సోమవారం 08 మార్చి 2021
Zindagi - Jan 22, 2021 , 00:12:25

నీటి కోసం..మహిళా కోటి!

నీటి కోసం..మహిళా కోటి!

మనిషి మనుగడకు గాలి ఎంత అవసరమో నీళ్లూ అంతే ముఖ్యం. అయితే, మన దేశంలో చాలా ప్రాంతాల్లో నీటి కరువు తీవ్రంగా ఉన్నది. బిందెలు పట్టుకుని కిలోమీటర్ల దూరం నడవాల్సిన పరిస్థితి. అలాంటి ప్రాంతాలు మధ్యప్రదేశ్‌లో అనేకం. అందులోనూ చౌదరి ఖేరా, అగ్రోతా, ఛత్తర్‌పూర్‌ వంటి గ్రామాల ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. మగవాళ్లకేం మహారాజులు. నీళ్ల బరువూ బాధ్యతా మొత్తంగా మహిళలదే. దాంతో ఆడవాళ్లు జట్టుగా ఏర్పడి పూడుకుపోయిన కుంటలకు జీవం పోస్తున్నారు. ‘జల్‌ సహేలీస్‌' పేరుతో సంఘం ఏర్పాటు చేసుకున్నారు. అగ్రోతా గ్రామంలో బబితా రాజ్‌పుత్‌ అనే పందొమ్మిదేండ్ల రైతు బిడ్డ తన నాయకత్వంలో ఏకంగా ఒక చెరువు తవ్వించింది. పక్కనే ఉన్న కొండ నుంచీ, అటవీ ప్రాంతాల నుంచీ వర్షపు నీరు చెరువులోకి చేరేలా చేసింది. చౌదరి ఖేరా గ్రామానికి చెందిన 30 ఏండ్ల గంగారాజ్‌పుత్‌ దగ్గర్లో ఉన్న తలాబ్‌ అనే పాడుబడ్డ పాత కుంటను మళ్లీ కొత్తగా నిర్మించింది. గత నాలుగు దశాబ్దాలుగా ఆ కుంటను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో శిథిల స్థితికి వచ్చింది. కారణం, ఒకానొక సమయంలో ఆ ఊరి సర్పంచ్‌ ఆ కుంటను బాగుచేసేందుకు ప్రయత్నించినప్పుడు.. ఆయన ఇద్దరు బిడ్డలూ చనిపోవడమే. ఇప్పుడు గంగ ముందుకొచ్చి గ్రామ ప్రజల మూఢనమ్మకాలను పోగొట్టింది. ఆ పల్లెకు మరో గంగమ్మ అయ్యింది.  


VIDEOS

logo