e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home జిందగీ సప్త స్వరాలు ఐదు గళాలు

సప్త స్వరాలు ఐదు గళాలు

సప్త స్వరాలు ఐదు గళాలు

స్వరాలు ఏడైనా.. రాగాలెన్నో! వాటిని ఆలపించే గళాలు మరెన్నో!! కానీ, వాటిలో శ్రోతలను ఊర్రూతలూగించేవి కొన్నే!! తమ గళవిన్యాసాలతో ప్రేక్షకులను సమ్మోహితులను చేశారు ఈ ఐదుగురు. జీ తెలుగులో ప్రసారమైన ‘సరిగమప’ రియాలిటీ షోలో అద్భుతమైన ప్రదర్శనతో అందరి మన్ననలు అందుకున్న ఈ యువ సంచలనాలు ‘జిందగీ’తో పంచుకున్న కబుర్లువి..
12 ఏండ్లకే అవకాశం భరత్‌ రాజ్‌ రన్నరప్‌
మాది హైదరాబాద్‌. అమ్మానాన్నకి సంగీతం అంటే ఇష్టం. అందుకే అన్నయ్యకు, నాకు ఇద్దరికీ సంగీతం నేర్పించారు. చిన్నప్పటినుంచే స్టేజ్‌ షోస్‌లో పాడేవాణ్ని. మొదటిసారి జెమిని చానల్‌లో ‘బోల్‌ బేబీ బోల్‌’ రియాలిటీ షోలో పాల్గొన్నా. ఒకరోజు ఆ షోకి సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ గెస్ట్‌గా వచ్చారు. పోటీదారుల నుంచి కొందరు పిల్లల్ని ఎంపిక చేసుకున్నారు. అలా 12 ఏండ్లకే ‘మనం’ సినిమాలో ‘కని పెంచినా మా అమ్మకే..’ పాట పాడే అవకాశం వచ్చింది.

ఆ తర్వాత ‘సరిగమప’ షోకి రాకముందే ‘బాయ్‌’ మూవీలో రెండు పాటలు పాడా. కొవిడ్‌వల్ల జీ తెలుగు వాళ్లు ఈ షో కోసం ఆన్‌లైన్‌లో ఆడిషన్స్‌ చేశారు. నేను సెలెక్ట్‌ అవుతానని అస్సలు అనుకోలేదు. కానీ, మెగా ఆడిషన్లో కూడా సెలెక్టయి ఫైనల్‌ ఫైవ్‌లోకి వెళ్లడమే కాకుండా రన్నరప్‌గా నిలిచాను. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్‌, సెకండ్‌ అనికాదు, ఈ షో ద్వారా సోషల్‌మీడియాలో, బయట అభిమానులు పెరిగారు. ఈ జర్నీలో చాలా మెమొరీస్‌ ఉన్నాయి.

ఒకరోజు ‘శశి’ సినిమా టీం ముందు ఆ సినిమాలో సిధ్‌ శ్రీరామ్‌ పాడిన ‘ఒకే ఒక లోకం నువ్వు..’ పాట పాడా. అప్పుడు హీరో ఆదిగారు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అరుణ్‌గారు స్టేజ్‌పైకి వచ్చి హగ్‌ చేసుకున్నారు. నిజంగా అది మరిచిపోలేని సంఘటన. ప్రస్తుతం డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్నా. సివిల్స్‌ నా లక్ష్యం. సంగీతం జర్నీ కొనసాగిస్తూనే సివిల్స్‌కి ప్రిపేర్‌ అవుతా. రెండిటినీ బ్యాలెన్స్‌ చేస్తూ అందరి అభిమానాన్ని సంపాదిస్తూ సమాజానికి సేవ చేయాలనే ఆశయంతో ఉన్నా.
డాక్టర్‌ విన్నర్‌ యశస్వి కొండెపూడి
మాది కాకినాడ. నాన్న శేఖర్‌, అమ్మ శ్రీదేవి. ఇద్దరూ ఆర్కెస్ట్రా గాయకులు. కొన్నాళ్లు వేరే ఆర్కెస్ట్రాల్లో పాడిన తర్వాత సొంతంగా ‘సరిగమప’ అనే ఆర్కెస్ట్రా పెట్టారు. చిన్నప్పటినుంచి వాళ్లతోపాటు ప్రోగ్రామ్స్‌కి వెళ్లడం అలవాటైంది. పాటలు పాడటం కన్నా నాకు కీ బోర్డు ప్లే చేయడమంటే ఎక్కువ ఆసక్తి. నెల రోజులపాటు కీబోర్డు నేర్చుకున్నా. ఓసారి ఓ కార్యక్రమానికి మా ఆర్కెస్ట్రా కీబోర్డ్‌ ప్లేయర్‌ రాలేదు. ఆ రోజు అనుకోకుండా నేను కీబోర్డ్‌ వాయించాను. అప్పటి నుంచి మా ఆర్కెస్ట్రాలో నేనే కీబోర్డ్‌ ప్లేయర్‌ని. మా ఆర్కెస్ట్రా తరఫున నిర్వహించిన ఒక ఈవెంట్‌కు సుప్రసిద్ధ గాయకులు ఎస్పీ బాలుగారు వచ్చారు. ఆయన పాడుతుంటే నేను కీబోర్డ్‌ వాయించాను.

అప్పుడు నా వయసు 12 ఏండ్లు. నన్ను ఆయన వేదికపైకి పిలిచి ప్రత్యేకంగా అభినందించడం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటన. సంగీతం నేర్చుకోకపోయినా పాటలు పాడేవాణ్ని. విన్నది విన్నట్టుగా పాడేందుకు ప్రయత్నించేవాణ్ని. అందంగానూ పాడేవాణ్ని. అలా సాధన చేస్తూ చేస్తూ ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో పాల్గొన్నా. రెండో రౌండ్‌ రోజే నాకు ఎంబీబీఎస్‌ పరీక్షలు ఉండటంతో పోటీకి వెళ్లలేకపోయాను. తర్వాత జీ తెలుగు ‘సరిగమప’ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్‌ చేశా. ఈ కార్యక్రమంతో నామీద నాకు నమ్మకం పెరిగింది.

ఈ పోటీలో టైటిల్‌ గెలుస్తానని అస్సలు అనుకోలేదు. అందరూ బాగా అభినందిస్తున్నారు. అమెరికాలో నా పేరున ర్యాలీకూడా నిర్వహించారు. అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకున్నాను. ఇప్పటికి పది చిత్రాల్లో పాటలు పాడాను. మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. మరోవైపు నా స్నేహితులతో కలిసి ‘వై.కే.బ్యాండ్‌’ పేరుతో ఒక బ్యాండ్‌ పెట్టాం. ఇందులో నేను, మా చెల్లి సంకీర్తన పాటలు పాడతాం. ఇప్పటివరకు చాలా ప్రోగ్రామ్స్‌ ఇచ్చాం. డాక్టర్‌గా వైద్యసేవలు అందిస్తూనే సింగర్‌గా కొనసాగాలని నిర్ణయించుకున్నా. ఫైనల్‌గా నాకింతటి గుర్తింపు ఇచ్చిన ‘సరిగమప’ టీమ్‌కి కృతజ్ఞతలు.
అమ్మ కోసమే సంగీతం: పవన్‌ కళ్యాణ్‌
సంగీతం అంటే మా అమ్మకు చాలా ఇష్టం. నిజానికి తను సింగర్‌ అవ్వాలని కలలు కనేదట. కానీ, అది కుదరకపోవడంతో నన్ను బాగా ఎంకరేజ్‌ చేసేది. మొదట్లో నాకు మ్యూజిక్‌పై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఇంట్లో వాళ్ల బలవంతం మీదే నేర్చుకోవడం మొదలుపెట్టాను. భాస్కర్‌గారు, ఉమాదేవి గారి దగ్గర క్లాసికల్‌ మ్యూజిక్‌ నేర్చుకున్నాను. తర్వాత రామాచారి గారి దగ్గర లైట్‌ మ్యూజిక్‌ నేర్చుకున్నాను. అలా మెల్లమెల్లగా సంగీతంపై ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ‘సరిగమప’ నా మొదటి రియాలిటీ షో. ఇందులో టాప్‌ ఐదుగురిలో ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. జడ్జీల నుంచి మెంటర్ల వరకు నన్ను అందరూ ఎంకరేజ్‌ చేసేవారు. ఇప్పుడు మా ఫ్యామిలీ ముఖ్యంగా అమ్మ చాలా సంతోషంగా ఉంది.

సప్త స్వరాలు ఐదు గళాలు


సెల్ఫీలు అడుగుతున్నారు వెంకట చైతన్య
చిన్నప్పటి నుంచీ పాడటం ఇష్టమేగానీ ఎప్పుడూ ఎక్కడా కాంపిటీషన్స్‌లో పాల్గొనలేదు. మాది విజయనగరం జిల్లా బొబ్బిలి. తాతయ్య సంగీతం మాస్టారు. నాన్నకూడా డ్రామా ఆర్టిస్ట్‌. ఆలిండియా రేడియోలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేవారు. నాకు చిన్నప్పటినుంచి డ్యాన్స్‌ అంటే ఇష్టం. డ్యాన్స్‌ నేర్పించట్లేదని సంగీతం నేర్చుకోలేదు. సరదాకి పాడేవాణ్ని. మ్యూజిక్‌ యాప్స్‌తో రకరకాల పాటలు పాడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసేవాణ్ని. ఒకసారి ‘కేరాఫ్‌ కంచరపాలెం’ సినిమాలోని ‘ఆశా పాశం..’ పాట పాడి వీడియో పెట్టా. అది చూసి సినిమాలో ఆ పాట పాడిన అనురాగ్‌ కులకర్ణి ఫోన్‌ చేసి బాగా పాడావని మెచ్చుకున్నారు. సంగీత దర్శకుడు స్వీకర్‌ అగస్టీ మెసేజ్‌ చేశారు.

నాలో సింగింగ్‌ టాలెంట్‌ ఉందని అప్పుడు అనిపించింది. ‘సరిగమప’ గురించి విన్నప్పుడు ఒకసారి నేనుకూడా ట్రై చేద్దామనిపించింది. ఇప్పుడు మా తాతయ్యకు 95 ఏండ్లు. నాన్న పద్యాలు పాడుతుండగా తాతయ్య ఎప్పుడూ చూడలేదు. ‘సరిగమప’ షోను టీవీలో చూసి ఎంతో మెచ్చుకున్నారు. ఫైనల్స్‌కు అమ్మానాన్న వచ్చారు. వారి ముందు స్టేజ్‌మీద మొదటిసారి పాట పాడా. జీవితంలో మర్చిపోలేని సంఘటన అది. ఈ షో ద్వారా చాలా ఫేమ్‌ వచ్చింది. ఎక్కడికి వెళ్లినా సెల్ఫీలు అడుగుతున్నారు.

ఫైనల్‌ గెలువలేకపోయానన్న బాధ అస్సలు లేదు. మా ఫైనలిస్ట్‌ల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో యూనిక్‌ ైస్టెల్‌. ఎవరి ప్రత్యేకతలు వారివి. ఉద్యోగరీత్యా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నా. ఇప్పుడిప్పుడే పాటలు పాడే అవకాశాలు వస్తున్నాయి. సినిమాలో ఒక పాట పాడా. ఉద్యోగం చేస్తూనే సింగింగ్‌ కంటిన్యూ చేద్దామనుకుంటున్నా. జాబ్‌ చేయలేనన్ని అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం సింగర్‌గానే కొనసాగుతా!
నిరంతర సాధనతోనేప్రజ్ఞా నయని
మా అమ్మకి సంగీతం అంటే చాలా ఇష్టం. అందుకే, నాకు మ్యూజిక్‌ నేర్పించింది. చిన్నప్పటి నుంచి స్కూళ్లో ఏ ప్రోగ్రామ్‌ జరిగినా పాడేదాన్ని. 2018లో ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో పాల్గొన్నా. నాకు చిన్నప్పటి నుంచీ అందరి ముందు గొప్పగా పాడి మంచి పేరు తెచ్చుకోవాలని ఉండేది. నాన్నేమో బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని కోరుకునేవాళ్లు. సంగీత సాధన నిరంతరం కొనసాగించేదాన్ని. చదువులోనూ చురుగ్గా ఉండేదాన్ని. ఫార్మసీ చదివా. కొవిడ్‌ వల్ల హాస్పిటల్లో వర్క్‌ చేయడం అంతమంచిది కాదనిపించి ఫ్రెండ్‌ సలహాతో ‘సరిగమప’ ఆడిషన్‌లో పాల్గొన్నా. ఈ షోద్వారా చాలా నేర్చుకున్నా.

అంతకుముందు ఎవరితోనైనా మాట్లాడాలంటే భయపడేదాన్ని. స్టేజ్‌ ఫియర్‌ ఉండేది. కానీ, ఇప్పుడు అందరితో మాట్లాడటం నేర్చుకున్నా. ఈ షోలో అందరూ నన్ను సింగర్‌ సునీతగారితో పోల్చేవాళ్లు. జూనియర్‌ సునీత అనేవాళ్లు. ఓసారి సునీతగారు గెస్ట్‌గా వచ్చారు. బాగా పాడావని హగ్‌ చేసుకున్నారు. ‘సరిగమప’ కన్నా ముందు ఒక యూట్యూబ్‌ చానల్‌ స్టార్ట్‌ చేశా. పాటలు పాడి ఆ వీడియోలు అప్‌లోడ్‌ చేసేదాన్ని. ఈ షోకు ముందు వందల్లో ఉండే సబ్‌స్ర్కైబర్స్‌ సంఖ్య తర్వాత బాగా పెరిగింది. ఫాలోవర్స్‌ కూడా పెరిగారు. పెండ్లి తర్వాత నా భర్త ఇచ్చిన ప్రోత్సాహంతోనే నాకిష్టమైన సింగింగ్‌లో రాణిస్తున్నా.

-ప్రవళిక వేముల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సప్త స్వరాలు ఐదు గళాలు

ట్రెండింగ్‌

Advertisement