గురువారం 25 ఫిబ్రవరి 2021
Zindagi - Jan 18, 2021 , 01:23:13

సోనమ్‌ చెక్కిన బొమ్మలు

సోనమ్‌ చెక్కిన బొమ్మలు

‘శక్తిమాన్‌' ఆమె చెప్పింది తు.చ తప్పకుండా చేస్తాడు.‘చోటా భీమ్‌' ఆమె ఆడించినట్టు ఆడుతాడు. నెట్‌ఫ్లిక్స్‌లో పిల్లలను, పెద్దలను అలరిస్తున్న ‘ఆల్‌ హెయిల్‌ కింగ్‌ జూలియన్‌' షోలో వినిపించేవీ ఆమె మాటలే! ఇంతకీ ఎవరామె? ఏం చేస్తుంది? ఏం సాధించింది..? ఇవన్నీ తెలుసుకోవాలంటే రాజస్థాన్‌ ఎడారిలో పుట్టిన యానిమేటెడ్‌ స్టోరీ స్క్రీన్‌ రైటర్‌ సోనమ్‌ షెకావత్‌ కథ చదువాల్సిందే.

అప్పుడు సోనమ్‌కు ఐదేండ్లు. జైపూర్‌లో ఉండేవాళ్లు. ‘నాన్నా! జురాసిక్‌పార్క్‌ సినిమాకు వెళ్దామా!’ అన్నది తండ్రితో. ఆయనా సరేనన్నాడు. తండ్రి పక్కన కూర్చొని కన్నార్పకుండా సినిమా చూసింది. సినిమాలో డైనోసార్ల ఆకారం చూసి అందరిలానే ఆశ్చర్యపోయింది. వాటి వికృత శబ్దాలకు ఉలిక్కిపడింది. కూతురుకు కథ అర్థం చేస్తూ.. ధైర్యం చెబుతూ సినిమా చూపించాడు సోనమ్‌ తండ్రి. సినిమా అయిపోయింది. ‘నాన్నా! అంతపెద్ద డైనోసార్లు ఎక్కడుంటాయి?’ అనడిగింది. ‘అవి నిజమైనవి కావమ్మా! కంప్యూటర్‌లో తీశారు’ అన్నాడు తండ్రి. రాక్షస బల్లుల గురించే ఆలోచిస్తూ నిద్దుట్లోకి జారుకుంది సోనమ్‌. తెల్లవారి నిద్రలేచాక.. ‘నాన్నా! పెద్దయ్యాక నేనూ కంప్యూటర్‌ బొమ్మలతో సినిమా తీస్తా!’అన్నది.


పదిహేనేండ్లకే నవల

ఆ రోజు నుంచి రకరకాల క్యారెక్టర్లు ఊహించేసుకోవడం, వాటి చుట్టూ చిట్టిపొట్టి కథలు అల్లుకోవడం.. ఇదే సోనమ్‌ వ్యాపకం. క్లాస్‌ పుస్తకాలన్నీ కవితలు, కథలతోనే నిండిపోయేవి. అలా రాసిన కవితలు, కథలను పత్రికలకు పంపేది. అచ్చయిన వాటిలో కొన్నిటికి జాతీయస్థాయిలో బహుమతులు కూడా వచ్చాయి. వయసు పెరిగే కొద్దీ పాత్రల ఔచిత్యం అర్థం చేసుకుంది. కథను మలుపులు తిప్పడంలో ఆరితేరింది. పదిహేనేండ్లున్నప్పుడే 500 పేజీల నవల రాసింది. ఈ కథలు, కవితలు ఎందుకు పనికొస్తాయనేది సోనమ్‌ తల్లిదండ్రుల అభిప్రాయం. కూతురిని ఇంజినీరింగో, మెడిసినో చదివించాలనేది వారి అభిమతం. చివరికి ఆమె ఇష్టానికి తలొగ్గక తప్పలేదు. పట్టుబట్టి బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో యానిమేషన్‌ అండ్‌ మల్టీమీడియా కోర్సులో చేరింది సోనమ్‌. చదువు పూర్తయ్యేనాటికి యానిమేషన్‌లో నిష్ణాతురాలిగా బయటకు వచ్చింది.

ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ యానిమేషన్‌

20 ఏండ్ల వయసులోనే రిలయన్స్‌ యానిమేషన్స్‌లో త్రీడీ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ మొదలుపెట్టింది సోనమ్‌. బొమ్మలతో ఆడుకునే వయసులో కన్న కలలను నెరవేర్చుకున్న క్షణంలో ఆమె కండ్లల్లో ఆనందం. తను అనుకున్న కథలన్నీ రాయాలనీ,  తను కలలుగన్న   ప్రాణం పోయాలనీ భావించేది. కార్టూన్లు, కామిక్‌ క్యారెక్టర్లను ఊహించుకుంటూనే కాలం గడిపేది. ఆఫీస్‌లోనూ అల్లరి చేస్తూ, గెంతులు వేస్తూ పని చేసేది. కానీ, ఈ అల్లరి పిల్లలోని సృజనాత్మకతకు అందరూ ఆశ్చర్యపడేవారు. ఇచ్చిన ప్రతి టాస్క్‌నీ విజయవంతంగా పూర్తి చేసి శభాష్‌ అనిపించుకునేది. సోనమ్‌ ఫొటోగ్రఫిక్‌ మెమొరీ అమోఘం. ప్రొడక్షన్‌ సమయంలో ఏ ఫ్రేమ్‌ వాడారు, ఎన్ని అంగుళాలకు ఫిక్స్‌ చేశారు.. ఇలాంటి టెక్నికల్‌ విషయాలన్నీ ఎప్పుడడిగినా ఠక్కున చెప్పేది. అందుకే ఆఫీస్‌లో అందరూ సోనమ్‌ను ‘ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ యానిమేషన్‌' అని పిలిచేవారు.


