e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home Top Slides పెంపకమే నా బలం!

పెంపకమే నా బలం!

పెంపకమే నా బలం!

‘నువ్వు సివిల్స్‌ సాధించాలి’ అంటూ లక్ష్యాన్ని ఇచ్చాడు నాన్న. కంటికి రెప్పలా భద్రతను ఇచ్చింది అమ్మ. ఆటపాటలతో, అల్లరితో ఆనందాలనూ అనుభూతులనూ ఇచ్చాడు అన్నయ్య. ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చింది అక్కయ్య. కాబట్టే, ‘నా పుట్టిల్లే నా విజయ రహస్యం’ అంటున్నారు తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ స్వాతి లక్రా.
అమ్మంటే ఆప్యాయత. నాన్నంటే భరోసా. అక్క, అన్నయ్య, నేను.. ముగ్గురం. అన్నయ్యను ప్రత్యేకంగా పెంచింది లేదు. మాకు తక్కువ చేసిందీ లేదు. అందుకే వివక్ష అంటే తెలిసేది కాదు. పెద్దయ్యాక, బయటి ప్రపంచాన్ని చూశాక.. సమాజంలో వివక్ష ఎంతగా వేళ్లూనుకొందో అర్థమైంది. మా ఇంట్లో అలాంటి వాతావరణం లేకపోవడమే నా విజయానికి కారణం. నాన్నపై మాకెంత నమ్మకమో, నాన్నకు మాపై అంతకంటే ఎక్కువ నమ్మకం. మా కోసం ఆయన చాలా త్యాగాలు చేశారు. మా విజయాల చరిత్రలో ప్రతి పేజీలో నాన్న పేరు రాసి ఉంటుంది.
ఝార్ఖండ్‌లోని రాంచీ మా ఊరు. పుట్టి పెరిగింది అక్కడే. నాన్న సుబోధ్‌ లక్రా రైల్వేలో ఇంజినీర్‌. అమ్మ లూసీ గృహిణి. నాన్నకు తరచూ బదిలీలయ్యేవి. మామూలుగా అయితే, ఎవరైనా కుటుంబంతోసహా కొత్త చోటుకు వెళ్లిపోతారు. నాన్న మాత్రం ఒంటరిగా వెళ్లేవారు. పిల్లల చదువులు ఒకే పాఠశాలలో కొనసాగితే మంచిదని ఆయన అభిప్రాయం. అందుకే కొన్నేండ్లపాటు అమ్మకూ, మాకూ దూరంగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ర్టాల్లో పని చేశారు. పండుగలకు, సెలవులకు ఇంటికి వచ్చేవారు. మా భవిష్యత్తు కోసం నాన్న కుటుంబ సంతోషానికి దూరమయ్యారు. నాన్నను మేం చాలా మిస్సయ్యేవాళ్లం. ముఖ్యంగా నాన్న చెప్పే మ్యాథ్స్‌ పాఠాలు మిస్సయ్యేదాన్ని. నాన్న వచ్చినప్పుడు ఇల్లంతా కోలాహలంగా ఉండేది. మా చదువుల గురించి ఆరా తీసేవారు. బాగా చదవాలనీ, సివిల్స్‌ సాధించాలనీ చెబుతుండేవారు. అలాగని, మార్కుల కోసం ఒత్తిడి ఉండేది కాదు. చాలా విశాలంగా ఆలోచించేవారు. ఆయన వైఖరి మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేసేది. నాన్న కోరుకున్నట్టుగానే నేను, అన్నయ్య అంబర్‌ సివిల్స్‌ వైపు వచ్చాం. అక్క సిమ్మి బ్యాంక్‌ మేనేజర్‌ అయ్యింది.
నానమ్మ కథలు వింటూ..
నాన్న ఇంట్లో లేకున్నా అమ్మ మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడేది. మాకేం కావాలో అడక్కుండానే అర్థంచేసుకునేది. అమ్మకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. కొత్త కొత్త ప్రయోగాలు చేసేది. నేను, అన్నయ్య అదే పనిగా తింటామని వాటిని ఫ్రిజ్‌లో పెట్టి తాళం వేసేది. నానమ్మ మాతోపాటే ఉండేది. మా పనులన్నీ నానమ్మే చక్కబెట్టేది. రాత్రిళ్లు మంచి మంచి కథలు చెప్పేది. నాన్న కోరుకున్నట్టుగానే, మా స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అంతా ఒకేచోట సాగింది. నేను ప్లస్‌ టూ వరకు రాంచీలోని డీఏవీ స్కూల్‌లో చదివా. తర్వాత ఢిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజ్‌లో డిగ్రీ, ఢిల్లీ యూనివర్సిటీలో పీజీ చదివాను. అప్పుడే, సివిల్స్‌ రాసి మంచి ర్యాంక్‌ సాధించా. 1995లో ఐపీఎస్‌ శిక్షణ తీసుకున్నా. అన్నయ్య ఐఏఎస్‌ సాధించాడు.
అక్క అండదండలు
నాన్న రిటైర్‌ అయ్యే సమయానికి అక్క ఎస్‌బీఐలో మేనేజర్‌గా ఉద్యోగం సాధించింది. ఇంటి బాధ్యతల్లో పాలుపంచుకునేది. నాకు, అన్నయ్యకు సివిల్స్‌ కోచింగ్‌ ఫీజు తనే కట్టింది. మా ఖర్చుల కోసమూ డబ్బు పంపేది. అక్క ఢిల్లీకి వచ్చినప్పుడు షాపింగ్‌కు వెళ్లేవాళ్లం. నాకు అవసరమైన దుస్తులు, వస్తువులు కొనిచ్చేది. వయసులో అక్క నాకన్నా నాలుగేండ్లు పెద్ద. చిన్నప్పుడు కొట్టుకునే వాళ్లం. పెద్దయ్యే కొద్దీ బాగా క్లోజ్‌ అయ్యాం. ఇప్పటికీ ఏ విషయమైనా అక్కతో షేర్‌ చేసుకుంటా. ఇంట్లో ఎవరికైనా ఇబ్బందివస్తే అక్క విలవిల్లాడిపోతుంది. కన్నతల్లిలా అండగా నిలుస్తుంది. మా ముగ్గురి అప్యాయతలు చూసి అమ్మానాన్న మురిసిపోతుంటారు.
