప్పుడు పోడ్కాస్ట్.. చడీచప్పుడు లేని జలపాతం. గుండె లోతుల్లోకి చేరిపోయే అమృత గళం.. పోడ్కాస్ట్ బలం. మనసుకు హత్తుకునే కాన్సెప్ట్‌లతో, మస్తిష్కానికి అస్తిత్వాన్ని ప్రసాదించే సబ్జెక్ట్లతో పోడ్కాస్టర్లు చేస్తున్న కార్యక్రమాలు ఈతరం అభిరుచికి అద్దం పడుతున్నాయి. నవతరం శ్రోతలే లక్ష్యంగా వినూత్న ప్రయోగాలతో గళగళ ‘పోడ్’తున్నారు వీళ్లు. గతేడాది లాక్డౌన్ సమయంలో పోడ్కాస్టర్ల అవతారమెత్తిన అతివల పరిచయమిది..
పద్మావతి సాఫ్ట్వేర్ ఉద్యోగిని. వారంలో ఐదు రోజులు ఆఫీస్ పనిలో తలమునకలయ్యే ఆమె.. వారాంతంలో తనలోని సృజనను వెలికి తీస్తుంది. పద్మావతి పుట్టి, పెరిగిందంతా హైదరాబాద్‌లోనే! ఇంజినీరింగ్ పూర్తయ్యాక బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరింది. గతేడాది కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలవడంతో మరింత తీరిక కుదిరింది. తనలోని క్రియేటివిటీకి పనిచెప్పింది. పోడ్కాస్టర్గా కొత్త ప్రయాణం ప్రారంభించాలనుకుంది. అలా మొదలైందే ‘తెలుగు లోగిలి’.
‘నాకు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా చేయాలని ఎప్పట్నుంచో ఉండేది. నా స్నేహితులు ఎవరైనా షార్ట్‌ఫిల్మ్స్ చేస్తే డబ్బింగ్ చెప్పేదాన్ని. సినిమాలకు డబ్బింగ్ చెప్పాలని ఉన్నా.. పని ఒత్తిడి కారణంగా పెద్దగా ప్రయత్నించలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో ఖాళీ దొరికింది. దీంతో పోడ్కాస్ట్ ద్వారా నాకు నచ్చిన వ్యాపకాన్ని ఎంచుకున్నా. ప్రారంభానికి ముందే.. అన్ని వయసుల వారూ వినగలిగేలా దీన్ని తీర్చిదిద్దాలనుకున్నా. తెలుగువారికి చేరువ కావాలనే ఉద్దేశంతో ‘తెలుగు లోగిలి’ అని పేరు పెట్టాను. నాకు రాయడమన్నా ఆసక్తే! అందుకే, కథలన్నీ నేనే రాసుకుంటాను. నా ఫాలోవర్స్ కూడా రకరకాల రచనలు పంపిస్తూ ఉంటారు. వాటిలో నచ్చినవి ఎంచుకొని, చిన్నచిన్న మార్పులు చేసి వినిపిస్తుంటాను. అలాగే, నా పోడ్కాస్ట్లో సినిమా రివ్యూలు, సినిమా వెనుక కథలతో ప్రత్యేకంగా సిరీస్‌లు చేశాను. ఇలా రకరకాల కాన్సెప్ట్‌లతో శ్రోతలకు చేరువయ్యాను. అన్ని మ్యూజిక్ యాప్స్‌లో నా కంటెంట్ వినొచ్చు. ‘తెలుగు లోగిలి’కి ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన కనిపిస్తున్నది. ఈ పోడ్కాస్ట్ వల్ల నాకు యూట్యూబ్ చానెళ్లలో పని చేసే అవకాశాలూ వచ్చాయి’ అని చెప్పుకొచ్చింది పద్మావతి.
ఒక్కొక్కరిలో ఒక్కో ప్రావీణ్యం ఉంటుంది. పావని సమ్‌థింగ్ స్పెషల్. అచ్చెరువొందేలా చిత్తరువులు గీస్తుంది. మధుర స్వరంతో మంచిమంచి కథలు వినిపిస్తుంది. ప్రత్యేకమైన గళమే తనను పోడ్కాస్టర్ని చేసిందని చెబుతుంది పావని. సామాజిక మాధ్యమంలో చురుగ్గా ఉండే ఆమె, ఇన్‌స్టాగ్రామ్‌లో యాంకర్ యాప్ సాయంతో ఆడియో స్టోరీస్ చేయడం మొదలుపెట్టింది. అలా పోడ్కాస్టర్గా జర్నీ మొదలుపెట్టిన పావని కబుర్లు ఇవి..
