e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home ఆరోగ్యం చర్మంపైనా.. కొవిడ్‌ దాడి!

చర్మంపైనా.. కొవిడ్‌ దాడి!

కరోనా తొలిదశ కంటే రెండోదశ పూర్తి భిన్నమైంది. లక్షణాల్లోనూ పెనుమార్పులు కనిపిస్తున్నాయి. మొదటి దశలో జ్వరం, దగ్గు,ఒంటి నొప్పులు, ఆయాసం, కండ్లు ఎర్ర బడటం వంటి లక్షణాలుమాత్రమే ఉండేవి. కానీ, రెండో దశలో కొత్తకొత్త లక్షణాలుబయట పడుతున్నాయి. 80 శాతం మందిని చర్మసంబంధ సమస్యలు వెంటాడుతున్నాయి. ఒంటిపైదద్దుర్లు, దురదతోపాటు ముఖం, గొంతు, మెడ,కడుపు, మోచేతులు, మోకాళ్ళపై నొప్పితో కూడినకురుపులు పుడుతున్నాయి. నోరు పొక్కడం, నాలుకపగలడం తదితర లక్షణాల్నీ చూస్తున్నాం. అయితే,ఈ చర్మ సమస్యలన్నీ కరోనా రోగుల్లో తొలిదశసంకేతాలుగా అంటే జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులకంటే ముందుగానే బయటపడుతున్నాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు, కేవలం చర్మసంబంధ సమస్యలుగానో, సాధారణ ఎలర్జీగానోభావించి నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే. వెంటనే డెర్మటాలజిస్టును సంప్రదించాలి. అవి చర్మ సంబంధ సమస్యలా లేక కరోనా లక్షణాలా అన్నది నిపుణులే తేలుస్తారు.

ఏదైనా వైరస్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చినప్పుడు చర్మవ్యాధులు దాడి చేయడం సర్వసాధారణం. డెంగ్యూ వంటి వైరల్‌ ఫీవర్స్‌ బారిన పడిన రోగులకుకూడా, వ్యాధి తగ్గాక చర్మ సమస్యలు వస్తుంటాయి. కానీ, కరోనా రోగుల్లో చర్మ రుగ్మతలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. మధుమేహ రోగులు, స్కిన్‌ ఎలర్జీలు ఉన్నవారిలోనే ఇవి అధికంగా ఉత్పన్నమవుతున్నాయి. ఎక్కువమందిలో కరోనా తగ్గిపోయిన నెలా, రెండు నెలల తరువాత హెర్పిస్‌, చికెన్‌పాక్స్‌, పాలిక్కల్‌ ఇన్‌ఫెక్షన్స్‌, రుఫేషియా (చెంపలపై ఎర్రటి దద్దుర్లు), పెదవులపై నీటి బుడగలు, సెకండరీ బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్స్‌, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వంటివి వస్తున్నాయి. కరోనా సమయంలో వచ్చే దాదాపు అన్ని చర్మవ్యాధులూ కరోనా తర్వాత కూడా కనిపిస్తున్నాయి. ప్రాథమిక దశలోనే డెర్మటాలజిస్టును సంప్రదిస్తే కేవలం అయింట్‌మెంట్‌తో నివారించవచ్చు. బ్యాక్టీరియల్‌, వైరస్‌, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్స్‌కి యాంటి బ్యాక్టీరియల్‌, యాంటి వైరల్‌, యాంటి ఫంగల్‌ చికిత్స అందించవచ్చు. సమస్యలు ముదిరితే ఖర్చుతో కూడిన వైద్యం తప్పదు.

ప్రధాన సమస్యలివే..

  • సొరియాసిస్‌ సమస్య పెరుగుతుంది.
  • హెర్పిస్‌ (చికెన్‌పాక్స్‌) డయాబెటిస్‌ రోగుల్లో ఎక్కువ.
  • పెదవులపై నీటి బుడగలు.
  • జూస్టర్‌ (నరాలున్న ఒక భాగంలోనే నొప్పితో కూడిన దద్దుర్లు, కురుపులు). ఇవి వయసు పైబడిన వారిలో అధికం.
  • నొప్పితో కూడిన గడ్డలు.
  • సెల్యులైటిస్‌ (ముఖ్యంగా మధుమేహుల్లో).
  • గోళ్లపై తెల్లని లేదా గోధుమ రంగు చారలు.
- Advertisement -

కారణాలు?
కరోనా ఉన్నప్పుడు లేదా తగ్గిన తర్వాత వచ్చే చర్మవ్యాధులకు వైరస్‌లో ఏర్పడిన మ్యుటేషన్స్‌ లేదా స్ట్రెయిన్స్‌ కారణం కావచ్చు. సాధారణంగా వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ అనేది రక్తంలో ఉంటుంది. ఈ రక్తం చర్మానికి సరఫరా కావడం వల్ల చర్మవ్యాధులు రావడం సహజం. అయితే, పోస్ట్‌ కరోనాలో వస్తున్న చర్మవ్యాధులు మాత్రం తీవ్రంగానే ఉంటున్నాయి. సకాలంలో చికిత్స తీసుకోకపోతే ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి.

