e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home జిందగీ సూపర్‌ మార్కెట్స్‌! ‘స్వయం సహాయక’ విజయం

సూపర్‌ మార్కెట్స్‌! ‘స్వయం సహాయక’ విజయం

సూపర్‌ మార్కెట్స్‌! ‘స్వయం సహాయక’ విజయం

అంతా పేదలే. రెక్కాడితే కాని డొక్కాడని జీవితాలే. పరిస్థితులను లాక్‌ డౌన్‌ మరింత కుదేలు చేసింది. అయినా, వెనుకడుగు వేయలేదు. తమకు తెలిసిన పనిలో నైపుణ్యం సాధిస్తే, అదే ఉపాధి చూపుతుందని నమ్మారు. అనుకున్నది సాధించారు. సర్కారు అండతో కిరాణా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.. స్వయం సహాయక బృందాల మహిళలు.

ఆమెలో ఉత్సాహం ఉంది, ప్రోత్సాహం కావాలి. నైపుణ్యం ఉంది, పదునుపెట్టాలి. ఆమెకో ఆలోచన ఉంది, దిశానిర్దేశనం అవసరం. ఆమె దూసుకుపోగలదు, ధైర్యం ఇవ్వాలి. అదే జరుగుతున్నదిప్పుడు. అదే జరుగుతున్నదిక్కడ. రాష్ర్ట గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పేద మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నాయి. ఆ ప్రయత్నంలో తొలి అడుగు.. తెలంగాణ ఎస్‌జీహెచ్‌ స్టోర్స్‌. ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్ట్‌గా జనగామ, ములుగు, నల్గొండ జిల్లాల్లో 164 దుకాణాలు స్థాపించారు. అన్నీ విజయవంతంగా నడుస్తున్నాయి. నిత్యావసర వస్తువుల తయారీలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నేతృత్వంలో ‘శిక్షణ’ పొందిన స్వయం సహాయక సంఘాల మహిళలకు.. స్త్రీనిధి, సెర్ప్‌ద్వారా ‘రుణాలు’ ఇస్తారు. దీనివల్ల నైపుణ్యం, పెట్టుబడి రెండూ సమకూరుతాయి. తెలంగాణలోని ప్రతి ప్రాంతానికీ ఒక ప్రత్యేకత ఉంది. ఏదో ఓ ఉత్పత్తికో, పంటకో చిరునామాగా నిలుస్తాయి. అక్కడ లభించే నాణ్యమైన సరుకును స్వయం సహాయక బృందాల మహిళలు సేకరిస్తారు. ఆకర్షణీయంగా ప్యాక్‌ చేసి, ఎస్‌హెచ్‌జీ స్టోర్స్‌కు తరలిస్తారు. బ్రాండింగ్‌, మార్కెటింగ్‌, క్వాలిటీ చెక్‌.. తదితర బాధ్యతలన్నీ తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన బైరిసన్స్‌ ఆగ్రో ఇండియా సంస్థ పర్యవేక్షిస్తుంది.

- Advertisement -

నాణ్యత, చవక!
స్వయం సహాయక బృందాల దుకాణంలో ఉప్పునుంచి పప్పు వరకూ దొరకని వస్తువంటూ ఉండదు. నిజామాబాద్‌ పసుపు, తాండూరు కందిపప్పు, భద్రాద్రి అడవి తేనె, చింతపండు.. ఇలా తెలంగాణ గడ్డమీద పండే అత్యుత్తమ ఉత్పత్తులన్నీ ఇక్కడ లభిస్తాయి. నిఖార్సయిన నాణ్యత. సరసమైన ధర. మార్కెట్‌తో పోలిస్తే పదినుంచి ఇరవై శాతం తక్కువకే ఇస్తున్నారు. కొనుగోలుదారులకు నాలుగు రూపాయలు ఆదా అవుతుంది. నలుగురు మహిళలకు ఉపాధినిచ్చామన్న సంతృప్తి ఉంటుంది. వాళ్లేం కార్పొరేట్‌ దుకాణదారుల్లా కోట్ల రూపాయల టర్నోవర్‌ కోసమో, మార్కెట్‌మీద గుత్తాధిపత్యం కోసమో వ్యాపారం చేయడం లేదు. మనుగడ కోసమే ఈ పోరాటమంతా. ఎంత మంచి ఉత్పత్తికైనా ప్రచారం అవసరం. బ్రాండింగ్‌ ముఖ్యం. సరుకుల నాణ్యత గురించి, ఉత్పత్తుల నవ్యత గురించి జనానికి తెలియజెప్పడానికి ప్రతి గ్రామానికి ‘ఎస్‌హెచ్‌జీ మిత్ర’ అనే వ్యవస్థ ఉంటుంది. ఇక, మిగిలింది టెక్నాలజీ. స్వయం సహాయక బృందాల దుకాణాలు టెక్నాలజీ విషయంలో ఏ హైపర్‌ మార్కెట్లకూ తక్కువ కాదు. కస్టమర్ల వివరాలను ‘బి మార్ట్‌’ యాప్‌తో అనుసంధానిస్తారు. తమకు నచ్చిన సరుకులను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే, అంతే వేగంగా డోర్‌ డెలివరీ చేస్తారు.

ఎన్నో విజయాలు
స్వయం సహాయక బృందాల మహిళలు ‘రిటైల్‌’ దిగ్గజాలకు దీటుగా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఎంతోకొంత సంపదను సృష్టిస్తున్నారు. ‘మా దగ్గర సిబ్బంది వేతనాలు పోనూ నెలకు రూ. 30 వేలకుపైగా ఆదాయం వస్తున్నది’ అని సగర్వంగా ప్రకటిస్తారు నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన ‘దుర్గా సమభావన సంఘం’ సభ్యురాలు నాగలక్ష్మి. రైతులనుంచి నేరుగా వ్యవసాయ ఉత్పత్తులను కొనడం వల్ల నాణ్యమైన సరుకు తక్కువ ధరకే లభిస్తున్నది. ప్యాకింగ్‌ యూనిట్ల పుణ్యాన కరోనా లాక్‌డౌన్‌లో ఓ పదిమందికి ఉపాధి దొరికింది. దళారి వ్యవస్థ లేకపోవడంతో రైతులకు ఎంతో మేలు జరిగింది. మహిళా సంఘాలూ ఆర్థికంగా బలపడుతున్నాయి. “మేం గతంలో కూరగాయలు అమ్మేవాళ్లం. పెద్దగా రాబడి వచ్చేది కాదు. నెల క్రితమే తెలంగాణ ఎస్‌జీహెచ్‌ స్టోర్‌ పెట్టాం. అన్ని రకాల వస్తువులతోపాటు తాజా కూరగాయలూ మా దగ్గర అందుబాటులో ఉంటాయి. నాణ్యమైన వంటనూనెలు, సబ్బులు బయట కంటే తక్కువ ధరకే ఇస్తున్నాం” అంటారు ఈదులూరులోని ‘జయలక్ష్మి ఎస్‌జీహెచ్‌’ సభ్యురాలు నర్మద. మూడు జిల్లాల్లో ప్రారంభమైన ఈ మార్పు నాలుగు దిక్కులకూ విస్తరించే రోజు ఎంతో దూరం లేదు. చిల్లర దుకాణాలతో శ్రీమహాలక్ష్మి అవుతున్నది తెలంగాణ మహిళ.

…శ్యాంమోహన్‌, కె.రమేష్‌బాబు

మా మద్దతు ఉంటుంది
తమ గ్రామంలో స్టోర్‌ ప్రారంభించాలనుకొనే మహిళా సంఘం కనీసం రూ. లక్ష పెట్టుబడి పెట్టాలి. దీనికి సెర్ప్‌ద్వారా రుణాలు ఇప్పిస్తాం. మా సంస్థ తరఫున రూ.50వేల సరుకులు అందిస్తాం. మిగతా రూ. 50 వేలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. టర్నోవర్‌నుబట్టి అదనపు సరుకులు సమకూరుస్తాం. మహిళలపై రవాణా భారం కూడా ఉండదు. నేరుగా స్టోర్‌కే సరుకులు చేరవేస్తాం. స్వయం సహాయక బృందాలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్‌, బ్రాండింగ్‌ బాధ్యత మాదే.
డా. ప్రసాద్‌ పాశం, చైర్మన్‌ బైరిసన్స్‌ ఆగ్రో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సూపర్‌ మార్కెట్స్‌! ‘స్వయం సహాయక’ విజయం
సూపర్‌ మార్కెట్స్‌! ‘స్వయం సహాయక’ విజయం
సూపర్‌ మార్కెట్స్‌! ‘స్వయం సహాయక’ విజయం

ట్రెండింగ్‌

Advertisement