బుధవారం 27 జనవరి 2021
Zindagi - Jan 14, 2021 , 01:13:57

ముఖచిత్ర ముగ్గులు!

ముఖచిత్ర ముగ్గులు!

నింగిలోని చుక్కల్ని నేలకు దింపి, వాటిని ఓ క్రమంలో కలిపి, అందంగా రంగులు అద్దడం అందరూ చేసేదే. ఈ కుర్రాడు మాత్రం అదే ముగ్గుపిండితో అద్భుతాలు చేసేస్తున్నాడు. అతడి చేతి నుంచి ముగ్గు ఒలికితే ముద్దులొలికే బొమ్మ ప్రాణం పోసుకుంటుంది. వీరూ, వారూ అని తేడా లేదు. ఎవరినైనా ఇట్టే ముగ్గులోకి దించేస్తాడు. అపురూపమైన కళతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించాడు రాయ్‌పూర్‌కు చెందిన రంగోలీ ఆర్టిస్ట్‌ ప్రమోద్‌ సాహూ. 

ప్రమోద్‌ ఐదేండ్లున్నప్పుడు అమ్మతో కలిసి రంగోలీ వేయడం నేర్చుకున్నాడు. ‘నీకెందుకురా ముగ్గులు’ అని వారించలేదు వాళ్లమ్మ. కొడుకు ఉత్సాహం చూసి.. దగ్గరుండి రంగవల్లులు ఎలా తీర్చిదిద్దాలో నేర్పించింది. అమ్మఒడిలో నేర్చుకున్న ముగ్గుల కళను కొత్తపుంతలు తొక్కించాడు ప్రమోద్‌. సాదాసీదా ముగ్గులు వేయడంతో మొదలుపెట్టిన ప్రయాణం.. పోర్ట్రెయిట్లు, కార్టూన్లు వేయడం వరకు వెళ్లింది. ఏడేండ్లున్నప్పుడే ముగ్గుల పోటీలో గెలిచి ఐదు రూపాయల నగదు బహుమతి అందుకున్నాడు. వ్యాపకంగా మొదలైన ముగ్గుల కళను కెరీర్‌గా మలుచుకున్నాడు. అసాధారణమైన ప్రతిభతో ముగ్గుపిండితో ‘హైపర్‌ రియలిస్టిక్‌ త్రీడీ రంగోలీ’లో నిష్ణాతుడయ్యాడు. ఆల్‌ ఇండియా ప్లాటినమ్‌ ఆర్టిస్ట్‌ అవార్డ్‌ కూడా అందుకున్నాడు. అంతర్జాతీయ స్థాయి కళాకారుడిగా ఎదిగాడు. ఒక ఇనిస్టిట్యూట్‌ నెలకొల్పి ఎందరికో తర్ఫీదునిస్తున్నాడు. ఏటా పదిమంది పిల్లలకు ఉచితంగా రంగోలీ నేర్పుతున్నాడు.

గంటల తరబడి

రంగోలీ ఆర్ట్‌ అంటే ముగ్గు వేసినంత తేలిక కాదు. గంటల సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అంతకుమించి ఓపిక చాలా అవసరం. ఒక్కో బొమ్మ గీయడానికి రోజుల తరబడి శ్రమిస్తాడు ప్రమోద్‌. కండ్లు, ఆభరణాలు, కలర్స్‌.. ఇలా ఒక్కోదానికి ఇన్ని గంటల చొప్పున కేటాయించుకొని బొమ్మను దించడం మొదలుపెడతాడు. ఒక్కసారి గీయడం ప్రారంభిస్తే.. ఎన్ని గంటలైనా అదే పనిలో నిమగ్నమవుతాడు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ వర్క్‌షాప్‌లో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాన్ని రంగవల్లిలో తీర్చిదిద్దడానికి 14 గంటల సమయం పట్టిందని చెబుతాడు ప్రమోద్‌. మహాత్మా గాంధీ, రతన్‌టాటా, ప్రధాని మోదీ, ఇతర రాజకీయ ప్రముఖులు, సినిమా సెలబ్రిటీల బొమ్మలతోపాటు పేదల బతుకు చిత్రాలనూ ముగ్గులో చూపుతూ ఎందరినో  మంత్రముగ్ధులను చేస్తున్నాడు.


logo