రివైండ్ 2020: ఊహకందని విషాదాలు.. మార్పులు!

- కరోనా దెబ్బకు కకావికలమైన ప్రపంచం.. పట్టు వదలక పోరాడి వ్యాక్సిన్ అభివృద్ధి
- మరణాలు, దుర్ఘటనలు, దాడులు, ప్రతిదాడులు.. శాంతి, సామరస్యం, మరింత దగ్గరైన మానవాళి
- చెడులోనూ మంచిని చూపిన సంవత్సరం
2020.. ప్రపంచానికి ఓ పీడకలలా నిలిచిపోయే సంవత్సరం.. చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా మనిషిని భయపెట్టిన కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిన ఏడాది ఇది. అదే సమయంలో మనిషి ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిన ఏడాది కూడా ఇదే.. అంతా సజావుగా సాగుతుందని భావిస్తున్న మానవాళిని భవిష్యత్తు గురించి కొత్త ఆలోచనలు చేయాలని హెచ్చరించిన ఏడాది. సరిహద్దు గోడలను కూలగొట్టి మనుషులంతా ఒక్కటిగా ఆలోచించటం మొదలుపెట్టేలా చేసిన ఏడాది. భవిష్యత్తులో మహా ఉత్పాతాలు ఏర్పడినా కలిసికట్టుగా ఎదుర్కోగలమనే భరోసా ఇచ్చిన ఏడాది ఇదే.. కరోనా ఎంత భయపెట్టినా మనిషి మేధస్సు పనిచేయటం ఆగలేదు. 2020లో శాస్త్ర ప్రపంచం పలు గొప్ప ఆవిష్కరణలు చేసింది. పరిశోధకులు నిత్య అధ్యయనంతోఅనేక రహస్యాలను ఛేదించారు.
కరోనా విలయతాండవం
ఆధునిక ప్రపంచం ఎన్నడూ ఎరుగని విపత్తు ఇది. చైనాలోని వుహాన్‌లో తొలిసారి వెలుగుచూసిన కరోనా వైరస్ చూస్తుండగానే అన్ని దేశాలకూ విస్తరించింది. ఇప్పటివరకూ కోట్లాదిమంది వైరస్ బారినపడగా, లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా దెబ్బకు పేద దేశాలతోపాటు అగ్రరాజ్యాలు కూడా వణికిపోయాయి. ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. అనేకమంది ఉద్యోగాలు కోల్పోయారు. కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్న ప్రస్తుత తరుణంలో కరోనా రక్కసి రూపుమార్చుకుని విరుచుకుపడుతుండటం ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నది.
బీరూట్ పేలుడు
ఈ ఏడాది ఆగస్టులో లెబనాన్ రాజధాని బీరూట్‌లో సంభవించిన పేలుడు ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అక్కడి నౌకాశ్రయంలో పెద్ద ఎత్తున నిల్వచేసిన అమ్మోనియం నైట్రేట్ పేలడంతో బీరూట్ నగరం కంపించిపోయింది. అణుబాంబు పడినట్టుగా అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ దుర్ఘటనలో 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు 7000 మంది గాయపడ్డారు. 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
కరోనా టీకా..
2020లో మానవ మేధస్సుకు ఎదురైన అగ్ని పరీక్ష కరోనా వ్యాక్సిన్ తయారీ. అడ్డూ అదుపూ లేకుండా విస్తరించిన కరోనాను ఎదుర్కొనేందుకు భూమి నలుమూలల ఉన్న శాస్త్రజ్ఞులంతా ఒక్కటయ్యారు. దేశాలన్నీ చేతులు కలిపాయి. దశాబ్దాల పాటు కష్టపడితే కూడా సాధ్యం కాని టీకా అభివృద్ధి కేవలం ఐదారు నెలల్లో సాధ్యమైంది. ఇప్పుడు పదుల సంఖ్యలో టీకాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ పరిణామం భవిష్యత్తులో వేగంగా ఔషధాలు తయారుచేయటానికి మార్గం వేసిందనే చెప్పాలి. 2020 ఏడాది కరోనా రూపంలో భయపెట్టి మానవాళిని ఏకం చేసింది.
‘మిడతల దండు’యాత్ర
మిడతల దండు దండయాత్రతో దేశం వణికిపోయింది. దాదాపు 10 రాష్ర్టాలను మిడతలు హడలెత్తించాయి. అనేక హెక్టార్లలో పంటలను నాశనం చేశాయి. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, ఉత్తరాఖండ్లను మిడుతలు చుట్టుముట్టాయి. వాటి నియంత్రణకు పలు రాష్ర్టాలు హెలికాప్టర్ల ద్వారా రసాయనాలను పిచి కారి చేశాయి.
విశాఖ గ్యాస్‌లీక్
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ శివారులో ఉన్న ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్‌లో మే 8న విషపూరిత వాయువు లీక్ కావడం కలకలం రేపింది. ప్రజలందరూ ఆదమరిచి నిద్రిస్తుండగా వేకువజామున 3.30 గంటల సమయంలో ైైస్టెరీన్ మోనోమర్ గ్యాస్ లీకయింది. దీంతో ఊపిరాడక ప్రజలు భయాందోళనతో రోడ్లమీదకు పరుగులు తీశారు. కొంతమంది సొమ్మసిల్లిపడిపోయారు. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మూగజీవాలు మ్యతువాతపడ్డాయి. అధికారులు వేగంగా స్పందించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటంతో ప్రాణనష్టం తగ్గింది.
అతిపెద్ద లాక్డౌన్.. వలస సంక్షోభం
కరోనా వైరస్ కట్టడికి అనేక దేశాలు లాక్‌డౌన్‌ను విధించాయి. మనదేశంలో విధించిన లాక్డౌన్ ప్రపంచంలోనే అతిపెద్దది. దేశంలో తొలిసారి మార్చి 25న లాక్డౌన్ ప్రకటించారు. దీంతో కోట్లాది మంది ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. అత్యవసర సేవలు మినహా అన్నీ మూతపడ్డాయి. పలువిడుతలుగా లాక్‌డౌన్‌ను పొడిగించారు. ఒక్కసారిగా లాక్డౌన్ ప్రకటించటం.. దేశంలో వలస సంక్షోభానికి దారితీసింది. ఉపాధి కోల్పోయి లక్షలాది మంది వలస కార్మికులు రోడ్డున పడ్డారు. రవాణా సేవలు నిలిచిపోవటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వందల కిలోమీటర్లు కాలినడక సాగించి స్వస్థలాలకు చేరుకున్నారు.
వర్క్ ఫ్రం హోం
కరోనా తెచ్చిన అనివార్యతల్లో నుంచి ఆవిర్భవించిన కొత్త విధానం వర్క్ ఫ్రం హోం. గతంలో కూడా ఇలా ఇండ్ల నుంచి పనిచేసే విధానం ఉన్నప్పటికీ.. మూకుమ్మడిగా ఉద్యోగులంతా ఇండ్లనుంచే పనిచేయటం మాత్రం 2020లోనే ప్రారంభమైంది. దాంతో భూమిపై అనేక చోట్ల కాలుష్యం భారీగా తగ్గింది. ప్రజలకు ఇంధన ఖర్చులు తగ్గిపోయాయి. దూర ప్రయాణాలు చేయవల్సిన అవసరం లేకుండానే సేవలు అందించే సౌలభ్యం 2020లో అందుబాటులోకి వచ్చింది.
విద్యా వ్యవస్థలో భారీ మార్పులు
2020లో విద్యా వ్యవస్థ సమూలంగా మారిపోయింది. కరోనా దెబ్బకు పాఠశాలలన్నీ మూత పడటంతో ఆన్లైన్ బోధన ఒక మహా ఉద్యమంగా ప్రారంభమైంది. విద్యార్థులకు ఇండ్లే పాఠశాలలు అయ్యాయి.
ఎగిరే కారు
వాహనాల సంఖ్య పెరగటంతో ప్రపంచవ్యాప్తంగా రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లతో ప్రయాణికులు సతమతమవుతున్నారు. దీనికి పరిష్కారం చూపేందుకు అనేక మంది శాస్త్రవేత్తలు, సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. 2020లో జపాన్‌కు చెందిన ఓ అంకుర సంస్థ గాళ్లో ఎగిరే కారును విజయవంతంగా పరీక్షించింది. స్కైడ్రైవ్ అనే సంస్థ తయారు చేసిన ఎస్డీ-03 అనే కారు ఈ ఏడాది సెప్టెంబర్‌లో గాలిలో చక్కర్లు కొట్టింది. ఈ కారు తయారీ పరిశోధనల కోసం ప్రముఖ కార్ల కంపెనీ టొయోటా నిధులు సమకూర్చింది. ఈ ఎగిరే కారు మూడేండ్లలో మార్కెట్లోకి వస్తుందని స్కైడ్రైవ్ ప్రకటించింది.
భూమిపైకి గ్రహ శకలం మట్టి
భూమిపైకి మొట్టమొదటిసారిగా విశ్వంలోని ర్యుగు అనే గ్రహ శకలం మట్టి నమూనాలు చేరాయి. జపాన్ ప్రయోగించిన హయబుసా-2 వ్యోమనౌక డిసెంబర్ 6న ర్యుగు గ్రహ శకలం నమూనాలను భూమిపైకి చేరవేసింది. విశ్వం పుట్టుక గుట్టును ఈ మట్టి విప్పగలదని భావిస్తున్నారు.
‘హైపర్'లూప్ వేగం
ప్రయాణ వేగంలో విప్లవాత్మకమైన మార్పులు తేనుందని భావిస్తున్న హైపర్‌లూప్ టెక్నాలజీని అమెరికాకు చెందిన వర్జిన్ హైపర్‌లూప్ సంస్థ నవంబర్‌లో విజయవంతంగా పరీక్షించింది. కొన్నేండ్లుగా ఈ టెక్నాలజీపై పరిశోధనలు చేస్తున్న సంస్థ.. తాజాగా మానవ సహితంగా పరీక్షలు నిర్వహించింది. భారీ పైపుల వంటి గొట్టాల్లో గాలి నిరోధకతను పూర్తిగా తొలగించటం ద్వారా అసాధారణ వేగంతో ప్రయాణించటమే హైపర్‌లూప్ టెక్నాలజీ ప్రత్యేకత. వర్జిన్ హైపర్‌లూప్ కారు వంద మైళ్ల వేగాన్ని అందుకున్నది. అయితే, ఈ సంస్థ గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైపర్‌లూప్ కార్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
నూతన కణం
పదార్థంలో మరో నూతన కణాన్ని పరిశోధకులు గుర్తించారు. పరమాణు కేంద్రకంలో ఉండే ప్రొటాన్, న్యూట్రాన్ వంటి మరో కణాన్ని గుర్తించామని యూరప్‌లోని లార్జ్ హాడ్రన్ కొైల్లెడర్ (ఎల్హెచ్సీబీ) పరిశోధకులు ప్రకటించారు. దాంతో ఖగోళ, భౌతిక శాస్త్ర ప్రయోగాలు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉన్నది.
అంతరిక్ష పరిశోధనల్లోకి ప్రైవేటు కంపెనీ
అంతరిక్ష ప్రయోగాల్లో మొట్టమొదటిసారి ఈ ఏడాది ఒక ప్రైవేటు కంపెనీ వాణిజ్య సేవలను ప్రారంభించింది. అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ నలుగురు నాసా వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి విజయవంతంగా చేర్చింది.
భూమిలాంటి గ్రహం
ఖగోళ పరిశోధకులు సౌర కుటుంబానికి బయట భూమిని పోలిన ఓ గ్రహాన్ని గుర్తించారు. టీవోఐ700 డీ అని పేరు పెట్టిన ఈ గ్రహం భూమి అంత సైజులోనే ఉన్నది. భూమికి 101.4 కాంతి సంవత్సరాల దూరంలో డొరాడో నక్షత్ర కూటమిలో ఓ చిన్న గ్రహం చుట్టూ ఇది తిరుగుతున్నది.
అతి ప్రాచీన పదార్థం
భూమి పుట్టకముందే ఆవిర్భవించిన మర్చిసన్ మెటీరియోరైట్ తాలూకు అవశేషాన్ని భూమిపై గుర్తించినట్టు ఈ ఏడాది జనవరి 13న శాస్త్రవేత్తలు ప్రకటించారు. భూమి వయసు 454 కోట్ల ఏండ్లు కాగా, ఈ పదార్థం 7 వందల కోట్ల ఏండ్ల నాటిదని గుర్తించారు.