అన్నయ్య అల్లరిలో వాటా
అల్లరిలో అన్నయ్య మాస్టర్‌. ఇంట్లో నేను చిన్నదాన్ని కావడంతో కాస్త గారాబం చేసేవారు. అలాగని పెద్దగా అల్లరి చేసేదాన్ని కాదు. బిడియం ఎక్కువే. కానీ, అన్నయ్య తన అల్లరిలో నన్నూ ఇన్‌వాల్వ్‌ చేసేవాడు. ఓసారి మా అమ్మ పల్లీ పట్టీలు చేసి ఓ గదిలో పెట్టి తాళం వేసింది. అన్నయ్య, నేను కిటికీలోంచి కర్రపెట్టి ఆ డబ్బా అందుకోవాలని ప్రయత్నించాం. డబ్బా కాస్తా జారి కిందపడింది. పట్టీలన్నీ చెల్లాచెదురైపోయాయి. ఆరోజు మా ఇద్దరికీ తిట్లు తప్పలేదు. వేసవి సెలవుల్లో మధ్యాహ్నం అందరూ పడుకునేవారు. అన్నయ్య, నేను మాత్రం పెరట్లోకి వెళ్లి చెరుకు గడలు, మక్కజొన్నలు తెంపుకొని తినేవాళ్లం. అన్నయ్యకు పతంగులు ఎగరేయడం అంటే ఇష్టం. స్వయంగా మాంజా తయారు చేసేవాళ్లం. పాడైపోయిన ట్యూబ్‌లైట్లను పగులగొట్టి, పొడి చేసి దాన్ని అన్నంలో కలిపి దారానికి అద్దేవాళ్లం. గాజు రజను కారణంగా చేతులు కోసుకుపోయేవి. ఇలాంటి సరదాలెన్నో. ఇప్పటికీ, తలుచుకుంటే నవ్వొస్తుంది.
మంచి వాతావరణం
మా కాలనీలో అన్ని రాష్ర్టాలకు చెందిన కుటుంబాలూ ఉండేవి, తమిళులు, బిహారీలు, బెంగాలీలు ఎక్కువ. వాళ్ల పిల్లలతో కలిసి ఆడుకునేవాళ్లం. అలా నాకు కొద్దిగా బెంగాలీ అబ్బింది. అన్ని పండుగలూ కలిసి చేసుకునేవాళ్లం. క్రిస్మస్‌ నుంచి దుర్గాపూజ వరకు అన్నిట్లో ఇష్టంగా పాల్గొనేదాన్ని. చుట్టూ స్నేహపూర్వకమైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది. పిల్లల్ని పెంచే వాతావరణంపైనే వారి ప్రవర్తన, గుణగణాలు, వ్యక్తిత్వం ఆధారపడి ఉంటాయని అంటారు. ఆ మాట నిజమే. పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు, నైతిక విలువలు మాత్రం తప్పక అందించాలి. మంచి చదువులు చెప్పించాలి. అదే వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది.
‘షీ టీమ్స్‌’ రాకతో..
నాకు తెలిసి ప్రతి అమ్మాయీ సమాజంలో ఎక్కడో ఓచోట వివక్ష, అవమానం, హేళనకు గురవుతూనే ఉంటుంది. పదేండ్ల వయసులో నేను స్కూల్‌కి వెళ్లాలంటే ఇంటినుంచి బస్టాండ్‌కు ఒకట్రెండు కిలో మీటర్లు నడవాల్సి వచ్చేది. అలా వెళ్తున్నప్పుడు కొందరు అబ్బాయిలు సైకిళ్లపై వచ్చి టీజ్‌ చేసేవారు. ఇంట్లో చెప్తే అమ్మ భయపడుతుందేమోనని చెప్పేదాన్ని కాదు. నాలానే చాలామంది అమ్మాయిలు లోలోపల భయపడుతూ ఉంటారు. కానీ, భద్రత విషయంలో మేం (తెలంగాణ పోలీస్‌)ఆడపిల్లలకు ఎప్పుడూ అండగా ఉంటాం. ప్రతి మహిళా తన సమస్యలను ధైర్యంగా మా దృష్టికి తీసుకురావాలి. ఆడపిల్లల భద్రత కోసం ‘షీ టీమ్స్‌’ అనే బృందాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారిదే. ఆ బాధ్యత నాకు అప్పగించారు. ఒకప్పుడు, పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే చుట్టుపక్కల వాళ్లు తక్కువ చేసి మాట్లాడుతారేమోనని అనుకునేవారు. అందుకే, ‘షీ టీమ్స్‌’ కార్యాలయాల్ని పోలీస్‌ స్టేషన్లలో కాకుండా వేరే చోట ఏర్పాటు చేశాం. దీంతో బాధిత మహిళలు ధైర్యంగా మా దగ్గరికి వస్తున్నారు. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్‌, హ్యాక్‌ ఐ, క్యూఆర్‌ కోడ్‌ ఇలా రకరకాల ప్లాట్‌ఫామ్స్‌ని తీసుకొస్తున్నాం. ‘షీ టీమ్స్‌’ వచ్చాక పరిస్థితుల్లో మార్పు కనిపిస్తున్నది. ఆకతాయి చర్యలు చాలావరకు తగ్గిపోయాయి. ప్రతి స్త్రీకి పుట్టిల్లు ఓ ధైర్యం. మా పుట్టిల్లు ఇచ్చిన భరోసాతోనే నేను ఐపీఎస్‌ ఆఫీసర్‌ కాగలిగాను. సమాజమే ఓ పుట్టిల్లులా మారినరోజున మహిళకు ఏ సమస్యా ఉండదు.
ఇద్దరం హైదరాబాద్‌లోనే..

