e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home జిందగీ తెలుగు అమ్మాయికి ‘అంతరిక్ష’ ఖ్యాతి

తెలుగు అమ్మాయికి ‘అంతరిక్ష’ ఖ్యాతి

‘నేను రాను.. చీకటి’ అన్నాడు తాతయ్య! ‘నేనున్నాగా తాతయ్యా!!’ అని ధైర్యం చెప్పింది ఓ ఐదేండ్ల చిన్నారి. ఆ చిన్నారి ఇప్పుడు ముప్పయ్యేండ్ల యువతి అయింది. దేశం గర్వించదగ్గ బండ్ల శిరీషగామారింది. చీకటిని చీల్చుకుంటూ రోదసిలోకి దూసుకుపోనుంది.వెలుగు పుంజం వైపు పయనించనుంది. అంతరిక్షంలో తెలుగు వాణిని వినిపించనుంది. భారతీయతను చాటనుంది. అన్నిటినీ మించి స్త్రీశక్తిని మరోసారి నిరూపించనుంది.

‘మన సంకల్పం బలంగా ఉండాలి. అప్పుడే మనసు విశ్వాంతరాళాల్లోకి వెళ్తుంది. అక్కడి అనంతశక్తిని కూడదీసుకొని అనుకున్న లక్ష్యాన్ని అందుకునేలా ప్రోత్సహిస్తుంది’ అంటారు అణ్వస్త్ర పితామహుడు ఏపీజే అబ్దుల్‌ కలామ్‌. తెలుగు తేజం శిరీష బండ్ల సంకల్పమే రోదసిలోకి పయనం. వెండిముద్దలా మెరిసిపోయే చంద్రుడిని తాకాలని, బంగారు వన్నెల నక్షత్రాలను ముట్టుకోవాలని ఆమె చిన్ననాటి కల. అదే అంతరిక్ష యానానికి పురిగొల్పింది.
ఆరేండ్ల వయసులో అమెరికాకు శిరీష తాత రాగయ్య వ్యవసాయ శాస్త్రవేత్త. తండ్రి మురళీధర్‌ సైతం వ్యవసాయ శాస్త్రవేత్తే. ప్లాంట్‌ పెథాలజీ చదివారాయన. తల్లి అనూరాధ విద్యాధికురాలు. శిరీష పుట్టిన తర్వాత ఆమె తల్లిదండ్రులు ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లారు. చిన్నారి శిరీష సంరక్షణ బాధ్యత అమ్మమ్మ, నానమ్మ తీసుకున్నారు. తాతయ్యల ఒడిలో వర్ణమాల నేర్చుకుంది. శతక పద్యాలు కంఠస్థం చేసింది. ఐదేండ్లు వచ్చేదాకా ఇక్కడే పెరిగింది. ఆరేండ్ల ప్రాయంలో.. అమెరికా వెళ్తున్న బంధువుల కుటుంబంతో విమానం ఎక్కింది. అమ్మానాన్న తోడు లేకుండా అంత చిన్న వయసులో కొండంత దూరం ఒంటరిగా ప్రయాణించింది. శిరీష వాళ్ల కుటుంబం టెక్సాస్‌లో ఉండేది. తర్వాత హ్యూస్టన్‌లో స్థిరపడింది. అక్కడ అక్కతో కలిసి విద్యాభ్యాసం కొనసాగించిందామె. అప్పటి వరకు ‘పెద్దయ్యాక ఏమవుతావు?’ అని ఎవరైనా అడిగితే, ఏం సమాధానం చెప్పాలో తెలిసేది కాదు శిరీషకు. ఓసారి కుటుంబంతో సమీపంలోని స్పేస్‌ సెంటర్‌కు వెళ్లిందా చిన్నారి. బామ్మ గోరుముద్దలు పెడుతూ, నింగిలో చూపించిన చందమామ.. అందుకునేంత ఎత్తులోనే కనిపించాడు. అల్లంత దూరంలో మెరిసే తారకలు ఎంతో దగ్గరగా ఉన్నాయనిపించింది. స్పేస్‌ సెంటర్‌ నుంచి రాగానే పెద్దయ్యాక ఏమవ్వాలన్నది నిర్ణయించేసుకుంది శిరీష. ‘వ్యోమగామి’ కావాలని డిసైడ్‌ అయిపోయింది.

- Advertisement -

ఆశల నిచ్చెన కూలిపోయినా..
ఆస్ట్ట్రోనాట్‌ కావాలంటే ఏం చదవాలో శిరీషకు తెలుసు. అందుకు తగ్గట్టుగా ఎన్నో ప్రణాళికలు అనుకుంది. ఎయిర్‌ఫోర్స్‌లో అడుగుపెట్టాలనుకుంది. అక్కడి నుంచి నాసా గడప తొక్కాలనుకుంది. ఆపై రాకెట్‌లో గగనాంతర రోదసిలోకి వెళ్లాలనుకుంది. ఏవేవో కలలు కంటున్న కండ్లలో ఏదో సమస్య వచ్చింది. కంటిచూపులో తేడా! దీంతో ఆస్ట్ట్రోనాట్‌ కావడానికి కనీస అర్హత కోల్పోయింది. నింగికి వేసుకున్న ఆశల నిచ్చెన ఒక్కసారిగా జారిపోయినట్టయింది. ఇంటర్‌లో ఉండగా ఓ సమాచారం ఆమెకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ప్రైవేట్‌ స్పేస్‌ టూరిజం గురించి తెలిసి.. మళ్లీ తన కలలకు రెక్కలు తొడగాలనుకుంది. పర్‌డ్యూ యూనివర్సిటీ నుంచి ఏరోనాటికల్‌- ఆస్ట్ట్రోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టా అందుకుంది. కొన్నాళ్లకు జార్జి వాషింగ్టన్‌ యూనివర్సిటీ నుంచి స్పేస్‌ ఇండస్ట్రీలో ఎంబీఏ చేసింది. అలా లక్ష్యసాధనకు అవసరమైన అస్ర్తాలన్నీ ప్రోది చేసుకుంది శిరీష.

అంచెలంచెలుగా అంతరిక్షానికి..
2012లో కమర్షియల్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌ ఫెడరేషన్‌లో అసోసియేట్‌ డైరెక్టర్‌గా చేరింది. 2015 వరకు ఆ బాధ్యతలు నిర్వర్తించింది శిరీష. తర్వాత అంతరిక్ష పర్యాటక సంస్థ వర్జిన్‌ గెలాక్టిక్‌లో వ్యాపార అభివృద్ధి-ప్రభుత్వ వ్యవహారాల మేనేజర్‌గా నాలుగేండ్లు పనిచేసింది. తర్వాత అదే సంస్థలో డైరెక్టర్‌ ఆఫ్‌ వాషింగ్టన్‌ వర్జిన్‌ ఆర్బిట్‌ బాధ్యతలు చేపట్టింది. గత జనవరిలో సంస్థ ఉపాధ్యక్షురాలిగా ఎంపికైంది. ఇప్పుడు అదే హోదాలో అంతరిక్ష యానానికి సిద్ధమవుతున్నది శిరీష. ఈ నెల 11న వర్జిన్‌ గెలాక్టిక్‌ వ్యవస్థాపకుడు బ్రాన్‌సన్‌తో కలిసి వెళ్తున్న మరో ఐదుగురిలో ఆమె ఒకరు. మొత్తం ఆరుగురు సభ్యుల బృందంలో ఇద్దరు పైలెట్లు. మొత్తానికి తన చిన్ననాటి కలను నెరవేర్చుకున్న ఆనందంలో ఉంది శిరీష బండ్ల. అంతరిక్షంలోకి వెళ్తున్న తెలుగు మూలాలున్న తొలి యువతిగా ఆమె ప్రయాణం మనకూ గర్వకారణమే! ఆ ఘనత సాధించినవారిలో భారతీయ మూలాలున్న నాలుగో వ్యక్తిగా.. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌ తర్వాత మూడో మహిళగా రికార్డును సొంతం చేసుకుంది శిరీష.

స్విమ్మింగ్‌తో ఉపశమనం

బాల్యంలో ఐదేండ్లు ఇక్కడే పెరగడంతో శిరీష తెలుగులో గలగలా మాట్లాడేస్తుంది. 2014లో తానా సభల్లో ‘యంగ్‌ స్టార్‌’ అవార్డునూ అందుకుంది. పుస్తక పఠనం అంటే ఆమెకు ఆసక్తి. ఒత్తిడికి గురైనప్పుడు స్విమ్మింగ్‌ చేసి సేద చెబుతున్నది. లాంగ్‌ వీకెండ్స్‌లో హైకింగ్‌, రాక్‌ ైక్లెంబింగ్‌కు వెళ్తుంటుంది. మారథాన్‌ వంటి ఈవెంట్లకూ హాజరవుతుంటుంది. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుంది శిరీష. ఈ మేరకు ఆస్ట్ట్రోనాటికల్‌ సొసైటీ, ఫ్యూచర్‌ స్పేస్‌ లీడర్స్‌ ఫౌండేషన్లకు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌గా, పర్‌డ్యూ యూనివర్సిటీ యంగ్‌ ప్రొఫెషనల్‌ అడ్వయిజరీ కౌన్సెల్‌ సభ్యురాలుగా కొనసాగుతున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana