బుధవారం 27 జనవరి 2021
Zindagi - Jan 14, 2021 , 01:13:57

తెలంగాణ ఆండాళమ్మ!

తెలంగాణ ఆండాళమ్మ!

‘ఎంత ధైర్యం ఉంటే.. స్వామివారికి అలంకరిం చాల్సిన పూలదండను తను వేసుకుంటుంది?’ అని ముక్కున వేలేసుకున్నారు అంతా. కానీ, శ్రీరంగడు మాత్రం ‘నువ్వు ధరించి ఇచ్చిన పూదండలే మాకు ప్రీతి’ అన్నాడు. రంగనాథుడిని పాశురాలతో బంధించి, భక్తితో గెలిచి, తన నాథుడిగా భావించిన భక్తాగ్రేసురాలు గోదాదేవి. ఆండాళ్‌ అమ్మగా భక్తులను అనుగ్రహిస్తున్న గోదాదేవికి దక్షిణ భారతావనిలో రెండు ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. అందులో ఒకటి తెలంగాణలోని మేడ్చల్‌ జిల్లా, ఘట్‌కేసర్‌ మండలం, ఎదులాబాద్‌లో ఉన్నది.

ఎదులాబాద్‌లోని గోదాసమేత మన్నారు రంగనాయక స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. విల్లిపుత్తూర్‌ నుంచి గోదాదేవి ఇక్కడికి తరలి వచ్చిందని స్థలపురాణం. దీని వెనుక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉన్నది. అప్పల దేశికుల వంశానికి చెందిన వారు అప్పట్లో దేశాటనం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారు. శ్రీనివాస దేశికుడు, అలివేలమ్మ దంపతుల కొడుకు అప్పలాచార్యులు. తండ్రి కన్నుమూసిన తర్వాత అప్పలాచార్యులు తల్లితో ఇక్కడే స్థిరపడ్డాడు. ఓసారి తల్లితో మదురై దగ్గర్లోని విల్లిపుత్తూరులోని మేనమామ ఇంటికి వెళ్లాడు. స్థానిక ఆలయంలోని గోదా రంగనాయకస్వామి దర్శనం చేసుకొని అక్కడే విశ్రమించాడు. ఆ రాత్రి అప్పలాచార్యుడికి కలలో గోదాదేవి కనిపించింది. తనను రాయపురం తీసుకువెళ్లాల్సిందిగా కోరిందట. మర్నాడు అతడికి గోదాదేవి, రంగనాయకుల విగ్రహాలు బంగారు ఊయలలో లభించాయట. వాటిని తీసుకొని ఎదులాబాద్‌కు చేరుకున్నాడు అప్పలాచార్యులు. అమ్మవారికి చిన్న ఆలయం కట్టించాడు. కుతుబ్‌షాహీల కాలంలో ఈ ప్రాంతాన్ని రాయపురం అని వ్యవహరించేవారు. ఇక్కడి కొండల్లో గరుడ పక్షులు ఎక్కువగా సంచరిస్తుండటంతో ఈ ప్రాంతాన్ని గరుడాచలంగానూ పిలిచేవారు. అప్పటి రాయపురమే ఇప్పటి ఎదులాబాద్‌.  విరాళాలు సేకరించి తర్వాతి కాలంలో భారీ ఆలయాన్ని నిర్మించారు. ఏటా శ్రావణంలో స్వామి  బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ధనుర్మాసం మొదలు సంక్రాంతి వరకు అధ్యయనోత్సవాలు జరుగుతాయి.  

-భూపాల్‌ లింగాలlogo