‘ఏ ముహూర్తాన పెట్టారో మా సారుకు ఆ పేరు. నింగిలోని ఆదిత్యుడికి సెలవు ఉండదు. మా ఆదిత్య సారుకూ సెలవంటే ఏందో తెల్వదు’ అంటారు విద్యార్థులు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు గుమ్మడి ఆదిత్య. ఆరున్నరేండ్లుగా ఒక్కరోజూ సెలవు తీసుకోకపోవడం ఆయన పనితీరుకు నిదర్శనం. తాను హాజరవ్వడమే కాదు.. విద్యార్థుల హాజరు సైతం 100 శాతం ఉండేలా ప్రోత్సహిస్తున్నారు. పాఠశాలకు వచ్చింది మొదలు తీరిక లేకుండా పనిచేస్తూనే ఉంటారు. జూనియర్ కళాశాల, హాస్టల్, తరగతి గదులు.. ప్రతీది పర్యవేక్షిస్తారు. ఆంగ్లంలో బోధనసాగిస్త్తూ విద్యార్థుల భవితను తీర్చిదిద్దుతున్నారు.
2003 డీఎస్సీ ద్వారా స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు ఆదిత్య. ఎనిమిదేండ్లు ఆదిలాబాద్‌లో పనిచేశారు. కరీంనగర్ జిల్లాలో ఉద్యోగం చేయాలనే తపనతో 2013లో మోడల్ స్కూల్స్‌లో పీజీటీ ఇంగ్లిష్ పరీక్ష రాసి రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్ సాధించారు. నాటి నుంచి తిమ్మాపూర్ మోడల్ స్కూల్లో వైస్ ప్రిన్సిపల్‌గా కొనసాగుతున్నారు. 2015 జూన్‌లో విధుల్లో చేరిన నాటి నుంచీ ఆయన ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు. పరీక్షల నిర్వహణలోనూ ఆయన దిట్ట. ప్రభుత్వం నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షలు, ఇంటర్, టెన్త్ బోర్డ్ పరీక్షలకు.. పరీక్షా కేంద్రం అధికారిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ‘పాఠశాలనే నాకు అన్నీ. ఎన్ని పనులున్నా తొలి ప్రాధాన్యం బడికే. ఇంటికి బంధువులొచ్చినా, పండుగలున్నా బడికి రావాల్సిందే! సాధ్యమైనన్ని రోజులు ఈ నియమాన్ని ఇలాగే కొనసాగించాలని అనుకుంటున్నాను. ప్రిన్సిపల్ పద్మ సహకారంతో అన్ని బాధ్యతలూ సమర్థంగా నిర్వహిస్తున్నాను’ అని చెబుతారు ఆదిత్య.
… వేల్పుల రాజుయాదవ్