e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, April 13, 2021
Advertisement
Home జిందగీ నా పేరే..సారంగ దరియా!

నా పేరే..సారంగ దరియా!

నా పేరే..సారంగ దరియా!


ఏ నోట విన్నా ‘దాని కుడిభుజం మీద కడువా’అనే పాటే. ఏ చోట చూసినా ‘దాని ఎజెంటురైకలు మెరియా’ అనే ఊపే. పంటపొలాల్లోపాడుకునే ఒక సాదాసీదా పల్లెపదంఎందుకు ట్రెండింగ్‌లో ఉంది? ‘రమ్మంటె రాదుర సెలియా’ అంటూవైరల్‌ ఎందుకయ్యింది? మధ్యలోఈ శిరీష ఎవరు? శిరీషకు ఈపాటను ఇచ్చిన కోమల ఎవరు?సినీ ప్రపంచం గుండెలకుహత్తుకున్న అసలు సిసలైన‘సారంగ దరియా’ పాట పుట్టింది ఎక్కడో సమాధానం దొరక బడదాం!
శ్రమైక జీవుల జానపదం ఆధునిక హంగులతో సినీ తెరపై సందడి చేస్తున్నది. ‘సారంగ దరియా’ పాట ఇప్పుడు ప్రపంచమంతటా వినిపిస్తున్నది. విశేషాదరణ పొందిన ఈ పాటను పదేండ్ల క్రితమే ‘రేలారే రేలా’ వేదికగా మంచిర్యాల మట్టి పరిమళం గొల్లపల్లి శిరీష పాడింది. ఈ పాటే ఆమెను నిలబెట్టింది. ఇంతకూ శిరీషకు ఆ పాటను ఎవరిచ్చిండ్రో, ఆ పాట తర్వాత ఆమె జీవితం ఎట్లా మలుపు తిరిగిందో తెలుసుకుందాం..
ఆ పాట ఎక్కడిదంటే?
మస్తు సంబరమైతాంది. ఎక్కడ చూసినా ‘సారంగ దరియా’ పాటనే వినిపిస్తాంది. నాకు మల్లా పాత రోజులు గుర్తుకొస్తాన్నయ్‌. ‘రేలారే రేలా’లో నేనొక పార్టిసిపెంట్‌ని. నాతోపాటు చానామంది ఉండేది. మంచి మంచి పాటలు పాడి, మంచిపేరు సంపాదించుకున్న రోజులవి. అమ్మ దగ్గర నేర్చుకున్న పాటలు పాడితే అంతా కొత్తగా చూసిండ్రు. అంత అరుదైన పాటలు మా అమ్మ దగ్గర ఉండేటియి. ఫైనల్స్‌ దగ్గరవడుతున్నయనంగా నా దగ్గర పాటలు కూడా ఒడ్శినయి. వరంగల్‌కు చెందిన తోటి కళాకారిణి కోమలను ‘ఏదన్నా ఓ మంచి పాట ఉంటె ఇయ్యవా’ అని అడిగిన. ‘నా దగ్గరో మంచి పాటుంది. ఇస్త తియ్‌’ అన్నది కోమల. ప్రాక్టీస్‌ నాటికి ‘దాని కుడిభుజం మీద కడువా’ పాట ఇచ్చింది.
నాకు బ్రాండ్‌ అయింది
ఉదయభానక్క పిలవంగనే వెళ్లి ‘దాని కుడిభుజం మీద కడువా, దాని గుత్తెపు రైకలు మెరియా, దాని పేరే సారంగదరియా’ అని పాడంగనే అందరూ మెచ్చుకుండ్రు. జడ్జీలు కూడా ‘మస్తు పాడినవ్‌ శిరీషా’ అన్నరు. అట్లా ఆ పాటపై నా ముద్ర పడింది. అప్పటి వరకు ‘శిరీష పాడ్తది’ అనే పేరుండేది. ఈ పాట ‘శిరీష బాగా పాడ్తది’ అనే గుర్తింపు తెచ్చిపెట్టింది. నేను ఎక్కడ ప్రోగ్రామ్‌ చేసినా ఈ పాటనే పాడమనేటోళ్లు.
ఎక్కడ విన్నా నా పాటే

నా పేరే..సారంగ దరియా!

