e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home జిందగీ బచ్‌పన్‌ భరోసా!

బచ్‌పన్‌ భరోసా!

తల్లిదండ్రులు ఇద్దరూ కొవిడ్‌ బారిన పడటంతో ఒంటరిగా మిగిలిపోయిన పిల్లలు, కన్నవారి మరణంతో అనాథలైన బిడ్డలు, మురికివాడల్లోని బాలలు.. ఇలా ఆందోళనలో ఉన్న బాల్యానికి అండగా నిలుస్తున్నది ‘బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌’.

వ్రిశాంక్‌ ఐదేండ్ల పిల్లవాడు. అమ్మ, నాన్నతోపాటు అక్కకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయింది. ముగ్గురూ తనను దూరం పెడుతున్నారు. కానీ, వ్రిశాంక్‌ మాత్రం వాళ్లతోనే ఉంటానంటూ మారాం చేస్తున్నాడు. ఇరుగు పొరుగు పట్టించుకోవడం లేదు. పోనీ, ఊరినుంచి ఎవరినైనా పిలిపిద్దామంటే పరిస్థితులు బాగా లేవు. ఏం చేయాలో అర్థం కాక, బెడ్‌రూంలో పిల్లాడిని ఒక్కడినే ఉంచి ముగ్గురూ హాల్‌లోనే ఉంటున్నారు. పగలంతా ఫర్వాలేదు. చీకటి పడగానే ఒకటే ఏడుపు.
దిక్కు తోచక ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

- Advertisement -

సికింద్రాబాద్‌కు చెందిన ఏడేండ్ల పాప పరిస్థితి మరింత దారుణం. తల్లి, తండ్రి ఇళ్లలో చిన్నచిన్న పనులు చేస్తుంటారు. ఈమధ్యే వారికి కొవిడ్‌ వచ్చింది. వలస కార్మికులు కావడంతో తెలిసిన వారెవరూ లేరు. దీంతో ఆ పాపను ‘బేటీ బచావో ఆందోళన్‌’ వారి సీడబ్ల్యూసీ (చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటి)కి అప్పగించారు. ప్రస్తుతం తల్లిదండ్రులు ఇద్దరూ ఆసుపత్రిలో ఉన్నారు.

ఆపదల్లో ఎందరో..
ఇప్పటి వరకు దాదాపు వందమంది కొవిడ్‌ బాధిత బాలలను బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ (బీబీఏ) గుర్తించింది. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్‌ సత్యార్థి నడిపిస్తున్న ఈ సంస్థద్వారా పిల్లలకు అవసరమైన సాయం చేయడంతోపాటు వారిలో మనోధైర్యం నింపేందుకు కృషి చేస్తున్నది. “నాకు ఎనిమిదేండ్లుగా తెలిసిన దళిత మహిళ లక్ష్మమ్మ (పేరు మార్చాం) తన నలుగురు పిల్లలతో కలిసి మహబూబ్‌నగర్‌ జిల్లానుంచి హైదరాబాద్‌కు వలస వచ్చింది. తన ఇద్దరు ఆడపిల్లలను బాల్య వివాహాల బారినుంచి కాపాడటంతో పాటు వారికి మెరుగైన విద్య అందించాలనేది ఆ తల్లి ఆరాటం. భర్త తాగుబోతు. కుటుంబాన్ని పట్టించుకోడు. ఇక్కడే ఓ బస్టాప్‌ పక్కన జొన్నరొట్టెలు అమ్ముకుంటూ సంసారాన్ని నెట్టుకొస్తున్నది. ఈ క్రమంలో లక్ష్మమ్మ పెద్ద కొడుకు మాకు ఫోన్‌ చేశాడు. అమ్మకు కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, నెల రోజులుగా ఒళ్లునొప్పులతో బాధ పడుతున్నదనీ, ఆసుపత్రికి వెళ్దామంటే బెడ్స్‌ లేవంటున్నారనీ ఏడుస్తూ చెప్పాడు. స్నేహితుల సాయంతో గాంధీలో బెడ్‌ దొరికింది. మా ఆర్గనైజేషన్‌ తరఫున ఆ పిల్లలకు అవసరమైన నిత్యావసరాలు సమకూర్చాం. లక్ష్మమ్మ త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ని ప్రార్థించాం” అంటూ బీబీఏ తెలంగాణ కోఆర్డినేటర్‌ చందన ఈమధ్య జరిగిన ఓ సంఘటనను పంచుకొన్నారు. అలాంటి వారికి మనం చేయగలిగిన సాయం చేస్తే మంచిది. వీలు కాకపోతే కనీసం బీబీఏకు సమాచారం ఇవ్వడం ద్వారా, పిల్లలకు అండగా నిలవొచ్చు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా సరే, 1800-102-7222 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫోన్‌ చేస్తే చాలు. సంస్థ ప్రతినిధులు మిగిలింది చూసుకుంటారు. వీరికి తక్షణ సాయం అందించేందుకు వాట్సాప్‌లో ఓ గ్రూప్‌ను క్రియేట్‌ చేసి అందులో వైద్యులు, కౌన్సెలర్ల ద్వారా అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నది ‘బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌’. కొవిడ్‌ బారిన పడి, వెంటిలేటర్‌ వరకూ వెళ్లిన పిల్లల బాధ్యతనూ ఈ సంస్థ స్వీకరించింది. కొవిడ్‌ బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులను సరఫరా చేసింది.

తెలంగాణ సర్కారు సాయం మరువలేనిది
‘మా పోరాటంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారం చాలా గొప్పది. ఆసుపత్రి బెడ్‌ కావాలన్నా, ఆక్సిజన్‌ కావాలన్నా వెంటనే స్పందించి అండగా నిలుస్తున్నారు. రానున్న రోజుల్లో ఆపరేషన్‌ ముస్కాన్‌కు టెక్నికల్‌ సపోర్టు ఇవ్వనున్నాం. పిల్లలు బాలకార్మికులుగా మారకూడదనే ఉద్దేశ్యంతో తెలంగాణ పోలీసు, డబ్ల్యూసీడీ (ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌) శాఖ, ఎస్‌ఎల్‌ఏ (స్టేట్‌ లీగర్‌ సర్వీస్‌ అథారిటీ)తో కలిసి పని చేయనున్నాం. పిల్లలు మళ్లీ కార్మికులుగా మారితే తల్లిదండ్రులకు శిక్ష విధించేలా కృషి చేస్తున్నాం. రాష్ట్రంలోని 53 అనాథాశ్రమాల్లో ఒక్కో ఆశ్రమానికి రూ.1.20 లక్షల విలువైన మెడికల్‌ కిట్లు సరఫరా చేయాలని నిర్ణయించుకున్నాం.

చందనబీబీఏ తెలంగాణ కోఆర్డినేటర్‌

… సిద్ధార్థ గుల్లపెల్లి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana