బుధవారం 03 జూన్ 2020
Zindagi - Jan 29, 2020 , 22:24:39

నిస్వార్థసేవకు దక్కిన గౌరవం

నిస్వార్థసేవకు దక్కిన గౌరవం

నిస్వార్థంగా సేవ చేయాలనే ఆలోచన ఉండాలే కానీ.. ప్రాంతం, దేశంతో సంబంధం ఉండదు. అలాంటి మంచి మనసున్న వారి అడుగులు.. వారికి తెలియకుండానే బాధితులవైపు వెళ్తుంటాయి. సాయమంటూ చేయి చాచిన వారికి ఆపన్నహస్తం అందిస్తుంటాయి. దేశం కాని దేశంలో ఎన్నో అవస్థలు పడే తెలుగువారికి అండగా ఉంటూ.. స్థానిక ఆస్ట్రేలియన్ల సమస్యలు పరిష్కరిస్తూ.. బాధిత వర్గాలకు విద్య, ఉద్యోగం, ఉపాధి మార్గాలు చూపిస్తూ ఆస్ట్రేలియన్ల అభిమానాన్ని చూరగొన్నారు శ్రీమతి సంధ్యారెడ్డి. ఆ దేశం ప్రతిష్ఠాత్మకంగా అందించే ‘స్ట్టార్త్‌ఫీల్డ్‌ సిటిజన్‌ ఆఫ్‌ ది ఇయర్‌- 2020’ అవార్డుకు ఎంపికై.. తెలంగాణ ప్రజల గౌరవాన్ని మరో మెట్టు ఎక్కించారు.

‘కుడి చేతితో చేసిన సాయం.. ఎడమ చేతికి కూడా తెలియకూడదు’ అని అంటుంటారు పెద్దలు. ఈ మాటకు నిలువెత్తు నిదర్శనం శ్రీమతి సంధ్యారెడ్డి. తెలంగాణలో పుట్టిపెరిగి.. ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాలో స్థిరపడిన కర్రి బుచ్చిరెడ్డి, సంధ్యారెడ్డి దంపతులు అక్కడ నివసించే భారతీయులంతా గర్వపడే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ దేశంలోకి వచ్చే కొత్తవారికి సాయం చేయడం, వారికి సలహాలు సూచనలు ఇవ్వడం, పాఠశాలల్లో బాధిత పిల్లలు చేరేలా ప్రోత్సహిస్తూ, వారందరికీ ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రయోజనాలు పొందేలా చూడటంలో సంధ్యారెడ్డి సహకారం అందిస్తున్నారు. ఇలాంటి పనులు ఒక ఎత్తైతే.. క్లీన్‌అప్‌ ఆస్ట్రేలియా డేలో పాలుపంచుకోవడం, స్వచ్ఛతపై ప్రచారం చేయడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, స్థానిక పాఠశాలల్లో చదరంగం పోటీలు ఏర్పాటుచేయడం వంటి అనేక సామాజిక కార్యక్రమాలు నిరంతరాయంగా చేపడుతున్నారు సంధ్యారెడ్డి.  


ఇటీవల ఆస్ట్రేలియాలో సంభవించిన కార్చిచ్చులో కూడా నిరాశ్రయులైన ఎంతోమందికి అన్నం పెట్టి ఆదరించారు సంధ్యారెడ్డి. ‘బుష్‌ఫైర్‌ ఇన్ఫర్మేషన్‌ లైన్‌'లో పనిచేసి వేలాది జంతువులకు ఆశ్రయం కల్పించారు. కార్చిచ్చుతో బూడిదగా మిగిలిన అటవీ ప్రాంతంలో పచ్చదనాన్ని నింపేందుకు విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నారు. ఆస్ట్రేలియాలోని పాఠశాలలను సందర్శిస్తూ.. ప్రకృతి విపత్తులు, పర్యావరణం, జీవ వైవిధ్యంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. స్ట్రార్త్‌ఫీల్డ్‌  ఎస్‌ఈఎస్‌ యూనిట్‌ నిర్దేశించిన విధంగా ఉద్యోగాలు చేపట్టడంలో సహాయం చేస్తున్నారు సంధ్యారెడ్డి. ఈక్రమంలోనే  ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందించే ‘స్ట్రార్త్‌ఫీల్డ్‌ సిటిజన్‌ ఆఫ్‌ ది ఇయర్‌- 2020’ అవార్డుకు ఆమెను ఎంపిక చేశారు. దీంతో భారతసంతతికి చెందిన సంధ్యారెడ్డికి అరుదైన గౌరవం లభించింది. ఎందుకంటే ఈ అవార్డు అందుకున్న తొలి భారతసంతతి మహిళ సంధ్యారెడ్డి. సమాజసేవతోపాటు పర్యావరణ పరిరక్షణకు కృషిచేసేవారిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. 


‘స్ట్టార్త్‌ఫీల్డ్‌ సిటిజన్‌ అవార్డు’ అందుకోవడంపట్ల సంధ్యారెడ్డి సంతోషాన్ని వెలిబుచ్చారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. తన బాధ్యత పెరిగిందని, చేయాల్సిన పని చాలా ఉందని అంటున్నారు. ఆమె నిస్వార్థ సేవను గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వానికి సంధ్యారెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. 


‘స్ట్రార్త్‌ఫీల్డ్‌  సిటిజన్‌ అవార్డు’కు ఎంపిక చేయడమంటే మాటలు కాదు. అది ఆషామాషీ అవార్డు అంతకన్నా కాదు. దీనికి ఎంపిక చేయాలంటే కొన్ని ప్రమాణాలుంటాయి. ఈ ఏడాది అన్ని క్రైటీరియాల్లో చూసినా.. సంధ్యారెడ్డి ఉత్తమంగా నిలువడంతో ఆమెకు అవార్డు అందించారు. సేవాకార్యక్రమాల్లోనే కాకుండా.. రాజకీయంగా కూడా ఆమె ఆస్ట్రేలియన్లకు సుపరిచితురాలే. 2017లో నిర్వహించిన ‘సిడ్నీ సబర్బన్‌ ఏరియా స్టార్త్‌ ఫీల్డ్‌ మున్పిపాలిటీ’ ఎన్నికల బరిలో సంధ్యారెడ్డి నిలిచారు. దీంతో ఆస్ట్రేలియాలో స్థానిక సంస్థలకు పోటీ చేస్తున్న ‘తొలి ప్రవాస తెలంగాణ వాసి’గా ఆమె రికార్డు సృష్టించారు. ‘ఆస్ట్రేలియా జూనియర్‌ చెస్‌ చాంపియన్‌ షిప్‌-2017’ (ఏజేసీసీ)లో ఆమె కొడుకు నిఖిల్‌ రెడ్డి చాంపియన్‌గా నిలిచాడు. 


logo