‘నేను బీఎస్సీ చేశాను. మొదట్నుంచీ ఉద్యోగం చేయడం నచ్చేది కాదు. చిత్రలేఖనం అంటే ఇష్టం. దానిపై దృష్టి పెట్టాను. సోషల్ మీడియాలో ఒక ఆర్ట్ పేజీ తయారు చేసి, ఆర్డర్స్ మీద చిత్రాలు గీయడం మొదలుపెట్టాను. పోడ్కాస్ట్ మీద అవగాహన వచ్చిన తర్వాత సోషల్ మీడియాలోని నా ఆర్ట్ పేజీలో కథలకు ఆహ్వానం పలికాను. కృష్ణతేజ అనే అమ్మాయి కొన్ని కథలు పంపింది. వాటిని ఆడియో రికార్డ్ చేసేదాన్ని. పాత్ర, సన్నివేశం ఆధారంగా ఉచ్చారణలో కొత్తదనం ప్రదర్శించేదాన్ని. అలానే, వేరే రచయితలు కూడా తమ కథలు పంపేవాళ్లు. కథ బాగుంటే ఆడియో రికార్డు చేసి రచయిత పేరు చెప్పేదాన్ని. కొన్నాళ్లకు ‘తెలుగు కథలు బై పావని’ పేరుతో పోడ్కాస్టింగ్ చేసేదాన్ని. ఈ క్రమంలో ‘ఏం మాయ చేశావె’, ‘మ్యాట్రిమొనీ లవ్’ సిరీస్‌లు మంచి సక్సెస్ ఇచ్చాయి. ప్రస్తుతం ‘పావనితో కబుర్లు’ పోడ్కాస్ట్ ద్వారా ‘సమ్మోహనం’ అనే కొత్త సిరీస్ ప్రారంభించాను. ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ర్టాల్లో పోడ్కాస్ట్ శ్రోతల సంఖ్య పెరుగుతున్నది. నా సిరీస్‌లకూ ఆదరణ వస్తున్నది. వారానికి ఒక ఎపిసోడ్ అప్లోడ్ చేస్తుంటాను. మొదట్లో నేను చెప్పే కథలు ఎవరైనా వింటారా? అనుకునేదాన్ని. కానీ, ఎప్పుడైనా స్టోరీ ఆలస్యం అయితే చాలు, శ్రోతల నుంచి చాలా మెసేజ్‌లు వస్తుంటాయి. ‘నా కథలకు ఇంత ఆదరణ ఉందా!’ అనిపించింది. నా పోడ్కాస్ట్ కథలను స్పాటిఫై, గానా, వింక్, అమెజాన్ మ్యూజిక్, గూగుల్ పోడ్కాస్ట్స్, జియోసావన్ వంటి అన్ని మ్యూజిక్ యాప్స్‌లో వినొచ్చు. పోడ్కాస్ట్తో పాటు నాకు ప్రాణమైన చిత్రలేఖనంతోనూ సంతోషంగా కాలం గడిపేస్తున్నా?’
అంటున్నది పావని.
ఆమె పేరులోనే సంగీత సాహిత్యాలున్నాయి. అందుకు తగ్గట్టే సాహితీ రాగలీనకు రచన అంటే ఆసక్తి. సంగీతమంటే మమకారం. ఈ రెండిటినీ రంగరించి ‘తెలుగు అమ్మాయి’ పేరుతో పోడ్కాస్ట్ ప్రారంభించింది. రకరకాల కథలు, కార్యక్రమాలతో శ్రోతలను ఆకట్టుకుంటూనే.. తనలా పోడ్‌కాస్ట్‌పై ఆసక్తి ఉన్నవాళ్లను ప్రోత్సహిస్తున్నది. అందుకోసం ‘రాగా పోడ్’ అనే ప్రొడక్షన్ హౌజ్‌ను ప్రారంభించింది.
‘లాక్డౌన్ సమయంలో ఒకరోజు సోషల్ మీడియాలో హిందీ పోడ్కాస్ట్ విన్నాను. తెలుగులో వెతికితే కొన్నే కనిపించాయి. దాంతో ‘తెలుగులో నేనే ఎందుకు పోడ్కాస్ట్ ప్రారంభించొద్దు?’ అనుకున్నా! అలా 2020 జూన్‌లో ‘తెలుగు అమ్మాయి’ పోడ్కాస్ట్ ప్రారంభించాను. అందులో వర్తమాన అంశాలు, ప్రత్యేక సందర్భాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తాను. శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చింది. క్రమంగా ఇందులోని మార్కెటింగ్ మెలకువలూ తెలుసుకున్నా. కొన్నాళ్లకు ‘రాగా పోడ్’ అనే ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించాను. అంటే వేరేవాళ్ల కోసం పోడ్కాస్ట్లను నిర్మించి, మార్కెటింగ్ చేస్తానన్నమాట. ప్రస్తుతం మా దగ్గర 20 ప్రాజెక్ట్స్ దాకా నడుస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘ఇంటింటా ఇన్నొవేటర్’ ప్రాజెక్ట్ మీద పోడ్కాస్ట్ షో నడుస్తున్నది. అలాగే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. మా రికార్డింగ్స్ అన్ని మ్యూజిక్ యాప్స్‌లో అందుబాటులో ఉంటాయి. ఇంట్లో వాళ్ల ప్రోత్సాహంతోనే ఇవన్నీ సాధ్యం అవుతున్నాయి. నా షోల విషయానికి వస్తే ఫాలోవర్స్ సంఖ్య ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉంది. మా నానమ్మతో కలిసి ఒక షో చేశాను. దానికి మంచి స్పందన వచ్చింది. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేయాలనుకుంటున్నా’ అని వివరించింది సాహితీ రాగలీన.
… నిఖిత నెల్లుట్ల