బుధవారం 24 ఫిబ్రవరి 2021
Zindagi - Feb 06, 2021 , 00:36:07

అందరి చేతుల్లో..‘ఆర్య’ డైలాగ్‌ పేపర్స్‌!

అందరి చేతుల్లో..‘ఆర్య’ డైలాగ్‌ పేపర్స్‌!

మన కలలు ఒకలా ఉంటాయి. సృష్టికర్త స్క్రీన్‌ప్లే ఇంకోలా ఉంటుంది. జీ తెలుగు ‘రక్త సంబంధం’ ద్వారా ప్రేక్షకులతో ఆత్మీయ అనుబంధం పెంచుకున్న సిద్ధార్థ్‌ వర్మ అడ్డూరి జీవితమే అందుకు ఉదాహరణ. తనకు నటనలో శిక్షణ లేదు. ఇంట్లో వాళ్లెవరూ పరిశ్రమలో లేరు. అనుకోకుండా సినిమా వైపు అడుగులు వేశాడు. వరుస అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. అంతలోనే సందిగ్ధం. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అన్నిటినీ ఓపిగ్గా ఎదుర్కొని టెలివిజన్‌ రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆ ప్రయాణం గురించి సిద్ధార్థ్‌  ‘జిందగీ’తో పంచుకున్న ముచ్చట్లు..

మాది తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి. చదువంతా మా ఊర్లోనూ, అమ్మమ్మగారి ఊరు అడ్డతేగలలోనూ సాగింది. కాకినాడ, భీమవరంలో కూడా చదువుకున్నా. చిన్నప్పటినుంచీ ఫ్రెండ్స్‌ ఎక్కువ. అమ్మమ్మగారి ఊర్లో చాలామంది స్నేహితులు ఉండేవారు. మా తాతయ్య పేరు రామకృష్ణరాజు, వాళ్ల అన్నయ్య సత్యనారాయణరాజు గారికి మా ఊర్లో ఓ థియేటర్‌ (శ్రీ వేంకటేశ్వర) ఉండేది. ప్రత్యేకంగా టికెట్‌ కొనే అవసరం లేకపోవడంతో అన్ని సినిమాలూ రెండు మూడుసార్లు చూసేవాణ్ణి. హీరోలను అనుకరిస్తూ సినిమా డైలాగ్స్‌ చెప్పేవాడిని. నటనవైపు వస్తానని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. కానీ, కాలేజీ రోజుల్లో ఫ్రెండ్స్‌తో కలిసి సినిమా పోస్టర్లు ఎడిట్‌ చేసి మా పేర్లు వేసుకుని మురిసిపోయే వాళ్లం. నిజంగానే పోస్టర్లమీద నా పేరు వచ్చే రోజు ఒకటుంటుందని ఊహించలేదు.

సంబంధం లేని రంగం

మా కుటుంబంలో కానీ బంధువుల్లో కానీ నాటకాలతో, సినిమాలతో సంబంధమున్న వాళ్లెవరూ లేరు. 2012లో అనుకుంటా, విజయనగరంలో ఉండగా ఏవో సినిమా ఆడిషన్స్‌ జరుగుతున్నాయని తెలిసింది. మా అన్నయ్యవాళ్ళు నన్నూ ట్రై చేయమన్నారు. నేనూ సరదాగానే తీసుకున్నాను. సెలెక్ట్‌ అవుతాననే నమ్మకమైతే లేదు. తీరా అక్కడికెళ్తే దాదాపు వెయ్యిమందిదాకా ఉన్నారు. ఆర్య సినిమా ైక్లెమాక్స్‌ డైలాగ్‌ పేపర్లు పట్టుకుని ప్రాక్టీస్‌ చేస్తున్నారంతా. వాళ్లందరినీ చూడగానే, సినిమా అవకాశం ఏమోగాని అక్కడ ఉండాలంటేనే భయమేసింది. నా పేరు పిలువగానే వెళ్లాను. ఆడిషన్‌ రూమ్‌లో ఉన్న నలుగురినీ చూసేసరికి నోట్లోంచి మాట రాలేదు. ఏదైనా డైలాగ్‌ చెప్పమని అడిగారు. చెప్పలేకపోయాను. కానీ నన్నే సెలెక్ట్‌ చేసుకున్నారు. ఆ మాట చెప్తే ఇంట్లో వాళ్లుకూడా నమ్మలేదు. నేనేదో సరదాకి అబద్ధం చెబుతున్నాననుకున్నారు. మరుసటిరోజు జిల్లా ఎడిషన్‌లో వార్త వస్తేగానీ నమ్మలేదు. అలా అనుకోకుండా నా కెరీర్‌ స్టార్ట్‌ అయింది. ‘3జీ లవ్‌' సినిమాతో హీరోగా పరిచయమయ్యాను. 


