మా ఆయన..వద్దనలేదు!

‘పెండ్లయితే ఆడవాళ్ళు ఉద్యోగం, కెరీర్ వదులుకోవాల్సిందే’ అనేది ఒకప్పటి మాట. కెరీర్‌కు పెండ్లి అడ్డే కాదని నిరూపిస్తున్నారు నేటి యువతులు. తాను వివాహం తర్వాత కూడా నటిస్తాననీ, మంచి పాత్రలు వచ్చినంత కాలం పరిశ్రమలోనే ఉంటాననీ చెబుతున్నారు జీ తెలుగు ‘త్రినయని’ హీరోయిన్ అశికా గోపాల్ పదుకునే. ఇంజినీరింగ్ పాసై, ఉద్యోగంలో చేరే సమయంలో అనుకోకుండా వచ్చిన ఓ అవకాశం తననెలా నటిగా మార్చిందో, ఆ తర్వాత పరిణామాలేమిటో ‘జిందగీ’తో పంచుకున్నారామె..
మా నాన్నగారిది బ్యాంకు ఉద్యోగం. దీంతో ప్రతి మూడు సంవత్సరాలకూ బదిలీ అయ్యేది. అందుకేనేమో నేను పుట్టింది ఉడుపిలో అయితే , స్కూల్‌కి వెళ్లింది బెంగళూర్‌లో. ఆ తర్వాత ముంబై, హుబ్లీ, మళ్ళీ బెంగళూరు..ఇలా తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడైతే బెంగళూర్‌లో స్థిరపడ్డాం. చదువుకునే రోజుల్లో ఇంజినీరింగ్ చేసి, మంచి జాబ్ తెచ్చుకుని, హాయిగా సెటిలవ్వాలని కలలు కనేదాన్ని. ఇంజినీరింగ్ చివరి సంవత్సరంలో ఉండగానే, క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. రెండు నెలల్లో జాబ్‌లో జాయినవ్వాలి. అప్పుడే, కన్నడ సీరియల్ ‘నిహారిక’లోనూ అవకాశం వచ్చింది. ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. ఇంట్లో వాళ్లు జాబ్ చేయడమే మంచిదని సలహా ఇచ్చారు. నేనూ అలానే అనుకున్నా. తర్వాత కథ, పాత్ర నచ్చడంతో సీరియల్లో నటించడానికి ఒప్పుకొన్నా. మంచి జాబ్ వదులుకుని రిస్క్ చేస్తున్నానేమో అని అమ్మానాన్న భయపడ్డారు. ప్రేక్షకుల నుంచి ఆ సీరియల్‌కి వచ్చిన ఆదరణ చూసి కాస్త కుదుటపడ్డారు. మొదటి ప్రాజెక్ట్ పూర్తి అవుతుండగానే ‘త్రివేణి సంగమ’ అనే సీరియల్లో అవకాశం వచ్చింది. ఆ సమయంలోనే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఫోన్ రావడంతో హైదరాబాద్‌కు వచ్చాను. మొదట తెలుగు రాదని భయపడ్డాను. అన్నపూర్ణ ప్రొడక్షన్స్‌లో అవకాశం రావడమే గొప్ప విషయమని అందరూ చెప్పడంతో, సంతోషంగా ఒప్పుకొన్నా. అలా, ‘స్టార్ మా’లో ప్రసారమైన ‘కథలో రాజకుమారి’లో అవనిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాను.
