శనివారం 28 నవంబర్ 2020
Zindagi - Nov 22, 2020 , 00:11:03

ఆకాశమే నా హద్దు

ఆకాశమే నా హద్దు

ఆడవాళ్లు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా, ఒక్క సినిమా డైరెక్షన్‌ విషయంలో మాత్రం వాళ్ల మార్క్‌ కనిపించడం లేదు.లేడీ డైరెక్టర్స్‌ అంటూ ఉన్నా ఆ సంఖ్య చాలా తక్కువ. అలాంటిది  ఒక మహిళా దర్శకురాలు ఓ పెద్ద హీరోతో సినిమా తీసి, సక్సెస్‌ అందుకున్నారంటే.. చాలా గొప్ప విషయమే. ఇటీవలే ఓటీటీలో రిలీజైన ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా ద్వారా ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు సుధ కొంగర. కానీ ఈ గెలుపు ఆమెకు అంత సులువుగా దక్కలేదు. 

ఇంత పెద్ద సక్సెస్‌ని ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారు?

ఎన్నో ఓటములు చూసినవాళ్లకు సక్సెస్‌ వచ్చినప్పుడు ‘ఓస్‌ ఇంతేనా!’ అనిపిస్తుంది. ఇప్పుడు నా పరిస్థితీ అదే. ఎవరైనా, ఏ సినిమానైనా సక్సెస్‌ కావాలనే తీస్తారు. కాకపోతే అది హిట్‌ అవ్వడం లేదా ఫెయిల్‌ అవ్వడం అన్నది మన చేతుల్లో ఉండదు. అందువల్ల ఎంత బ్లాంక్‌గా ఉంటే అంత మంచిదని నా ఫీలింగ్‌. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఆడుతున్నదని గంతులేస్తే.. ఆడలేనప్పుడు మనం దాన్ని ఓర్చుకోలేం. అందుకే స్థిరంగా ఉండటం అలవాటు చేసుకున్నాను. 

మిమ్మల్ని చెన్నైలో సెటిలైన తెలుగింటి ఆడపడుచు అనొచ్చా?

కచ్చితంగా నేను తెలుగింటి ఆడపడుచునే. నేను పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో. అయితే నా మూడేండ్ల వయసులో ఫ్యామిలీ మొత్తం చెన్నైకి షిఫ్ట్‌ అయ్యాం. కానీ హాలిడేస్‌లో సొంతూరికి వెళ్లడం,  హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి రావడం బాగా అలవాటు. నాకు తెలుగు భాషంటే ఇష్టం. ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటాం. అమ్మ నాకు తెలుగు రాయడం, చదవడం నేర్పించింది. 

ఏం చదువుకున్నారు?

డిగ్రీలో బీఏ హిస్టరీ చదివాను. అది పూర్తవగానే పెండ్లి, పిల్లలు.. వెంటనే జరిగిపోయాయి. పెద్దమ్మాయి పుట్టిన తర్వాత మాస్‌ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్‌ చేశాను. అసలు నాకు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి కోర్సు చేయాలని ఉండేది కానీ, కుదర్లేదు. కాకపోతే మొదట్నుంచీ సినిమాలంటే పిచ్చి. సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడం, కథలు రాసుకోవడం అలవాటు. పీజీలో ఉన్నప్పుడు షార్ట్‌ ఫిల్మ్స్‌ అలానే తీశాను. నేను చదువుకోవడానికి, సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించడానికి నా భర్త, పిల్లల సపోర్ట్‌ చాలా ఉంది. 

సినిమా ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టారు?

1999 ప్రాంతంలో హీరోయిన్‌ రేవతిగారి దర్శకత్వంలో వచ్చిన ‘మిత్‌'్ర సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాను. ఒకటి, రెండు అని కాదు.. సినిమా అన్ని విభాగాల్లో పని చేశాను. నేను సినిమా గురించి చదువుకున్నది అంటే ఆమె దగ్గరే. అది చూసే నన్ను డైరెక్టర్‌ మణిరత్నం సర్‌ అసిస్టెంట్‌గా తీసుకున్నారు. ఆయన దగ్గర ఆరున్నర సంవత్సరాలు చేశాను. మొదటి రెండున్నరేండ్లు స్క్రిప్ట్స్‌ రాశాను. తర్వాత ఆయన సినిమాలకు అసిస్టెంట్‌గా చేశాను. ఇప్పుడైనా, భవిష్యత్తులో అయినా నేను ఏది చేసినా మా గురువు ‘మణిరత్నం’గారి దగ్గర నేర్చుకున్నదే. తమిళంలో ‘ద్రోహి’ సినిమాతో డైరెక్టర్‌గా నా సినిమా కెరీర్‌ మొదలైంది.