మానసిక ఒత్తిడి వల్ల….
మనిషిలో ఒత్తిడి పెరిగినప్పుడు శరీరంలో ‘కార్టిజాల్‌’ అనే హార్మోన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో జీవక్రియలో తేడా వస్తుంది. ఆకలి మందగిస్తుంది. లేదంటే, విపరీతంగా ఆకలి పెరుగుతుంది. నిద్ర పట్టక పోవడం వంటి కారణాలవల్ల చర్మం మీద, ముఖ్యంగా ముఖంపై మొటిమలు అధికమవుతాయి. హార్మోన్ల అసమతౌల్యంతో ముఖంపై అవాంఛిత రోమాలు ఏర్పడతాయి. స్టెరాయిడ్స్‌ దుష్ఫ్రభావంతో జుట్టు ఊడిపోవచ్చు. సాధారణంగా ఏ ఇన్‌ఫెక్షన్‌ తర్వాత అయినా జుట్టు ఊడటం సహజమే. డెంగ్యూ రోగుల్లోకూడా 4నుంచి 6 నెలల పాటు ఈ సమస్య ఉంటుంది. దీనిగురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆరు నెలల తర్వాత కూడా హెయిర్‌ గ్రోత్‌ లేకపోతే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. మహిళల్లో అయితే నెలసరిలోనూ తేడా కనిపిస్తుంది.

కొవిడ్‌ చికిత్సవల్ల కూడా..
కొవిడ్‌ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్‌ అధికంగా వాడటం కూడా చర్మ సమస్యలకు ఓ కారణం కావచ్చు. సెకండరీ బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ అంటే.. చిన్నచిన్న గడ్డలు ఏర్పడటం, ప్రత్యేకించి డయాబెటిస్‌ రోగుల్లో సెలులైటిస్‌ రావడం జరుగుతుంది. సెకండరీ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ అంటే.. మ్యుకొర్మైకోసిస్‌ వంటివీ సోకుతాయి. సెకండరీ వైరల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ అంటే.. హెర్పిస్‌వల్ల పెదవులపై నీటి బుడగలు లేదా పొక్కులు ఏర్పడతాయి. చికెన్‌పాక్స్‌ కూడా వస్తుంది.

ఆహారం, నిద్ర, వ్యాయామం
పౌష్ఠికాహారం, 8 గంటల నిద్ర, సరైన వ్యాయామం తదితర జీవనశైలి జాగ్రత్తలతో కరోనా, ఆ తర్వాత వచ్చే చర్మవ్యాధులను సాధ్యమైనంత వరకు నివారించవచ్చు. ముఖ్యంగా ఒత్తిడికి గురికాకుండా ఉల్లాసంగా గడపాలి. పాలు, గుడ్లు, ఆకుకూరలు, తాజా పండ్లు, మొలకెత్తిన గింజలు తీసుకోవాలి. అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండకూడదు. కనీసం అరగంటపాటు వ్యాయామం, వాకింగ్‌, యోగా వంటివి చేయాలి. ఏవైనా ఇబ్బందులు ఉంటే సకాలంలో వైద్యులను సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలి.

జాగ్రత్త.. జాగ్రత్త!

కరోనాను ఎదుర్కోవాలంటే తగిన జాగ్రత్తలు తప్పనిసరి. కానీ, ఆ జాగ్రత్తల్లోనూ కొన్ని అజాగ్రత్తలు ఉంటాయి.

శానిటైజర్‌తో….
అతిగా శానిటైజర్‌ వాడటం వల్ల చేతులపై చర్మం పొడి బారుతుంది. ‘హ్యాండ్‌ ఎగ్జిమా’ అంటే చేతులపై దురద, ఎలర్జీ ఏర్పడి దద్దుర్లు లేదా కురుపులు ఏర్పడతాయి. చర్మం మొద్దుబారే ప్రమాదం లేకపోలేదు.

మాస్కుల వల్ల..
అపరిశుభ్రమైన మాస్కుల కారణంగా ముఖం లేదా నోటివద్ద కురుపులు వస్తాయి. మొటిమలు తీవ్రమవుతాయి. దద్దుర్ల వంటివీ రావచ్చు.

పీపీఈ కిట్స్‌తో…
ముఖ్యంగా వైద్యవృత్తిలో ఉన్నవారికి కరోనా చికిత్సలో పీపీఈ కిట్స్‌ తప్పనిసరి. ఎక్కువ సమయం వీటిని ధరించడం వల్ల శరీరంపై వేడిగడ్డలు, చెమట కురుపులు, దురద తదితర చర్మ సంబంధ వ్యాధులు వస్తున్నాయి.

చర్మ సమస్యలున్నా…
చర్మ సమస్యలు ఉన్నవారు కూడా నిర్భయంగా టీకా తీసుకోవచ్చు. టీకావల్ల ఎలాంటి ఇబ్బందులూ రావు. అయితే, సొరియాసిస్‌ ఉన్నవారు వైద్యుల సిఫార్సు మేరకు ‘మిథోట్రిక్సేట్‌’ మాత్రలు వాడాలి. రెండు వారాలపాటు వాడి, నిలిపి వేసిన తర్వాతే కరోనా టీకా తీసుకోవాలి. చాలామంది ముఖంపై ముడతలు రాకుండా ‘యాంటి ఏజింగ్‌ డెర్మల్‌ ఫిల్లర్స్‌’ చేయించుకుంటారు. అలాంటివారు ఫిల్లింగ్‌ చేయించుకున్న రెండు వారాల తర్వాత టీకా తీసుకోవాలి. టీకా తీసుకున్న రెండు వారాల వరకూ ఫిల్లింగ్‌ చేయించుకోకూడదు.

డా॥ లక్ష్మిదివ్య
(ఎండి, డివిఎల్‌), డెర్మిక్‌ క్లీనిక్‌,
కొండాపూర్‌

డా॥ దివ్యశ్రీ
(ఎండి, డివిఎల్‌),
డెర్మిక్‌ క్లీనిక్‌,
కొండాపూర్‌

… మహేశ్వర్‌రావు బండారి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana