e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home జిందగీ వింధ్యా విశాఖ విన్నింగ్‌ కామెంట్రి!

వింధ్యా విశాఖ విన్నింగ్‌ కామెంట్రి!

వింధ్యా విశాఖ విన్నింగ్‌ కామెంట్రి!

టీవీలో ఐపీఎల్‌ మ్యాచ్‌ ‘రేయ్‌ మచ్చా.. ఇయ్యాల ఎవరు గెలుస్తరు?’ ‘ఇంకేది.. మా టీమే’ ‘నిన్న మీవోడు డకౌట్‌ అయ్యిండు బేబీ!’‘అబఛా.. మీవోడు పెద్ద గదంచినట్టూ’ముచ్చట్లమీద ముచ్చట్లు. ఈ ఉత్కంఠను,ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని మిక్స్‌ చేస్తూ టీవీలో కామెంటరీ వస్తున్నది. అదికూడా తెలుగులోనే. ఉగాది పచ్చడంత కమ్మనైన ఈ కామెంటరీ వినిపిస్తున్నదెవరో తెలుసా? ఘట్‌కేసర్‌ యువతి వింధ్యా విశాఖ మేడపాటి. ఆ క్రికెట్‌ స్టేడియం కబుర్లు ఆమె మాటల్లోనే..
ఇప్పుడే కాదు, గత మూడు సీజన్లలోనూ ఐపీఎల్‌ హోస్ట్‌గా వ్యవహరించాను. మగవాళ్లు రాజ్యమేలుతున్న క్రికెట్‌ కామెంటరీ విభాగంలో ‘తొలి తెలుగు ఆడగొంతుక’ నాదే. 2018లో స్టార్‌ స్పోర్ట్స్‌ వాళ్లు ప్రాంతీయ భాషల్లో క్రికెట్‌ ప్రత్యక్ష వ్యాఖ్యానం తీసుకురావాలని అనుకున్నారు. అదే గొప్ప విషయమని అనుకుంటే, ఏకంగా మహిళా కామెంటేటర్లను నియమించాలని అనుకోవడం ఇంకా గొప్ప. నేనే ఆ ‘తొలి తెలుగు మహిళా కామెంటేటర్‌’ను కావడం నా అదృష్టం. ఇప్పటివరకు వందలాది మ్యాచ్‌లకు కామెంట్రీ చేశాను. దాదాపు అన్నీ లైవ్‌ ప్రోగ్రామ్సే చేస్తున్నాను. నిజంగా నాకు ఇదొక కొత్త అనుభూతి.

వన్‌ అండ్‌ ఓన్లీ

ప్రతీ సీజన్‌కు హోస్ట్‌లను మారుస్తుంటారు. ఇప్పటివరకు నాతోపాటు కొందరు పనిచేశారు. వాళ్లంతా మారుతుంటారు. నేను మాత్రం 2018లో ఎంపికై, ఇప్పటివరకు కొనసాగుతూనే ఉన్నాను. ఐపీఎల్‌ పది సీజన్ల వరకు మొత్తం మేల్‌ కామెంటేటర్లతోనే నడిచింది. తర్వాత సీజన్‌నుంచీ కథ మారిపోయింది. మహిళా హోస్ట్‌ల శకం మొదలైంది. తాజాగా, ముంబై ఐపీఎల్‌ మ్యాచ్‌లకు కూడా హోస్ట్‌గా వ్యవహరించాను. ఇదంతా ఓ కొత్త ప్రపంచం. నన్ను నేను నిరూపించుకోవడానికి అనువైన వేదిక.

తొలి అడుగు.. ప్రో కబడ్డ్డీ

క్రికెట్‌ కంటే ముందే నాకు ప్రోకబడ్డీలో ప్రవేశం ఉంది. 2017లో ప్రోకబడ్డీ హోస్ట్‌కి ఆడిషన్స్‌ జరుగుతున్నాయని స్టార్‌ స్పోర్ట్స్‌నుంచి కాల్‌ వచ్చింది. ముంబై వెళ్లి ఆడిషన్స్‌ ఇచ్చాను. సెలెక్ట్‌ అయ్యాను. అలా, స్పోర్ట్స్‌లో నా ఎంట్రీ ప్రో కబడ్డీతోనే ప్రారంభమైంది. నేను చిన్నప్పుడు కబడ్డీ ఆడేదాన్ని. ఇలా, కబడ్డీ హోస్ట్‌గా వ్యవహరిస్తానని మాత్రం ఏనాడూ అనుకోలేదు. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాను. అది స్టార్‌వాళ్లకు నచ్చింది. 2018లో ప్రాంతీయ భాషల్లో ఐపీఎల్‌ కామెంటరీ ప్రారంభిస్తున్నప్పుడు మళ్లీ అవకాశం ఇచ్చారు. అలా నేను ప్రోకబడ్డీనుంచి ఐపీఎల్‌కు వచ్చాను.

కాలేజీ సెలక్షన్స్‌

మాది మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌. వ్యవసాయ కుటుంబం. నాన్న సత్తిరెడ్డి, అమ్మ మమతా చక్రవర్తి. నా ప్రాథమిక విద్యంతా ఘట్‌కేసర్‌లోనే. అమ్మమ్మవాళ్లది సికింద్రాబాద్‌. కస్తూర్బాగాంధీ కాలేజీలో డిగ్రీ చదివాను. ఇంగ్లిష్‌ లిటరేచర్‌ నా ప్రధాన సబ్జెక్ట్‌. అప్పుడు, అన్నా హజారే లోక్‌పాల్‌ మూమెంట్‌ జరుగుతున్నది. ‘యూత్‌ ఫర్‌ బెటర్‌ ఇండియా’ వాళ్లు అవినీతికి వ్యతిరేకంగా ఒక షో చేశారు. దాన్ని హెచ్‌ఎంటీవీ వాళ్లు షూట్‌ చేస్తున్నారు. షోకోసం మా కాలేజీలోనే సెలక్షన్స్‌ జరిపారు. అందులో నేను ఎంపికయ్యాను. నాకేదో స్క్రిప్ట్‌ ఇచ్చారు. అవినీతికి వ్యతిరేకంగా స్లోగన్స్‌ ఇస్తూ మాట్లాడాను. అది టెలికాస్ట్‌ అయ్యింది. అప్పటి, హెచ్‌ఎంటీవీ సీయీవో రామచంద్రమూర్తి సార్‌కు అది నచ్చింది. ‘తనకు న్యూస్‌ యాంకర్‌గా ఇంట్రెస్ట్‌ ఉందేమో అడగండి’ అని సూచించారట. దీంతో నన్ను పిలిపించారు.

అనుకోని అవకాశం

వింధ్యా విశాఖ విన్నింగ్‌ కామెంట్రి!

నాకు మీడియా రంగంపై అవగాహన లేదు. అందుకే, తొందర పడొద్దనే అనుకున్నాను. ఆఫీస్‌కైతే వెళ్లాను కానీ, ఏ పనీ చేయలేదు. రెండు నెలలు పరిశీలించాను. మూడో నెలలో ‘న్యూస్‌ ప్రజెంటర్‌’గా కెరీర్‌ స్టార్ట్‌ చేశాను. లైవ్‌న్యూస్‌ చేయడం ప్రారంభించారు. అప్పటికి నేను డిగ్రీ చదువుతున్నా. ఎక్కడ చదువుకు ఆటంకం కలుగుతుందో అని, ఎనిమిది నెలల తర్వాత మానేశాను.

మోడలింగ్‌ వద్దనుకున్నా

కాలేజీ పూర్తయ్యాక కొంతకాలం మోడలింగ్‌ చేశాను. నాకెందుకో నచ్చలేదు. అదీ మానేశాను. మా టీవీనుంచి ఆఫర్‌ వచ్చింది. అది సినిమా అవార్డ్స్‌ రెడ్‌కార్పెట్‌ కార్యక్రమం. అదే నా తొలి ఈవెంట్‌. సక్సెస్‌ అయ్యింది. ‘స్టార్‌ మా’ వాళ్లకు కూడా బాగా నచ్చింది. 2014లో మా మ్యూజిక్‌లో ‘చాయ్‌ బిస్కెట్‌’ లైవ్‌ ప్రోగ్రామ్‌ మొదలైంది. ఈ అవకాశమూ నా తలుపు తట్టింది. అక్కడినుంచి యాంకరింగ్‌లో కొనసాగుతూ వచ్చాను.

ఐపీఎల్‌లో..

టెలివిజన్‌ యాంకర్‌గా మంచి ఊపులో ఉన్నప్పుడే ఐపీఎల్‌ అవకాశం వచ్చింది. అప్పటిదాకా నేను చేసిందంతా పక్కా ఎంటర్‌టైన్‌మెంట్‌. క్రికెట్‌ హోస్టింగ్‌ అలా కాదు. చాలా సీరియస్‌గా ఉంటుంది. క్రికెట్‌తో నాకు పెద్దగా అనుబంధం కూడా లేదు. ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి వెళ్లాను కాబట్టి, మొదట్లో కాస్త ఇబ్బంది అనిపించినా రాన్రాను మెరుగయ్యాను. ప్రతీ మ్యాచ్‌కు ముందు హోంవర్క్‌ చేయడం మొదలుపెట్టాను. ‘ఏ ఆటగాడి పర్ఫార్మెన్స్‌ ఎలా ఉంది?’ అనేది స్పష్టంగా తెలుసుకున్నాను. మైండ్‌ఫుల్‌గా మాట్లాడి ప్రేక్షకులను మెప్పించి ఫస్ట్‌ సీజన్‌ కంప్లీట్‌ చేశాను. నిపుణుల పరిచయాలతో నా పనితీరులో చాలా మార్పు వచ్చింది. ఐపీఎల్‌ హోస్ట్‌గా చేస్తూనే, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈవెంట్స్‌ నిర్వహిస్తున్నాను.

మహిళలు ఆడొద్దా?

సినిమా, క్రికెట్‌ అనే రెండు పెద్ద ఫీల్డ్స్‌లో నిలదొక్కుకోవడం నాకు సంతృప్తినిచ్చే విషయం. ఇలా అన్నిట్లోనూ రాణించే మహిళలను ఆటలకు మాత్రం ఎందుకు దూరం చేశారో? మందిరాబేడి, మహంతి, సంజనా, భావన.. వీళ్లను చూశాక, ఆడవాళ్లు సామాన్యులు కారని ఎవరికైనా అనిపిస్తుంది. ఇందుకు ఉదాహరణ మా అమ్మే. తాను అప్పట్లోనే ఎన్‌సీసీ క్యాడెట్‌. జీవితంలో చాలా చేయాలని అనుకున్నది. కానీ, అవేవీ పట్టించుకోకుండా పెండ్లి చేశారు.. కుటుంబం, పిల్లలు, బాధ్యతలు. అలా తాను మిస్‌ అయిన జీవితాన్ని నాలో చూడాలనుకుంది. నన్ను బాగా ఎంకరేజ్‌ చేస్తున్నది. 2019లో నా పెండ్లయింది. మా ఆయన విశాల్‌ కుమార్‌. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో సీనియర్‌ మేనేజర్‌. తను కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు.
సమాజానికి నావైపునుంచి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ‘స్వేచ్ఛ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌’ను స్థాపించాను. దానిద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఖాళీ సమయాల్లో ఘట్‌కేసర్‌లోని మా వ్యవసాయ క్షేత్రంలో పచ్చని ప్రకృతిమధ్య గడుపుతాను. మా ఇల్లు విశాలంగా ఉంటుంది. మా ఆవరణలో పిచ్చుకలు, పెంపుడు జంతువులు, ఆవులు ఉంటాయి. వాటిని చూస్తూ రిలాక్స్‌ అవుతాను. చాలామంది నా ప్రొఫెషనల్‌ లైఫ్‌తోపాటు పర్సనల్‌ లైఫ్‌ గురించికూడా అడుగుతుంటారు నన్ను. వారికోసం ‘వింధ్యా విశాఖ’ అనే యూట్యూబ్‌ చానెల్‌ ప్రారంభించాను.
దాయి శ్రీశైలం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వింధ్యా విశాఖ విన్నింగ్‌ కామెంట్రి!

ట్రెండింగ్‌

Advertisement