2020లో మనకు దూరమైన ప్రముఖులు..

కాలపరిణామంలో ఈ ఏడాది భారంగా గడిచిపోయింది. ఎవరూ ఊహించని విధంగా ప్రపంచాన్ని కాటేసిన కరోనా.. ఎంతోమందిని కాలగర్భంలో కనుమరుగుచేసింది. మనలో ప్రతి ఒక్కరికీ.. తెలిసిన వారిలో కనీసం పదిమందినైనా మహమ్మారి బలితీసుకొన్నది. చివరిచూపులకు నోచుకోని పరిస్థితి.. సగౌరవంగా అంత్యక్రియలు జరుపలేని దుస్థితి. చివరకు కొడుకులు తలకొరివి పెట్టలేని దయనీయ స్థితి.. ఈ క్రమంలోనే ఎంతోమంది మేధావులనూ కోల్పోయాం. ఆధ్యాత్మిక, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో ఎనలేని కృషిచేసిన ఎందరో మహానుభావులు ఈ ఏడాది మనకు దూరమయ్యారు. ఎందరో చిరస్మరణీయులు.. వారిలో కొందరిని స్మరించుకొందాం..
ప్రణబ్ ముఖర్జీ
- 11 డిసెంబర్ 1935- 31 ఆగస్టు 2020
పార్టీలకతీతంగా అంతా ‘ప్రణబ్ దా’ అని ప్రేమగా పిలుచుకొనే రాజకీయ దురంధరుడు. భారతరత్న, మాజీ రాష్ట్రపతి. పార్లమెంటులో ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రి. క్లిష్ట సమయాల్లో ఎన్నోసార్లు కాంగ్రెస్‌ను గట్టెక్కించిన ట్రబుల్షూటర్. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి నమ్మకమైన సలహాదారుడుగా ప్రణబ్ వ్యవహరించారు. ప్రధాని పీఠం అందినట్టే అంది.. దూరమైనప్పటికీ, పార్టీ బలోపేతానికే పాటుపడ్డారు. కరోనా నుంచి బయటపడినా.. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఆగస్టు 31న కన్నుమూశారు. అజాత శత్రువుగా, మహా మేధావిగా, రాజకీయ కురువృద్ధుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా దేశ రాజకీయాలపై ప్రణబ్‌ది చెరిగిపోని ముద్ర.
కర్నల్ సంతోష్‌బాబు
సూర్యాపేటకు చెందిన కర్నల్ బిక్కుమళ్ల సంతోశ్‌బాబు మరణం తెలుగు రాష్ర్టాలతోపాటు దేశం మొత్తాన్ని కదిలించింది. లఢక్ సమీపంలోని గాల్వన్ లోయ ప్రాంతంలో జూన్ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సంతోష్‌బాబు వీరమరణం పొందారు. ఆయన భార్య సంతోషికి తెలంగాణ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చి అండగా నిలిచింది.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
- 04 జూన్ 1946 - 25సెప్టెంబర్ 2020
ఈ ఏడాది తెలుగు రాష్ర్టాలే కాదు భారతీయ సంగీత పరిశ్రమ తన ముద్దుబిడ్డను కోల్పోయింది. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా అనంతర సమస్యలతో బాధపడుతూ సెప్టెంబర్ 25న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో అభిమానులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. పాట కన్నీరు పెడుతున్నదంటూ శోకసముద్రంలో మునిగిపోయారు.
శోభానాయుడు
- (1956- 14 సెప్టెంబర్ 2020)
కూచిపూడి నృత్యంతో సత్యభామ, పద్మావతి పాత్రలకు శోభానాయుడు ప్రాణం పోశారు. ఎంతోమంది ఔత్సాహికులకు కూచిపూడిలో సుశిక్షితులను చేశారు. కళారంగంలో సేవలకుగాను కేంద్రప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. న్యూరోలాజికల్ సమస్యలతో సెప్టెంబర్ 14న మృతిచెందారు.
స్వామి అగ్నివేశ్
- 21 సెప్టెంబర్ 1939 11 సెప్టెంబర్ 2020
ప్రముఖ సామాజిక కార్యకర్త. హక్కుల ఉద్యమకారుడు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి మద్దతు పలికారు. 29 ఏండ్ల వయసులో ఆర్య సమాజ్‌లో చేరి సన్యాసం స్వీకరించారు. 1970లో ఆర్యసభను స్థాపించారు. ఢిల్లీ చుట్టుపక్కల క్వారీల్లో మగ్గుతున్న ఎంతోమంది నిర్బంధ కార్మికులకు విముక్తి కల్పించారు. 1981లో వెట్టి చాకిరీ నిర్మూలనకు ‘బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్'ను స్థాపించారు. చాలాకాలంపాటు కాలేయ సంబంధ సమస్యలతో బాధపడుతూ సెప్టెంబర్ 11న కన్నుమూశారు.
జశ్వంత్ సింగ్
- 3 జనవరి 1938 - 27 సెప్టెంబర్ 2020)
రాజకీయ నేతగా మారిన సైనికుడు. మాజీ ప్రధాని వాజపేయికి అత్యంత ఆప్తుడు. ఆయన హయాంలోనే ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖల మంత్రిగా పనిచేశారు. దేశం ఎదుర్కొన్న ఎన్నో సవాళ్లను వ్యూహాత్మకంగా పరిష్కరించారు. 1998లో పోఖ్రాన్-2 అణు పరీక్షలు, ఆ మరుసటి ఏడాది పాక్‌తో జరిగిన కార్గిల్ యుద్ధం, 2001లో భారత్-పాక్ ఆగ్రా శిఖరాగ్ర సమావేశం వంటి సంక్లిష్ట అంశాలను ఎంతో పరిణతితో పరిష్కరించారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సెప్టెంబర్ 27న కన్నుమూశారు.
రామ్‌విలాస్ పాశ్వాన్
- 1946 8 అక్టోబర్ 2020
దళితుల తలలో నాలుకలా.. వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచిన నేత. దేశ రాజకీయాల్లో ఐదు దశాబ్దాలకు పైగా చెరగని ముద్ర వేసిన రాజకీయ నాయకునిగా రాంవిలాస్ పాశ్వాన్‌కు పేరుంది. ఈయన లోక్ జన్‌శక్తి పార్టీ వ్యవస్థాపకులు. బీహార్ కేంద్రంగా సుదీర్ఘకాలంపాటు దళితులు, బీసీల అభ్యున్నతికి కృషి చేశారు. ఎనిమిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆరుగురు ప్రధానుల మంత్రివర్గాల్లో పనిచేశారు. మోదీ క్యాబినెట్లో మంత్రిగా ఉండగానే హృద్రోగ సమస్యలతో బాధపడుతూ అక్టోబర్ 8న కన్నుమూశారు.
అహ్మద్‌పటేల్
- (21 ఆగస్టు 1949 25 నవంబర్ 2020
గాంధీ కుటుంబం తర్వాత కాంగ్రెస్‌లో అత్యంత బలమైన నేతగా గుర్తింపు పొందారు అహ్మద్ పటేల్. మూడుసార్లు లోక్‌సభకు, ఐదుసార్లు రాజ్యసభకు ఎన్నికైన ఈయన.. ప్రచారానికి దూరంగా, తెర వెనుక రాజకీయం నడుపడంలో సిద్ధహస్తుడు. నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో కింగ్‌మేకర్‌గా గుర్తింపు పొందారు. ట్రబుల్ షూటర్‌గానూ పేరుంది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ నుంచి ప్రస్తుత కాంగ్రెస్ చైర్పర్సన్ సోనియాగాంధీకి అత్యంత నమ్మకస్థుడైన నేతగా, ముఖ్య సలహాదారుడుగా నిలిచారు. నవంబర్ 25న కొవిడ్‌తో చనిపోయారు.
బాతిక్ బాలయ్య
- (24 డిసెంబర్ 2020)
ప్రముఖ చిత్రకారుడు. ఆయన అసలుపేరు యాసాల బాలయ్య. మైనంతో గీసే బాతిక్ చిత్రకళలో ఆయన ప్రసిద్ధుడు. డిసెంబర్ 24న అనారోగ్యంతో కన్నుమూశారు.
పొత్తూరి వెంకటేశ్వరరావు
- (8 ఫిబ్రవరి 1934 5 మార్చి 2020)
పత్రికారంగంలో ఐదు దశాబ్దాలకుపైగా పొత్తూరి వెంకటేశ్వరరావు సేవలందించారు. పలు పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు. తెలుగు భాషాభిమానిగా పేరొందిన పొత్తూరి కొన్ని దశాబ్దాలనాటి తెలుగు పత్రికలను డిజిటలైజ్ చేయడంలో కీలకపాత్ర పోషించారు. మార్చి 5న అనారోగ్యంతో మృతిచెందారు.
