e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home జిందగీ బన్నీ ఎనర్జీ భేష్‌!

బన్నీ ఎనర్జీ భేష్‌!

చిన్నప్పటినుంచీ నటన అంటే ఇష్టం. హీరో కావాలని కలలు గన్నాడు. చదువు పూర్తవగానే ప్రయత్నాలు ప్రారంభించాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. విలన్‌గా కెమెరా ముందుకొచ్చినా, అదృష్టం తనను హీరోగా నిలిపిందంటున్నాడు జీ తెలుగు ‘రాధమ్మ కూతురు’సీరియల్‌ హీరో గోకుల్‌. తెలుగు ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న చెన్నై చిన్నోడు గోకుల్‌ ‘జిందగీ’తో పంచుకున్న విశేషాలు.

బన్నీ ఎనర్జీ భేష్‌!

ఎలాగైనా సినిమా యాక్టర్‌ కావాలని బాల్యంలోనే నిర్ణయించుకొన్నా. అందుకే, సినిమాలు విపరీతంగా చూసేవాణ్ని. ఇంజినీరింగ్‌ కాగానే సినిమాల్లోకి వచ్చే దారులన్నీ వెతికాను. మోడలింగ్‌పై దృష్టి పెట్టాను. యాడ్స్‌లో నటించాను. ఆడిషన్స్‌కీ వెళ్లేవాణ్ని. మాది కేరళ. కుటుంబం చెన్నైలో ఉండేది. స్టార్‌ విజయ్‌ టీవీలో ఓ సీరియల్‌లో హీరో పాత్ర కోసం ఆడిషన్స్‌ జరుగుతున్నాయంటే వెళ్లాను. రెండురోజుల తర్వాత ఫోన్‌ చేసి, నేను సెలెక్ట్‌ అయ్యానని చెప్పారు. తీరా వెళ్లాక విలన్‌ పాత్ర చేయమన్నారు. ఆ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉండటంతో ఒప్పుకొన్నా. అలా, తమిళ సీరియల్‌ ‘కల్యాణం కల్యాణమమ్‌’లో విలన్‌గా నా కెరీర్‌ ప్రారంభమైంది.

తెలుగులోకి..
తమిళంలో సీరియల్‌ చేస్తున్నప్పుడే ‘స్టార్‌ మా’నుంచి అవకాశం వచ్చింది. అప్పుడు నాకు తెలుగు అంతగా రాదు. అందుకే, కొంచెం ఆలోచించా. కానీ, దర్శకుడు సురేష్‌ కృష్ణ ధైర్యం చెప్పడంతో కాదనలేక పోయా. ‘జ్యోతి’ సీరియల్‌లో హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చా. ఆ తర్వాత జీ తెలుగు ‘రాధమ్మ కూతురు’లో అవకాశం వచ్చింది. ప్రస్తుతం ‘రాధమ్మ కూతురు’ మాత్రమే చేస్తున్నా. తమిళంలో చాలా ఆఫర్లు వస్తున్నా, డేట్లు కుదరడం లేదు. కరోనా కారణంగా ప్రయాణాలు కూడా ఇబ్బందిగా సాగుతున్నాయి. అందుకే, మంచి అవకాశాలను కూడా వదులుకోవాల్సి వస్తున్నది.

అందరూ ఇష్టమే..
నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. నేనుకూడా తెలుగు సినిమాలకు వీరాభిమానినే. మొదట్లో సబ్‌ టైటిల్స్‌తో సినిమా చూసేవాణ్ని. ఇప్పుడు డైరెక్ట్‌గా చూస్తున్నా. అల్లు అర్జున్‌ అంటే చాలా ఇష్టం. ఆయన డ్యాన్స్‌, ఎనర్జీ మాలాంటి వాళ్లకు ఆదర్శం. మహేష్‌ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, నాని అందరి సినిమాలూ చూస్తా. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. నా ఆహార్యానికి మంచి ప్రశంసలు వస్తుంటాయి. చాలామంది నా గడ్డం, మీసాలు బాగుంటాయంటారు. ‘రాధమ్మ కూతురు’ సీరియల్లో మా జంటకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభిస్తున్నది. జీ కుటుంబం అవార్డుల్లో ‘బెస్ట్‌ రొమాంటిక్‌ కపుల్‌ అవార్డు’కూడా వచ్చింది. సినిమాల్లో నటించాలని ఈ రంగంలోకి వచ్చా. ఎప్పటికైనా హీరోగా వెండితెరపై నన్ను నేను చూసుకోవాలి. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. మా కుటుంబంలో సినీరంగానికి సంబంధించిన వాళ్లెవ్వరూ లేరు. అయినా, నేను ఈ రంగంలోకి వచ్చా. కష్టమైనా ఇష్టపడి వచ్చినందుకు మంచిపేరు, గుర్తింపు సంపాదించుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా.

మూడేండ్ల తర్వాతే..
అమ్మ, నాన్న, అన్నయ్య, నేను.. ఇదే మా కుటుంబం. అన్నయ్య సింగర్‌. తమిళ సినిమాలకు మ్యూజిక్‌ కంపోజర్‌గా చేస్తున్నాడు. జీవితంలో తోడు కావాలంటే పెండ్లి చేసుకోవాలి. పెండ్లిపై మంచి అభిప్రాయం ఉంది గాని, ఇప్పట్లో ఆ ఆలోచనే లేదు. మూడేండ్ల వరకు కెరీర్‌మీదే దృష్టి పెట్టాలనుకుంటున్నా.
ప్రవళిక వేముల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బన్నీ ఎనర్జీ భేష్‌!

ట్రెండింగ్‌

Advertisement