బుధవారం 27 జనవరి 2021
Zindagi - Jan 14, 2021 , 01:13:52

అంతరంగ వల్లిక!

అంతరంగ వల్లిక!

చేతిలో ముగ్గు గిన్నెతో క్షీరాబ్ధి కన్యక! కళ్లాపి చల్లి క్రిమికీటకాల్ని పారదోలుతున్న సమయానికి పార్వతీదేవి! చుక్కలకు  చక్కని ఆకృతి ఇస్తున్న వేళ సృష్టికర్తకు సరిజోడు సరస్వతీ దేవి.సంక్రాంతినాడు, ముంగిట ముగ్గేస్తున్న ప్రతి అమ్మా.. ముగురమ్మల మూలపుటమ్మే!

గంగిరెద్దులవాని జోలె నింపే ధాన్యలక్ష్మి.ఆడపడుచులకు సారెచీరలు పెట్టే సౌభాగ్యలక్ష్మి. అతిథి అభ్యాగతులకు కొసరి వడ్డించే అన్నలక్ష్మి.పారాణి పాదాల సౌందర్యలక్ష్మి. పంట పండకో, ధర గిట్టకో కుదేలైపోయిన పెనిమిటికి మనోబలాన్నిచ్చే ధైర్యలక్ష్మి. ఆమె కాలుమోపిన గడప లక్ష్మీ నివాసం. ఆమె కాపురానికొచ్చిన ఇల్లు ఆనంద నిలయం. రంగవల్లిక.. మగువ అంతరంగ వల్లిక!  ఆలోచనలు ఎక్కడెక్కడికో పరుగులు తీస్తున్నప్పుడు.. రథం ముగ్గు! జ్ఞాపకాల పరిమళం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు.. పూల ముగ్గు! ఆకాశంలో తేలిపోతున్న అనుభూతి కలిగినప్పుడు.. చుక్కల ముగ్గు!

స్త్రీలను అర్థం చేసుకోవడం మహా కష్టమని అంటారు కానీ, ఓ నిమిషం ముంగిట నిలబడి ముగ్గులు చూస్తే చాలు.  రంగవల్లిక నిలువెత్తు అద్దమై ఆమెను ఆవిష్కరిస్తుంది. మగువ భావాలూ, ఉద్వేగాలూ, ఆలోచనలూ, అంతరంగాలూ ఆ రంగుల్లో ప్రతిబింబాలై కనిపిస్తాయి. ఆమె ఏ రోజుకా రోజు కొత్త ముగ్గంత తాజాగా కనిపించడం వెనుకా ఓ రహస్యం ఉంది. చీపురు పట్టి.. వాకిలి ఊడ్చటం అన్నది పైపైకి ఓ మామూలు పనిలా అనిపించవచ్చు కానీ.. ఊడ్చగా ఊడ్చగా శుభ్రపడేది ముంగిలే కాదు, మహిళ మనసు కూడా. జీవితమంటేనే చికాకుల మయం. బంధువుల చాకిరి, అత్తమామల సేవ, పని మనుషులతో సమస్యలు, వీధిరాయుళ్ల వెకిలి చూపులు.. ఇరవై నాలుగు గంటల్లో సవాలక్ష చికాకులు. అన్నీ టోకుగా చెత్తతో పాటు బుట్టలోకి వెళ్లిపోతాయి. ఆ తర్వాత, కళ్లాపి! నాటకానికి వేదిక, సినిమాకు తెర, పుస్తకానికి అట్ట.. ముగ్గుకు కళ్లాపి! బిడ్డకు లాల పోసినంత ప్రేమగా, ఆవుపేడతో నలుగుపెట్టి నేలకు స్నానం చేయిస్తుందామె. ఆ పారవశ్యంలో నేలమ్మ, ముదురు గోధుమరంగు క్యాన్వాసులా మారిపోతుంది. వెనువెంటనే, కొంగూ కొప్పూ బిగించి ముగ్గు గిన్నెతో మహిళ రంగంలోకి దిగుతుంది. 

