నేడు ‘నేషనల్ హ్యాండ్లూమ్ డే’
చేనేత చీర అంటేనే.. వేల దారాలతో ఒడుపుగా అల్లిన అందాల మాలిక. ఆ కట్టులో మగువ హృదయ సౌందర్యం ఆవిష్కృతం అవుతుంది. ఆ వస్త్రం వెనుక శ్రమజీవన సౌందర్యమూ అంతర్లీనం. తరాలనాటి నేతకళను నిలబెట్టుకోవాలంటే, నేతన్నను బతికించుకోవాలి. ‘నేషనల్ హ్యాండ్లూమ్ డే’ (ఆగస్టు 7) నినాదమూ ఇదే. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా.. చేనేత, హస్తకళల సంరక్షణే ధ్యేయంగా ఆవిర్భవించిన తెలంగాణ క్రాఫ్ట్స్ కౌన్సిల్ గురించి పరిచయ వ్యాసం..
ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే, ఆ పూటకే సరిపోతుంది. జీవనోపాధి కల్పిస్తే బతికున్నంత కాలమూ భరోసా లభిస్తుంది. ఆ ధైర్యం మరికొందరికి అన్నం పెట్టేంత ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తుంది. ‘క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ’ లక్ష్యం కూడా ఇదే. సృష్టిలో మార్పు తప్ప ఏదీ శాశ్వతం కాదు. నిన్నటి నైపుణ్యం నేటికి పాతబడిపోవచ్చు. నేటి ఇష్టం రేపటికి అయిష్టంగా మారిపోవచ్చు. అత్యద్భుతం అనిపించిన సాంకేతికత తెల్లారేసరికి మూలన పడిపోవచ్చు. ఫ్యాషన్ జగత్తులో ఈ వేగం మరీ ఎక్కువ. కాబట్టే, నేత కళాకారులకు కొత్త డిజైన్లు, డిజిటల్ మార్కెటింగ్, ఆధునిక పరికరాల వినియోగం.. తదితర విషయాల మీద తెలంగాణ క్రాఫ్ట్స్ కౌన్సిల్ అవగాహన కలిగిస్తున్నది. 1987లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రత్యేక రాష్ట్రం అవతరించాక.. క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ (సీసీటీ)గా రూపాంతరం చెందింది.
ప్రదర్శనలకు వేదిక
చేనేత రంగంలోనూ దళారి వ్యవస్థ ఉంది. దాన్ని వదిలించుకోవాలంటే ఒక్కటే దారి.. ఉత్పత్తి దారుడే విక్రేత కావాలి. అదంతా జరగాలంటే, తమ ఉత్పత్తులను తాము అమ్మకానికి పెట్టడానికి ఓ వేదికంటూ ఉండాలి. ఆ బాధ్యత క్రాఫ్ట్స్ కౌన్సిల్ తీసుకుంటున్నది. విరివిగా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నది. నైపుణ్యం పెంచుకొనేలా శిక్షణ ఇస్తున్నది. బంజారాహిల్స్‌లో నిర్మించుకున్న సువిశాల భవనంలో, నేతన్నలు స్టాళ్లను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తున్నది. హస్తకళలకు సంబంధించి.. ఎల్లమ్మతండాలోని బంజారా మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సంప్రదాయ అల్లికల మార్కెటింగ్‌పై అవగాహన కల్పించింది. 15 మందితో ఏర్పడిన ఆ బృందం 180 మందికి విస్తరించింది. వాళ్లంతా అమెరికా, టర్కీ తదితర దేశాలకు వెళ్లి విక్రయాలు సాగిస్తున్నారు. కౌన్సిల్ ‘ఆకృతి వస్త్ర’, ‘కౌశలం’ తదితర పేర్లతో ఏర్పాటు చేసే ప్రదర్శనలు దేశవ్యాప్తంగా ఉన్న హ్యాండ్లూమ్ కలెక్షన్లకు వేదిక అవుతున్నాయి. దీనివల్ల నేతన్నలకు చేతినిండా ఉపాధి దొరుకుతున్నది, మార్కెట్ మీద ఓ అవగాహన వస్తున్నది. ఆన్లైన్ విక్రయాలు అనివార్యమైన పరిస్థితుల్లో సామాన్య మహిళలు తమ చేనేత ఉత్పత్తులను ఫొటోలు తీసి.. ఆన్లైన్లో అప్లోడ్ చేయడంలోనూ కౌన్సిల్ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నది.
వర్చువల్‌గా..
ఈమధ్య జరిగిన ఎగ్జిబిషన్లో ‘వర్చువల్ కౌశలం’ పేరుతో ప్రత్యేకించి ఆన్లైన్ విక్రయాలను ప్రోత్సహించింది క్రాఫ్ట్స్ కౌన్సిల్. ఆ ప్రదర్శనలో ప్రవాస భారతీయ మహిళలు నిఖార్సయిన చేనేత వస్ర్తాలను కొనడానికి ఎంతో ఆసక్తి చూపారు. క్రాఫ్ట్స్ కౌన్సిల్ సంప్రదాయ చేనేత డిజైన్ల పునరుద్ధరణకూ కృషిచేస్తున్నది. కాలం గడిచేకొద్దీ కొన్ని డిజైన్లు కనుమరుగైపోతున్నాయి. వాటిని కాపాడటం తన బాధ్యతగా భావిస్తున్నది. జమ్దానీలాంటి చీరలు నేయడానికి ఏడాది నుంచి ఏడాదిన్నర వరకూ సమయం పడుతుంది. అంతకాలం నేతన్న కుటుంబానికి గుప్పెడు మెతుకులు దక్కాలంటే.. చీరకు తగిన ధర రావాలి. అందుకే, క్రాఫ్ట్స్ కౌన్సిల్ ప్రదర్శనలకూ, విక్రయాలకే పరిమితం కావడం లేదు. కొనుగోలుదారులతో నేతకారుల పరిచయ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నది. చీరల వెనుక కథల్ని జనంలోకి తీసుకెళ్తున్నది. ‘చేనేత వృత్తిలో పురుషులదే పైచేయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలు కూడా రాణించేలా సీసీటీ ప్రోత్సహిస్తున్నది. మా చొరవ వల్ల చేనేత కుటుంబాల్లోని మహిళలు సైతం కుటుంబ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు. పిల్లల్ని చదివించుకొంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు’ అంటారు సీసీటీ కార్యదర్శి మీనా అప్పెందర్. సత్కార, పురస్కారాలతోనే కళాకారులలో ఉత్సాహం ఇనుమడిస్తుంది. చేనేత, హస్తకళలకు సంబంధించి ఆయా రంగాలలోని దిగ్గజాలను క్రాఫ్ట్స్ కౌన్సిల్ సన్మానిస్తుంది. కోట చీరల నేత కళాకారిణి మొబీనా భానును ఈమధ్యే ఘనంగా సత్కరించింది.
సాంకేతికత సాయంతో..
మన సంప్రదాయాన్ని ప్రతిబింబించే చీరలను అందిస్తారు చేనేత కార్మికులు. వారికి అండగా ఉండటం మన బాధ్యత. అరుదైనహస్త కళలను భవిష్యత్ తరాలకు పదిలంగా చేరవేయడమూ మన కర్తవ్యమే. సాంకేతికతను వినియోగించి ఆ కళాకారులు అమ్మకాలను పెంచుకునేలా తగిన వేదికను సమకూరుస్తాం. సీతారంజిత్‌రెడ్డి, సభ్యురాలు, సీసీటీ
‘చేనేత, హస్త కళలను కాపాడేందుకు, వాటిపై ఆధారపడిన వారిని ప్రోత్సహించేందుకు క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ తనవంతు కృషి చేస్తున్నది. మహిళలకు అవసరమైన చేనేత, హస్తకళా వస్తువులన్నీ ఒకే చోట లభించేలా సీసీటీ ఓ వేదిక కావడం పట్ల కళాకారులు, కొనుగోలుదారుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది’ ఉషా సర్వారాయులు, చైర్ పర్సన్, క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ
… వరకవుల దుర్వాసరాజు