చాలా ప్రత్యేకం
తెలుగు ప్రేక్షకులు చాలా ప్రత్యేకం. అందరినీ కలుపుకొంటారు. అందరినీ ఆదరిస్తారు. ప్రాంతీయతత్వం లేకుండా ప్రతిభను గుర్తిస్తారు. మొదట్లో నాకస్సలు తెలుగు వచ్చేది కాదు. తర్వాత నేర్చుకున్నా. ఇప్పుడు బాగానే మాట్లాడగలను. ‘కథలో రాజకుమారి’ తర్వాత జీ తెలుగు ‘త్రినయని’లో అవకాశం వచ్చింది. చానల్ మారినా, ఒకటే ప్రొడక్షన్ కావడంతో పెద్ద ఇబ్బందులేం ఎదురుకాలేదు. ‘త్రినయని’ ఒక ప్రత్యేకమైన పాత్ర. అందరినీ కాపాడే బాధ్యతగల పాత్ర. ఈ సీరియల్ కోసం చాలా కష్టపడాల్సి వస్తున్నది. యాక్షన్ సీన్స్‌కూడా ఉన్నాయి. ప్రేక్షకుల ఆదరణ చూసిన తర్వాత
ఆ కష్టమంతా మరచిపోయా.
సినిమాలు..
ఇప్పటివరకు కన్నడలో రెండు, తెలుగులో రెండు సీరియల్స్ చేశాను. ‘త్రినయని’ని సన్ టీవీ వాళ్ళు ‘తమిళ్ సెల్వి’ పేరుతో డబ్ చేస్తున్నారు. సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. అయితే పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టరో, చిన్న సినిమాల్లో హీరోయిన్ పాత్రో వస్తున్నాయి. నాకెప్పుడూ నలుగురిలో ప్రత్యేకంగా ఉండటం ఇష్టం. అందుకే, నలుగురిలో ఒకరిగా కనిపించే పాత్రలు ఒప్పుకోవడం లేదు. కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా.
కుటుంబమే బలం
ప్రతి విషయంలోనూ నా కుటుంబం ఎప్పుడూ నాకు అండగా ఉంటుంది. మేం ముగ్గురం. అక్క అమెరికాలో ఉంటుంది. తమ్ముడు ఇంజినీరింగ్ చేస్తున్నాడు. ఈ ఫీల్డ్‌లోకి వస్తున్నప్పుడు అక్క నన్ను చాలా సపోర్ట్ చేసింది. అమ్మానాన్నలు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే, నచ్చిన పనిచేస్తూ ఆనందంగా జీవిస్తున్నా. చిన్నప్పటి నుంచీ పాటలు పాడటం అంటే ఇష్టం. నా గొంతు బాగుంటుందని చాలామంది ప్రశంసించారు. అప్పుడప్పుడు ప్రత్యేక కార్యక్రమాలు, వేడుకల్లో పాడుతుంటా. నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకోవాలని ఉంటుంది కానీ, బిజీ షెడ్యూల్ వల్ల వీలు కావడం లేదు.
పెండ్లి తర్వాత కూడా..
ఈ మధ్యే నాకు నిశ్చితార్థం అయ్యింది. ఆయన పేరు చేతన్ శెట్టి. సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఈ సంవత్సరం చివర్లో పెండ్లి ఉంటుంది. ఆ తర్వాత, నేను నటించనని చాలామంది అనుకుంటున్నారు. పెండ్లి చేసుకుంటే కెరీర్‌ని వదులుకోవాలని లేదు కదా. చేతన్ ఈ విషయంలో నాకెలాంటి నిబంధనలూ పెట్టలేదు. ఏదైనా నా ఇష్టమేనన్నారు. అందుకే, మంచి పాత్రలు వచ్చినంత కాలం నటించాలని నిర్ణయించుకున్నా. ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి.. అని నేనెప్పుడూ ప్లాన్ చేసుకోను. ఎందుకంటే, కాలానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి కానీ.. కాలాన్నీ, పరిస్థితులనూ మనం మార్చలేం. గత సంవత్సరం అలా గడుస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ, అందరూ ఆమోదించాల్సి వచ్చింది. బాధైనా, సంతోషమైనా.. జీవితం ఏదిస్తే దాన్ని స్వీకరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను.
తాజావార్తలు
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
- సమంత స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో వైరల్
- అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. తాజా సినిమా కోసం కసిగా పని చేస్తున్న త్రివిక్రమ్