వెంటనే రెండో సినిమా

‘3జీ లవ్‌' కోసం హీరోగా తీసుకున్నప్పుడు నాకు నటన అంటే తెలియదు. డైలాగ్స్‌ చెప్పడం రాదు. నెలరోజులు శిక్షణ ఇచ్చారు. ఆ సినిమా 2013లో విడుదలై మంచి విజయం సాధించింది. వెంటనే ‘నేను నా ఫ్రెండ్స్‌' సినిమా అవకాశం వచ్చింది. కానీ ఆ తర్వాతే, ఎనిమిది నెలల గ్యాప్‌. ఏం చేయాలో తోచలేదు. సినిమా ప్రయత్నాలు వదిలేసి ఇంటికెళ్ళి చదువు మీద దృష్టి పెడదామనుకున్నా. కానీ మనసు ఒప్పుకోలేదు. ఎలాగైనా, ఇక్కడే నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నా. అప్పటికే చాలా అవకాశాలు వస్తుండటంతో ఓ సీరియల్‌కి సైన్‌ చేశాను. అదే సమయంలో క్రిష్‌గారి ఆఫీస్‌లో ఆడిషన్స్‌ జరుగుతున్నాయని తెలిసి వెళ్ళాను. నన్ను ఎంపిక చేసుకున్నారు. అన్నాళ్లూ ఎదురుచూసిన సీరియల్‌ వదిలేయాలో, పెద్ద ప్రొడక్షన్‌లో సినిమా వదిలేయాలో అర్థం కాలేదు. నా పరిస్థితిని అర్థం చేసుకుని, సినిమా వాళ్లే సీరియల్‌ నిర్మాతలకు చెప్పి ఒప్పించారు. అలా రామోజీరావుగారి ప్రొడక్షన్‌లో ‘దాగుడు మూతలు దండాకోర్‌'లో అవకాశం దక్కింది. ‘దేవుళ్ళు’లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేసిన నిత్యాశెట్టి హీరోయిన్‌. రాజేంద్రప్రసాద్‌, రవిప్రకాశ్‌ వంటి పెద్ద నటులతో కలిసి పనిచేయడం గొప్పగా అనిపించింది. ఆ సినిమా తర్వాత పూర్తి సమయాన్ని సీరియళ్ళకే కేటాయించాను. ఈటీవీలో ‘స్వాతి చినుకులు’, మా టీవీలో ‘ఓకే జాను’ సీరియల్స్‌ చేశాను. ప్రస్తుతం జీ తెలుగులో వస్తున్న ‘రక్తసంబంధం’తోపాటు జెమినీలో ‘మట్టిగాజులు’ చేస్తున్నా. జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘రక్త సంబంధం’ సీరియల్‌ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని కథతో, ట్విస్ట్‌లతో నడుస్తున్నది. పుట్టగానే పిల్లలను మార్చే లైన్‌తో సాగే ఈ కథలో, చాలా ప్రాధాన్యమున్న పాత్ర నాది. ఈ సీరియల్‌కుగాను జీ అవార్డ్స్‌లో ‘ఉత్తమ కొడుకు’ అవార్డుతోపాటు, రెండేండ్లు వరుసగా ‘ఉత్తమ హీరో’ అవార్డుకూడా వచ్చింది. 

తలరాతని నమ్ముతా

జీవితంలో ఏదైనా మన తలరాతపైనే ఆధారపడి ఉంటుంది. సాయం చేసినా చేయకపోయినా, ఎవరికీ హాని చేయకుండా ఉంటే చాలు. ప్రయత్నలోపం లేకుండా కష్టపడితే ఎప్పటికైనా ఫలితం దక్కుతుంది. సినిమానే కాదు, అన్ని రంగాల్లోని విజేతలూ  నాకు ఆదర్శమే. ఎక్కడైనా కష్ట పడితేనే గెలుపు సాధ్యమవుతుంది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కొన్ని ఇబ్బందులైతే ఎదుర్కొన్నా. అయితే, అన్ని వేళలా నన్ను ప్రోత్సహిస్తూ అండగా నిలిచారు నా స్నేహితులు. ముఖ్యంగా సురేంద్ర అనే ఫ్రెండ్‌, తన జీతంలోంచి సగం డబ్బులు పంపేవాడు. భీమవరంలో ఉండే విజయ్‌ నందిపల్లి కూడా ఎంతగానో ప్రోత్సహించాడు. నేనీరోజు ఈ పరిస్థితిలో ఉన్నానంటే వారందరి మద్దతే కారణం.

నా బలం..

మా అమ్మానాన్నలు నాగసత్యాదేవి, కుమార్‌రాజు. నాకో అక్క ఉంది. తను పెండ్లయి బెంగళూర్‌లో సెటిలయ్యింది. అమ్మానాన్నల తర్వాత, నా బలం నా భార్య విష్ణుప్రియ. మాది లవ్‌ మ్యారేజ్‌. 2017లో పెద్దల అంగీకారంతో పెండ్లయింది. తనూ ఇదే రంగంలో ఉండటంతో నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. నేను ఇంటికెళ్ళిపోదామని అనుకున్నప్పుడు తనే నన్ను సపోర్ట్‌ చేసింది. మాకు ఓ బాబు. పేరు అయాన్ష్‌ వర్మ. నా జీవితంలో ఎప్పుడూ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం..నా పెళ్ళిరోజు, ఫిబ్రవరి 11.


క్రేజీ కపుల్‌

టెలివిజన్‌ రంగంలోని రియల్‌ కపుల్‌ ఇంద్రనీల్‌-మేఘన, శివనాగ్‌-మహేశ్వరి, ప్రియతమ్‌-మానస, మా జంట.. మేమంతా ఓ గ్యాంగ్‌. పేరు క్రేజీ కపుల్‌. మేమంతా వారాంతాల్లో కలుస్తుంటాం. పార్టీలు, ఫ్యామిలీ గెట్‌ టుగెదర్‌లు.. ఇలా చాలా సందడిగా ఉంటుంది మా భేటీ.

...ప్రవళిక వేముల

VIDEOS

logo