సెల్‌ఫోన్‌తో.. ‘టెక్ట్స్ నెక్ సిండ్రోమ్'

స్నేహితులతో మాట్లాడాలంటే అంతంత దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదు. షాపింగ్ చేయాలంటే దుకాణానికి వెళ్లాల్సిన పన్లేదు. కరెంటు బిల్లు, బీమా ప్రీమియం, బ్యాంకు పని.. దేనికోసమూ క్యూలో నిల్చోవాల్సింది లేదు. ఇంతకు ముందు దేనికైనా ఒళ్లొంచే వాళ్లం. ఇప్పుడు ‘మెడ’ వంచితే సరిపోతుంది! తలవంచి సెల్ఫోన్లో టైప్ చేస్తే చాలు. అవసరమైన పనుల కోసమైతే పరవాలేదు. అర్థం లేని వ్యవహారాల కోసమూ గంటలకు గంటలు మెడలు వంచడంతో.. ‘తల’కు మించిన భారమై, మెడమీద ఒత్తిడి పెరుగుతున్నది. ఫలితంగా, ‘టెక్ట్స్ నెక్ సిండ్రోమ్' ఆరోగ్యాన్ని కబళిస్తున్నది.
పక్కన ఆత్మీయులున్నా, లేకపోయినా చేతిలో మాత్రం ఫోను ఉండాల్సిందే. మనం కనిపెట్టిన పరికరమే అనుక్షణం మనల్ని నియంత్రిస్తున్నది. ఇప్పుడు సెల్ నంబరే మనిషికి ఆధార్‌ను మించిన గుర్తింపు, బతికున్నాడనడానికి సర్వైవల్ సర్టిఫికెట్‌ను మించి సాక్ష్యం. మీకంటూ ఓ మొబైల్ నంబరు లేకపోతే, ప్రపంచానికీ మీకూ మధ్య లంకె లేనట్టే. ఒక్క రోజు కూడా గడవదు. నిజమే, సెల్‌ఫోన్‌తో చాలా పనుల్ని క్షణాల్లో చేసుకోవచ్చు. ఎంతో సమయం ఆదా అవుతుంది. కానీ సోషల్ నెట్‌వర్క్‌లు, సినిమాలు, సీరియళ్లు.. ఇలా అనవసర విషయాలకు కూడా సెల్‌ఫోన్ మీదే ఆధార పడటం ఇప్పుడు పెద్ద వ్యసనం అయిపోయింది. సెల్‌ఫోన్ చూస్తున్నంత సేపూ మెడను వంచే ఉంచడం వల్ల, చిన్న వయసులోనే మెడనొప్పి వెంటాడుతున్నది.
అయిదు వంతులు ఎక్కువ బరువు
మొబైల్, కంప్యూటర్లు, ట్యాబ్లెట్ల వ్యసనం వల్ల కలిగే సమస్యే .. ‘టెక్ట్స్ నెక్ సిండ్రోమ్'. దీన్నే ‘ఓవర్ యూజ్ సిండ్రోమ్' అనీ అంటారు. మెడ, దాని చుట్టూ ఉండే కండరాలు, జాయింట్లు, ఎముకలు వగైరాలను అతిగా వాడటం వల్ల, వాటిపై ఒత్తిడి పడి ఉత్పన్నమయ్యే రుగ్మత అన్నమాట. గాడ్జెట్స్‌తో పనిచేసేటప్పుడు సరైన భంగిమలో కూర్చోవాలి. కానీ, చాలామంది ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. టూత్ పిక్మీద నిమ్మకాయను ఉంచితే.. బ్యాలెన్సింగ్‌గా టూత్‌పిక్ నిమ్మకాయ బరువును ఎలాగైతే మోస్తుందో, మన మెడకాయ కూడా తల బరువును అలాగే మోస్తుంది. తలను నిటారుగా ఉంచినప్పుడు మాత్రమే ఆ బరువును మెడ మోయగలదు. కానీ, మొబైల్ చూడ్డానికి మనం మెడను 45 డిగ్రీలకు వంచుతాం. దీనివల్ల మెడపైన 25 కిలోల బరువు పడుతుంది. ఇది ఐదు వంతులు ఎక్కువ భారం. మొబైల్ చూసేటప్పుడు తల, మెడ ముందుకు వంచి గంటలకొద్దీ గడిపేస్తాం. దీనివల్ల మెడపైన బరువు అధికమై, ఒత్తిడి ఎక్కువై మెడ నొప్పి వస్తుంది. ఇదే ‘టెక్ట్స్ నెక్ సిండ్రోమ్'.
ఏమవుతుంది?
అసలే కోతి.. అన్నట్టు, అసలే గాడ్జెట్స్‌తో మమేకమైన ప్రాణాలు. కొవిడ్ పుణ్యమాని వర్క్ ఫ్రం హోమ్ చుట్టూ ఆఫీసులూ.. ఆన్లైన్ క్లాసుల చుట్టూ స్కూళ్లు, కాలేజీలు గింగిర్లు కొడుతున్నాయి. దాంతో మొబైల్‌తో దోస్తీ మరింత పెరిగింది. సెల్‌ఫోన్‌కు సంబంధించి ఫలానా సమయంలో, ఫలానా విషయాలకు మాత్రమే వాడాలన్న పరిమితులేమీ లేవు. దీంతో నిరంతరం ఫోన్లోనే ఉంటున్నాం. ఫోన్ చూసేటప్పుడు ఈ భంగిమలో ఇలానే కూర్చోవాలి, అలానే చూడాలి అన్న ఆరోగ్య చైతన్యం మనకు ఇసుమంతైనా లేదు. సౌకర్యంగా ఉండేలా మాత్రమే కూర్చుంటాం. కానీ మన మెడకు సౌకర్యంగా ఉంటుందా? మెడకు, తలకు ఏ భంగిమ మంచిది? అన్నది చచ్చినా ఆలోచించం. సాధారణంగా సెల్‌ఫోన్ పట్టుకున్నప్పుడు తల, మెడ కిందికి వంచి చూస్తుంటాం. దీనివల్ల మొదట్లో బాగానే ఉంటుంది. కానీ కొన్ని నెలలు, సంవత్సరాల తర్వాత సమస్య మొదలవుతుంది. మనం తల వంచాలంటే మెడ వెనకాల ఉన్న కండరాలు పనిచేయాలి. అయితే, ఈ కండరాలు మన తలను నిటారుగా ఉంచడానికి తోడ్పడేవి. కానీ సెల్ఫోన్వల్ల మనం పదేపదే దాన్ని ముందుకు వంచేస్తున్నాం. దాంతో, మెడను నిటారుగా ఉంచడానికి కండరాలు ప్రయత్నిస్తాయి. కానీ, మెడ కిందికి వంగేసరికి దాన్ని సరిచేసే ప్రయత్నంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతాం. తద్వారా, నెమ్మదిగా కండరాలు బలహీనమవుతాయి. ఇదే మెడనొప్పికి పెద్ద కారణం. ముందువైపు కండరాలకూ, వెనుక వైపు కండరాలకూ మధ్య సమతౌల్యం దెబ్బతినడం వల్లే ఇదంతా జరుగుతుంది.
నిద్రలేమికీ కారణం
ఇంతకుముందు ఇంట్లో ల్యాండ్‌లైన్ ఫోన్ ఉండేది. రింగ్ అయితే ఎవరో ఒకరు మాట్లాడేవాళ్లు. అంతవరకే దాని పని. ఫోన్ అనేది కేవలం కమ్యూనికేషన్ కోసమే. దూరంగా ఉన్నవాళ్లతో మాట్లాడటం, సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి మాత్రమే వాడేవాళ్లం. సెల్‌ఫోన్ అలా కాదే! ఏ పనికైనా అదే! చేతిలో ఉంటే చాలు, నిమిష నిమిషానికీ చెక్ చేసుకొంటాం. వాట్సాప్, ఫేస్‌బుక్‌లాంటి సోషల్ నెట్‌వర్కింగ్‌ల కోసమైతే - ప్రతి క్షణం ‘ఎవరు ఏ పోస్టు పెట్టారు, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి’... అంటూ చూసుకోవడంతోనే సరిపోతుంది. వీటికి తోడు ప్రకటనలు, వీడియోలు. ఏదో ఒక రకంగా నిరంతరం మనల్ని యాక్టివ్‌గా ఉంచుతున్నది ఫోన్. దీనివల్ల మెడనొప్పి, నిద్ర పట్టకపోవడం సర్వసాధారణం అయిపోయాయి. నిద్ర పట్టకపోతే కూడా, మళ్లీ పక్కనున్న సెల్‌ఫోనే తీస్తాం. ఫేస్బుక్, యూట్యూబ్, సినిమా చూస్తూ రాత్రంతా కాలక్షేపం చేస్తాం. ఇప్పుడు, అదనంగా ఓటీటీలు కూడా వచ్చాయి. ఏ టైమ్‌లో అయినా ఎంటర్టెయిన్మెంట్ సిద్ధం! దీంతో, ఉన్న కొద్దిపాటి నిద్రకూడా వదిలిపోతుంది. ఇది క్రమంగా నిద్రలేమి అవుతుంది. ఇంతకుముందు నిద్ర పట్టకపోతే పుస్తకాలు చదివేవాళ్లం. దాంతో, కొంత సేపటికి ఆవులింత వచ్చేది. ఇప్పుడు పుస్తకాలు కూడా ఫోన్లోనే చదువుతున్నాం. ఇక నిద్ర ఎక్కడిది? సగటున ప్రతి వ్యక్తి కనీసం 5 నుంచి 6 గంటల పాటు సెల్‌ఫోన్ మీదే ఉంటున్నారు.
అనారోగ్యాల చిట్టా
- కండరాలు బలహీనం: మెడ ఎక్కువసేపు వంచడం వల్ల కండరాలపై ఒత్తిడి పడుతుంది. దీంతో, అవి బలహీనపడి మెడనొప్పి వస్తుంది.
- డిస్క్ సమస్యలు: మెడలోని కండరం వెన్నుపాముకు రక్షణనిస్తుంది. ఈ కండరాలు బలహీనమైతే డిస్క్ ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. దాంతో దానిపై ఒత్తిడి అధికమై పక్కకు జరిగిపోతుంది. చిన్న వయసులోనే అరిగిపోతుంది. 40-50లలో అరగాల్సిన డిస్కులు 20లలోనే అరుగుతున్నాయి.
- జాయింట్లకు చేటు: వెన్నుపాములోని జాయింట్లలో కండరాలు, లిగమెంట్లు, ఎముకలు, డిస్కులు ఉంటాయి. వీటిలో వేటికైనా సమస్య రావొచ్చు. మొబైల్, ఇతర గాడ్జెట్స్ అతిగా వాడితే ఇవి కూడా ఒత్తిడికి లోనవుతాయి. తద్వారా లిగమెంట్లు స్ప్రెయిన్ అవుతాయి. ఎముకలు అరుగుతాయి. డిస్కులు డీజనరేట్ అవుతాయి. ఆస్టియోఫైట్స్ ఏర్పడుతాయి.
- ఆస్టియోఫైట్స్ : ఇవి ప్రొటెక్టివ్ మెకానిజమ్‌లో భాగాలు. ఎముకకు స్థిరత్వాన్ని ఇవ్వడానికి ఏర్పడుతాయి. ఎముకల వాడకం మితిమీరిన చోట ఆస్టియోఫైట్స్ ఏర్పడుతాయి. మెడ, ఇతర జాయింట్ల కన్నా మోకాలి కీలును ఎక్కువగా వాడుతాం. కాబట్టి, సాధారణంగా మోకాలిలో ఆస్టియోఫైట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు, మెడమీద పని ఒత్తిడి ఎక్కువ అవుతున్నది. మోకాలిలో ఉన్నది ఒకటే జాయింట్. కానీ వెన్నుపాములో ఎక్కువ జాయింట్లుంటాయి. సెల్‌ఫోన్ వ్యసనం వల్ల మెడలోని ఎముకల్లో అదనంగా ఆస్టియోఫైట్స్ ఏర్పడుతున్నాయి. అంటే, కొత్తగా ఎముక పుట్టుకు వచ్చినట్టు ఉంటుందన్నమాట. ఇవి ఏర్పడిన కొద్దీ, నరాలపై ఒత్తిడి కలిగిస్తాయి. దీనివల్ల వెన్నుపాము, నరాలు దెబ్బతింటాయి.
- తలకు, భుజాలకు మధ్య అనుసంధానంగా ఉండే కండరం బలహీనపడి భుజం నొప్పి వస్తుంది.
- అదేపనిగా మొబైల్ చూడటం తలనొప్పికి కూడా దారితీస్తుంది.
- ఎక్కువసేపు అలా పట్టుకునే ఉండటం, గంటలకొద్దీ మెసేజ్‌లు టైపు చేయడం వల్ల చేతులకు, వేళ్లకు తిమ్మిర్లు వస్తాయి.
పరిష్కారం మన చేతుల్లోనే..
- ఇంటికి రాగానే సెల్‌ఫోన్ ఆఫ్ చేయడం మంచిది. అత్యవసరం అయితే తప్ప ఆ జోలికి పోవద్దు.
- సినిమాలూ, వెబ్‌సిరీస్ మొబైల్లో చూస్తే , ఇక ఇంట్లో అంత పెద్ద టీవీఉండి ఏం లాభం? వీటిని టీవీలోనే వీక్షించాలి.
- అలారమ్ పెట్టుకోవడానికి మొబైల్ కన్నా గడియారమే మేలు.
- సెల్‌ఫోన్‌ను కనిపెట్టి మనం, మరిన్ని జబ్బులను కొనితెచ్చుకున్నాం. అతి పెద్ద ఆరోగ్య సంక్షోభం సెల్‌ఫోనే! అలాగని వాడకుండా ఉండటమూ కష్టమే. అదే సమయంలో, మొబైల్ కాలక్షేపం తగ్గించడం మాత్రం కష్టం కాదు. చాలామందికి రాత్రిపూట సెల్‌ఫోన్‌తో అవసరం ఉండదు. పడుకొనే ముందు, ఏ హాల్లోనో సెల్ పడేసి బెడ్రూమ్లోకి వెళ్లడం మంచిది.
- ఫోన్ వాడేటప్పుడు ఇంత డ్యామేజి ఉంటుందని మనకు తెలియదు. ఊహించం కూడా. కాబట్టి, రోజూ 2 - 5 నిమిషాల పాటు మెడ వ్యాయామాలు చేయాలి. కండరాలన్నీ ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. అందుకే, మెడ వ్యాయామాలు ఒక్కటే సరిపోవు. కండరాలన్నీ చురుగ్గా మారాలంటే సాధారణ వ్యాయామాలూ తప్పనిసరి.
- బ్యాంకింగ్, షాపింగ్ లాంటి పనులు డెస్క్‌టాప్ మీద చేసుకుంటే సరి. సోషల్ నెట్వర్క్ సైట్లకోసం కూడా డెస్క్‌టాప్ ఉత్తమం. దీనిమీద ఎక్కువసేపు చూడలేం. విసుగొచ్చి ఆపేస్తాం.
డాక్టర్ వంశీకృష్ణ పెన్మెత్స
సీనియర్ స్పైన్ సర్జన్
యశోద హాస్పిటల్స్
సికింద్రాబాద్
తాజావార్తలు
- నానీని హగ్ చేసుకున్న ఈ బ్యూటీ మరెవరో కాదు..!
- సర్కారు పెరటి కోళ్లు.. 85 శాతం సబ్సిడీతో పిల్లలు
- కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ
- గోమాతలకు సీమంతం.. ప్రత్యేక పూజలు
- కూతురి కళ్లెదుటే.. తండ్రిని కత్తులతో పొడిచి చంపారు
- ‘పెట్రో’ ఎఫెక్ట్.. రూ.12 పెరగనున్న పాల ధర!
- రాజన్న హుండీ ఆదాయం రూ. 40.56 లక్షలు
- నయనతార పెళ్లిపై క్రేజీ గాసిప్..!
- ఆడపిల్లకు సాదర స్వాగతం.. మురిసిన కుటుంబం
- సిలిండర్ ధర ఎంత పెరిగినా.. మారని రాయితీ!