e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home జిందగీ తేడా వస్తే..ట్రోల్‌ తీస్తా!

తేడా వస్తే..ట్రోల్‌ తీస్తా!

తేడా వస్తే..ట్రోల్‌ తీస్తా!

అమ్మపేరులో కొంత, నాన్న పేరులో ఇంకొంత సొంతం చేసుకున్న గారాలపట్టి రకుల్‌ ప్రీత్‌సింగ్‌. అందం, అంతకుమించిన అభినయంతో టాప్‌ హీరోయిన్‌గా నిలబడింది. కష్టపడే తత్వం ఆమెను టాప్‌గేర్‌లో దూసుకుపోయేలా చేసింది. ఆర్మీ కుటుంబం నుంచి వచ్చిన రకుల్‌ చూసేందుకు కూల్‌గా కనిపించినా తేడా వస్తే ఫైర్‌ బ్రాండే! సామాజిక మాధ్యమాల్లో ఆమె దూకుడే ఇందుకు నిదర్శనం. తన వాదనను సూటిగా, ఘాటుగా చెబుతూ ట్రోలర్స్‌కు చెక్‌ పెట్టేస్తుంది. నెగెటివిటీ అంటే తనకు అస్సలు గిట్టదని చెబుతున్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జీవితంలోని పాజిటివ్‌ సంగతులివి..

నటన అంటే చాలా ఇష్టం. రోజంతా ఏదో ఒక పాత్రలో ఉండాల్సిందే! ఇంటికొచ్చిన తర్వాత కూడా, ఒక్కోసారి నా రియల్‌ లైఫ్‌ గుర్తుకురాదు. ఆ పాత్రల ప్రభావం అంతగా ఉంటుంది. దానినికూడా ఎంజాయ్‌ చేస్తున్నాననుకోండి. సినిమాలను కెరీర్‌గా ఎంచుకోవడం అన్నది కొన్నిసార్లు అనుకోకుండా జరగొచ్చు. కానీ, ఒక్కసారి జర్నీ మొదలయ్యాక నేనెప్పుడూ ‘ఎందుకు ఇక్కడికి వచ్చానా!’ అని బాధపడలేదు. ప్రతి సినిమానూ ఇష్టపడి చేశాను. చేస్తున్నాను కూడా.

360 రోజులు

సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేవడం నా అలవాటు. ఉదయాన్నే వర్కవుట్స్‌ చేస్తాను. వ్యాయామంలో వాయిదాలు ఉండవు. రోజూ తప్పనిసరి. ఏడాదిలో 365 రోజులుంటే, 360 రోజులు నా దినచర్యలో ఎక్సర్‌సైజ్‌ ఉండి తీరుతుంది. ఈ విషయంలో నన్ను నేను మెచ్చుకోవాల్సిందే!

పది స్కూళ్ల చదువు

బాలీవుడ్‌లో అవకాశాలు వస్తుండటంతో హైదరాబాద్‌కు, ముంబయికి తరచూ తిరగాల్సి వస్తున్నది. ఇప్పుడు, ఈ రెండు నగరాలూ నా పుట్టిళ్లలా మారిపోయాయి. నాన్న ఆర్మీ ఆఫీసర్‌ కావడంతో మా క్వార్టర్స్‌లో డిఫరెంట్‌ వాతావరణం ఉండేది. రిచ్‌ అర్బన్‌ కల్చర్‌ అలవాటైంది. కావాల్సినంత స్వేచ్ఛ దొరికేది. కానీ, చాలా క్రమశిక్షణతో మెలిగేదాన్ని. నాన్న దేశమంతా పనిచేయడంతో, నా స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పది స్కూళ్లలో కొనసాగింది. చదువు సంగతి అటుంచితే.. హిందీ, పంజాబీ, ఇంగ్లిష్‌లపై మంచి పట్టు వచ్చింది. తెలుగు సరేసరి. తమిళమూ మాట్లాడగలను.

జాతకం చూపించారట

మొదట్లో మోడలింగ్‌ అంటే ఆసక్తి ఉండేది. అదికూడా అమ్మ ప్రోత్సాహంతోనే. అనుకోకుండా నా ప్రయాణం సినిమాల వైపు మళ్లింది. ప్లస్‌టూ అయ్యాక, కన్నడ ఇండస్ట్రీ నుంచి ఒక ఆఫర్‌ వచ్చింది. వాళ్లు నేరుగా నాన్నను కాంటాక్ట్‌ అయ్యారు. ఆ నిర్మాతలు నా జాతకం చూపించారట. ‘మీ అమ్మాయి పెద్ద స్టార్‌ అవుతుంది’ అని నాన్నతో చెప్పారట. నాన్నకూడా సరేననడంతో, 2009లో కన్నడంలో ‘గిల్లీ’ అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చాను. అప్పటికి నాకు 18 ఏండ్లు. సినిమాల్లోకి వచ్చి అప్పుడే పుష్కర కాలం అయింది! దాదాపు 38 సినిమాల్లో నటించాను. కెరీర్‌ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోవడం సంతోషంగా ఉంది.

కారు కొనుక్కుందామని..

‘గల్లీ’ సినిమా తెలుగులో వచ్చిన ‘7/జి బృందావన్‌ కాలనీ’కి రీమేక్‌. ఆ సినిమా చూడమని నిర్మాతలు సీడీ పంపించారు. ైక్లెమాక్స్‌ చూసి నేను చేయనని ఒకటే ఏడుపు. నా కోసం ైక్లెమాక్స్‌ కూడా మార్చారు. రెమ్యునరేషన్‌ లక్షల్లో ఉండేసరికి నాకు ఆశ్చర్యమేసింది. ఒక సినిమాకు అంత ఇస్తారని నాకు తెలియదు. అప్పటికి నా పాకెట్‌ మనీ నెలకు జస్ట్‌ రెండు వేలు! ఆ డబ్బుతో కారు కొనుక్కోవచ్చన్న ఆశతో ఓకే చెప్పాను.

డేట్స్‌ ఇచ్చేదాన్ని కాదు

ఢిల్లీలో ఉన్నప్పుడు సౌత్‌ ఇండస్ట్రీ అనేది ఒకటి ఉందని కూడా తెలియదు. అందుకే సినిమా అవకాశాలు వస్తే పెద్దగా రెస్పాండ్‌ అయ్యేదాన్ని కాదు. కన్నడలో ఆఫర్‌ వచ్చాకే ఆ భాష నేర్చుకున్నా. సెట్స్‌లో కన్నడంలో మాట్లాడుతుంటే అందరూ షాక్‌. ‘గల్లీ’ తర్వాత తెలుగులో ఆఫర్లు రావడం మొదలైంది. అప్పట్లో నేను డిగ్రీ చేస్తున్నా. ఏ సినిమా అవకాశం వచ్చినా నెల, రెండు నెలల డేట్స్‌ అడిగేవారు. ‘నాలుగైదు రోజులైతే ఓకే..’ అనేదాన్ని. ‘కెరటం’లో హీరోయిన్‌ అవకాశం వచ్చినా, అన్ని రోజులు రావడం కుదరదని అనేసరికి గెస్ట్‌ రోల్‌కు బుక్‌ చేసుకున్నారు. 2011 మిస్‌ ఇండియా పోటీల తర్వాత కానీ, ఇండస్ట్రీ అంటే ఏమిటి, అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి.. అన్న విషయాలు అర్థం కాలేదు. క్రేజీ ఫీల్డ్‌లో చాన్స్‌లు తలుపు తడుతున్నా, మిస్‌ చేసుకున్నానే అనిపించింది. ఆ తర్వాత తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ నుంచి మొదలైన జర్నీ ఇదిగో ఇలా హ్యాపీగా కొనసాగుతూనే ఉంది. తెలుగులో నాకు మంచిమంచి పాత్రలు ఇస్తున్నారు. ఏ నటికైనా ఇంతకంటే ఏం కావాలి?

గోల్ఫ్‌ గోల్‌

గోల్ఫ్‌ ఆడటం ఇష్టం. ఇది ఈ మధ్య నేర్చుకున్నది కాదు. నాకు, మా తమ్ముడు అమన్‌ప్రీత్‌కు ఈ క్రీడలో మంచి పట్టే ఉంది. పద్నాలుగేండ్లు ఉన్నప్పుడే జూనియర్‌ సర్క్యూట్‌ పూర్తి చేశానంటే గోల్ఫ్‌లో నా గోల్‌ ఎంత కచ్చితంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. మోడలింగ్‌పై దృష్టి పెట్టడంతో ఆటకు దూరమైన మాట వాస్తవమే! కానీ, ఇప్పటికీ సీరియస్‌గా ఆడుతూనే ఉన్నా. కొన్నాళ్ల కిందట కపిల్‌ దేవ్‌తో కలిసి ఓ ఈవెంట్‌లోనూ పాల్గొన్నా.

ట్రోల్స్‌ పట్టించుకోను కానీ

చాలా విషయాల్లో నేను చాలా ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతాను. న్యాయం మనవైపు ఉంటే ఎవరు ఏమనుకుంటారన్నది ఆలోచించను. కాస్త దూకుడుగానే ఉంటాను. సామాజిక మాధ్యమాల్లో నా వాదనను బలంగానే వినిపిస్తాను. నెగెటివ్‌ పీపుల్‌ గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం వేస్ట్‌ అనిపిస్తుంది. ట్రోల్స్‌పై స్పందించాలని ఉన్నా చాలా సందర్భాల్లో ఇగ్నోర్‌ చేస్తాను. మరీ శ్రుతిమించితే మాత్రం ఊరుకోను.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తేడా వస్తే..ట్రోల్‌ తీస్తా!

ట్రెండింగ్‌

Advertisement