సోమవారం 25 మే 2020
Zindagi - Mar 16, 2020 , 10:54:29

నెట్టింట్లో తెలుగు కథలు..

నెట్టింట్లో తెలుగు  కథలు..

కథలంటే కొందరికి రాయడం ఇష్టం, కొందరికి వినడం ఇష్టం, ఇంకొందరికి చదవడం ఇష్టం మరికొందరికి  చెప్పడం ఇష్టం. ఇలాంటి వాళ్లందరిని  ఒకే చోట  ఏకం చేస్తున్నాయి కొన్ని కథల వెబ్ సైట్లు, బ్లాగులు. రాజుకు ఏడుగురు కొడుకులు. వారు చేపల వేటకు వెళ్లారంటూ నానమ్మ మొదలెట్టిన కథ అయిపోయే సరికే నిద్రలోకి జారుకోవడం ఈ కాలం పిల్లలు ఎరుగరు. కానీ ఒకప్పుడు కథలు అంటే పిల్లలు చెవులు  కోసుకునే వారు. పిల్లలు అందరూ ఒక దగ్గరకు చేసి 'అనగనగా' అని నాయనమ్మ మొదలెట్టగానే ముక్కుమీదెలేసుకుని ఊకొట్టేవారు. అంతా అయిపోయాక  'కథ కంచికి మనం ఇంటికి' అని అనగానే ఉలిక్కిపడి ఇంటికి వెళ్లేవారు. 

కానీ, ఇప్పుడు సెలవుల్లో పిల్లలను ఒక్క దగ్గర కూర్చోబెట్టి అల్లరి చేయకుండా చూసేందుకు తల్లిదండ్రులు పడే పాట్లు అన్నీఇన్నీ కావు. గతంలో పిల్లలందర్నీ ఒక్కచోట చేర్చుకొని  నీతి కథలు మొదలు పెట్టి వారిని ఏదో తెలియని ఊహాలోకం తీసుకెళ్లే ఓపికున్న అమ్మమ్మలు, నానమ్మలూ ఇప్పుడు కరువయ్యారు.

టెక్నాలజీ పెరిగే కొద్ది కలం, కాగితాలతో పని తగ్గుతున్నది నేరుగా కంప్యూటర్ లోనే కథలు రాయడం, వినడం మొదలెడుతున్నారు.  కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్‌లో నెట్ సౌకర్యం ఉంటే చాలు కదిలే బొమ్మలతో నీతి కథలను చదివిస్తూ పిల్లలను బుద్ధిమంతుల్లా ఉంచేందుకు ఆన్‌లైన్‌లో అలనాటి, నేటి కథలు అందుబాటులో ఉన్నాయి. 

చందమామ, పంచతంత్రం,  బాలమిత్ర, బొమ్మరిల్లు, చిట్టెలుక కథలు,  పేదరాశి పెద్దమ్మ, భేతాల కథలు, అక్బర్ బీర్బల్ కథలు తెనాలి రామకృష్ణ కవి హాస్య కథలు, సింహం చిట్టెలుక తదితర కథల పుస్తకాలతో పాటు, చదువు, సాహిత్యం, క్రీడలు, సాంస్కృతికం తదితర అంశాలు కలిగిన పుస్తకాలు, సైట్లు, బ్లాగులు ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉంటున్నాయి.

'నెట్' ఇంట్లోకి తెలుగు కథలు: 

తెలుగు నీతి కథల కోసం ప్రత్యేకంగా కొన్ని పుస్తకాలుండేవి ఆ కాలంలో. అప్పుడు నీతి కథల పుస్తకాలు  పిల్లలకు స్కూల్ లలో ఇచ్చేవారు. సెలబస్ పుస్తకాలే మోయలేని పరిస్థితి ఇప్పుడున్న పిల్లలది.  అయినప్పటికి ఆ  ఇంటర్నెట్‌లోనూ తెలుగు భాషలో చిన్నారులకు ఎన్నో కథలు అందుబాటులో ఉన్నాయి. సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్తే తెలుగు కథలు ప్రత్యక్షమవుతాయి.te.vikaspedia.in లో బాలల కథలు, బాలల ఆరోగ్యం, బాలల నీతి కథలు, పద్యాలు దాదాపు వందకు పైగా ఉన్నాయి. Kathalu.wordpress.com లో బోలెడన్ని తెలుగు నీతి కథలు దర్శనమిస్తున్నాయి. www.teluguone.com లో కథల తో పాటు తెలుగు పద్యాలు, ఇంగ్లీష్ పద్యాలు బోలెడన్ని ఉన్నాయి. www.goodreads.com లో కథల పుస్తకాలు అందబాటులో ఉన్నాయి.  కాలక్షేపం కోసం, సరదాకోసం ఉపయోగపడే  సరదా వీడియోలు పొందుపరిచారు. 

ఇలాంటి కథల వెబ్ సైట్లు మరికొన్ని: 

podupukathalu.blogspot.com,indianepicstories.blogspot.in, telugupennidhi.com, telugu-velugu.net, forkids.in, telugumalika.blogspot.com.  ఇలా ఇవే కాదు . ఓపిక ఉండాలే గానీ చిన్నారులకు సంబంధించిన లక్షలాది కథలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. 

వివిధ దేశాలకు సంబంధించిన సామాజిక సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్లు బాలల కథలను అందిస్తున్నాయి. ఉచితంగా కథలు చదవడంతో పాటు, వాటిని డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. కొన్ని పుస్తకాలు ఆన్‌లైన్‌లోనే చదివే అవకాశముంది. చదవడమే కాదు. అది ఎందుకు నచ్చిందీ? దాంట్లో ఆసక్తి గొలిపిన విషయాలేంటీ? ఏం నీతిని గ్రహించారు? తదితర అంశాలను ఇంటర్నెట్‌లో స్నేహితులతో షేర్ చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది చిన్నారులు ఆయా వెబ్‌సైట్లలో చేరి తాము గ్రహించిన విజ్ఞానాన్ని, మంచి విషయాలను తమ దోస్తులతో పంచుకుంటున్నారు. 

ఇక్కడ కథలు కదలుతాయ్‌..

వెబ్‌సైట్ లతో పాటే యూట్యూబ్  ద్వారా సాహిత్యానికి సంబంధించిన అంశాలు, చరిత్ర, పురాణాలు, యూట్యూబ్ ద్వారా కార్టూన్ కథలు, బాల గేయాలు, బాల సాహిత్యం వంటివి ఎన్నో చిన్నారుల మేధోసంపత్తిని పెంచేందుకు అందుబాటులో ఉన్నాయి. చిన్నారులు ఇష్టంగా పాడుకునే ‘చిట్టి చిలకమ్మ, 'చుక్ చుక్ రైలు,  ఏనుగమ్మ ఏనుగు, బుర్రుపిట్ట..’ వంటి పలు రకాల పాటలు యానిమేషన్ వీడియోలు  కళ్ల ముందు కదులుతాయి. 

ఆయా యూ ట్యూబ్ ఛానళ్లు పెడుతున్న  రెయిమ్స్, పిట్టకథలు, తెలుగు పద్యాలను సులభంగా విద్యార్థులకు నేర్పించవచ్చు. ముఖ్యంగా ఎల్‌కేజీ, యూకేజీ నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఇలాంటి విధానం ద్వారా పాఠాలు బోధించడం ద్వారా ప్రత్యేక శ్రద్ధతో పిల్లలు నేర్చుకుంటున్నారు.  ఇలా బాలల కథలను, పద్యాలను యానియేషన్ లుగా అందిస్తున్న కొన్ని  యూట్యూబ్ చానెళ్లు : Fairy Toonz Telugu, Fairy Toonz Telugu, Bommarillu videos, kids planet, bhul bhul మొదలగు ఛానెళ్లు కథలను యానిమేషన్ రూపంలో అందిస్తున్నాయి.


logo