బుధవారం 27 జనవరి 2021
Zindagi - Jan 14, 2021 , 01:13:57

రావమ్మా భాగ్యలక్ష్మీ..రావమ్మా!

రావమ్మా భాగ్యలక్ష్మీ..రావమ్మా!

సంక్రాంతి సంబురంలో హరిదాసులది ప్రత్యేక స్థానం. మంచుతెరలు తొలగకముందే శ్రావ్యమైన కీర్తనలతో ఊరందరినీ మేలుకొల్పే, వారందరి మేలు కోరే హరిదాసులంటే ఎరుగనివారుండరు. నెత్తిన అక్షయ పాత్ర, ఓ చేతిలో చిడతలు, మరోచేతిలో తంబుర, మెడలో పూలదండలు ధరించి ఇల్లిల్లూ తిరుగుతారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ మహిళ ‘హరిదాసి’గా పల్లెలన్నీ తిరుగుతున్నది.  సంక్రాంతి సందర్భంగా భాగ్యలక్ష్మి ‘జిందగీ’తో పంచుకున్న అనుభవాలు ఆమె మాటల్లోనే..

మాది యాదాద్రి భువనగిరి జిల్లాలోని రేపాక గ్రామం. మా పూర్వీకులంతా హరిదాసులే. ధనుర్మాసం మొదలు సంక్రాంతి వరకు మా నాన్న అయ్యోరు మురళి హరిదాసుగా రాజాపేట మండలంలోని 14 గ్రామాల్లో తిరిగేవారు. సంక్రాంతి అయిపోయాక దళితవాడల్లో పెండ్లిళ్లు, శుభకార్యాలు చేసేవారు. చిన్నప్పటి నుంచీ నాన్నను చూస్తూ పెరగడం వల్ల పౌరోహిత్యంపై నాకూ ఆసక్తి పెరిగింది. మా అమ్మానాన్నలకు నేనొక్కదాన్నే సంతానం. డిగ్రీ దాకా చదువుకున్నా. అనారోగ్యంతో నాన్న 2013లో మరణించారు. అదీ ఆయన దైవంగా భావించే వృత్తిని నిర్వర్తిస్తూ..  కనుమ రోజునే కన్నుమూశారు. నాన్న వారసత్వాన్ని కొనసాగించాలని నేను నిర్ణయించుకున్నా.

అందరూ ఆదరిస్తున్నారు..

హరిదాసుగా నాన్న రాజాపేట మండలంలో సుపరిచితులు. అందరూ అభిమానంగా చూసేవాళ్లు. నన్నూ అంతే ఆదరిస్తున్నారు. ఊరందరి మంచి కోసం హరిదాసుగా మారానని ఎంతగానో గౌరవిస్తారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసం మొదలుకాగానే, హరిదాసుగా నా ప్రయాణం ప్రారంభం అవుతుంది. నెల రోజులు తెల్లవారు జామున 3 గంటలకే అక్షయ పాత్రతో బయల్దేరుతాను. రోజుకో ఊరు చొప్పున తిరుగుతాను. కీర్తనలు పాడుతూ.. మనస్పూర్తిగా ఆశీర్వదిస్తాను. ధాన్యం, డబ్బులు కానుకలుగా సమర్పిస్తారు. సంక్రాంతి తర్వాత పౌరోహిత్యం కూడా చేస్తాను. పెండ్లిళ్లు, వినాయక పూజలు, సత్యనారాయణస్వామి వ్రతాలు.. ఇలా ఏ శుభకార్యమైనా నన్నే పిలుస్తారు. ముహూర్తాల కోసం పరిసర గ్రామాల ప్రజలూ సంప్రదిస్తుంటారు. నాన్న ఉన్నప్పుడే పెండ్లయ్యింది. నేను ఒక్కదాన్నే కావడంతో మా ఆయనను ఇల్లరికం తెచ్చుకున్నారు నాన్న. మావారూ పౌరోహిత్యం చేస్తారు. మాకు ఒక్కతే అమ్మాయి. డిగ్రీ చదువుతున్నది. ఈ వృత్తిలో నా వారసురాలు కూడా తనే. 

- ఠాకూర్‌ హిమ్మత్‌ సింగ్‌ 


logo