నమస్తే. నాకు పెండ్లయింది. ఒక కూతురు. కలసి ఉండటం అసాధ్యమని
నిర్ణయించుకొన్నాక భర్త నుంచి విడాకులు తీసుకున్నాను. భార్యాభర్తలు
విడాకులు తీసుకున్నాక, తల్లికి చట్టపరమైన కస్టడీ వస్తే, తండ్రి ప్రమేయం లేకుండా ఆ బిడ్డతో సహా ఆమె విదేశాలకు వెళ్లొచ్చా?
ఒక సోదరి
జ : మీరు అడిగినట్టు, భార్యాభర్తలిద్దరిలో ఒకరికి పిల్లల్ని కలిసే హక్కు
వచ్చిందంటే, అవతలి వారికి ఫిజికల్, లీగల్ రెండు కస్టడీలూ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఆ కేసుకు సంబంధించిన విషయాలను పరిగణనలోకి తీసుకుని, అంతిమంగా కోర్టు నిర్ణయిస్తుంది. అలాగే తల్లికి లీగల్, ఫిజికల్ కస్టడీలు రెండూ లభిస్తే, తండ్రి ప్రమేయం లేకుండా బిడ్డను తీసుకుని విదేశాలకు వెళ్లే హక్కు ఆ తల్లికి ఉంటుంది. కానీ, కోర్టు నుంచి దానికి
సంబంధించిన ఆర్డర్ ఉండాలి.
ఫిజికల్ కస్టడీ అంటే, పిల్లల రోజువారీ పెంపకంపై చిన్న చిన్న నిర్ణయాలు తీసుకునే హక్కు ఉండటం. అలాగే పిల్లల రోజువారీ వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ. ఉదాహరణకు ఎలాంటి బట్టలు కొనాలి, ఏ హాబీ క్లాసులో చేర్చాలి, పిల్లలను స్కూల్ పిక్నిక్కి పంపాలా, వద్దా తదితర విషయాలు.
లీగల్ కస్టడీ అంటే, పిల్లల జీవితంలో పెద్దపెద్ద
నిర్ణయాలు తీసుకునే హక్కు ఉండటం. ఉదాహరణకు పిల్లలను ఏ స్కూల్లో చేర్పించాలి, వైద్య పరమైన సమస్య తలెత్తితే, ఆపరేషన్ చేయించాలా వద్దా మొదలైన విషయాలు.
మానసి చౌదరి
అడ్వకేట్
www.pinklegal.in