సోమవారం 01 మార్చి 2021
Zindagi - Feb 11, 2021 , 01:07:50

ఇద్దరక్కచెల్లెండ్లు ఉయ్యాలో!

ఇద్దరక్కచెల్లెండ్లు ఉయ్యాలో!

కళల కాణాచి మన తెలంగాణ. ఈ గడ్డపై నిత్యమూ జానపద జాతర సాగుతది. పెదాలపై పల్లె పదాలే కాదు.. ఆ పదాలను పట్టాలెక్కించే జమిడిక మోతలు.. తాటిబూర చప్పుళ్లు కూడా ఊగిస్తయి. చెట్టుమీద.. పుట్టమీద.. చేలల్లో.. చెలకల్లో.. సెలయేర్లపై అచ్చమైన పల్లెపదం రోజూ పారుతనే ఉంటది. వినసొంపుగా.. వీనుల విందుగా.. కోలాటమేసి కోటి సంబురాలు పంచుతనే ఉంటది. అసొంటి జానపద తోటలో పూసిన జమిలి ఆణిముత్యాలే.. అక్క హరిత, చెల్లె సవిత. ‘ఇద్దరక్క చెల్లెండ్లు ఉయ్యాలో.. ఒక్కపాట పాడిండ్రు ఉయ్యాలో’ అన్నట్లుగా పల్లె పాటల సోపతైండ్రు! 

భిన్నాభిప్రాయాలు, విభిన్న అభిరుచులు. అన్నదమ్ములే కాదు.. అక్కాచెల్లెండ్లు కూడా ఒక్కమాట మీద ఉండటం కష్టం. అలాంటిది, వీళ్లిద్దరూ ఒక్కమాట మీదే కాదు.. ఒకే పాటమీద కూడా ఉంటున్నరు. అందులోనూ జానపదం. ఇప్పుడంటే జానపదానికి ఓ గ్లామర్‌ ఉందిగానీ.. ఎలాంటి క్రేజ్‌ లేనప్పుడే వీళ్లిద్దరూ జానపదాన్ని  ఎంచుకున్నరు. చండూరు చూరుకింద మొదలైన ఆ అక్కాచెల్లెండ్ల పల్లె పాటల ప్రయాణం ఇప్పుడు ఎక్కడిదాకా చేరిందో తెలుసుకుందాం. 

అమ్మానాయిన కష్టం తెలుసు

మాది పల్లెటూరు. నల్లగొండ దగ్గర చండూరు మండలం కొండాపూర్‌ మా ఊరు. అమ్మానాయిన వెంకటమ్మ, గడ్డం లింగయ్య. వాళ్లు వ్యవసాయం చేస్తరు. నాతోడ ముగ్గురు అక్కలు, ఒక చెల్లె. ఐదుగురం ఆడబిడ్డలమే అయితిమి.. పెద్దజేసి పెండ్లిళ్లు చేయాల్నాయె. అందుకోసం అమ్మానాయిన చానా కష్టపడేటోళ్లు. పేదరికమే అయినా మాకు ఏ ఆపతీ రాకుంట సూడాలన్నదే వాళ్ల ఉద్దేశం. ‘మేమే సదువుకోలేదు. అక్కలు కూడా సరిగ్గా సదవలేదు. చిన్నోళ్లు మీరన్న మంచిగ సదివి.. ఇగురానికి రాండ్రి బిడ్డా’ అని బాగా ఎంకరేజ్‌ చేస్తడు నాయిన.  వాళ్ల కష్టాన్ని అర్థం చేసుకున్న నేను. డిగ్రీ అయిపోయి బీఈడీ చేయాలనుకుంటున్నా. 

యూట్యూబ్‌ చానెళ్ల కోసం ఇప్పటిదాంక నేను 15 పాటలు పాడిన. నేను మంచిగా పాడగలను అని పదిమందికి తెలిసేలా చేసింది మాత్రం ‘ఓ కంకరగొట్టే కన్నెపిలగో లచ్చుమయ్యా’ పాట. మానుకోట ప్రసాదన్న పాడించిండు. తర్వాత అమూల్య ఆడియోస్‌ అండ్‌ వీడియోస్‌ వారి ‘ఉండనే ఉండనమ్మా’ పాట మంచిపేరు తెచ్చింది. ‘ఊరిమీద సోపతిడిసీ కట్టుకున్న ఆలినిడిసీ’ అనే గల్ఫ్‌ అన్నల పాట మరో మెట్టు ఎక్కించింది. నన్ను ట్రెండింగ్‌లోకి తీసుకెళ్లి ఎక్కువమందికి పరిచయం చేయడంతోపాటు ‘ఫోక్‌ 