చాలా యేండ్లకు, ఒక ఊరికాడ ఒక పిల్ల ఫోన్ల ‘దాని ఎడమ భుజం మీద కడువా, దాని ఎజెంటు రైకలు మెరియా’ పాట వినిపిస్తున్నది. అది నా గొంతే. ఎట్లా ఫేమస్‌ అయ్యిందో? ఎవ్వరుజేసిండ్రో తెల్వదిగానీ తర్వాత ఆ పాట రాష్ట్రమంతటా ఊపింది. టిక్‌టాక్‌లో పది వీడియోలు చూస్తే దాంట్లె ఆరు వీడియోలు ఈ పాటనే వినిపించేది. ఇప్పుడు ‘లవ్‌ స్టోరీ’ సినిమాల కూడా ఈ పాట పెట్టిండ్రని తెలిసి సంతోషపడ్డా.
రాజయ్య తాత ప్రోత్సాహం
జానపదాలంటే నాకు పిచ్చి. ఏడేండ్ల వయసు నుంచే పాడుతుండేదాన్ని. స్కూల్లో ఏ కార్యక్రమంలోనైనా నా పాట వినిపించాల్సిందే. అందరమ్మాయిలూ ఖోఖో, కబడ్డీ వంటి ఆటల్లో పేరు రాపిస్తుంటే, నేను మాత్రం ‘పాట’ల్లో రాయించుకునేదాన్ని. టీచర్లు కూడా మస్తు ఎంకరేజ్‌ చేసిండ్రు. మాది పేద కుటుంబం. అమ్మ రాజవ్వ, నాయిన యేసయ్య. నాయిన ఎవుసాయం జేస్తే అమ్మ కూలీ పనికి వెళ్తది. అప్పట్ల టీవీకూడా ఉండకపోయేది. వేరేటోళ్ల ఇంట్లనే చూస్తుంటిమి. అట్లా మాటీవీల ‘రేలారే రేలా’ చూసిన. ‘నాగ్గూడా అవకాశం వస్తే బాగుండు’ అన్న కోరిక కలిగింది. నాకు పాటలంటే ఇష్టమని తెలుసుకొని నన్ను ప్రోత్సహించి తీర్చిదిద్దింది మా తాత రాజయ్యే. ఆయన పాటలు పాడ్తడు, రాస్తడు కూడా. ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా నన్ను తీస్కొని పోతుండె తాత.
అమ్మ పాడిన పాటలే
నాతోడ ఇద్దరక్కలు, ఒక తమ్ముడు. వారిలో పాటలెవరికీ అబ్బలేదు. పైగా నేను పాడుతుంటే చిత్రంగా చూసేటోళ్లు. బైటోళ్లు కూడా ‘తిన్నదరగక ఒక్కటే పాటలు పాడుతది పొల్లా’ అందురు. ఎవరేమి అనుకున్నా అమ్మానాయిన మాత్రం నా పాటను గుర్తించిండ్రు. పాడాలన్న నా తపననూ అర్థం చేసుకున్నరు. వాళ్ల ప్రోత్సాహమే లేకపోతే నేను ఇక్కడిదాంకా వచ్చేదాన్ని కాదు. చిన్న కుటుంబం. అందునా పేద కుటుంబం కాబట్టి, నేనుకూడా అమ్మతోపాటు కూలీ పనికి వెళ్లేదాన్ని. నాట్లేసేటప్పుడు అమ్మలక్కలు పాడుకున్న మంచి జానపదాలను, జాజిరి పాటలను రాసుకునేదాన్ని. బీడీలుకూడా చుట్టబోయేదాన్ని. అక్కడాతీరొక్క పాటలు నేర్చుకున్నా. అప్పుడే రాజయ్య తాతతో కలిసి తెలంగాణ ఉద్యమంలో వెళ్తుండెదాన్ని. అట్లా చానా చిన్న వయసులోనే స్టేజీపైకి ఎక్కి పాడటం అలవాటైంది.
