గురువారం 28 జనవరి 2021
Zindagi - Dec 01, 2020 , 01:29:06

ఆమె చెయ్యిపడితే ఇంద్ర భవనమే!

ఆమె చెయ్యిపడితే ఇంద్ర భవనమే!

పునాదులు ఇంటికి దృఢత్వాన్ని ప్రసాదిస్తాయి. గోడలు రక్షణ కల్పిస్తాయి. రంగులు అందాన్నిస్తాయి. కానీ, ఇంటిని ప్రత్యేకంగా నిలిపేది, రిచ్‌గా చూపించేది.. ఇంటీరియర్‌ డిజైనింగే! ఇంటిని పొందికగా అమర్చడంలో ఆరితేరిన మహిళలకు మాత్రం ఈ రంగంలో అవకాశాలు తక్కువ. 1970లో ఇంటీరియర్‌ డిజైనర్‌గా  ప్రయాణం మొదలుపెట్టి  స్త్రీ సృజనాత్మక శక్తిని చాటారు సునీతా కోహ్లీ. 74 ఏండ్ల వయసులోనూ భవనాల రూపురేఖలు మార్చుతూ ఈ తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

సునీత చదివింది ఎంఏ ఇంగ్లిష్‌ లిటరేచర్‌. సాహిత్యాభిమానం ఎక్కువ. భావుకతకు, సృజనాత్మకతకు దగ్గరి సంబంధాలు ఉంటాయి. అందుకే కాబోలు.. తనకు ఏమాత్రం పరిచయం లేకున్నా, అనుకోకుండా ఇంటీరియర్‌ డిజైనింగ్‌ రంగంలోకి వచ్చి.. అద్భుతాలు ఆవిష్కరించింది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన సునీత పెండ్లయ్యాక తన ఇంటిని తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో ఈ రంగం వైపు అడుగులు వేసింది. భర్తతో కలిసి లక్నో, జైపూర్‌, డెహ్రాడూన్‌ ట్రిప్‌లకు వెళ్లినప్పుడు అక్కడి ఫర్నిచర్‌ దుకాణాల్లో బ్రిటిష్‌ కాలం నాటి వస్తువులు, లాంతర్లు కొనుగోలు చేసేవారు. ఈ క్రమంలో యాంటిక్స్‌పై, ఆర్కిటెక్చర్‌పై ఆసక్తి పెరుగుతూ వచ్చింది. మొదట్లో డేవెన్‌ పాట్‌ డెస్క్‌ (ఈ టేబుల్‌ని ఎలాగంటే అలా అడ్జస్ట్‌ చేసుకోవచ్చు), వైన్‌ టేబుల్స్‌ అమ్మే చిన్న బిజినెస్‌ని మొదలుపెట్టారు. తర్వాత పాత వస్తువులను డిజైన్డ్‌గా మార్చి అమ్మే టెక్నిక్స్‌ని నేర్చుకున్నారు. అనుభవాల నుంచీ పాఠాలు అభ్యసిస్తూ పూర్తిస్థాయి ఇంటీరియర్‌ డిజైనర్‌గా మారారు సునీత.

ఢిల్లీలో సొంత కంపెనీ: 1971లో ఢిల్లీ కేంద్రంగా ‘సునీత కోహ్లీ ఇంటీరియర్‌ డిజైన్స్‌' కంపెనీని స్థాపించారు. ఫర్నిచర్‌ తయారీ కంపెనీనీ మొదలుపెట్టారు. 1975లో ఒబెరాయ్‌ హోటల్స్‌కు ఇంటీరియర్‌ డిజైనింగ్‌ చేసి ఔరా! అనిపించుకున్నారు సునీత. అనతికాలంలోనే ఆమె పేరు మార్మోగిపోయింది. ప్రముఖ సంస్థలన్నీ సంప్రదించడం మొదలైంది. కాలానికి తగ్గట్టుగా మార్పులను స్వీకరిస్తూ పనిలో ప్రత్యేకతను చాటుకున్నారు. 1990లలో ఢిల్లీలోని బ్రిటిష్‌ కౌన్సిల్‌ బిల్డింగ్‌కు డిజైనింగ్‌ చేశారు. ఆపైన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌, హైదరాబాద్‌ హౌస్‌, ప్రధానమంత్రి నివాసం, ప్రధానమంత్రి కార్యాలయాలకూ తనదైన శైలిలో మార్పులు చేసి కొత్త లుక్‌ తీసుకొచ్చారు. భూటాన్‌లోని నేషనల్‌ అసెంబ్లీ బిల్డింగ్‌ని డిజైన్‌ చేశారు. 1992లో భారత ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ’ అవార్డును అందుకున్నారామె. దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు స్థాపించి మహిళా సాధికారతకు పోరాడుతున్నారు. ‘మహిళ పుట్టుకతోనే ఇంటీరియర్‌ డిజైనింగ్‌ నిపుణురాలు’ అంటున్న సునీతా కోహ్లీ  నుంచి నేటితరం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. 


logo