e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 8, 2021
Home News బాన్సువాడ అల్లుడిని!

బాన్సువాడ అల్లుడిని!

గాంధీజీ, ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు, వీరప్పన్‌.. మహామహుల పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసిన నటుడు రాంజగన్‌. చిన్నతెర అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం. ప్రాధాన్యం లేని సినిమా పాత్రల కంటే, బలమైన సీరియల్‌ క్యారెక్టర్లే నటుడిని నిలబెడతాయని అంటారాయన. జీ తెలుగు ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌తో, మరోసారి అభిమానుల ముందుకు వచ్చిన రాంజగన్‌తో ‘జిందగీ’ ముచ్చట్లు..

నటుడు కావాలనే ఆలోచన ఎలా వచ్చింది?
నాకు చిన్నప్పటినుంచీ ఎన్టీఆర్‌ అంటే వీరాభిమానం. ఆయన సినిమాలంటే ప్రాణం. కాలేజీ రోజుల్లో నందమూరివారి సినిమాలు చూసి, నటుడు కావాలనే కోరిక కలిగింది. కానీ, హీరో అవ్వాలని ఏరోజూ కలలు కనలేదు. అల్లు రామలింగయ్య గారిలా మంచి హస్యనటుడిగా పేరు తెచ్చుకుంటే చాలనుకున్నా.

- Advertisement -

సొంతూరు?
మాది భీమవరం దగ్గర పల్లెటూరు. సినిమాల కోసం చెన్నై వెళ్లిపోయా. సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు వచ్చాక, ఇక్కడికి షిఫ్ట్‌ అయ్యాను. దాదాపు ఇరవై ఏండ్లకు పైగా ఇక్కడే ఉంటున్నా కాబట్టి, నాది హైదరాబాద్‌ కిందే లెక్క.

సినిమాల్లోకి ఎలా వచ్చారు?
దాదాపు ముప్పై ఏండ్ల కిందటి మాట. ఒక రోజు, మధు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ వాళ్లు పేపర్లో యాడ్‌ ఇచ్చారు. నటన మీద ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇస్తామన్నది ఆ ప్రకటన సారాంశం. ఇంటర్వ్యూ చేశాక, నాకు అడ్మిషన్‌ ఇచ్చారు. మాదే ఫస్ట్‌ బ్యాచ్‌. దేవదాస్‌ కనకాలగారు ప్రిన్సిపల్‌. ఆహుతి ప్రసాద్‌, శివాజీ రాజా, విజయ్‌ యాదవ్‌, దర్శకుడు కిషోర్‌, అచ్యుత్‌, నర్రా శ్రీనివాస్‌.. మేమంతా బ్యాచ్‌మేట్స్‌. రెండేండ్ల శిక్షణ పూర్తి కాకుండానే, రామానాయుడుగారు ఓ కొత్త సినిమాలో నాకు, అచ్యుత్‌కు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత పెద్ద వంశీగారి సినిమాలు, ఆర్‌. నారాయణమూర్తిగారి సినిమాలు చేశా. రామ్‌గోపా ల్‌వర్మ ‘శివ’తో కెరీర్‌ ఊపందుకుంది.

సీరియల్స్‌లోనూ విభిన్నమైన పాత్రలు చేశారు కదా?
అవును. ఈటీవీలో వచ్చిన ‘తులసీ దళం’ నాకు గుర్తింపు తెచ్చింది. దూరదర్శన్‌ నుంచి జీ తెలుగు వరకు దాదాపు అన్ని చానళ్లకూ పనిచేశా. హీరో దగ్గర్నుంచి కమెడియన్‌, స్నేహితుడు, తండ్రి వరకు
రకరకాల పాత్రల్లో నటించా.

సినిమాలు, సీరియల్స్‌.. మీ ఓటు ఎటువైపు?
మంచి ప్రాధాన్యమున్న పాత్ర ఒక్కటి పడినా చాలు, కొన్నేళ్ల వరకూ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేస్తుంది సినిమా. అయితే, అన్నిసార్లూ అంత బలమైన పాత్రలు దక్కవు. సినిమాల్లో ప్రాధాన్యంలేని క్యారెక్టర్లు చేయడం కంటే, ఎక్కువ ప్రాధాన్యమున్న సీరియల్‌ పాత్రలు చేసేందుకే మొగ్గు చూపుతా. అందుకే నేను చేసిన సినిమాలకంటే, వదులుకున్నవే ఎక్కువ.

ప్రస్తుతం ఏయే ప్రాజెక్టుల్లో చేస్తున్నారు?
కరోనాకు ముందు చేసిన ఐదు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలీగారు హీరోగా మలయాళ సినిమా ‘వికృతి’ని తెలుగులో రీమేక్‌ చేశారు. అదీ విడుదలకు ఉంది. లాక్‌డౌన్‌ తర్వాత సంపూర్ణేష్‌ బాబుతో రెండు సినిమాలు చేశా. తమిళ్‌లో వీరప్పన్‌ పాత్రలో ఒక సినిమా చేశా. ప్రస్తుతం జీ తెలుగులో ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌లో హీరో స్నేహితుడి పాత్ర చేస్తున్నా.

మీ కుటుంబం గురించి?
మా ఆవిడది బాన్సువాడ దగ్గర పల్లెటూరు. నేను బాన్సువాడ అల్లుడిని. ఇద్దరు పిల్లలు. అమ్మాయికి పెండ్లయింది. అమెరికాలో సెటిలయ్యింది. బాబు కూడా అక్కడే ఎమ్మెస్‌ చేస్తున్నాడు. చాలా సంతృప్తికరమైన జీవితం నాది. దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే, ‘మరో జన్మంటూ ఉంటే ఇదే జీవితం, ఇదే కుటుంబం, ఈ స్నేహితులనే ఇవ్వు స్వామీ!’ అని కోరుకుంటా.

  • ప్రవళిక వేముల
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement