e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home జిందగీ ఎనకటీ నాగాలివాడా..ఎండికట్టె పోగులోడా

ఎనకటీ నాగాలివాడా..ఎండికట్టె పోగులోడా

నెమలికి సోగలందం. నల్లకోడికి పిల్లలందం. ఆడపిల్లకు ఎడుమ సేతి గాజులందం. నడుముకు వడ్డాణం అందం. గాయనికి గాత్రం అందం. జగతికి జానపదం అందం. ఎందుకంటే జానపదం పల్లెదనాన్ని, మట్టి మనుషులను కండ్లముందు ప్రత్యక్షం చేస్తుంది. వారితో మమేకమైన ఎద్దును,ఎవుసాన్ని, నాగలిని, నాట్లనూ చూపిస్తుంది. గొర్రెల్ని, గొంగడిని, సేనును,సెలయేర్లనూ పరిచయం చేస్తుంది. ముఖ్యంగా మన మూలాలు గుర్తుకొస్తయి. శ్రమనే నమ్ముకొని ఆరుగాలం కష్టపడే రైతన్న గుర్తుకొస్తడు.అలాంటి అచ్చమైన పల్లె పాటలు పాడుతూ జానపదాల జల్లులు కురిపిస్తున్న గాయని అశ్విని రాథోడ్‌ పాట ముచ్చట..

పాట నా జీవితంలో భాగం కావడానికి మా అమ్మానాయనే కారణం. మాది బంజారా కుటుంబం. ఇప్పుడిప్పుడు కొంచెం కలుస్తున్నంగానీ, గతంలో ఈ పరిస్థితి లేకపోయేది. మాదొక ప్రపంచం. చిన్నచిన్న ఆనందాలు, పండుగలు, సంబురాలు మావి. అప్పుడే తిట్టుకొంటం. అప్పుడే ఒక్కటైతం. భాష వేరు. వేషం వేరు. మరీ ఎక్కువలేని, మరీ తక్కువలేని జనాభా. ఒకరింట్ల దావతైతే అందరూ పోవుడు, ఒకరికి బాధ కలిగితే అందరూ పంచుకొనుడు నాటి నుంచీ వస్తున్నది. అట్లాంటి వాతావరణంలో పుట్టి, పెరిగిన. చిన్నప్పటి నుంచే పాటలకు దగ్గరైన. అమ్మ పేరు రజిత, నాయన రాందాస్‌ నాయక్‌. మా ఇంట్లో మా నాయనతోటి పాట మొదలైంది. ‘లంబడోల్ల రాందాస్‌ కిరాక్‌ పాటలు పాడ్తడుబై’ అని అంటుంటే మాగ్గూడా సంబురమనిపించేది. నన్ను భుజాలపై ఎత్తుకొని చిన్నప్పుడు నాయన పాడిన పాటలు ఇప్పటికీ గుర్తున్నయి. అవే నాకు పాటల ఊటగా మారినయి. జీవితానికి దారి చూపినయి.

రగే చోరియే చోరీ

- Advertisement -

మాది భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం గాజురాంపల్లి. బోర్లగూడం తర్వాత వచ్చే చిన్న పల్లె. మా ఊర్లో ఎప్పుడూ ఏదో ఒక పండుగ జరిగేది. అందరమూ కలిసి ఆడిపాడేవాళ్లం. అలాంటి పండుగల్లో ‘తీజ్‌’ ఒకటి. ఇది మాకు దసరా, దీపావళి, సంక్రాంతి, బక్రీద్‌, క్రిస్మస్‌ లాంటి పండుగ. సుట్టాలను పిలిచి దావత్‌ ఇస్తం. అందరికీ మంచి మర్యాద చేస్తం. తీజ్‌ సందర్భంగా పాడుకొనే పాటలు బాగా నచ్చేవి. వాటిని నేను అనుకరించేదాన్ని. చిన్నప్పుడు ‘రగే చోరియే చోరీ’ బాగా పాడేదాన్ని. ఇది మా నాన్న నేర్పించిండు. అన్నాచెల్లెళ్ల మధ్య సాగే అనుబంధాల పాట ఇది. మట్టి మనుషుల జీవితం ఈ పాటలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రకృతి అన్నా, పల్లెలన్నా, వాటితో మమేకమైన పాటలన్నా నాకు చిన్నప్పటి నుంచీ ఇష్టం.

నాతోనే పాడించేవాళ్లు

మాది ఉద్యమాల నేల. లంబాడాలకు పోరాట పటిమ ఎక్కువ. ఐదో తరగతిలో ఉండగానే స్కూల్‌ వేదికలపై పాడేదాన్ని. టీచర్లు మెచ్చుకొని ప్రోత్సహించేవాళ్లు. బయట కూడా పాడించేవాళ్లు. సినిమా ప్రపంచానికి దూరంగా బతుకుతున్నా, నాకెందుకో సినిమా పాటలపై ఆసక్తి. బాగా ప్రాక్టీస్‌ చేసేదాన్ని. వేదికలపై కూడా సినిమా పాటలే పాడేదాన్ని. ఎన్ని పాడినా, నా మాతృక అయిన బంజారా పాటలు మాత్రం, ఎప్పుడూ నా గొంతులో నానుతుండేవి.

ఆ కిక్కే వేరు

ఇంటర్‌కు వచ్చేసరికి నా పాటల్లో పరిణతి కనిపించింది. ట్రెడిషనల్‌ సాంగ్స్‌, కీర్తనలు పాడేదాన్ని. నా నేపథ్యం తెలియనివాళ్లు, ‘ఈ అమ్మాయి సంగీత కుటుంబం నుంచి వచ్చినట్టుంది’ అనుకొనేవారు. ‘ఇంత బాగా పాడుతున్నావ్‌. ఇప్పుడు జానపద ట్రెండ్‌ నడుస్తున్నది. మంచి జానపదాలు సేకరించి పాడితే, జనాల్లోకి వెళ్తాయి. నీకూ మంచి పేరొస్తది’ అని మా బావ ప్రోత్సహించిండు. అప్పటినుంచి పూర్తిగా జానపదాలపై దృష్టి పెట్టిన. ఒకసారి నేను పాడిన పాటకు స్టేట్‌ లెవెల్‌ ప్రైజ్‌ వచ్చింది. ఆ బహుమతి తర్వాత నాలో ఆసక్తి రెట్టింపు అయ్యింది.

ఐదు పాటల తర్వాతే..

నన్ను ఎంతో ప్రోత్సహించిన బావనే పెండ్లి చేసుకొన్నా. పేరు రవీందర్‌. మా అత్తగారి ఊరు భూపాలపల్లి దగ్గర గొల్ల బుద్ధారం. డిజిటల్‌ మీడియా విస్తరించింది, మంచి అవకాశాలు ఉంటాయని చెప్పింది కూడా ఆయనే. నేను పాడిన ఒక లవ్‌ ఫెయిల్యూర్‌ బంజారా సాంగ్‌ను రికార్డు చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిండు. కానీ ఐదారు పాటల తర్వాతే నాకు బ్రేక్‌ వచ్చింది. ‘రూపా కాయి ఇరగ ఇరగ’ పాట జనాల్లోకి వెళ్లింది. ‘భూలజౌరిచి కాయియె చోడఔరికయే’, ‘గుగ్గరారి జోడి’ వంటి బంజారా సాంగ్స్‌ పాడిన. ‘ఎనకటీ నాగాలి వాడా.. ఎండికట్టె పోగులోడా’ పాట టర్నింగ్‌ పాయింట్‌ అయ్యింది. ప్రేక్షకులు బాగా ఆదరించిండ్రు. ఈ పాట అర్థం కూడా గొప్పగా ఉంటుంది.

జానపదమే బతుకుచిత్రం

‘ఎనకటీ నాగాలి వాడా’ పాట నాకు మంచి పేరు తెచ్చింది. ఇందులోని ప్రతీ పదం పల్లె వాసుల బతుకు చిత్రాన్ని తెలియజేస్తుంది. కచ్చురాల బండి, కంచెకాడ, ఎనకలి నాగలి, దాపటెద్దుల దూప, సెలిమి వంటి పదాలను నేటి తరానికి మరోసారి పరిచయం చేసే అవకాశం నాకు దక్కింది. స్క్రీన్‌ మీద కూడా నేనే కనిపిస్తాను. పల్లె నేపథ్యంనుంచి వచ్చినా మంచిగా చదువుకొన్నా. లోకం పోకడలు తెలుసుకున్నా. ఈ క్రమంలో టీవీ యాంకర్‌ కావాలనే ఆలోచన వచ్చింది. ఆ అవకాశమూ దొరికింది. ఇప్పుడు లైఫ్‌ బిజీగా మారిపోయింది. ఒకవైపు పాటలు, మరోవైపు యాంకరింగ్‌తో ప్రజల అభిమానాన్ని పొందుతున్నాను. బంజారా పాటలు, జానపదాలే కాకుండా సామాజిక గీతాలు కూడా పాడుతున్నా. ప్రియాంకారెడ్డి హత్య నేపథ్యంలో ‘రాలుతున్నయమ్మా పూవులు రాలుతున్నయమ్మా’ అంటూ నేను కన్నీళ్లతో పాడిన పాటను ప్రేక్షకులు బాగా రిసీవ్‌ చేసుకున్నరు. ‘అశ్విని అఫీషియల్‌’ పేరుతో అమ్మమ్మలు, యనమ్మల కాలంనాటి జానపదాలను ఒడిసిపట్టి నేటి తరానికి వినిపించాలని నా కోరిక. యాంకరింగ్‌లోనూ ఇంకా రాణించి మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలనేది నా లక్ష్యం.

వెయ్యికి పైగానే..

బంజారా అమ్మాయిలను బయటకు వెళ్లనీయరు. పాటలు పాడతా, డ్యాన్స్‌ చేస్తా అంటే ఒప్పుకోరు. కానీ నాకేమో చిన్నప్పటి నుంచీ పాటంటే ఇష్టం. తీజ్‌ సాక్షిగా నేర్చుకొన్న పాటలవి. స్టేజీ ఎక్కి ‘కచ్చురాల బండిగట్టి కంచెకాడికి పోయెటోడా.. ఎడమసెంపకు ఎండకొట్టెనే కల్యాణరాయ జొన్నసేను జోరుగున్నాదా’ అని పాడితే వచ్చే ఆదరణను నేను వదులుకోదలుచుకోలేదు. అమ్మానాన్నలతో ఇదే మాట చెప్పిన. ‘నీకు నచ్చిన పని చెయ్‌’ అని వాళ్లు ప్రోత్సహించిండ్రు. వాళ్ల ఆశీస్సుల వల్లనే 1000కి పైగా బంజారా పాటలు, 50కి పైగా తెలుగు జానపదాలు పాడిన.

దాయి శ్రీశైలం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana