అక్కడికి వెళ్తే బ్యాట్మ్యాన్తో కలిసి కాఫీ సిప్ చేయొచ్చు. కెప్టెన్ అమెరికాతో కలిసి కేక్ తినొచ్చు. సూపర్ మ్యాన్‌తో కలిసి సూప్ తాగొచ్చు, హీ మ్యాన్‌తో కలిసి హాట్ హాట్ బెవరేజెస్ లాగించొచ్చు. 80, 90లలో అలరించిన కామిక్ క్యారెక్టర్లన్నీ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కామిక్ కెఫేలో కండ్లముందుంటాయి. ఏ దిక్కున చూసినా బాల్యంలో ఎంతగానో అలరించిన ఓ కామిక్ హీరో కనిపిస్తాడు. ‘కామిక్ సోషల్’ పేరుతో ఏర్పాటైన ఈ కెఫేలో అడుగడుగునా నోస్టాలజీ అలరిస్తుంది. కామిక్ థీమ్ ప్లస్ కామిక్ లైబ్రరీతో ఏర్పాటైన తొలి కెఫే ఇదేనని చెబుతున్నారు నిర్వాహకులు. హాట్‌గా ఓ కాఫీ ఆర్డరిచ్చి.. గోడలపై కొలువుదీరిన కామిక్ క్యారెక్టర్లను చూస్తూనో, లైబ్రరీలో ఏర్పాటు చేసిన కామిక్ బుక్స్ చదువుతూనో గంటల తరబడి కాలక్షేపం చేయొచ్చు. ఇప్పుడంటే కొవిడ్ నిబంధనలు ఉన్నాయి కానీ, లేకపోతే పది నిమిషాల్లో ఏవో స్నాక్స్ లాగించేసి వెళ్లిపోదామనుకొని అడుగుపెట్టిన వాళ్లు.. రెండు మూడు గంటలు అక్కడే తిష్టవేస్తారు.