e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home జిందగీ పదేండ్లకు సరిపడా కథలున్నాయి

పదేండ్లకు సరిపడా కథలున్నాయి

‘సినిమాను థియేటర్‌లో చూడటంలోనే అపరిమితమైన ఆనందం ఉంటుంది. ఆ ఎక్స్‌పీరియన్స్‌ కాపాడుకుంటే మన జీవితాల్లో ప్రతి శుక్రవారం పండుగే’ అంటున్నారు దర్శకుడు సంపత్‌ నంది. ‘ఏమైంది ఈ వేళ’, ‘రచ్చ’, ‘బెంగాల్‌ టైగర్‌’ సినిమాలతో వాణిజ్య చిత్రాల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారాయన. తాజాగా ఆయన దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సీటీమార్‌’ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు సంపత్‌ నందిని ‘జిందగీ’ పలకరించింది.

‘సీటీమార్‌’కు ఎలాంటి స్పందన వస్తున్నది?

తెలుగు రాష్ర్టాలతో పాటు చెన్నై, నార్త్‌ ఇండియాలోనూ చాలా చోట్ల సినిమాను విడుదలచేశాం. ప్రతి సెంటర్‌లో అద్వితీయ అదరణ లభిస్తున్నది. ఏకగ్రీవంగా హిట్‌ అని చెబుతున్నారు. బాక్సాఫీస్‌కు ఆక్సిజన్‌ పోశారని ప్రశంసిస్తున్నారు. ఒక్క నెగెటివ్‌ కామెంట్‌ కూడా రావడం లేదు.

సెకండ్‌వేవ్‌ తర్వాత విడుదలైన వాటిలో అత్యధిక ఓపెనింగ్స్‌ను సాధించిన చిత్రమిదేనని చెబుతున్నారు?

- Advertisement -

బాలీవుడ్‌ సినిమాలకు మించి అత్యధికంగా ఓపెనింగ్స్‌ను సాధిస్తున్న సినిమా అని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అది విని సంతోషంగా ఫీలయ్యా. కలెక్షన్ల్ల గురించి నిర్మాతలు త్వరలో వెల్లడిస్తారు.

క్రీడా నేపథ్య చిత్రాన్ని మాస్‌ పంథాలో తెరకెక్కించాలనే ఆలోచన ఎలా మొదలైంది?

‘చెక్‌దే ఇండియా’, ‘దంగల్‌’ సినిమాల్లా నిజాయతీతో కూడిన స్పోర్ట్స్‌ సినిమా చేయాలని అనుకోలేదు. అదే విషయాన్ని ఆడియో వేడుకలో చెప్పాను. క్రీడానేపథ్యంలో సాగే యాక్షన్‌ సినిమా ఇది. ఈ పాయింట్‌కు మహిళా సాధికారతను చర్చిస్తూ, ఓ లక్ష్యం కోసం వారు సాగించే పోరాటాన్ని చూపించాను. కథలో మేము చెప్పిన ఎమోషన్స్‌ ప్రతిఒక్కరికీ కనెక్ట్‌ అవుతున్నాయి. మాస్‌ ఆటగా పేరున్న కబడ్డీకి యాక్షన్‌ హంగుల్ని జోడిస్తే వర్కవుట్‌ అవుతుందని నమ్మాను.
అదే నిజమైంది.

చాలా విరామం తర్వాత హీరో గోపీచంద్‌కు సక్సెస్‌ ఇచ్చిన దర్శకుడు మీరే కావడం ఎలాంటి అనుభూతినిస్తున్నది?

పదేండ్లుగా గోపీచంద్‌కు సరైన సక్సెస్‌ లేదు. ఆయన అభిమానుల దాహాన్ని ఈ సినిమా తీర్చింది. హీరోతోపాటు అతడి ఫ్యాన్స్‌ను మెప్పించే సినిమా చేయడం ఏ దర్శకుడికైనా గర్వంగా ఉంటుంది. ప్రస్తుతం నేను ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నా.

ఆంధ్రా, తెలంగాణ నేపథ్యాన్ని ఎంచుకొని సినిమా చేశారు. ఆ రెండు ప్రాంతాలకు సమ ప్రాధాన్యమిస్తూ సినిమా చేయడం చాలెంజింగ్‌గా అనిపించిందా?

కథ రాయడం మొదలుపెట్టినప్పుడే ఆంధ్రా, తెలంగాణలో ఎవరి మనోభావాలను కించపరచకుండా అందరినీ స్నేహంగా కలిపితే బాగుంటుందని అనుకున్నా. సమష్టి విజయం సాధించడంలో అసలైన ఆనందం ఉంటుందని సినిమాలో చూపించా.

దర్శకుడిగా మీరు విజయాన్ని అందుకొని చాలా కాలం అవుతున్నది. షూటింగ్‌ సమయంలో ఈసారి హిట్‌ కొట్టాలనే ఒత్తిడికి గురయ్యారా?

ఇండియా-పాకిస్థాన్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు వెళ్తే.. చివరి నిమిషంలో మనం గెలుస్తామా? లేదా? అనే ఫీలింగ్‌ ఎదురైనప్పుడు ఉండే టెన్షన్‌ మొత్తాన్ని ఈ సినిమా కోసం నేను అనుభవించా. విడుదలకు ముందు మూడు రోజులు సరిగ్గా నిద్రపోలేదు. ‘థియేటర్స్‌కు ప్రేక్షకులు వస్తారా? ఓపెనింగ్స్‌ బాగుంటాయా?’ అనే ఆలోచిస్తూ ఉండిపోయా. నిర్మాతల డబ్బు, మా కెరీర్‌.. అన్నిటినీ పణంగా పెట్టి చేసిన సినిమా ఇది. ఓటీటీలో మంచి ఆఫర్స్‌ వచ్చినా రిస్క్‌ తీసుకొని థియేటర్‌లోనే విడుదలచేశాం. వినాయకుడు మా భయాల్ని పటాపంచలు చేశాడు. క్లయిమాక్స్‌ ఎడిట్‌ చేయడానికి ఇరవై రోజులు తీసుకున్నా. రెండు వెర్షన్‌లను తెరకెక్కించాం. స్పోర్ట్స్‌, వాణిజ్య హంగులు రెండిటినీ మేళవిస్తూ సినిమా చేయడం కత్తిమీద సాములా ఫీలయ్యాను. మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం ఆనందంగా ఉంది.

వినాయక చవితి రోజున ఓటీటీలో ఓ పెద్ద సినిమా విడుదలైంది. ఆ చిత్రానికి పోటీగా మీ సినిమాను థియేటర్‌లో విడుదల చేయాలనే ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది?

మాది క్లాస్‌ సినిమా కాదు. పక్కా మాస్‌ హంగులతో రూపొందించాం. యాక్షన్‌ సన్నివేశాలు, పాటలు, ఎమోషన్స్‌ ఉంటే ప్రేక్షకులు వచ్చి మా సినిమా చూస్తారనే నమ్మకంతోనే ధైర్యంగా థియేటర్‌కు వెళ్లాం. తెలుగు ప్రేక్షకుల విజయమిది. థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఆస్వాదించాలనే ఆలోచన వారిలో రాకపోతే ఎంత గొప్ప సినిమా తీసిన వర్కవుట్‌ కాదు. ప్రతి వేడుకలోనూ థియేటర్‌లను కాపాడుకుందాం అని చెబుతూవచ్చా. నా మాటల్ని ప్రేక్షకులు స్వీకరించడం సంతోషంగా ఉంది.

అనుకున్న బడ్జెట్‌ కన్నా ఎక్కువగా ఖర్చుచేశారన్న టాక్‌ ఉంది. దీనిపై మీరేం అంటారు?

కథ ఏం కోరుతుందో అవన్నీ సమకూరుస్తామని నిర్మాతలు మొదటి రోజే చెప్పారు. ఆ మాటకు కట్టుబడి సినిమా కోసం భారీగా ఖర్చుచేశారు. చెప్పిన బడ్జెట్‌లోనే ఈ సినిమా చేశాం. డిజైనింగ్‌, స్టోరీ
బోర్డ్‌లు సిద్ధం చేసుకున్న తర్వాతే షూటింగ్‌లో అడుగుపెడతాం. అది నాకు అలవాటు. ఈ సినిమాలో అదే పంథాను అనుసరించా.

తదుపరి సినిమా విశేషాలేమిటి?

ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ‘సీటీమార్‌’కు మించిన సినిమా చేయాలని అనుకుంటున్నా. మంచి కథ దొరికితే తప్పకుండా గోపీచంద్‌తో మరో సినిమా చేస్తా. లాక్‌డౌన్‌ కారణంగా విరామం దొరకడంతో ఓటీటీ మాధ్యమం కోసం ‘బ్లాక్‌రోజ్‌’, ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ కథలు రాశాను. నా దగ్గర పదేండ్లకు సరిపడా కథలున్నాయి. వాటి గురించి వెతుక్కోవాల్సిన అవసరం లేదు.

జ్వాలారెడ్డి పాట అందుకే!

ద్వితీయార్థంలో.. ఒకే ఎమోషన్‌తో కథ నడిపించాల్సిన తరుణంలో ప్రేక్షకులకు రిలీఫ్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో ‘జ్వాలారెడ్డి’ పాట పెట్టాం. జ్వాలారెడ్డిగా తమన్నా పేరు సినిమాలో అందరికీ నచ్చింది. ప్రజల హృదయాల్లో ఉన్న జానపద బాణీలను ఎంచుకొని ఈ పాట చేశాం. అందువల్లే ఈ పాట ప్రతి ఒక్కరికీ రీచ్‌ అయింది.

నరేశ్‌ నెల్కి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana