ప్రత్యేకమైన వాసన, కమ్మని రుచి, బంగారాన్ని తలపించే మెరుపు.. పనసపండు ప్రత్యేకతలు. ఆరోగ్యానికి, అందానికి మేలు చేసే గుణాలు పనసలో అపారం.
క్యాలరీల కుండలాంటి పనసలో కొలెస్ట్రాల్ అస్సలుండదు. దీంట్లో విటమిన్- ఎ, సి, ఇ, కె, బి6, నియాసిన్తోపాటు రక్తం తయారీకి అవసరమైన కాపర్, మాంగనీస్, మెగ్నీషియం వంటి సూక్ష్మపోషకాలు ఉంటాయి. ఇవి రక్తహీనతను అడ్డుకుంటాయి.
పనస గింజల్లో ప్రొటీన్లు మెండు. అందుకే, వీటిని వంటకాల్లో వాడతారు. పప్పుధాన్యాలలో లభించే పోషకాలన్నీ ఈ గింజల్లోనూ లభిస్తాయి. తలభాగంలో రక్తప్రసరణ సవ్యంగా జరిగేందుకు పనస తోడ్పడుతుంది.
ఈ పండులోని పోషకాలవల్ల శిరోజాలు ఏపుగా పెరుగుతాయి. పొడిజుట్టు, వెంట్రుకలు కొసభాగంలో చిట్లి పోవడం వంటి సమస్యలను నివారించి, కేశాలను సంరక్షిస్తుంది.
పనస పండులోని-సి విటమిన్ శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. జలుబు, దగ్గు, ఫ్లూలను అడ్డుకుంటుంది. క్యాలరీలు తక్కువే అయినా తక్షణం శక్తిని అందిస్తుంది.
పనస గింజల్ని పాలలో నానబెట్టి, పొడి చేసుకొని చర్మం ముడతల మీద రాసుకుంటే అందంగా కనిపిస్తారు. ఎండిన పనసగింజల్ని పాలు, తేనెలో నానబెట్టి, మెత్తని పేస్టులా చేసి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకుంటే మొహం తాజాదనంతో వెలిగిపోతుంది.
పనస గింజల్ని నేరుగా తినడం వల్ల కడుపుబ్బరం సమస్య తగ్గిపోతుంది. ఈ గింజల్లోని పీచుపదార్థం జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది. వీటిలోని పొటాషియం రక్తంలోని సోడియం నిల్వల్ని నియంత్రిస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరుకు అవసరమైన కాపర్ పనసలో లభిస్తుంది. అధిక, అల్ప రక్తపోట్లు, గుండెపోటు ముప్పులను ఇది నివారిస్తుంది.