ఆమె తనకంటూ ఓ పావుగంటో, అరగంటో కేటాయించుకునేది పొద్దున్నే. మిగిలిన సమయమంతా.. కుటుంబ బాధ్యతలకే అంకితం. ప్రత్యేకించి వ్యాయామం చేసేంత తీరికా, ఓపికా ఉండవు. ముగ్గు భంగిమలే ఆమెకు యోగాసనాలూ, సూర్య నమస్కారాలూ. ముగ్గేయడమే పెద్ద కసరత్తు. నిటారుగా నిలబడాలి, వజ్రాసనంలో కూర్చోవాలి. ధనురాసనంలో విల్లులా నడుము వంచాలి. ఒళ్లంతా చెమటలు పట్టాల్సిందే.


చుక్క తప్పితే లెక్క తప్పుతుంది. ముగ్గు కుదరదు. నలుగురిలో ఎంత నామోషీ! కాబట్టే, ఆ సమయంలో ధ్యానంలాంటి స్థితిలోకి వెళ్లిపోతుంది. ఇక ప్రత్యేకమైన మెడిటేషన్‌ అవసరం లేదు. చుక్కలను కలపడం అంటే, పజిల్‌ పూర్తిచేయడమే. పరోక్షంగా మానసిక వ్యాయామం కూడా. అందుకేనేమో ముగ్గేస్తున్న సమయానికి.. ఆమె శరీరం, మనసు  రెండు వ్యవస్థలూ చక్కని సమన్వయంతో పనిచేస్తాయి. ఒక చుక్క, రెండు చుక్కలు, మూడు చుక్కలు. అడ్డంగా కొన్ని. నిలువుగా కొన్ని.

మహామహా దేవతలకే తైలవర్ణ రూపం ఇచ్చిన రవివర్మ కూడా, ఆ చుక్కల చిక్కులు అర్థం చేసుకోలేక.. తలగోక్కుంటాడేమో. ‘నేను ఖరీదైన బ్రష్‌తో తప్ప చేయలేని పనిని, ఈవిడ రెండు వేళ్లతో ఎలా మేనేజ్‌ చేస్తుందబ్బా!’ అని స్వగతంలోనే చర్చించుకుంటాడేమో. చంద్రుడిని మనోనియామకుడని అంటారు. వెన్నెలరాజు మనసులను చదవడంలో మహానేర్పరి. అంతటి సైకాలజిస్టు కూడా చుక్కల పరమార్థం తెలియక నెలవంక ఆకారంలో మొహం ముడుచుకుంటాడేమో. ఇంత సంక్లిష్టంగా ఉంటుందా ముగ్గుల వ్యవహారం. పావుగంటలో నక్షత్రమండలాన్నంతా నేలకు దించేస్తుంది. 

ఈ చుక్కకు ఆ చుక్క. ఆ చుక్కకు ఇంకో చుక్క. ఒక్కో చుక్కా కలుస్తున్న కొద్దీ, ఒక్కో రహస్యం విడిపోతుంది. కట్టెదుట ఓ కొత్త ప్రపంచం!మేరు పర్వతంలాంటి తేరు.ముత్యపు రాశుల్లాంటి మల్లె తీగలు.ఏ మీనాక్షి కండ్లలోంచో జారి పడ్డట్టు.. చిన్నాపెద్దా చేపల డిజైన్లు. చిదిమి దీపం పెట్టుకోవచ్చనిపించే ప్రమిదల వరుసలు. గోదాదేవి భుజాల పైనుంచి ఎగిరొచ్చిన చిలుకల సమూహాలు. ఒకటా రెండా, ఆమె చేతిలో ప్రాణంపోసుకున్నాక సృష్టిలోని అందాలన్నీ దిష్టి తీయించుకోవాల్సిందే!

అంతలోనే భళ్లున తెల్లారిపోతుంది. పాల ప్యాకెట్ల చప్పుడు. పేపర్‌బాయ్‌ అరుపులు. పక్షుల కిలకిలలు. కుక్కర్ల విజిళ్లు. ‘కాఫీ’ అంటూ బెడ్‌రూమ్‌లోంచి అభ్యర్థనలు. ఆ సృజన సామ్రాజ్ఞి మళ్లీ సామాన్య మహిళగా మారిపోతుంది. పౌష్యలక్ష్మిలా ఇంట్లోకి అడుగుపెడుతుంది.  


logo