బుధవారం 27 జనవరి 2021
Zindagi - Jan 13, 2021 , 01:56:41

ప్ర‌భుత్వ పాఠ‌శాల విద్యార్థినుల ఘ‌న విజ‌యాలు

ప్ర‌భుత్వ పాఠ‌శాల విద్యార్థినుల ఘ‌న విజ‌యాలు

  • జూడోలో ఓ ప్రభుత్వ పాఠశాల
  • విద్యార్థినుల ఘన విజయాలు

ఆ బాలికలు రుద్రమ్మ వారసులు. పట్టుదలతో యుద్ధక్రీడ జూడో నేర్చుకున్నారు. ఆట మీద పట్టు సాధించి.. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు పట్టుకుని వస్తున్నారు. అలా అని, వాళ్లేం పట్టు పానుపు మీద పవళించడం లేదు. అందరిదీ అతి సామాన్య నేపథ్యం. సాధన సమయంలో, చిరుగుల దుప్పట్లే జూడో మ్యాట్‌ అవతారం ఎత్తుతున్నాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లా,వర్ధన్నపేట మండలం, ఉప్పరపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థినుల విజయాలపై ‘గ్రౌండ్‌' రిపోర్ట్‌ ..

ఉప్పరపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు జూడోలో సత్తా చాటుతున్నారు. మల్లయుద్ధాన్ని తలపించే ఆ సాహసక్రీడలో రాటుదేలుతున్నారు. జాతీయ స్థాయిలోనూ పతకాల పంట పండిస్తున్నారు. మైదానంలో బాలురకు ఏ మాత్రం తీసిపోమని చాటిచెబుతున్నారు. నిత్యసాధనతో కార్పొరేట్‌ విద్యార్థులను సైతం మట్టి కరిపిస్తున్నారు. యోగా, వాలీబాల్‌ క్రీడల్లోనూ జాతీయ స్థాయిలో జెండా ఎగరేస్తున్నారు. ఈ పాఠశాలలో చదివే 35 మంది విద్యార్థినీ విద్యార్థులు జూడోలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. 

లక్ష్యంపైనే గురి

పోటీ అంటే యుద్ధమే! అత్యాధునిక పరికరాలతో సాధన చేయాలి. బలమైన ఆహారం తీసుకోవాలి. యూనిఫామ్‌ వేసుకోవాలి. అందులోనూ, జూడో సాధనకు మ్యాట్‌ తప్పనిసరి. లేకపోతే, గాయాలు అవుతాయి. పల్లెటూరి పిల్లలు అంత ఖరీదైన మ్యాట్లు ఎక్కడ కొంటారు? మహానగరాల్లోనే లభించే జూడో దుస్తులు వాళ్లకెవరు తెచ్చిస్తారు? దీంతో, చిరుగుల దుప్పట్లమీదే సాధన మొదలుపెట్టారు. పరిమితులూ, ఇబ్బందులూ, ఆర్థిక సమస్యలూ.. దేన్నీ పట్టించుకోకుండా లక్ష్యంపైనే  మనసు పెడుతున్నారు. పతకమే సర్వస్వంగా సాధన చేస్తున్నారు. ఆ కఠోర శ్రమ ఫలితాలను ఇస్తున్నది. తొమ్మిదో తరగతి విద్యార్థిని పసునూరి శ్రావ్య ఇప్పటికే జాతీయస్థాయిలో రాణిస్తున్నది. 2019 జనవరిలో ఢిల్లీలో జరిగిన జూడో జాతీయ స్థాయి అండర్‌-14 విభాగంలో పతకంతోపాటు సర్టిఫికెట్‌ను అందుకుంది. వరుసగా రెండుసార్లు  రాష్ట్ర స్థాయి పతకాలు కైవసం చేసుకుంది. చెలుకపల్లి శృతి రాష్ట్ర, జిల్లాస్థాయి పోటీల్లో అదరగొట్టింది. ఆదిలాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పతకం సొంతం చేసుకుంది. తనూ తొమ్మిదో తరగతే. అన్నారం శృతి కూడా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. జాతీయ పతకమే లక్ష్యంగా శిక్షణ తీసుకుంటున్నది. 

బాలుర విభాగంలో చెలుకలపల్లి భరత్‌, ఆగపాటి సాయిచరణ్‌ మెడల్స్‌ సాధించారు. ఈ విజయాల వెనుక ద్రోణాచార్యుడి వంటి ఓ గురువు ఉన్నారు. పేరు.. వీరాస్వామి. ఆ బడిలో ఆయన ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌. కాలం మారినా ఎవరి భయాలు వారివి. ఆడపిల్లల్ని బడివరకూ పంపగలుగుతున్నారు కానీ, ఆటలకు పంపేంత ధైర్యం చేయలేకపోతున్నారు అమ్మానాన్నలు. దీంతో, వీరాస్వామి స్వయంగా ప్రతిభావంతుల ఇండ్లకు వెళ్లి కన్నవాళ్లను ఒప్పిస్తున్నారు. నేనున్నానని భరోసా ఇస్తున్నారు. చదువులో ఆటలూ ఓ భాగమేననీ, పతకాలు సాధిస్తే మంచి కొలువులు వెతుక్కుంటూ వస్తాయనీ.. పిల్లల భవిష్యత్తు పట్ల ఆశ కలిగిస్తున్నారు. దీంతో కన్నవారు సంతోషంగా ఒప్పుకుంటున్నారు. ఈ ప్రోత్సాహకర వాతావరణంలో  సర్కారు బడి పిల్లలు జూడోలో ఆరితేరుతున్నారు. ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఒడుపుగా త్రోలు చేయడంలో రాటుదేలుతున్నారు. స్కార్ఫ్‌ హోల్డ్‌, క్రాస్‌లాక్‌ సహా అన్ని టెక్నిక్స్‌ నేర్చుకుంటున్నారు. పట్టు పడితే పతకమే అన్న రీతిలో సిద్ధమవుతున్నారు. ఆ సాధనకు మరింత ప్రోత్సాహం తోడైతే అంతర్జాతీయంగానూ పతకాలు పండిస్తారు.


మీ సహకారం కావాలి

జూడోలో మా విద్యార్థినులు రత్నాలే. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, రెండేండ్ల నుంచీ శిక్షణ ఇస్తున్నా. అయితే, సాధనకు అవసరమైన మ్యాట్లు, డ్రస్‌లు లేవు. వసతులూ అంతంతమాత్రమే. అందరూ పేద కుటుంబాల నుంచి వచ్చినవారే. సొంతంగా కొనలేని పరిస్థితి. దాతలు ముందుకు వస్తే మెరుగైన శిక్షణ అందిస్తాం. జాతీయ స్థాయిలో తప్పక రాణిస్తారనే నమ్మకం నాకుంది. 

- వీరాస్వామి, పీయీటీ 

మచ్చ సమ్మయ్య


logo