కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే బాలీవుడ్ నటి స్వర భాస్కర్. తాజాగా, తన తండ్రి ఉదయ్ భాస్కర్ 70వ పుట్టినరోజు సందర్భంగా జీవితాన్నీ, వ్యక్తిత్వాన్నీ ఇచ్చిన నాన్నకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ లేఖను పోస్ట్ చేసింది. అందులోని సారాంశం ఇదీ..
నాన్నా! పుట్టినరోజు పేరుతో బహుమతులివ్వడం, తీసుకోవడం నీకు ఇష్టం ఉండదని తెలుసు. కానీ, నీ 70వ పుట్టినరోజు సందర్భంగా నేనిస్తున్న ఈ అరుదైన కానుకను తీసుకుంటావు కదూ! నీ కూతురిగా పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నా. నువ్వెప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నావు. ప్రతి విషయంలోనూ నాకు అండగా నిలిచావు. అన్ని మతాలనూ గౌరవించడం నేర్పావు. ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల వారసత్వంగా ఇచ్చావు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనసుకు నచ్చని పని చేయకూడదని హెచ్చరించావు. ముప్పై ఏండ్ల జీవితంలో ప్రతి క్షణం నాకు తోడుగా ఉన్నావు. నేను ఓ పరిపూర్ణ మహిళగా నిలిచానంటే, దానికి కారణం నువ్వే. జీవితాంతం నువ్వు చూపిన దారిలోనే నడుస్తా. నీలాంటి తండ్రి పెంపకంలో ఏ కూతురు అయినా, ఆత్మాభిమానంతో స్వతంత్రంగా బతుకుతుంది. నన్ను కన్నందుకు మరొక్కసారి కృతజ్ఞతలు.
-ఇట్లు..నీ స్వర