రేలారేకు అవకాశం
ఒకసారి రాజయ్య తాత వాళ్ల చుట్టాలింటికి తీసుకెళ్లిండు. అట్నుంచి అటే ఒక లోకల్‌ చానెల్‌ ఆఫీస్‌కు పట్కపోయిండు. అక్కడ పాటల పోటీలు జరుగుతున్నయి. టీవీ కోసం 70 మందిని పిలిపించిండ్రు. వారిలోకెల్లి 15 మంది మంచి పర్ఫామెన్స్‌ కింద సెలక్ట్‌ అయ్యిండ్రు. రవన్న ఇదంతా చూసుకున్నడు. ఆ పదిహేను మందిలకెల్లి నన్నొక్క దాన్నే హైదరాబాద్‌ తీస్కొచ్చిండు. హైదరాబాద్‌ వచ్చిందాక కూడా నాకు అది రేలారే కార్యక్రమం అని తెల్వది. మొత్తానికైతే నేను అనుకున్న చోటుకే వచ్చిన. యాంకర్‌ ఉదయభానక్క, జడ్జీలు గోరటి వెంకన్న, సుద్దాల అశోక్‌తేజ సార్‌ మస్తు ఎంకరేజ్‌ చేసిండ్రు.
పాట కోసం మస్తు తిరిగిన
‘రేలారే రేలా’ తర్వాత ఎక్కడా పాడలేదు. ఇంట్లో ప్రాక్టీస్‌ చేసుకుంటా ఉండేదాన్ని. చేతిలో ఫోన్‌ ఉండేది కాదు. పాటల సేకరణకు వెళ్లేందుకు కిరాయికి పైసలు కూడా ఉండేటివి కాదు. పెద్దపేట్‌, చింతపల్లి, ద్వారక, దండెపల్లి ఇట్లా ఊర్లన్నీ తిరిగి అవ్వలు, తాతలతో మాట్లాడి వాళ్ల దగ్గర పాటలు సేకరించేదాన్ని. తర్వాత పెండ్లి అయ్యింది. నా భర్త కూడా పాటగాడే. ఆయనపేరు శ్రావణ్‌. తెలంగాణ ఉద్యమంలో కాలికి గజ్జె కట్టుకొని ఊరూరా తిరిగిండు ఆయ్నె కూడా. ఇప్పుడు ఇద్దరం కలిసి తెలంగాణ సాంస్కృతిక సారథిలో చేస్తున్నాం. మంచిర్యాల డీపీఆర్‌వో ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఊరూరా ప్రచారం కల్పిస్తూ, మా పాటద్వారా ప్రజలను చైతన్యం చేస్తున్నం.
‘సారంగ దరియా’ సినిమాదాకా రావడం సంతోషం. అసొంటి పాటలు ఇంకేవైనా సినిమాలకు పెట్టుకుంటే, నా దగ్గర మంచి జానపదాలు ఉన్నయి. అన్నీ అచ్చమైన పల్లె పదాలు. వాటిని ప్రజలకు పరిచయం చేయాలన్నదే నా లక్ష్యం. పాడేందుకు అవకాశం ఇస్తే అంతకన్నా సంతోషం ఏముంటది? మా ఇంట్ల ఇద్దరం పాటగాళ్లమే ఉన్నం. మాకంటూ ఓ ప్లాట్‌ఫారమ్‌ ఏర్పాటు చేసుకొని కొత్త కొత్త పాటలను పరిచయం చేయాలని అనుకుంటున్నం. ఇప్పటిదాక నేను పాడిన పాటలను లక్ష్మణ్‌ తన యూట్యూబ్‌ చానెల్‌ ‘ఫోక్‌ బ్యాండ్‌’లో పెట్టిండు.
-దాయి శ్రీశైలం

Advertisement
నా పేరే..సారంగ దరియా!

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement