బుధవారం 03 మార్చి 2021
Zindagi - Feb 08, 2021 , 00:10:54

క్లాసిక్‌ ర్యాప్‌పక్కా శ్రుతిలో!

క్లాసిక్‌ ర్యాప్‌పక్కా శ్రుతిలో!

ఆమెకు శాస్త్రీయ సంగీతంలో ఆదితాళం తెలుసు.. వెస్ట్రన్‌ మ్యూజిక్‌లో మేజర్‌ స్కేల్‌ వ్యవహారాలూ తెలుసు. తన్మయత్వంతో తలలూపించే కృతులు వచ్చు, ఉర్రూతలూగించే పాప్‌ సాంగ్సూ పాడగలదు. ప్రాగ్దిశ వీణపై క్లాసిక్‌ సరిగమలు పలికించగలదు. పాశ్చాత్య గిటారుపై మోడ్రన్‌ ర్యాప్‌ పండించగలదు. ఈ రెండిటినీ పక్కా  శ్రుతిలో మేళవించి అద్భుతాలు సృష్టిస్తున్నది హైదరాబాద్‌కు చెందిన 24 ఏండ్ల శ్రుతి ధూళిపాల. సరికొత్త ప్రయోగాలతో శ్రోతలను అలరిస్తున్నది. తండ్రి వారసత్వంగా అబ్బిన సంగీత సారాన్ని మనసారా సాధన చేస్తూ, ప్రియమారా ఆలపిస్తూ ఔరా! అనిపిస్తున్నది.

శ్రుతి తండ్రి మృదంగ విద్వాన్‌ డీఎస్‌ఆర్‌ మూర్తి. మూడేండ్లున్నప్పటి నుంచే తండ్రి మృదంగ విన్యాసాలకు శ్రుతి శుభగంగా గొంతు కలిపేది. కూతురు ఉత్సాహం గమనించి సంగీతంలో శిక్షణ ఇప్పించారాయన. కాస్త పెద్దయ్యాక తండ్రి పాల్గొనే కచేరీలకు వెళ్లేది. అలా ఎల్‌.సుబ్రహ్మణ్యం, బాంబే జయశ్రీ లాంటి లబ్ధప్రతిష్ఠులైన సంగీతజ్ఞుల స్వర విన్యాసాలను నిశితంగా గమనించేది. వారినే ఆదర్శంగా తీసుకొని సాధన చేసేది. హైదరాబాద్‌ సిస్టర్స్‌గా పేరుమోసిన లలిత, హరిప్రియల దగ్గర కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకుంది. సరిగమలపై పట్టు సాధించిన తర్వాత అమెరికాలోని ‘ఇండియన్‌ రాగా’లో ఫెలోషిప్‌ సాధించింది. అక్కడ కర్ణాటిక్‌ ఓకల్స్‌లో లెవల్‌-5 సర్టిఫికెట్‌ కూడా పొందింది శ్రుతి. 

చదువుల్లోనూ రాణిస్తూ..మక్కువతో సంగీతం నేర్చుకున్నా.. చదువును ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు శ్రుతి. హైదరాబాద్‌లోని వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చేసింది. కాలేజ్‌ డేస్‌లోనే ‘మ్యుజీషియన్‌ అండ్‌ సింగర్‌' కాన్సెప్ట్‌ మీద టెడెక్స్‌లో మాట్లాడి అందరి దృష్టినీ ఆకర్షించింది. అప్పటికి శ్రుతి వయసు 19 ఏండ్లు. పబ్లిక్‌ రిలేషన్స్‌ మీద ఆసక్తితో, మూడేండ్ల కిందట అమెరికాకు వెళ్లి బోస్టన్‌ యూనివర్సిటీలో ఎంటర్‌టైన్‌మెంట్‌ పీఆర్‌లో స్పెషలైజేషన్‌ చేసింది. ఆ క్రమంలోనే ఇంటర్న్‌షిప్‌ కోసం సీబీఎస్‌ స్టూడియోస్‌లో చేరింది. అక్కడ ‘ది బిగ్‌ బ్యాంగ్‌ థియరీ’, ‘ది లేట్‌ షో విత్‌ జేమ్స్‌ కార్డెన్‌' వంటి టీవీ షోలకు పనిచేసింది. ఇలా మల్టీటాలెంట్స్‌తో సత్తా చాటుతున్నది తెలుగమ్మాయి శ్రుతి.మ్యూజికల్‌ జర్నీ

అమెరికాకు వెళ్లకముందు శ్రుతి తెలుగు యూనివర్సిటీలో పలు కచేరీలు నిర్వహించింది. త్యాగరాయ గానసభ, రవీంద్రభారతి, శిల్పకళా వేదికల్లోనూ కచేరీల్లో పాల్గొంది. పాశ్చాత్య సంగీతంపైనా పట్టు సాధించిన తర్వాత స్నేహితులతో కలిసి ‘రూహ్‌' పేరుతో ఒక సెమీ-ప్రొఫెషనల్‌ బ్యాండ్‌ను స్థాపించింది. ‘ఐఐటీ హైదరాబాద్‌, లామకాన్‌, ది గ్యాలరీ కేఫ్‌, ఫీనిక్స్‌ ఎరేనా వంటి చోట్ల సాఫ్ట్‌ రాక్‌, కర్ణాటిక్‌ ఫ్యూజన్‌, పాప్‌ ప్రోగ్రామ్స్‌ చేశాం. ఇటీవలే సింగర్‌ కమ్‌ లిరిసిస్ట్‌ ఫ్రెండ్‌ శ్రుతి అయ్యర్‌తో కలిసి శివతాండవ స్తోత్రం ‘జటాకటా..’ ఈడీఎం ఫ్యూజన్‌ ఒరిజినల్‌ని ఆడియో ప్లాట్‌ఫ్లామ్‌లో రిలీజ్‌ చేశాం. మేమిద్దరం కలిసి ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాం’ అని చెబుతున్నది శ్రుతి. ‘క్యాప్టివ్‌' పేరుతో సింగిల్‌గా రూపొందించిన పాప్‌ గీతాలు ఆడియో ప్లాట్‌ఫామ్స్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఇండియన్‌ రాగా ఫెలోషిప్‌

అమెరికాలోని ఇండియన్‌ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ, వాళ్ల మ్యూజిక్‌ ప్రాజెక్ట్‌లకు స్పాన్సర్‌ చేసే సంస్థ ‘ఇండియన్‌ రాగా’. శ్రుతి అందులో ఓకల్‌ ఫెలోగా ఎంపికైంది. తను సంప్రదాయ శంకరాభరణ రాగానికి వెస్టర్న్‌ టచ్‌ ఇస్తూ ఇంగ్లిష్‌ నోట్‌ చేసింది. శాస్త్రీయ గీతాలు ఆలపించిన గళంలోనే ర్యాప్‌సాంగ్స్‌ పలికిస్తున్నది. ‘ఆలాపనలు, కల్పన స్వరాలు జోడిస్తూ ర్యాప్‌ గీతాలకు కర్ణాటిక్‌ టచ్‌ ఇస్తున్నాను. అలాగే తెలుగు, హిందీలలో పాటలు రాస్తూ.. సంగీతం జోడిస్తూ.. ఒరిజినల్‌ వీడియోలు చేస్తున్నా’ అని చెబుతున్నది శ్రుతి. సంగీతానికి ఎల్లలు లేవని నిరూపిస్తూ.. పడమటి సంధ్యారాగాన్ని వినిపిస్తున్నదీ కోయిలమ్మ.

నేనేంటో నిరూపించుకోవాలి

నేను ప్యాషన్‌తో పాటలు పాడుతున్నా. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్‌ పీఆర్‌గా పని చేయడం ప్రొఫెషనల్‌గా ఇష్టం. అందుకే రెండిటినీ హ్యాపీగా మేనేజ్‌ చేస్తున్నా. మనసుకు నచ్చిందే చేయాలనేది నాన్నను చూసి నేర్చుకున్నా. మ్యూజిక్‌, కల్చర్‌కు సంబంధించిన బ్రాండ్‌లకు తగిన గుర్తింపు తీసుకురావాలన్నది నా ఆశ. మరోవైపు సింగర్‌-సాంగ్‌ రైటర్‌గా నా ప్రత్యేకతను నిరూపించుకోవాలని భావిస్తున్నా. సంగీతానికి, సంగీత కళాకారులకు మంచి భవిష్యత్తు ఉంది. 


VIDEOS

logo