e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home జిందగీ కేసీఆర్‌ను చూస్తుంటే 'బాపు' గుర్తొస్తారు..

కేసీఆర్‌ను చూస్తుంటే ‘బాపు’ గుర్తొస్తారు..

కేసీఆర్‌ను చూస్తుంటే 'బాపు' గుర్తొస్తారు..
ఆమె పుట్టిల్లు సమాజానికి ఓ మహా మేధావిని, దేశానికి ఓ సమర్థ ప్రధానిని ఇచ్చింది. గుండెల నిండా ప్రేమలు, అరలనిండా పుస్తకాలు ఆ ఇంటి ప్రత్యేకత! వంగర జ్ఞాపకాలు, బాల్యస్మృతులు, అమ్మ ప్రేమ, బాపు వాత్సల్యం గురించి చెబుతూ ‘పుట్టిల్లు ప్రతి మహిళకూ ఓ గుండె ధైర్యం’ అంటారు పీవీ నరసింహారావు కూతురు, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి. ఆమె పీవీ కూతురు మాత్రమే కాదు.. పీవీ ఆలోచనలకూ, ఆశయాలకూ వారసురాలు. ఆ మితభాషి భావాలకు అచ్చమైన ‘వాణి’.  మాజీ ప్రధాని శత జయంతి ఉత్సవాల వేళ.. ఆమెను గెలిపించడమంటే, పీవీని గెలిపించడమే. తనను అపారంగా ప్రభావితం చేసిన నాన్న గురించి, తనకో వ్యక్తిత్వాన్ని ప్రసాదించిన పుట్టింటి గురించీ వాణీదేవి మాటల్లోనే.. 

మన పుట్టుకకు కారణమైంది పుట్టిల్లు. ఎన్నేండ్లయినా, ఎంత దూరమైనా, ఎంత గొప్పింటికి కోడలుగా పోయినా.. జీవితాంతం పుట్టింటిపై మమకారం ఉంటుంది. మన అస్తిత్వానికి కారణమైన ఆ ఇంటిపై ప్రేమ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. వంగరలోని పుట్టిల్లు నాకొక వరం. బాపు ఎప్పుడూ మమ్మల్ని అతిగారాబం చేయలేదు, అలాగని కఠినంగానూ వ్యవహరించలేదు. మాకొక మంచి వాతావరణం కల్పించారు. చదువు దగ్గర్నించి ఎంచుకొనే వృత్తివరకు అన్నిట్లో స్వేచ్ఛనిచ్చారు. అందువల్లే మాకు బాల్యం నుంచే మంచీచెడు, తప్పొప్పులపైన స్పష్టమైన అవగాహన ఏర్పడింది.

నాన్న పీవీ నరసింహారావుగారిని నేను ‘బాపు’ అని పిలిచేదాన్ని. ఆయన నన్ను ‘వాణక్క’, ‘బిడ్డా’ అనేవారు. అమ్మ పేరు సత్యమ్మ. ఆమె నా పద్దెనిమిదేండ్లప్పుడే చనిపోయింది. నాకిద్దరు అన్నయ్యలు రంగారావు, రాజేశ్వరరావు. రాజకీయాల్లో మంచి స్థాయికొచ్చారు. వాళ్లిద్దరూ ఇప్పుడు మా మధ్య లేరు. తమ్ముడు పీవీ ప్రభాకర్‌ రావు, ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. శారద, సరస్వతి, వాణి, జయ, విజయ.. ఇలా మా పేర్లన్నీ సరస్వతి అమ్మవారి పేర్లొచ్చేలా పెట్టారు. మాతోపాటే పెరిగిన చిన్నమ్మ కొడుకు వైవీ చంద్రశేఖర్‌రావు అన్న నాకున్న అతిపెద్ద ధైర్యం ఇప్పుడు. చిన్నప్పుడు ఇంట్లో మా ఎనిమిది మందితోపాటు చిన్నాన్న, అత్త, చిన్నమ్మ పిల్లలతో కలిపి మొత్తం ఇరవైమందిమి కలిసే పెరిగాం. మా ఇల్లు చిన్నపాటి గురుకులంలా ఉండేది. పిల్లల విషయంలో ఎలాంటి లింగవివక్షకూ తావు లేదు. నచ్చింది చదువుకునే స్వేచ్ఛ ఉండేది. పిల్లలందరికీ ఒకేసారి బట్టలు కుట్టించేవాళ్లు. అదికూడా తాన్‌లో ఒకే రకం బట్ట తీసుకొచ్చి అబ్బాయిలకు అంగీలు, అమ్మాయిలకు గౌన్లు కుట్టించేవాళ్లు. ఎండకాలం ఊళ్లకు వెళ్లినప్పుడు మేం ఎక్కడ తిరిగినా, తప్పిపోతామనే కంగారు ఉండేది కాదు (నవ్వుతూ).

అన్నీ చదవమనేవారు

బాపు పేరు తలుచుకోగానే, ఏ పుస్తకమో చదువుతూ కూర్చున్న గంభీర రూపమే కండ్లముందు మెదులుతుంది. ఆయన అంత శ్రద్ధగా చదువుతున్నారంటే, ఆ పుస్తకాల్లో ఏదో గొప్ప విషయమే ఉందన్న సంగతి, బడి వయసు రాకముందే నా  చిన్న బుర్రకు అర్థమైపోయింది.  నేను కూడా పెద్దపెద్ద పుస్తకాలు చదవాలని కలలు కనేదాన్ని. అలా, పుస్తక పఠనం అలవాటైంది. నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు విశ్వనాథ సత్యనారాయణగారి ‘వేయి పడగలు’ గ్రంథాన్ని హిందీలోకి అనువదిస్తున్నారు బాపు. ఆసక్తికొద్దీ ఆ వయసులోనే ‘వేయి పడగలు’ చదివేశాను. ఆయనెప్పుడూ ‘ఇదే చదవాలి, అదే చేయాలి’ అనేవారు కాదు. ఏది చేసినా సరే, ఆ రంగంలో నిష్ణాతులు కావాలని కోరుకునేవారు. మా ఇంట్లో ఎక్కడ చూసినా పుస్తకాలే ఉండేవి. ఒకరోజు బాపు బుక్‌షెల్ఫ్‌ను సర్దుతుంటే, ‘హౌ టు డ్రా ఎ పెయింట్‌’ అనే పాకెట్‌ సైజ్‌ పుస్తకం కనిపించింది. దానిమీద ఆయన సంతకంతోపాటు కొన్న సంవత్సరం (1959) రాసి ఉంది. తన పుస్తకాల మీద పేరు, కొన్న తారీఖు రాసుకోవడం బాపు అలవాటు. ఆ పుస్తకం వల్లే మొదటిసారి పెయింటింగ్‌పై నాకు ఆసక్తి కలిగింది. అప్పటికి నేను ఏడో తరగతిలో ఉన్నాను. పచ్చటి పొలాలూ, చుట్టూ కొండలతో వంగర చాలా అందంగా ఉంటుంది. వరి కోతలయ్యాక కల్లం వేశారంటే, నేనక్కడ ఉండాల్సిందే. అక్కడ కూర్చుని బొమ్మలేసుకోవచ్చని పరిగెత్తేదాన్ని. కల్లం దగ్గర తూర్పారబట్టే మహిళలను పెయింటింగ్స్‌లో భాగం చేసేదాన్ని. నాకు పెయింటింగ్‌ అంటే ఇష్టమని బాపుతో ఎప్పుడూ చెప్పలేదు. తనే గ్రహించారు. పెద్దపెద్ద చిత్రకారులను పిలిపించి సలహాలు ఇప్పించారు. 

అమ్మతో అనుబంధం

అమ్మతో ఎక్కువ కాలం గడపలేక పోయాననే వెలితి నన్ను ఇప్పటికీ బాధిస్తూనే ఉంటుంది. బాపు గురించి ప్రపంచానికంతా తెలుసు. కానీ, అమ్మ గురించి చాలామందికి తెలియదు. గుండెధైర్యంతోపాటు మనసునిండా ప్రేమగల మనిషి ఆమె. ఊళ్లో వ్యవసాయమంతా తానే చేయించేవారు. పసిపిల్లలను ఆశీర్వదించమంటూ జనం మా ఇంటికి వచ్చేవారు. అమ్మ ఆ బాలింతలకు చాటలో బియ్యం, ఎల్లిపాయలతో ఒడి నింపి పంపేది. సెలవులకు ఊరికి వెళ్లినప్పుడు పిల్లలమంతా చెరువుగట్లకు వెళ్లేవాళ్లం. ఒకసారి అలా వెళ్లేటప్పుడు చీర మార్చుకొని, ముఖానికి పౌడర్‌ రాసుకుంటుంటే అమ్మ వచ్చింది. “నువ్వు అక్కడ పొలాల్లో పనిచేసేవాళ్లతో సరదాగా ఉండాలంటే, వాళ్లలాగే ఉండాలి. అప్పుడే నిన్ను ప్రేమగా తమలో కలుపుకొంటారు. కష్టసుఖాలు చెప్పుకొంటారు’ అని చెప్పింది. ఎంత గొప్పమాట. 

బాపు ప్రపంచం విశాలమైంది. పుస్తకాలు, రాజకీయాలు, మేధావులతో చర్చలు! వీటన్నిటికీ అతీతంగా ఆయనలో ఓ లోపలి మనిషి ఉండేవారు. ఏకాంతంలో ఆయన ఎన్నో విషయాలు ఆలోచించేవారు. లోతైన అంతర్మథనం జరిగేది. అమ్మకు మాత్రం మేమూ, బాపు, ఇల్లు.. ఇదే ప్రపంచం. మాకు బుద్ధి తెలిసే నాటికే నాన్న రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. నెలలో పది రోజులు బయట ఉంటే, పది రోజులు ఇంట్లో ఉండేవారు. ఆయన వచ్చేసరికి మా అమ్మ మాపై షికాయత్‌లతో సిద్ధంగా ఉండేది. భోజనం వడ్డిస్తూ ఫిర్యాదుల చిట్టా విప్పేది. మేమంతా.. భయం భయంగా గోడ అవతల నిలబడి వినేవాళ్లం. ‘ఈ ఆడపిల్లలు చూశారా? మగరాయుడిలా సైకిల్‌ నేర్చుకుంటున్నారు’ అనేది అమ్మ. దానికి ఆయన ‘సైకిల్‌ నేర్చుకోవడం మంచిదేగా. బ్యాలెన్స్‌ తెలుస్తుంది’ అంటూ నవ్వేవారు. అమ్మ ఊరుకుంటుందా, ‘ఈతలు కూడా కొడుతున్నారు’ అని మరో ఫిర్యాదు. ‘నీళ్లలో పడితే ప్రాణం కాపాడుకోవాలి కదా!’ మరోసారి చిరునవ్వు. ఆ జవాబుకు అమ్మకూడా నవ్వేది. మా ఆటపాటలకు తనూ లోలోపల మురిసిపోయేది. అల్లరిలో మేం మగపిల్లలతో పోటీ పడేవాళ్లం. పరీక్షల్లో మార్కుల గురించి ఎన్నడూ ఒత్తిడి చేసింది లేదు. ఎంతో ప్రేమ చూపేవారు. కాబట్టే, అంతమంది పిల్లలమధ్య పెరిగినా, ఆప్యాయతలో ఎప్పుడూ లోటు కనిపించలేదు. 

నేను ఐదో తరగతి వరకు వంగరలోనే చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్‌కి మారాం. ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ, జేఎన్‌టీయూలో డిప్లొమా ఇన్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ చేశాను. తర్వాత ఐదేండ్లు జేఎన్‌టీయూలో లెక్చరర్‌గా చేశాను. తానొక జాతీయ నాయకుడైనా మమ్మల్ని ఆ ప్రభావాలకు దూరంగా పెంచారు నాన్న. లెక్చరర్‌గా పనిచేస్తున్న రోజుల్లో సిటీ బస్సులోనే కాలేజీకి వెళ్లేదాన్ని. బాపు స్థితప్రజ్ఞత ఆయన కూతురిగా నాకూ అబ్బింది. ఒక పని తలపెట్టినప్పుడు విజన్‌ ఉండాలని చెప్పేవారు. ఆయన స్ఫూర్తితోనే సురభి ఎడ్యుకేషనల్‌ సొసైటీని మూడున్నర దశాబ్దాలుగా దిగ్విజయంగా నిర్వహించగలుగుతున్నా. గడిచిన 35 ఏండ్లలో ఎంతోమంది విద్యార్థులు మా సంస్థనుంచి పట్టభద్రులయ్యారు. ఒక తల్లిగా నా పిల్లలను పెంచి ప్రయోజకులను చేశాను. ఓ యజమానిగా ఓ విద్యాసంస్థను సమర్థంగా నిర్వహిస్తున్నాను. ఓ సాధారణ మహిళగా ఇవన్నీ చేయగలిగిన నాకు, ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే మరిన్ని మంచి కార్యక్రమాలు చేయగలననే నమ్మకం ఉంది. 

నేను.. బాపు!

బాపు ప్రధానమంత్రి అయ్యాక మేం రెగ్యులర్‌గా ఢిల్లీ వెళ్లేవాళ్లం. అమ్మలేని లోటును ఆయన చాలాసార్లు ఫీలయ్యేవారు. వీలు కుదిరినప్పుడల్లా నేను, తమ్ముడు వెళ్లి కొన్ని రోజులు ఉండొచ్చేవాళ్లం. దగ్గరుండి వండి పెట్టకపోయినా అక్కడివాళ్లకు చెప్పి చేయించేదాన్ని. ఇంట్లో ఉన్నప్పుడు నేను చేసే బెండకాయ కూర, వంకాయ కూర, గుమ్మడికాయ బరడా ఇష్టపడేవారు. ఏదైనా మితంగా తినడం ఆయనకు అలవాటు. స్వీట్స్‌ మాత్రం ఇష్టపడేవారు కాదు. వంట పూర్తయ్యాక మొదటి ముద్ద ఇంటిపెద్దకు పెట్టడం మా పుట్టింటి ఆచారం. అలా తీసిన భోజనాన్ని హాట్‌బాక్స్‌లో కట్టి పెట్టేవాళ్లం. దాన్ని పంపిస్తే, బెడ్‌రూమ్‌లో కూర్చుని చదువుకుంటూ నచ్చినప్పుడు భోంచేసేవారు బాపు.

కేసీఆర్‌ను చూస్తుంటే 'బాపు' గుర్తొస్తారు..

అన్ని భాషలూ ఆయనవే

బాపు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో, ఆయనతో కలిసి విదేశాల్లో ప్రయాణించే అవకాశం నాకు వచ్చింది. అలా, ఎంతోమంది దేశాధ్యక్షులను దగ్గర నుంచి గమనించాను. కానీ, నాన్న లాంటి అరుదైన వ్యక్తి నాకెక్కడా తారసపడలేదు. మహామహా నాయకులు కూడా నాన్నకు చాలా విలువ ఇచ్చేవారు. ఆయన మాట్లాడుతుంటే శ్రద్ధగా వినేవారు. ఏ దేశ నాయకులతో ఆ దేశ భాష మాట్లాడి అందరినీ అబ్బుర పరిచేవారు. ఒక సామాన్యుడు కేవలం తన ప్రతిభతోనే.. ప్రధానమంత్రి స్థాయికి చేరుకోగలడని బాపు నిరూపించారు. 

నాన్నలో ఓ పసివాడు

ఒకసారి ఆయనకు కంటి ఆపరేషన్‌ చేయించాల్సి వచ్చింది. అప్పుడు, ఓ వారం రోజులు తనతోనే ఉన్నాను. ఆ సమయంలో తన చిన్ననాటి సంగతులన్నీ నెమరేసుకున్నారు. వంగర నుంచి ఢిల్లీ వరకూ తన ప్రయాణాన్నంతా గుర్తు చేసుకున్నారు. ఆయనలో నా చిన్నప్పటి బాపు కనిపించారు. నాన్న నిత్య విద్యార్థి. పట్టుబట్టి కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ నేర్చుకున్నారు. మా పిల్లలతో ఆధునిక టెక్నాలజీకి సంబంధించిన అనేక విషయాలు మాట్లాడేవారు.

నాకెందుకు ఓటేయాలంటే?

ఒకప్పుడు పట్టభద్రులంటే.. నిరుద్యోగులూ చిరుద్యోగులే! సర్కారీ కొలువులు తప్పించి మరో ఉపాధి మార్గం లేని పరిస్థితి. కానీ, బాపు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు అవకాశాలకు ద్వారాలు తెరిచాయి. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బ్యాంకింగ్‌, టెలికాం, బీమా.. ఇలా ప్రతి రంగంలోనూ ఉద్యోగావకాశాలు వెల్లువెత్తాయి.  తమకు జీవితాన్ని ఇచ్చిన ఆ దార్శనికుడికి ఓటేసి కృతజ్ఞతలు తెలుపుకొనే అవకాశం ఈ తరానికి రాలేదు. ఆయన కూతురిగానే కాదు, ఆయన ఆశయాలకు ప్రతినిధిగా కూడా నన్ను గెలిపించమని కోరుతున్నాను. ఎమ్మెల్సీని పదవిగానో, పేరు పక్కన అలంకారంగానో నేను భావించడం లేదు. ఇదో బాధ్యత. చదువుల తల్లి నా పేరుతో పాటు వ్యక్తిత్వంలోనూ ఉంది. విద్యారంగం నాకు ప్రాణంతో సమానం. అక్షరాభిమాని అయిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యారంగంలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ సమయంలో, విద్యాసంస్థల నిర్వాహకురాలిగా నా అనుభవం, ఆలోచనలు రాష్ర్టానికి, యువతకు ఉపయోగకరమని నా విశ్వాసం.

నాన్న ఆలోచనలు.. కేసీఆర్‌ ఆశయాలు

నాన్నకు వ్యవసాయం అంటే ఇష్టం. పల్లెలంటే ప్రాణం. వంగరకు వచ్చారంటే, పొలానికి పోవాల్సిందే. మా ఊర్లో తొలి పత్తిపంట ఆయనదే. తొలి ద్రాక్షతోటా ఆయనదే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయం పట్ల చూపిస్తున్న శ్రద్ధ చూస్తుంటే బాపు గుర్తుకొస్తారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత, తెలంగాణలో సేద్యం ఓ పండుగలా జరుగుతున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఆరేండ్లు అయింది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అనేక రకాలైన సమస్యలు ఉండేవి. ఒక్కోటి పరిష్కరించుకుంటూ బాలారిష్టాలను దాటాం. నీళ్లు, నిధులు, నియామకాలు ప్రాధాన్యక్రమంలో నెరవేరుస్తున్నది ప్రభుత్వం. ఇప్పటికే దాదాపు 1.30 లక్షల పైచిలుకు నియామకాలు జరిగాయి. రానున్న రోజుల్లో ఉపాధి కల్పన మరింత జోరందుకోనున్నది. కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం అవుతున్నది. గతంలో కలుషితమైన నీరు తాగి పల్లె ప్రజలు రకరకాల జబ్బులకు గురయ్యేవారు. పాలమూరు జిల్లాలో చిన్నారులు రికెట్స్‌ జబ్బు బారిన పడేవారు. మిషన్‌ భగీరథతో ఆ సమస్యలు తొలగిపోయాయి. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ సమస్య సమసిపోయింది. కేవలం ఆరేండ్ల పాలనలోనే ఈ అద్భుతాలు సాధ్యమయ్యాయి. బంగారు తెలంగాణకు బీజాలు పడుతున్నాయి.

పాలమూరు కోడలిని!

నేను పాలమూరు కోడలిని. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి దగ్గర ఓ కుగ్రామం మా అత్తగారి ఊరు. మా వారు అక్కడికి దత్తత వెళ్లారు. అలా పాలమూరు జిల్లాతో నాది 50 ఏండ్ల అనుబంధం. విద్యారంగంలో ఉన్నందువల్ల, ఆ జిల్లాలోని కళాశాలలకు తరచూ వెళ్తూ ఉండేదాన్ని. దీంతో పాలమూరు జిల్లా స్థితిగతులపై స్పష్టమైన అవగాహన ఏర్పడింది. తెలంగాణ వచ్చాక ఎలాంటి మార్పులు వచ్చాయో కూడా దగ్గరగా చూశా. ఒకప్పుడు పాలమూరు పల్లెల నుంచి ముంబయి బస్సు వెళ్తుండేది. ఇక్కడ ఉపాధి అవకాశాల్లేక వేల మంది వలస వెళ్తుండేవాళ్లు. ఇప్పుడు ముంబయి బస్సుల్లేవు. దేశం నలుమూలలకూ వలస వెళ్లిన పాలమూరు బిడ్డలు మళ్లీ సొంతూళ్లకు వచ్చేస్తున్నారు. నీటి సౌలత్‌ పెరగడంతో వ్యవసాయం చేసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల కారణంగానే ఇది సాధ్యమైంది.

కేసీఆర్‌ను చూస్తుంటే 'బాపు' గుర్తొస్తారు..

సరదా మనిషి

అమ్మ చనిపోయే నాటికి పెద్దక్కకు పెండ్లయింది. రెండో అక్కకు సంబంధం కుదిరింది. ఆ సమయంలో ఇంట్లో పెండ్లి జరగాలని పెద్దలు చెప్పడంతో.. రెండో అక్క పెండ్లితోపాటు మా మేనత్త కొడుకు సురభి దయాకర్‌రావుతో నా వివాహమూ జరిపించారు. మా ఆయన మాతోపాటే కలిసి పెరిగారు. ఆయనంటే నాన్నకు చాలా ఇష్టం. అలాగే మా అత్త (బాపు వాళ్ల అక్క) అంటే అమితమైన ప్రేమ. అత్తను చూసిన ప్రతిసారీ.. ‘బాగున్నావే అక్కా’ అని గట్టిగా అనేవాళ్లు. ఆమెకు వయసుతో వచ్చే చెవుడు ఉండేది. ‘ఆ దేవుడు నీకు చెవులు వినిపించకుండా చేసి మంచి పని చేసిండు లేవే. లేకపోతే, ఈ లోకంలోని చెడ్డ మాటలు వినాల్సి వచ్చేది. హాయిగా దైవనామస్మరణ చేసుకుంటూ కూర్చోరాదే’ అనేవారు. బాపు ప్రతి ఒక్కరితోనూ ఇలాగే, సరదాగా ఉండేవారు. జాతీయ రాజకీయాలతో బిజీ అయ్యాక, బాపు ఢిల్లీలోనే ఎక్కువగా ఉండేవారు. బాపును చూడటానికి వెళ్లిన ప్రతిసారీ, అది కూడా నా పుట్టిల్లే అనిపించేది. పుట్టింటిని, పుట్టింటివాళ్లనూ విడదీసి చూడలేం కదా

-నిఖిత నెల్లుట్ల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కేసీఆర్‌ను చూస్తుంటే 'బాపు' గుర్తొస్తారు..

ట్రెండింగ్‌

Advertisement