e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 23, 2021
Home Top Slides బంగారు మనసు!

బంగారు మనసు!

బంగారు మనసు!

ఏ మహిళ అయినా బంగారాన్ని ప్రేమిస్తుంది. బంగారు ఆభరణాలంటే మక్కువ చూపుతుంది. చేతిలో నాలుగు రాళ్లున్నా బంగారం కొనడానికే మొగ్గుచూపుతుంది. శ్రావ్యారెడ్డి మాత్రం నగలకంటే మనుషులే ముఖ్యమని భావించింది. పేదలకోసం ఒంటిమీది ఆభరణాలను విక్రయించింది. ‘వీ అండ్‌ షీ’ ఎన్జీవోను స్థాపించి పేదల బతుకుల్లో స్వర్ణకాంతులు నింపుతున్నది.

కలెక్టరైనంత ఆనందం!
పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రెండుసార్లు సివిల్స్‌ రాశా. కానీ, అర్హత సాధించలేకపోయాను. ఇప్పుడు నాకు ఆ బాధ లేదు. తాతయ్య, అమ్మానాన్న స్ఫూర్తితో నన్ను నమ్ముకొన్న వారికి అండగా ఉంటున్నా. ‘వీ అండ్‌ షీ’ సేవలు మరింత విస్తృతం చేయాలని ఉంది. ఐదారేండ్లలో అన్ని రాష్ర్టాలకూ మా ఫౌండేషన్‌ను విస్తరించాలన్నది లక్ష్యం. పంజాబ్‌, బీహార్‌, మహారాష్ట్ర నుంచికూడా సాయం కోసం కాల్స్‌ వస్తున్నాయి.

- Advertisement -

ఆమె.. పొలాల్లో పనిచేసే మహిళలను కలుస్తుంది, ముచ్చటిస్తుంది, బాధలు వింటుంది. అవసరమైన వారికి అండగా నిలుస్తుంది. రోడ్డుపక్కన దీనులైనా సరే, ధైర్యం చెబుతుంది. అన్నం పెట్టి కడుపు నింపుతుంది. వైద్యం చేయిస్తుంది. మందడి శ్రావ్యారెడ్డి దినచర్యలో ఇదో భాగం. శ్రావ్యకు జనమంటే ఇష్టం. మనుషుల మధ్య లేకపోతే ఉక్కపోసినట్టు అనిపిస్తుందట. అందుకే, 31 రోజులపాటు 31 జిల్లాలు తిరిగింది. 4,200 కి.మీ.లు పర్యటించింది. ఒంటరి మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కండ్లారా చూసింది. కొందరికైనా తనవంతు సాయం చేయాలనుకొంది. ఆ లక్ష్యంతోనే ‘వీ అండ్‌ షీ’ ఎన్జీవోను స్థాపించింది. కానీ, నిధుల సేకరణే పెద్ద సమస్య అయ్యింది. ఎవరి దగ్గరో చేయి చాచడం ఇష్టం లేక, ఒంటిమీదున్న బంగారాన్ని అమ్మేసింది. ఆ డబ్బుతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నది. పిల్లలు పట్టించుకోని తల్లిదండ్రులు, విధి వంచితులైన వితంతువులు.. ఇలా దిక్కూమొక్కూలేని స్త్రీలకు చుక్కానిగా మారింది. శ్రావ్య తండ్రి మందడి చంద్రశేఖర్‌రెడ్డి కాంట్రాక్టర్‌, తల్లి నీరజ న్యాయవాది.శ్రావ్య బీటెక్‌ చేసింది. గూగుల్‌ వంటి సంస్థల్లో ఉద్యోగం చేసింది. కానీ, ఆ ఎయిర్‌ కండిషన్డ్‌ వాతావరణం ఉక్కపోతగా అనిపించేది. దీంతో కార్పొరేట్‌ కెరీర్‌ను వదులుకొని సమాజసేవలో ఆనందాన్ని వెదుక్కుంటున్నది.

ఆర్థికంగా అభయం
‘వీ అండ్‌ షీ’ ఫౌండేషన్‌ ద్వారా ఎంతోమంది ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించింది శ్రావ్యారెడ్డి. కుట్టుమిషన్లు పంపిణీ చేసింది, వ్యాపారానికి సదుపాయాలు కల్పించింది, యంత్ర పరికరాలు అందించింది. కరోనా సమయంలో చేనేత కార్మికులకు సాయం చేయాలనే ఉద్దేశంతో, తెలుగు రాష్ర్టాల్లోని నేతన్నల వద్ద టోకుగా వస్ర్తాన్ని కొనుగోలు చేసింది. ఆ ముడిసరుకును తన ఎన్జీవో ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలకు ఇచ్చి మాస్క్‌లు కుట్టించింది. వాటిని విక్రయించే బాధ్యతను మరికొందరికి అప్పగించింది. అలా, అనేక కుటుంబాలకు ఉపాధి లభించింది. 2017లో రంగారెడ్డి కోర్టువద్ద ఓ మహిళ తన కేసును వాదించమంటూ, న్యాయవాది చేతిలో బంగారు గాజులు పెట్టి, వేడుకొంటున్న దృశ్యం శ్రావ్యను కలవరానికి గురి చేసింది. ‘నా వంతుగా ఏమీ చేయలేనా?’ అన్న ప్రశ్న ఆమెను వేధించింది. మహిళలకు సత్వర న్యాయాన్ని అందించడమే లక్ష్యంగా న్యాయశాస్త్రం చదివింది. అన్యాయంగా కోర్టు కేసుల్లో చిక్కుకున్న మహిళల తరఫున తన గొంతు వినిపిస్తున్నది శ్రావ్య.

మొదటి వేవ్‌ నుంచీ..
కరోనా కష్టకాలంలో ‘వీ అండ్‌ షీ’ బృందం రోగులకు ఆహారం అందించింది. 31 జిల్లాల్లోని ‘వీ అండ్‌ షీ’ సభ్యులంతా బృందాలుగా ఏర్పడి ఆక్సిజన్‌ సిలిండర్లు సరఫరా చేశారు, ప్లాస్మా దాతలను వెతికిపెట్టారు, దవాఖానలో బెడ్స్‌ సమాచారం అందించారు. శ్రావ్య ఆత్మీయుల్లో కొందరు తరచూ అంతర్జాతీయ పర్యటనలకు వెళ్తుంటారు. వాళ్లంతా తమ స్నేహితురాలి సేవా కార్యక్రమాలతో స్ఫూర్తి పొంది.. పర్యటనలు రద్దు చేసుకొన్నారు. ఆ డబ్బును అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు విరాళంగా ఇస్తున్నారు. కార్పొరేట్‌ కంపెనీల్లో ఉద్యోగం చేసినప్పుడు దాచుకున్న డబ్బుతో పోచంపల్లికి చెందిన రమేశ్‌ అనే చేనేత కార్మికుడికి రూ.2లక్షలు పెట్టి కృత్రిమ కాళ్లు ఇప్పించింది శ్రావ్యారెడ్డి. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం సీరోలు గ్రామానికి చెందిన సక్కుబాయికి ఇల్లు కట్టించింది. ‘నలుగురికి భరోసా కల్పించడాన్ని మించిన ఆనందం ఏం ఉంటుంది? నేను కోరుకుంటున్నదీ అదే’ అంటున్నది శ్రావ్య. తన సేవలకు గుర్తింపుగా ‘కరమ్‌వీర్‌ చక్ర అవార్డు’, ‘యంగ్‌ అచీవర్‌ అవార్డు’, ‘ప్రైడ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ వంటి అనేక పురస్కారాలు వరించాయి.

… డప్పు రవి, జి.భాస్కర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బంగారు మనసు!
బంగారు మనసు!
బంగారు మనసు!

ట్రెండింగ్‌

Advertisement