‘ఆకాశమే.. ’  ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకున్నారా? 

ఈ సినిమా జనాలకు వందశాతం కనెక్ట్‌ అవుతుందనే నమ్మకం మనసులో ఎప్పుడూ ఉండేది. ఎందుకంటే ప్రతిఒక్కరికీ ఒక కల ఉంటుంది. దాన్ని నిజం చేసుకోవడానికి ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొంటారు. అనుకున్నది సాధిస్తారు. కొందరు సాధించలేకపోవచ్చు. కాబట్టి గోపీనాథ్‌గారి లైఫ్‌ స్టోరీ జనాలకు నచ్చుతుందనుకున్నాను. తెలుగు ప్రేక్షకుల్లో నాకు నచ్చే విషయం ఏంటంటే.. మనవాళ్లకు భాషాభేదం ఉండదు. మంచి కథతో ఏ సినిమా వచ్చినా ఆదరిస్తారు. ఇప్పుడు కూడా గోపీనాథ్‌గారు తమిళ బ్యాక్‌గ్రౌండ్‌ వ్యక్తి. ఇందులో సూర్య కూడా తమిళ హీరో. గతంలో ఇన్‌స్ఫిరేషనల్‌ జానర్‌లో నేను తీసిన ‘గురు’ సినిమా సక్సెస్‌ అయ్యింది. అలాగే ‘ఆకాశమే నీ హద్దురా’ కూడా స్ఫూర్తిదాయకమైన కథ కావడంవల్ల జనం ఆదరిస్తున్నారు.


మొదటి ఫెయిల్యూర్‌ ఏం నేర్పింది?

‘ద్రోహి’ సినిమా ఫెయిలైనప్పుడు డల్‌గా మణి సర్‌ దగ్గరికి వెళ్లాను. నా సినిమా ఆడట్లేదని చెప్పాను. ఆయన వెంటనే ‘నోరు మూసుకుని, ఆ సినిమాలో నుంచి ఏం నేర్చుకోవాలో.. అది నేర్చుకుని, పరిగెత్తు మళ్లీ’ అన్నారు.  

డైరెక్టర్‌ కావాలనుకునే అమ్మాయిలకు మీ సలహా?

సినిమా ఇండస్ట్రీ పైకి కనిపించినంత గ్లామరస్‌గా ఏం ఉండదు. ఇందులో ఎత్తుపల్లాలు, గెలుపోటములు చాలా సాధారణం. జెండర్‌తో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో నిలుదొక్కుకోవడం ఎవరికైనా కష్టమే. అమ్మాయిల విషయానికొస్తే, అది ఇంకాస్త కష్టమని చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ ఇండస్ట్రీకి పంపడానికి ముందు ఇంట్లోవాళ్లు అభ్యంతరం చెప్తుంటారు. అక్కడే మొదటి అడ్డంకి స్టార్ట్‌ అవుతుంది. సరే, ఇంట్లోవాళ్లను కష్టపడి ఒప్పించి ఇక్కడికి వస్తే.. చుట్టుపక్కలున్న వాళ్ల నుంచి వ్యతిరేకత, చులకన ఎదురుకావచ్చు. ఆ సమయంలో, మనలో ఉన్న ప్యాషన్‌ మిగతావాటిని డామినేట్‌ చేయాలి. ఎవరేమన్నా, పనిలో ఎలాంటి ఓటములు ఎదురైనా.. ధైర్యంగా తాడోపేడో తేల్చుకునేలా ఉండాలి. నాకు సినిమా అంటే పిచ్చి. కాబట్టే నా ఫస్ట్‌, సెకండ్‌ సినిమాల మధ్య ఆరేండ్ల్ల గ్యాప్‌ వచ్చినా పట్టుదల వదల్లేదు.

ఇద్దరు ఆడపిల్లల తల్లిగా  పేరెంట్స్‌కి ఏదైనా సలహా ఇస్తారా?

నేను ఏ పేరెంట్స్‌కైనా ఒక్కటే చెప్తాను. ఆడపిల్లలను బాగా చదివించాలి. అది ఆర్ట్స్‌, మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, ఫిల్మ్‌ మేకింగ్‌..  ఏదైనా సరే వాళ్లకు నచ్చిన చదువు అందించాలి. ఆ డిగ్రీ ఎప్పుడూ ఆడపిల్లలకు ఫాల్‌బ్యాక్‌గా ఉంటుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్లకు కచ్చితంగా వెనుక ఒక ప్రొఫెషనల్‌ డిగ్రీ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ సక్సెస్‌ రేట్‌ ఎనిమిది నుంచి పదిశాతమే. అందులో మనం ఉంటామన్న గ్యారెంటీ ఉండదు. మన టైమ్‌ బాగుండాలి.. మన టాలెంట్‌, అవుట్‌పుట్‌ ప్రేక్షకులకు నచ్చాలి.. అప్పుడే సక్సెస్‌ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే.. పిల్లలకు సినిమాల మీద ప్యాషన్‌ ఉందా? లేక ఇంట్రెస్ట్‌ మాత్రమే ఉందా? అన్నది పేరెంట్స్‌ గమనించాలి. ప్యాషన్‌ ఉందని అనిపిస్తేనే, అదీ డిగ్రీ పూర్తయ్యాక పంపించాలి.

తెలుగులో వచ్చిన మీ రెండు సినిమాల్లోనూ స్త్రీ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది.  అలా, ప్లాన్‌ చేసి తీశారా?

ప్రత్యేకంగా అలా తీయాలనుకోలేదు. నేను ఎంచుకున్న కథల్లో వాళ్లకు ప్రాధాన్యం ఉందంతే. ఉదాహరణకు ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా ఒక మేల్‌ లీడ్‌ స్టోరీయే. అయితే గోపీనాథ్‌గారి లైఫ్‌ గురించి అనుకున్నప్పుడు.. ఆయన జీవితంలో భార్గవిగారి పాత్ర ముఖ్యమైనది. ఆవిడ క్యారెక్టర్‌కి నేను బాగా కనెక్ట్‌ అయ్యాను. ఒక మేల్‌ ఓరియెంటెడ్‌ సినిమాలో స్త్రీ పాత్రకు ప్రాధాన్యమిస్తే అది ప్రోగ్రెసివ్‌ సినిమా అవుతుందని నా అభిప్రాయం. ఆడియెన్స్‌కి హీరోతో సమానంగా హీరోయిన్‌ క్యారెక్టర్‌ నచ్చింది.

ఒక ప్రేక్షకురాలిగా మీకెలాంటి సినిమాలు ఇష్టం?

నాకు రియల్‌ స్టోరీస్‌ అంటే  ఇష్టం. తెలుగులో ‘పెళ్లిచూపులు’, ‘అర్జున్‌రెడ్డి’ భలే నచ్చేశాయి. ఇలాంటివే కాకుండా లాక్‌డౌన్‌కి ముందు రిలీజైన ‘అల వైకుంఠపురంలో’ బాగా ఎంజాయ్‌ చేశాను. బ్యాలెన్స్‌డ్‌గా ఉంటూ జనాలను ఎంటర్‌టెయిన్‌ చేయగలిగే సినిమాలను ఇష్టపడతాను.

మీ ఫేవరెట్‌ డైరెక్టర్‌ ఎవరు?

రామ్‌గోపాల్‌ వర్మ అంటే పిచ్చి. ఆయన సినిమాలంటే ఇష్టం. టాలీవుడ్‌లో ఒక ట్రెండ్‌ సెట్‌ చేసిన ‘శివ’ సినిమాను చూసి ఆయనకు ఫిదా అయిపోయాను. అందులోని మ్యూజిక్‌, వయొలెన్స్‌ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కొత్తగా అనిపించాయి. బాపు, విశ్వనాథ్‌ సినిమాల మేకింగ్‌ నచ్చుతుంది.

తెలుగులో ఎవరితో సినిమా చేయాలని ఉంది?

బాగా నటించే వాళ్లందరితో చేయాలని ఉంటుంది. ముఖ్యంగా నేను నాగార్జునగారికి పెద్ద ఫ్యాన్‌. ఎప్పటికైనా ఆయనతో సినిమా తీయాలన్నది ఆశ. విజయ్‌ దేవరకొండ యాక్టింగ్‌ని చాలా లైక్‌ చేస్తాను. 

కొన్నిరోజులు రెస్ట్‌ తీసుకుంటారా  లేక కొత్త ప్రాజెక్ట్‌ ..?

ఎంజాయ్‌ చేయడం, రెస్ట్‌ తీసుకోవడం కొన్నేండ్లుగా అలవాటు తప్పింది. ఎప్పుడూ తర్వాతేంటి అనే ఆలోచనే మనసులో మెదులుతూ ఉంటుంది. ఒక కథ రాయడం మొదలుపెట్టాను. ఆ కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో.. ఎవరితో చేస్తానో ఇంకా ఐడియా లేదు. 

పరిశ్రమలో మీరువివక్షకు గురయ్యారా?

మణిరత్నంగారి దగ్గర కాకుండా వేరేచోట చేసుంటే ఎదురయ్యేదేమో.. కానీ ఆయన దగ్గర ఆడవాళ్లకు చాలా సెక్యూర్డ్‌ లైఫ్‌ ఉంటుంది. చెప్పాలంటే మణి సర్‌ పెద్ద ఫెమినిస్ట్‌. ఆయనెప్పుడూ ఆడ, మగ అని తేడా చూపించలేదు. మాకూ మగాళ్లతో సమానంగానే అన్ని పనులూ అప్పజెప్పేవారు. అలాగే చుట్టుపక్కల ఎక్కడైనా ఆడవాళ్లకు అవమానం, అన్యాయం జరిగితే అసలు ఊరుకునే వాళ్లుకాదు. వేరే విషయాల్లో మాకు స్పెషల్‌ కంఫర్ట్స్‌ లేకపోయినా, సేఫ్టీ దగ్గరికి వచ్చేసరికి చాలా కేరింగ్‌గా ఉంటారు. 

ఇప్పుడు ప్రేక్షకుల ఫీలింగ్‌ ఒక్కటే.. ‘ఇదే సినిమా థియేటర్లో రిలీజ్‌ అయితే వంద కోట్లు కలెక్ట్‌ చేసేది’ అని. దానికి మీరేం అంటారు?

ఇంత ఇష్టపడి, కష్టపడి తీసిన సినిమాని సిల్వర్‌స్క్రీన్‌పైన చూసుకోవాలనే ఎవరికైనా ఉంటుంది. జూలై, ఆగస్ట్‌ నెలల్లో పరిస్థితి చాలా కష్టంగా ఉంది. థియేటర్లు తెరిచే పరిస్థితి లేదన్నట్టే ఉండేది. తెరిచినా ప్రేక్షకులు వస్త్తారన్న గ్యారెంటీ లేదు. ఈలోపు ప్రొడ్యూస్‌ చేసిన వాళ్లకు వడ్డీలు పెరుగుతాయి కదా. ఇలా అనేక కారణాల వల్ల ఓటీటీలో రిలీజ్‌ చేయాలని ప్రొడ్యూసర్‌గా సూర్య నిర్ణయం తీసుకున్నాడు.

ఈ స్టోరీ చెప్పినప్పుడు సూర్య ఎలా రియాక్ట్‌ అయ్యాడు?

2017 సెప్టెంబర్లోనే నేను, సూర్య ఈ కథ గురించి మాట్లాడుకున్నాం. అప్పుడే తను ఈ సినిమాలో నటించడానికి, ప్రొడ్యూస్‌ చేయడానికి ఒప్పుకున్నాడు. ఇది నడుస్తుండగానే.. మధ్యలో వెళ్లి తెలుగులో ‘గురు’ సినిమా చేశాను. ఆ తర్వాత మళ్లీ ఈ ప్రాజెక్ట్‌ పనిలో పడ్డాను. గురు తర్వాత టాలీవుడ్‌ నుంచి నాకు మంచి సపోర్ట్‌ వచ్చింది. చాలామంది నాతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. కాకపోతే నేను మాటిచ్చినట్టుగానే సూర్యతో ఈ సినిమా పూర్తి చేశా. 

మిమ్మల్ని మురిపించిన కాంప్లిమెంట్‌ ఎవర్నించి వచ్చింది?

ఒకరిద్దరు కాదు.. చాలామంది సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. అన్నింట్లో నాకు బాగా హ్యాపీగా అనిపించింది డైరెక్టర్‌ నందినిరెడ్డి ప్రశంసే. ఈ సినిమాను రిలీజ్‌కు ముందు చూసింది. ‘ఈ సినిమా కనుక జనాలకు నచ్చకపోతే, నేను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా’ అని చెప్పింది. ఈ సినిమాపై నాకంటే తనే ఎక్కువ కాన్ఫిడెంట్‌గా ఉంది.