సామాజిక పద్మస్త్రీలు

ప్రతికూల పరిస్థితుల్లోనే పద్మాలు పూస్తాయి.రవి కిరణాలు పడితేనే వికసిస్తాయి. పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న ఈ మహిళలూ అంతే! వారి నేపథ్యం ప్రతికూల పరిస్థితులే! సంకల్పం.. నలుగురి జీవితాల్లో వెలుగు కిరణాలు ప్రసరింపజేయడమే! అరుదైన వ్యక్తిత్వం ఒకరిదైతే, అసమాన కార్యదీక్ష మరొకరిది. కష్టాలకు ఎదురెళ్లే ధైర్యశాలి ఒకరైతే.. ఎదుటివారి కష్టాలను కడతేర్చే కల్పవల్లి మరొకరు. సామాజిక సేవతో వేలమంది జీవితాలను తీర్చిదిద్ది.. పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న స్త్రీమూర్తుల పరిచయం ఇది..
అందరికీ అమ్మ సింధుతాయి
మహారాష్ట్రలో వార్ధా బాపూజీ నడయాడిన పుణ్యస్థలి. ఉప్పు సత్యాగ్రహం తర్వాత సబర్మతి ఆశ్రమాన్ని వీడిన బాపూ స్వరాజ్య సమరంలో సింహభాగాన్ని వార్ధా ఆశ్రమం నుంచే నడిపించారు. ఈ ఆశ్రమం అనాథలను ఆదరించేది. కుష్ఠురోగులను కనికరించేది. బాపూ ఇచ్చిన స్ఫూర్తితోనే అదే వార్ధా ప్రాంతంలో అందరికీ అమ్మయింది సింధుతాయి. అనాథలకు అన్నీ తానే అయింది. అలాగని సింధుతాయి సంపన్నురాలు కాదు. అక్షరం దిద్దలేదు. తనను వంచించిన విధిని నిందించ లేదు. వదిలేసిన భర్తను శపించనూ లేదు. అన్నీ మౌనంగా భరించింది. తనలా బాధపడుతున్న వారికి అండగా నిలువాలని సంకల్పించుకుంది. తన కాళ్ల మీద తను నిలబడింది. తనను పదిమంది నమ్ముకునే విధంగా స్థిరపడింది. వేలమందిని అక్కున చేర్చుకునే స్థాయికి ఎదిగింది. అనాథలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఎందరో అనాథలకు ఆశ్రయం కల్పించి, వారి జీవితాలను తీర్చిదిద్దింది సింధుతాయి. లేనివారిని ఆదరించాలన్న బాపూజీ మాటను అక్షరాలా పాటిస్తూ వార్ధా గొప్పదనాన్ని కొనసాగిస్తున్నది.
మూఢనమ్మకాలపై కొరడా బిరుబల రభ
ఒకప్పుడు అసోంలో ఏటా కనీసం 25 వరకైనా అతిక్రూరమైన హత్యలు జరిగేవి. వాటన్నిటి వెనుక ఉన్న ప్రధాన కారణం చేతబడి! కేవలం అనుమానంతో అమాయకులను సజీవంగా తగులబెట్టేవారు. ఈ హత్యల సంఖ్య ఇప్పుడు దాదాపు సున్నాకు వచ్చిందంటే అందుకు కారణం బిరుబల రభ. అంధవిశ్వాసాలపై విరుచుకుపడిన కొరడా ఆమె. ‘బిరుబల మిషన్' సంస్థను ఏర్పాటు చేసి జనంలో చైతన్యం తీసుకువచ్చిందామె. ఈ పోరాటంలో ఎన్నో దాడులను ఎదుర్కొన్నది. అర్ధరాత్రి, అపరాత్రి మారుమూల పల్లెల్లో ప్రయాణించేది. ఊరూరా జనాన్ని చైతన్యపరిచి బిరుబల మిషన్‌లో భాగస్వామ్యం కల్పించేది. రాష్ట్ర వ్యాప్తంగా వందలమందిని సంస్థ సభ్యులుగా తీర్చిదిద్దింది. ఈ సైన్యం సాయంతో ఎన్నో ప్రాణాలను కాపాడింది. చేతబడి నెపంతో జరిగే హత్యలను చివరి నిమిషంలో అడ్డుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. బిరుబల రభ పోరుకు మద్దతుగా అసోం ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రవర్తనను నేరంగా గుర్తిస్తూ ఓ చట్టాన్ని తీసుకువచ్చింది.
ఆదుకునే ఆదిలక్ష్మి లఖిమీ బారువా
‘మహిళగా మహిళలకు ఏదైనా చేయాలి’ ఈ ఆలోచన లఖిమీ బారువాను ఓ అద్భుతాన్ని ఆవిష్కరించేలా చేసింది. ఆర్థికంగా మహిళలు నిలబడితే కుటుంబాలు బాగుపడతాయని ఆమెకు తెలుసు. 80వ దశకంలోనే పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసిన ఆమె ఈ దిశగా ఆలోచించడంలో వింతలేదు. కానీ, అందుకు తగిన ఏర్పాటు చేయడానికి మాత్రం ఎంతగానో శ్రమించింది. తన ఉద్యోగాన్నీ వదులుకుంది. జీవితాన్ని అంకితం చేసింది. బ్యాంకులో ఉద్యోగిగా పనిచేసిన లఖిమీ మహిళలకు బాసటగా నిలవాలనే ఉద్దేశంతో 1998లో ఓ బ్యాంకునే నెలకొల్పింది. అసోం జొరహాట్ పట్టణంలో 250 మంది మహిళా సభ్యులతో, 8.5 లక్షలతో కొనొక్లోటా మహిళా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ మొదలుపెట్టింది. ఇప్పుడు అదే బ్యాంక్‌లో దాదాపు 45వేల మంది ఖాతాదారులు ఉన్నారు. అందరూ మహిళలే. విద్యార్థినులు, ఉద్యోగినులు, విధి వంచితలు, భర్తను కోల్పోయిన అభాగ్యులు ఇలా ఎందరో ఇక్కడ ఖాతాదారులు. అవసరం ఉన్నవారికి రుణాలిచ్చి స్వయం ఉపాధిని కల్పిస్తున్నది లఖిమీ. ఎందరినో ఆర్థికంగా నిలబెట్టింది. బ్యాంక్ రికవరీ రేటు కూడా 95 శాతం పైమాటే. లఖిమీ అండదండలతో ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. 2016లో రాష్ట్రపతి చేతుల మీదుగా ‘నారీశక్తి పురస్కారం’ అందుకున్నదామె.
అలుపెరగని పోరాటం చుత్నీ దేవి
చుత్నీదేవి పేరు ఝార్ఖండ్‌లో మారుమూల పల్లెల్లోనూ వినిపిస్తుంది. భూతప్రేతాల పేరిట జనాన్ని గడగడలాడించే మంత్రగాళ్లకు చుత్నీదేవి సింహస్వప్నం. ఆమె పేరు చెబితే చాలు.. వాళ్లు వణికిపోతారు మరి. నిరక్షరాస్యత, మూఢనమ్మకం రెండూ కవలపిల్లలు. ఝార్ఖండ్‌లోని సరైకెలా అనే జిల్లాను అవి రెండూ శాసిస్తూ ఉండేవి. చిన్నప్పటి నుంచి వాటిని చూస్తూనే పెరిగింది చుత్నీదేవి. భరిస్తూనే వచ్చింది. సాధారణ జ్వరం వస్తే చాలు.. మంచంలో ఉన్న పిల్లగాన్ని అమాంతం మంత్రగాడి దగ్గరకు తీసుకెళ్లడం, ‘గిట్టనివారు మీ పిల్లాడిపై కన్నేశార’ని అతగాడు చెప్పడం, ‘ఎలాగైనా బతికించమ’ని మంత్రగాడి కాళ్లమీద పడటం.. అందినకాడికి దోచుకొని ఇంత విబూది ఇప్పించి పంపడం.. ఇలాంటి దృశ్యాలు చూస్తూ పెరిగింది చుత్నీదేవి. మొదట్లో వింతగా అనిపించినా తర్వాత్తర్వాత అందులోని మోసాన్ని గ్రహించింది. వారి పని పట్టాలనుకుంది. తనొక్కతే, అందులోనూ ఝార్ఖండ్ లాంటి రాష్ట్రంలో, మారుమూల పల్లెల్లో.. ఎవరెంత బెదిరించినా అందరినీ ఎదిరించింది. కీలెరిగి వాతపెట్టి వందలమంది దొంగ మంత్రగాళ్ల బండారం బయటపెట్టింది. చేతబడి, బాణామతి మూఢనమ్మకాలుగా పల్లెల్లో చైతన్యం తీసుకొచ్చింది. ‘సరైకలా పులి’గా కీర్తి గడించింది చుత్నీదేవి. ఇప్పుడు చుత్నీదేవి వయసు 63 ఏండ్లు. అంధవిశ్వాసాలపై ఆమె అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నది.
అనాథలకు అండ శాంతిదేవి
ఒడిశాకు చెందిన శాంతిదేవి వయసు 74 ఏండ్లు. జాతిపిత మహాత్మాగాంధీ ప్రభావం ఆమెపై ఎంతో. బాపూజీ అనుచరుడు రతన్దాస్తో ఆమె పెండ్లి జరిగింది. ఇద్దరిదీ ఒకే మాట, ఒకే బాట. లేనివారికి సాయం చేయడం. నా అన్నవాళ్లు లేనివారిని ఆదరించడం. ఈ క్రమంలో ఓ రోజు రాయ్‌గఢ్ జిల్లా గోబరపల్లిలోని ఓ సేవాశ్రమానికి వెళ్లింది శాంతిదేవి. ఆనాటి నుంచి సామాజిక సేవే తన జీవితంగా మారిపోయింది. 1964లో గుణ్పూర్లో ‘సమాజ్ సేవా’ ఆశ్రమం నెలకొల్పింది. కోరాపుట్, రాయ్‌గఢ్‌లోనూ ఆశ్రమాలు ఏర్పాటు చేసింది. ఏ ఆసరా లేని పిల్లలకు నీడ కల్పించడమే గొప్ప విషయమైతే.. వాళ్లకు కావాల్సిన సదుపాయాలతో పాటు విద్య, వృత్తి శిక్షణ ఇప్పిస్తూ దశాబ్దాలుగా అసాధారణమైన దాతృత్వాన్ని చాటుకుంటున్నది శాంతిదేవి. వందలమంది చిన్నారులకు మాతృమూర్తిగా నిలిచిన ఆమెను ఎన్నో పురస్కారాలు వరించాయి!
తాజావార్తలు
- అమ్మాయి మా బంధువే.. రూ.90 కోట్ల కట్నమిప్పిస్తాం..
- వేసవి తట్టుకునేలా.. మరో సబ్‌స్టేషన్
- ఎంఎస్ఎంఈ ద్వారా ఆన్లైన్లో టాయ్ ఫేయిర్
- వ్యాక్సినే సురక్షితమైన ఆయుధం
- రాష్ట్రంలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
- మార్చి 5నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
- మళ్లీ మాస్కు కట్టండి
- పాలమూరు వాణి
- 26-02-2021 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
- వాణియే మేటి..