వరుస అవకాశాలు

చిన్నాచితకా ప్రాజెక్టులు చేస్తుండగానే.. ఓ రోజు ‘శక్తిమాన్‌' యానిమేటెడ్‌ సిరీస్‌కు రచయితగా అవకాశం వచ్చింది సోనమ్‌కు. టైటిల్‌ థీమ్‌ మొదలుకొని ఎన్నో ట్రాక్స్‌ రాసింది. అది సూపర్‌ హిట్‌ అవ్వడంతో కెరీర్‌లో తొలి విజయాన్ని అందుకున్నది. వరుస ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా బిజీ అయిపోయింది. 2012లో గ్రీన్‌ గోల్డ్‌ యానిమేషన్స్‌ కంపెనీలో చేరింది సోనమ్‌. అప్పటికి డిస్నీతో కలిసి పనిచేస్తున్న ఏకైక కంపెనీ అదొక్కటే. అక్కడే ‘మైటీ రాజు’ అనే షోకు స్క్రీన్‌ప్లే రైటర్‌గా పనిచేసింది. తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన ‘చోటా భీమ్‌'కు అరవై ఎపిసోడ్ల దాకా పనిచేసింది. పలు అంతర్జాతీయ ప్రాజెక్టుల్లోనూ పనిచేసింది. మరోవైపు ఐదు యానిమేటెడ్‌ సినిమాల్లో పనిచేసింది. 30 పాటల వరకూ రాసింది. ఈ తరం చిన్నారులను ఉర్రూతలూగిస్తున్న ‘లిటిల్‌ సింగం’, ‘గోల్‌మాల్‌ జూనియర్‌', ‘భూత్‌ బంధు’ వంటి 17 షోలను స్వయంగా ప్రొడ్యూస్‌ చేసింది. ఈ కార్టూన్‌ షోలు ఇండియాతో పాటు యూరప్‌, అమెరికాల్లోనూ ప్రసారమవుతున్నాయి.

పురాణ పాత్రలతో..

నెట్‌ఫ్లిక్స్‌ ఫాలోవర్స్‌ను అలరిస్తున్న ‘ఆల్‌ హెయిల్‌ కింగ్‌ జూలియన్‌' షోకూ ఈమె రచయితగా పని చేసింది. ఆ షోకుగాను ప్రతిష్ఠాత్మక అమెరికన్‌ టెలివిజన్‌ ‘ఎమ్మీ అవార్డు’ అందుకున్నది. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ రచయితగా సోనమ్‌ రికార్డు సాధించింది. ప్రస్తుతం తను స్పేస్‌ డెలివరీ అనే ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నది. అలాగే భారతీయ పురాణేతిహాసాలపై పనిచేసేందుకు సన్నద్ధం అవుతున్నది. ప్రపంచానికి మన దేశ చరిత్రను, పురాణాలను యానిమేటెడ్‌ షోల ద్వారా చెప్పాలన్నది సోనమ్‌ ఆశయం. తన కలలను నిజం చేసుకోవడమే కాదు.. యానిమేషన్‌ రంగంలోకి మహిళలు రావడానికి కారణమైంది సోనమ్‌. 


అందరినీ మెప్పిస్తేనే..

కెరీర్‌ మొదట్లో ఎదురైన ఇబ్బందులనే సోపానాలుగా మలచుకొని పైకి ఎదిగింది సోనమ్‌. తన ఐడియాను నిర్మాతలు ఒప్పుకొనేందుకు చాలా కష్టపడాల్సి వచ్చేది. ‘డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల నుంచి మార్కెటింగ్‌ వాళ్ల వరకు అందరూ తమని తాము రైటర్లుగా భావిస్తుంటారు. మన కథ వాళ్లను మెప్పిస్తేనే ఆ ప్రాజెక్ట్‌ ముందుకు వెళ్తుంది. అందరినీ ఒప్పించడం కత్తి మీద సామే. యాభై మందిని కూర్చోబెట్టి కథను చెబితే.. హాస్య సన్నివేశాలు వచ్చినప్పుడు అందరూ నవ్వాలి. ఎమోషనల్‌ సీన్లలో కండ్లు చెమ్మగిల్లాలి. అప్పుడే సరైన కథ చెప్పినట్టు.

నా కొడుకు సాయం..

“పిల్లలు కార్టూన్లను ఎంత ఇష్టపడతారో, చిన్నచిన్న విషయాలను కూడా ఎంత జాగ్రత్తగా గమనిస్తారో నాకు బాగా తెలుసు. ఈ విషయంలో నా ఆరేండ్ల కొడుకు పాత్ర ఎక్కువే. వాడికి ఎలాంటి కార్టూన్లు ఇష్టం, ఎలాంటి వాటికి ఎలా రెస్పాండ్‌ అవుతున్నాడో గమనిస్తుంటా. నా తప్పొప్పులు దిద్దుకోవడంలో ఆ పరిశీలన ఎంతగానో ఉపయోగపడుతుంది. 

సోనమ్‌ షెకావత్‌


VIDEOS

logo