తరుణ్ గొగోయ్
- 1 ఏప్రిల్ 1936 23 నవంబర్ 2020
అసోంకు చెందిన దిగ్గజ కాంగ్రెస్ నేత తరుణ్‌గొగోయ్. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే గొగోయ్ అనేంతగా ఆ పార్టీతో పెనవేసుకుపోయారు. 2001-2016 వరకు అసోం సీఎంగా పనిచేశారు. నెహ్రూ-గాంధీ కుటుంబానికి విధేయుడైన గొగోయ్.. రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్న ఉల్ఫా వంటి మిలిటెంట్ సంస్థలను చర్చలకు ఒప్పించడంతో పాటు దివాలా అంచున ఉన్న రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చారు. నవంబర్ 23న అనారోగ్యంతో మరణించారు.
దోర్బల విశ్వనాథశర్మ
- 1931- 5 డిసెంబర్ 2020
సంస్కృతాంధ్ర భాషల్లో అపార పాండిత్యం గడించినవారిలో లబ్ధప్రతిష్ఠులు. ఆయన రచించిన ’శ్రీలాలిత్యం’ విశేష ఆదరణ పొందింది. అనేక విశ్వవిద్యాలయాలనుంచి గౌరవ డాక్టరేట్లు పొందారు. సంస్కృతభాషాభివృద్ధికి విశేష కృషిచేసిన దోర్బల విశ్వనాథశర్మ డిసెంబర్ 5న పరమపదించారు.
గుండా మల్లేశ్
- 13 సెప్టెంబర్ 2020
ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి 1983, 1985, 1994లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో బెల్లంపల్లినుంచి విజయం సాధించారు. కొంతకాలంగా కిడ్నీ, గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న గుండా మల్లేశ్ సెప్టెంబర్ 13న కన్నుమూశారు.
చక్ యేగర్
- 13 ఫిబ్రవరి 1923 7 డిసెంబర్ 2020
ధ్వని కంటే ఎక్కువ వేగంగా ప్రయాణించిన తొలి పైలట్‌గా రికార్డు సృష్టించారు. 1923లో అమెరికాలో పుట్టిన ఈయన.. 1941లో ఆర్మీ ఎయిర్ కార్ప్స్లో చేరారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. 1947, అక్టోబర్ 14న ధ్వని కంటే ఎక్కువ వేగంతో విమానాన్ని నడిపి రికార్డు సృష్టించారు. వృద్ధాప్య సమస్యలతో డిసెంబర్ 7న మరణించారు.
జువ్వాడి రత్నాకర్‌రావు
- (10 మే 2020)
కరీంనగర్ జిల్లా బుగ్గారం నియోజకవర్గం నుంచి 1989లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999, 2004లో గెలుపొందారు. వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. అనారోగ్యంబారిన పడిన జువ్వాడి ర
సున్నం రాజయ్య
- (4 ఆగస్టు 2020)
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత సున్న రాజయ్య 1999, 2004, 2014లో భద్రాచలం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో రంపచోడవరం నుంచి పోటీచేసి ఓడిపోయారు. కరోనాబారిన పడి ఆగస్టు 4న కన్నుమూశారు.
సౌమిత్ర చటర్జీ
- 19 జనవరి 1935 -15 నవంబర్ 2020
ప్రఖ్యాత బెంగాలీ నటుడు. దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే దర్శకత్వం వహించిన ‘అపూర్ సంసార్' (1959) సినిమాతో కెరీర్ ప్రారంభించారు. సినీరంగానికి చేసిన సేవలకుగానూ దాదాసాహెబ్ పాల్కే అవార్డు లభించింది. 60 ఏండ్లపాటు సినిమాల్లో కొనసాగారు. 1994లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. కొవిడ్ సంబంధిత సమస్యలతో నవంబర్ 15న మరణించారు.
ఎఫ్‌సీ కోహ్లీ
- 19 మార్చి 1924 26 నవంబర్ 2020
భారత ఐటీ రంగ పితామహుడు. దేశంలో ఐటీ రంగానికి మార్గదర్శకులుగా నిలిచారు. టీసీఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరు. టీసీఎస్‌కు సీఈవోగా ఆయన అందించిన సేవలు 100 బిలియన్ డాలర్ల భారత ఐటీ రంగ పరిశ్రమకు పునాది వేశాయి. 75 ఏండ్ల వయసులో రిటైరయినప్పటికీ, సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. దేశంలో నిరక్షరాస్యతను రూపుమాపడానికి కృషిచేశారు. నవంబర్ 26న గుండెపోటుతో మరణించారు.
పండిట్ జస్రాజ్
- 28 జనవరి 1930 17 ఆగస్టు 2020
ప్రపంచ ప్రఖ్యాత భారతీయ సంగీత విద్వాంసుడు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డుల గ్రహీత. సుమారు 80 ఏండ్లపాటు సంగీతానికి సేవలు అందించారు. తొమ్మిదో యేటనే హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కొలువులో సంగీత విద్వాంసుడిగా నియమితులయ్యారు. ఆయన సేవలకు గుర్తుగా గతేడాది ఓ చిన్న గ్రహానికి ఆయన పేరు పెట్టారు. ఆగస్టు 17న అమెరికాలో గుండెపోటుతో కన్నుమూశారు.
వీఎస్ రామమూర్తి
- 20 సెప్టెంబర్ 1920-2 సెప్టెంబర్ 2020
ప్రముఖ భరతనాట్య కళాకారుడు, నృత్య శిక్షకుడు వీఎస్ రామమూర్తి వందో ఏట సెప్టెంబర్ 2న మృతిచెందారు. రక్షణ శాఖలో ఇంజినీర్‌గా పనిచేసిన ఆయన నృత్యంపై మక్కువతో శ్రీదేవి నృత్య నికేతన్ స్థాపించి ఎంతోమందిని తీర్చిదిద్దారు.
నాయిని నర్సింహారెడ్డి
- 12 మే 1934 , 23అక్టోబర్ 2020
తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించిన అరుదైన వ్యక్తి నాయిని నర్సింహారెడ్డి. కార్మిక నేత. తెలంగాణకు తొలి హోంమంత్రిగా పనిచేశారు. అనారోగ్యంతోబాధపడుతూ అక్టోబర్ 22న కన్నుమూశారు. ఆయన సెప్టెంబర్ 28న కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత సుమారు రెండువారాల చికిత్స అనంతరం కోలుకున్నారు. కరోనా అనంతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో తుదిశ్వాస విడిచారు.
సోలిపేట రామలింగారెడ్డి
- 6 ఆగస్టు 2020
సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. మాజీ జర్నలిస్ట్. దుబ్బాక ఎమ్మెల్యే. కొన్నాళ్లుగా ఆయనను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ ఆగస్టు 6న మరణించారు. టీఆర్ఎస్ను స్థాపించిననాటి నుంచీ కేసీఆర్ వెంట నడిచిన అతికొద్ది మంది వ్యక్తుల్లో రామలింగారెడ్డి ఒకరు.
నోముల నర్సింహయ్య
- 9 జనవరి 1956- , 1 డిసెంబర్ 2020
న్యాయవాద వృత్తిని వదిలి సీపీఎంలో చేరి రాజకీయ నేతగా ఎదిగారు నోముల నర్సింహయ్య. పేదల పక్షాన పోరాడిన నేతగా గుర్తింపు పొందారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున నాగార్జునసాగర్‌లో పోటీ చేసి మాజీ మంత్రి జానారెడ్డిపై గెలుపొంది సంచలనం సృష్టించారు. డిసెంబర్ 1న గుండెపోటుతో కన్నుమూశారు.
తాజావార్తలు
- కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయినట్టే: విజయ్ రూపానీ
- ట్రైలర్‌తో ఆసక్తి రేపిన గాలి సంపత్ టీం
- 200 మంది ఖైదీలు పరారీ.. 25 మంది మృతి
- రాజన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి
- ఇస్రో సరికొత్త అధ్యాయం.. పీఎస్ఎల్వీ-సీ51 కౌంట్‌డౌన్ షురూ..
- నేటితో ముగియనున్న మేడారం చిన్న జాతర
- సల్మాన్‌కు ధన్యవాదాలు తెలిపిన రాఖీ సావంత్ తల్లి
- నైజీరియాలో 317 మంది బాలికలు కిడ్నాప్..
- మాఘ పూర్ణిమ.. కాళేశ్వరంలో శ్రీవారికి జలాభిషేకం
- అమెరికాలో భారీ అగ్నిప్రమాదం.. 10 బస్సులు దగ్ధం