సర్కిల్స్‌'లో నాకంటూ ప్రత్యేకతను చాటిన పాట మాత్రం ‘ఓసారి రావా బావా’. ఇప్పటికే ఈ పాట యాభై లక్షల వ్యూస్‌ దాటింది. ఇక పాటలు పాడే అవకాశాలు రావేమో అనుకొన్నా. పత్తి తీసే పనికి వెళ్లి.. చేలల్లో పాడుతుండేదాన్ని. అప్పుడే వీఆర్‌ టాకీస్‌నుంచి స్టిల్‌ విజయన్న వచ్చి ‘చెల్లే పాటలు పాడుతున్నవా?’ అని అడిగిండు. ‘ఓసారి రావా బావా’ పాడించి నా పాటను నిలవెట్టిండు. అక్క  నేర్పింది : నేను నాలుగో తరగతినుంచే పాటలు పాడుతున్న. కానీ నాకు పాట నేర్పింది.. నాచేత పాడించింది మాత్రం మా పెద్దక్క వనజ. ఆమె పొలం పనికి వెళ్లి మంచి మంచి పాటలు నేర్సుకుంది. ఆ పాటల్ని ఇంట్ల పాడుతుండేది. ‘అక్కా.. ఆ పాట పాడవా.. ఈ పాట పాడవా’ అనుకుంట పాడించేదాన్ని. నాకూ పాడాలనిపించి అక్కను అడిగిన. ‘నేను ఎట్ల పాడుతున్ననో నేర్సుకో ముందు’ అని సలహా ఇచ్చేది. మొత్తానికి నాకు అక్కతోటి పాట పరిచయం అయ్యింది. తర్వాత అక్క పెండ్లయింది. అక్క పాటలు ఆగిపోవద్దని ఆ బాధ్యత నేను తీసుకున్నా. ఎనిమిది, తొమ్మిదో తరగతికి వచ్చేసరికి బాగా పాడుతుందనే పేరు తెచ్చుకున్న.

నాయిన ప్రోత్సాహం

 స్కూల్‌ ప్రోగ్రామ్స్‌లో పాటలు పాడే నన్ను ఇరిగి శ్రీనన్న ధూమ్‌ధామ్‌ కార్యక్రమాలకు తీసుకెళ్లిండు. అట్లా పాటల ప్రపంచం ఏందో తెలుసుకున్న. కానీ ఊర్లల్ల ఎట్లుంటదంటే.. మనం ఏదైనా కాయిష్‌తోటి చేస్తుంటే కాళ్లల్ల కట్టెలేస్తుంటరు. నాగ్గూడా అసొంటి అనుభవమే ఎదురైంది. ‘ఏ పొల్లా.. ఏం పన్లేదా? సక్కగా సదువుకొని.. ఓ అయ్యింటికి ఇస్తే పెండ్లి చేసుకొని ఉండక.. ఈ పాటలేంది?’ అని కొందరు నిరుత్సాహపరిచే ప్రయత్నం చేసిండ్రు. కానీ మా నాయిన ‘నీ ఇష్టం బిడ్డా.. ఏది చేసినా నిజాయతీగా చేసి మంచిపేరు తెచ్చుకుంటే అదే సాలు నాకు’ అని నా తపనను అర్థం చేసుకొని ప్రోత్సహించిండు. ఒక దిక్కు పాటలు పాడుకుంటనే.. మరో దిక్కు ఎస్సై ఎంపిక పరీక్షలకు ప్రిపేరైతున్న. అమ్మానాయిన కష్టమేందో తెలుసు. వాళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కేటట్లు నా కెరీర్‌ను మలుచుకుంటనే, పాటలతోకూడా ప్రయాణం కొనసాగిస్త. 

అక్కను చూసి నేర్చుకొన్నా 

హరితక్క నాకంటే నాలుగేండ్లు పెద్ద. పెద్దక్క వనజను చూసి హరితక్క పాడటం నేర్చుకుంటే.. నేను హరితను చూసి నేర్చుకున్నా. చిన్నప్పటినుంచే వాళ్లను ఫాలో అయ్యేదాన్ని. అక్క బయట ప్రోగ్రామ్స్‌లో పాడిన పాటలు విని, ఇంటికి వచ్చినంక పాడుతూ అక్కను ఆట పట్టిస్తుండేదాన్ని. అలా ఏదో సరదా కోసమే పాడటం నేర్చుకున్నా కానీ, ప్రొఫెషనల్‌గా అయితే కాదు. కానీ, హరిత ఎంత ఇంట్రెస్ట్‌తో పాడేదో అంతే ఇంట్రెస్ట్‌తో నాకూ నేర్పింది. నాకు హరితక్కనే స్ఫూర్తి. 

మాకు ఐదెకరాల పొలం ఉంది. అదే మా ఆదరువు. హరిత ‘రేలారే రేలా’ 5వ సిరీస్‌ కోసం ఎంపికైతుందని ఆ కార్యక్రమ నిర్వహకులే ప్రోమో కోసం వీడియో షూట్‌ చేసుకొని వెళ్లిండ్రు. అప్పటి నుంచి నాకు పాటపై ఇంకా మక్కువ ఏర్పడింది. అక్క పాడే పాటలుగానీ, నేను పాడే పాటలుగానీ ఎక్కువగా మా ఇంటిపక్కన ఉండే అవ్వ ముత్తమ్మ దగ్గర నేర్చుకున్నవే. ఆమె బాగా పాడుతది. ముత్తమ్మ దగ్గర సేకరించిన చాలా పాటలు ఇప్పుడు అటు తిరిగీ ఇటు తిరిగీ యూట్యూబ్‌లో దర్శనమిస్తున్నయి. ఒకసారి అక్క శివరాత్రి ఉత్సవాల్లో పాడేందుకు సంస్థాన్‌ నారాయణపూర్‌ వెళ్లింది. అక్కడికి మానుకోట ప్రసాదన్న టీమ్‌ వచ్చిందంట. హరిత పాడిన ‘నంది వాహనా.. నాగభూషణా’ పాటను వాళ్లు మెచ్చుకున్నరని నాకు తెలిసింది. నేనుగూడా అట్ల పాడాలె అనిపించి ప్రాక్టీస్‌ చేసేదాన్ని. 

పచ్చబొట్టు సూపర్‌ హిట్టు : 2018లో వేణుకొండల్‌ అన్న ఒక సర్పంచ్‌ గురించి పాడమని అక్కను అమూల్య స్టూడియోస్‌కి రికార్డింగ్‌కి పంపించిండు. అక్క వాయిస్‌ చూసి ఆమెకు అవకాశాలు వచ్చినయి. ఆమెలా అవకాశాలు సంపాదించాలని నాకూ ఉండేది. ‘ఊరిమీద సోపతిడిసీ.. కట్టుకున్న ఆలినిడిసీ’ పాటను హరిత పాడినప్పుడు.. ‘పాడితే ఇసొంటి పాటలు పాడాలె’ అనిపించింది నాకు. ఇరిగి శ్రీనన్న సహకారంతో నల్లగొండ, హైదరాబాద్‌లో జరిగే ఈవెంట్స్‌కి వచ్చేదాన్ని. ఎన్నో ప్రయత్నాల తర్వాత ‘పచ్చబొట్టు’ పాట పాడే అవకాశం వచ్చింది. చాలా చక్కగా పాడినవనే ప్రశంసలు అందుకోవడమే కాదు, యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ లిస్ట్‌లో చేరింది ఈ పాట. ఇప్పుడు నేను నార్కట్‌పల్లి కిమ్స్‌ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్‌ సెకెండియర్‌ చదువుతున్నా. 

పాడుతా అని తెలవదు : నేను పాడుతా అని విజయన్నకు తెల్వదంట. హరితక్కకు ఓ పాట వినిపిద్దామని మా ఇంటికొచ్చిండొకసారి. వలస కార్మికుల గోసను చెప్పే ‘నెర్రబాసిన నేలలవోలె’ అనే పాట అది. ‘ఏరా బుజ్జీ ఏం జేస్తున్నవ్‌? నువ్వు కూడా పాడొచ్చు కదా?’ అని ఏదో సరదాకు అన్నడు. నేను వెంటనే ‘ఈ పాట నేనే పాడతలే అన్నా మరి’ అన్నాను. ‘అరే వాయిస్‌ బాగుంది.. ఇట్లనే కంటిన్యూ చెయ్‌' అని విజయన్న చెప్పడంతో, నేను పాటను సీరియస్‌గా తీసుకున్నా. అతనే ఓ ఆర్నెల్ల తర్వాత కాల్‌ చేసి.. ‘చెల్లె.. ఓ పాట ఉంది పాడతవారా?’ అని అడిగిండు.  ‘సరే’అన్నా. ఆ పాటే.. ‘నీ జ్ఞాపకాల చెరలో నేనలిగి పోతవున్నా.. పానమంత గుంజుతుందీ బావా.. నా గుండెపై పచ్చబొట్టయినావా’. 

స్క్రీన్‌పై కనిపించాలని

నేను కూడా హరితక్క లెక్కనే కెరీర్‌పై దృష్టి పెడుతూనే పాటల ప్రయాణాన్ని సాగిస్తా. మాది పేద కుటుంబం. అమ్మా నాయిన ఎంతో కష్టపడి మమ్ములను చదివించిండ్రు. వాళ్ల కష్టం ఫలించాలంటే చదువు చాలా ముఖ్యం. అందుకే, నేను నర్సింగ్‌ కోర్సు ఎంచుకున్నా. కొన్నిసార్లు మంది గురించి కూడా ఆలోచించాల్సి వస్తది. ‘అక్కలకు మంచి పేరుంది. మంచిగ పని చేసేటోళ్లు. ఒక అయ్యింటికిస్తే అక్కడకూడా పేరెల్లిండ్రు. మీరుగిట్ల వాళ్ల లెక్కనే మంచిపేరు తీస్కరావాలె బిడ్డా’ అని మా మేలు కోరేటోల్లు సలహా ఇస్తుంటరు. అందుకే, ప్రస్తుతానికి చదువుతూనే తీరికదొరికితే పాటలు పాడుతుంటా. జానపదం నాకు చిన్నతనంలోనే పరిచయం అయ్యింది. దాన్ని మధ్యలో వదిలి పెట్టలేను కదా? పాడటమే కాదు.. స్క్రీన్‌పై నటించాలని కూడా ఉంది. అవకాశాలు వస్తే నా టాలెంట్‌ ఏంటో నిరూపిస్తా. 

-దాయి శ్రీశైలం

VIDEOS

logo