పెంపకమే నా బలం!


మా ఆయన బెన్హర్‌ ఎక్కా. ఐఏఎస్‌ అధికారి. హైదరాబాద్‌లోని ఎమ్‌సీహెచ్‌ఆర్డీలో చేస్తున్నారు. ఆయన్ని నేను మొదటిసారిగా ఐపీఎస్‌ ట్రైనింగ్‌ కోసం ముస్సోరీలో ఉండగా కలిశాను. అలాగని ప్రేమ వివాహం అనుకోకండి. వారిదీ రాంచీనే. బెన్హర్‌ కుటుంబం నుంచి ప్రపోజల్‌ వచ్చింది. ఇరు కుటుంబాలకూ నచ్చడంతో మా పెండ్లి జరిగింది. నాకిద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయి పీజీ, చిన్నమ్మాయి పదో తరగతి. నేను కాస్త స్ట్రిక్ట్‌ మదర్‌నే! మా నాన్నలా అన్నమాట. ఇప్పటికైతే అందరం హైదరాబాద్‌లోనే ఉంటున్నాం. మాతోపాటు అత్తయ్య కూడా ఉంటారు. మేమిద్దరం బిజీగా ఉండటంతో పిల్లల బాధ్యత తనే చూసుకుంటారు. మా అమ్మానాన్నలకు వయసుమీద పడటంతో ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. నా దగ్గరికి రమ్మంటే రారు. వాళ్లను దగ్గరుండి చూసుకోలేకపోతున్నాననే బాధ ఉంది. ప్రతి క్రిస్మస్‌కి, వేసవి సెలవులకు మేము, అక్క, అన్నయ్య కుటుంబాలతో సహా అమ్మానాన్నల దగ్గరికి వెళ్తాం. అందరం సరదాగా గడుపుతాం.రెగ్యులర్‌గా వీడియో కాల్స్‌ చేసుకుంటాం.

-నిఖిత నెల్లుట్ల

Advertisement
పెంపకమే నా బలం!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement