e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home జిందగీ డ్యాన్స్‌ స్కూలు.. పచ్చని పొలాలు!

డ్యాన్స్‌ స్కూలు.. పచ్చని పొలాలు!

నర్తకిగా నెమలికి నడకలు నేర్పింది. పోలీసుగా ప్రజాసేవ చేయాలనుకుంది. కానీ, నటిగా ప్రేక్షకులను అలరిస్తున్నది. సీరియల్‌లో నటించడానికి హైదరాబాద్‌కు వచ్చిన ఈ కన్నడ భామ తెలుగింటి కోడలైంది. అనుకున్న దానికన్నా జీవితం సంతోషంగా సాగుతున్నదని అంటున్న అనూషా హెగ్డే ‘జిందగీ’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే..

డ్యాన్స్‌ స్కూలు.. పచ్చని పొలాలు!

బాగా చదువుకొని పోలీస్‌ ఆఫీసర్‌ కావాలన్నది నా కల. అందుకే, డిగ్రీ, ఎంకామ్‌ చేశాను. డిగ్రీలో ఉండగానే ఫేస్‌బుక్‌లో నా ఫొటోలు చూసి ఓ కన్నడ సీరియల్‌ ప్రొడ్యూసర్‌ కాల్‌ చేశారు. కానీ, అప్పటికి నాకు యాక్టింగ్‌పై ఆసక్తి లేదు. చాలారోజులు ఏం చెప్పలేదు. దాదాపు ఆర్నెళ్ల తర్వాత మళ్లీ కాల్‌ వచ్చింది. ఒకసారి ఆడిషన్‌కి రమ్మంటే వెళ్లా. మరుసటి రోజు ఫోన్‌ చేసి, ‘సెలెక్ట్‌ అయ్యానని’ చెప్పారు. పోలీస్‌ కావాలనేది నా బలమైన కోరిక. సివిల్స్‌ ప్రిలిమ్స్‌కూడా రాశాను. ఫైనల్స్‌కు ప్రిపేర్‌ అవుతుండగా ఓ ప్రమాదంలో నా చేయి విరిగింది. దాంతో మెయిన్స్‌లో క్వాలిఫై కాలేదు. మళ్లీ పరీక్ష రాయాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే! ఆ సమయంలోనే ఈ అవకాశం వచ్చింది. నా ఆశయం వేరే అయినా, అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఎందుకనిపించింది. ఇంట్లో వాళ్లూ నాకు ఇష్టమైతే ఓకే అన్నారు. అలా, కన్నడ సీరియల్‌ ‘రాధారమణ’తో చిన్నతెరకు పరిచయమయ్యా!

తెలుగులోకి ఎలాగంటే?
‘రాధారమణ’ చేస్తున్నప్పుడే అన్నపూర్ణ ప్రొడక్షన్స్‌ తరఫున ‘జీ’ తెలుగులో ‘నిన్నే పెళ్ళాడతా’ సీరియల్‌కు అవకాశం వచ్చింది. మాది మంగళూరు. ఉండేది బెంగళూరు. అందరినీ వదులుకొని హైదరాబాద్‌ రావాలంటే కష్టమే! తెలియని భాష, కొత్త ప్రాంతం అని సంశయించినా మంచి అవకాశం కాబట్టి ఒప్పుకొన్నా. అయితే, అటు కన్నడం, ఇటు తెలుగు సీరియల్‌ షూటింగ్స్‌తో ఏడాదంతా బిజీగా గడిచిపోయింది. దీంతో ఆరోగ్యం దెబ్బతిన్నది. ఇలాగైతే కష్టం అనుకొని ఆ సీరియళ్ల నుంచి తప్పుకొన్నా. ఓ నెల రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకున్నా. తర్వాత ‘సూర్యకాంతం’ సీరియల్‌లో లీడ్‌రోల్‌ కోసం అన్నపూర్ణ ప్రొడక్షన్స్‌ నుంచి మళ్లీ పిలుపొచ్చింది. ఇదో ప్రత్యేకమైన పాత్ర. ఇందులో హీరోయిన్‌ కొన్ని పరిస్థితులవల్ల మగాడిలా కనిపిస్తుంది. నటనకు స్కోప్‌ ఉండటంతో సరేనన్నా. ప్రస్తుతం ‘సూర్యకాంతం’ మాత్రమే చేస్తున్నా. కొన్ని సినిమా అవకాశాలు వచ్చాయి.
కానీ, ఆసక్తి లేక తిరస్కరించాను. సినిమాలు చేయకూడదన్న నియమమేం పెట్టుకోలేదు కానీ, మంచికథలో ప్రాధాన్యమున్న పాత్ర వస్తే కచ్చితంగా చేస్తా.

మరచి పోలేని క్షణం
ప్రతి ఒక్కరిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. మంచిని తీసుకునే ప్రయత్నం చేస్తా. నా నాట్య ప్రదర్శన చూసి ఎందరో మెచ్చుకునేవారు. నాన్నమాత్రం ‘బాగా చేశావు, ఇంకా బాగా చేయాలి’ అనేవారు. శాస్త్రీయ నృత్యకారులకు పరిపూర్ణ కళాకారులుగా గుర్తింపునిచ్చే పరీక్ష ‘అంతిమ’. ఈ ప్రదర్శనలో నాకు రాష్ట్రంలో రెండోస్థానం వచ్చింది. ఆ ప్రదర్శన చూసిన నాన్న ‘నాకు తెలుసు నువ్వు బాగా చేయగలవు’ అని మెచ్చుకొన్నారు. ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఇంతటి గుర్తింపు వచ్చిందంటే అందుకు కారణం మా అమ్మానాన్నలే!

డ్యాన్స్‌ అకాడమి పెట్టాలని..
‘నిన్నే పెళ్ళాడతా’ సీరియల్‌లో నాతో కలిసి నటించిన ప్రతాప్‌నే పెండ్లాడా. తనకు డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. తన భార్యకు క్లాసికల్‌ డాన్స్‌ వచ్చి ఉండాలనుకున్నాడట. నేను కష్టపడి నేర్చుకున్న నృత్యాన్ని అలా వదిలేయకుండా, భవిష్యత్తులో నా కోసం ఓ డ్యాన్స్‌ అకాడమి పెట్టాలనేది ప్రతాప్‌ కోరిక. అలాగే, వ్యవసాయమంటే మా ఇద్దరికీ ఇష్టం. కొంత పొలం కొనుక్కొని సేద్యం చేయాలని అనుకుంటున్నాం. ఇద్దరం ఒకే రంగంలో ఉండటంతో కష్టనష్టాలు అర్థం చేసుకోగలం. ప్రతాప్‌ను పెండ్లి చేసుకున్నాక నా ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. అన్నిటినీ పాజిటివ్‌గా తీసుకోవడం ఆయన నుంచే నేర్చుకున్నా. ప్రపంచంలో కనీస వసతులు, సరైన తిండి లేక చాలామంది కష్టపడుతున్నారు. వాళ్లతో పోల్చుకుంటే దేవుడు మనకి మంచి జీవితం ఇచ్చాడు. ఉన్న దాంట్లో తృప్తిగా జీవించాలని అనుకుంటా.

‘నిన్నే పెళ్ళాడతా’ అన్నాడు
‘నిన్నే పెళ్ళాడతా’లో ప్రతాప్‌తో కలిసి నటించా. ఏడాది తర్వాత తనే ప్రపోజ్‌ చేశాడు. తనను చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదనిపించింది. కానీ, ‘మా ఇంట్లోవాళ్లు ఒప్పుకొంటేనే సుమా..’ అని కండిషన్‌ పెట్టాను. అందరినీ ఒప్పించాక పెండ్లి జరగడానికి దాదాపు ఎనిమిది నెలలు పట్టింది. గతేడాది ఫిబ్రవరి 10న మేమిద్దరం ఒక్కటయ్యాం. ఇప్పుడు మా అమ్మానాన్నలు నాకన్నా ప్రతాప్‌నే ఎక్కువగా ఇష్టపడతారు. తాము చూసినా అంత మంచి వ్యక్తి అల్లుడిగా దొరికేవాడు కాదని పొంగిపోతారు. ప్రతాప్‌ కుటుంబంలోనూ అంతే. అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటారు.

వందల ప్రదర్శనలు
మా అమ్మ పొలిటికల్‌ లీడర్‌. నాన్న బిజినెస్‌ చేస్తారు. రంగస్థల నటుడుకూడా. ఆయనకి నటనంటే ఇష్టం. ఒక చెల్లి, తమ్ముడు. అమ్మానాన్న చిన్నప్పటినుంచీ నాకు ఇష్టమైన పని చేసేందుకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు.
శాస్త్రీయనృత్యంలో శిక్షణ ఇప్పించారు. చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు కానీ, పెద్దయ్యాక దాని విలువ, గొప్పతనం తెలిశాయి. ఏడేండ్లు నాట్యం నేర్చుకున్నా. సీరియల్స్‌లోకి రాకముందే భరతనాట్యంలో ‘విద్వత్‌’ పూర్తి చేశాను. దాదాపు 1500 ప్రదర్శనలు ఇచ్చాను. నేను అథ్లెట్‌ను. స్టేట్‌ లెవల్‌ యోగా ప్లేయర్‌ని కూడా.
ప్రవళిక వేముల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
డ్యాన్స్‌ స్కూలు.. పచ్చని పొలాలు!

ట్రెండింగ్‌

Advertisement