బుధవారం 03 మార్చి 2021
Zindagi - Feb 23, 2021 , 02:45:07

అంధుల బంధువయా!

అంధుల బంధువయా!

  • రేడియో ఉడాన్‌

ఆ క్షణం వరకూ కనువిందు చేసిన రంగులన్నీ ఒక్కసారిగా మాయమయ్యాయి. తన తెలివితేటలకు మురిసిపోయే అమ్మ మొహంలో ఆశ్చర్యం కనిపించకుండా పోయింది.  ఆప్యాయతకు మారుపేరైన నాన్నముఖాన్ని చూడటం అదే ఆఖరవుతుందని అనుకోలేదు. పెండ్లయ్యాక, అనుకోకుండా ఆమె చూపును కోల్పోయింది. మానవ తప్పిదం  బతుకునుచీకటి మయం చేసింది. అయినా కుంగిపోలేదామె.

నిరాశకూ లోనుకాలేదు. అంధత్వాన్ని సవాలుగా స్వీకరించింది. మనసుతో లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. తోటి అంధులకు బంధువైంది. ‘రేడియో ఉడాన్‌' యూట్యూబ్‌ చానల్‌ ద్వారా చీకటి జీవితాల్లో వెలుగును ప్రసరింపజేస్తున్నది.. మినాల్‌ సింఘ్వి.మినాల్‌ పుట్టిందీ, పెరిగిందీ హైదరాబాద్‌లోనే. ఆమె తండ్రి మహావీర్‌ పటేరా, తల్లి చంచల్‌ జైన్‌. వారిది రాజస్థాన్‌. మినాల్‌ పుట్టకముందే బొల్లారంలో స్థిరపడ్డారు. బీకామ్‌ చదివిన మినాల్‌ దేవాదాయ శాఖలో ఆఫీస్‌ సబార్డినేట్‌గా ఉద్యోగం సంపాదించింది. 1997లో వ్యాపారవేత్త అభయ్‌తో పెండ్లి జరిగింది. హాయిగా సాగుతున్న జీవితంలో ఒక్కసారిగా చీకట్లు ముసురుకున్నాయి. 2007లో ఇంజెక్షన్‌ వికటించి మినాల్‌ శాశ్వతంగా కంటి చూపును కోల్పోయింది. అయినా అధైర్య పడలేదామె. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. భర్త, తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడైంది. దీంతో, కంటి చూపు లేదన్న బాధ నుంచి త్వరగానే కోలుకుని, కొత్త జీవితాన్ని ప్రారంభించింది. 

చీకటి నుంచి వెలుగులోకి..

చీకటి ఎంత నరకమో చూపు లేనివారికే తెలుస్తుంది. అంధుల బతుకుల్లోని పరిమితులు మినాల్‌కు అర్థమయ్యాయి. వారి కోసం ఏదైనా చేయాలని అనుకుంది. ఈ ప్రయత్నంలో అండగా ఉంటానని మాటిచ్చాడు భర్త. అప్పటికే వారికో పాప, బాబు. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే తనలా అంధత్వంతో బాధపడేవారికి ఊతకర్ర కావాలని భావించిందామె. ఆన్‌లైన్‌ ద్వారా అంధులకు అవసరమైన సమాచారం ఇవ్వడంతోపాటు వారికి సామాజిక, రాజకీయ అంశాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఆన్‌లైన్‌లో ‘రేడియో ఉడాన్‌'కు నాంది పలికింది మినాల్‌. కొంత మంది మిత్రులు, గతంలో రేడియోలో పనిచేసిన సహృదయుల సాయంతో 2014 ఫిబ్రవరి 2న ఆన్‌లైన్‌ రేడియో ప్రసారాలను ప్రారంభించింది. 

ఉద్యోగం చేస్తూనే..

రేడియో సేవలు నిర్విఘ్నంగా కొనసాగించడానికి మినాల్‌ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోకుండానే, ఐదారు నెలల్లో సాంకేతిక విషయాల మీద పట్టు సాధించింది. ఉద్యోగం చేస్తూనే ‘రేడియో ఉడాన్‌'ను నడిపిస్తున్నది.  ఉదయం 9 గంటల వరకు ఇంటిపని, సాయంత్రం 5.30 వరకు ఆఫీసు. మళ్లీ, ఇంటి పని పూర్తి చేసుకొని రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు రేడియో కోసం శ్రమిస్తున్నది. 

‘రేడియో ఉడాన్‌' యూట్యూబ్‌ చానల్‌తోనే గాకుండా ఫేస్‌బుక్‌, యాప్‌ల ద్వారా కూడా దివ్యాంగులకు విలువైన సమాచారాన్ని అందిస్తూ అనతికాలంలోనే వారికి మరింత చేరువైంది. ప్రస్తుతం, సుమారు 125 దేశాల్లోని వారు ‘రేడియో ఉడాన్‌' కార్యక్రమాలను ఫాలో అవుతున్నారు.

రోజువారీ కార్యక్రమాలివి..

ప్రస్తుతం ప్రసార మాధ్యమాలు ఎంత విస్తరించినా దివ్యాంగులకు పనికొచ్చే సమాచారం అరకొరగానే ఉంటున్నది. ఉద్యోగాల నోటిఫికేషన్లు, ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు ‘రేడియో ఉడాన్‌' చానల్‌ అందుబాటులో ఉంచుతున్నది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అంధులకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నది. గణితం, ఆంగ్ల భాషకు సంబంధించి పలు అంశాలను శ్రోతలకు అందిస్తున్నది. పోటీ పరీక్షలకు అవసరమైన మెలకువలు చెబుతూనే, ఆయా పాఠ్యాంశాల్లో పట్టు సాధించేలా పలు కార్యక్రమాలు రూపొందిస్తున్నది. అంతేకాదు, పాపులర్‌ సాహిత్యాన్ని ఆడియో బుక్స్‌ రూపంలో వినిపిస్తున్నది.

వికలాంగులే ఉద్యోగులు

‘రేడియో ఉడాన్‌'లో ఎందరినో భాగస్వాములను చేసింది మినాల్‌. ఇక్కడ పని చేస్తున్న వారంతా దివ్యాంగులే. ప్రస్తుతం 25 మంది ఆర్జేలు ఉన్నారు. వారిలో చాలామంది ఉన్నత విద్యావంతులే. కొందరు స్వచ్ఛంద సేవగా పనిచేస్తున్నారు.  టాకింగ్‌ అప్లికేషన్ల సాయంతో ప్రోగ్రాములను  సొంతంగా రూపొందిస్తున్నారు. ఆసక్తి, ఆత్మవిశ్వాసం కలిగిన దివ్యాంగులను ఎంపిక చేసి.. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, కంప్యూటర్‌ ఆపరేటింగ్‌లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నది మినాల్‌. ఈ ఆరేండ్లలో సుమారు 400 మంది దివ్యాంగులు రేడియో ఉడాన్‌లో విధులు నిర్వహించారు. ఇక్కడి అనుభవంతో ఇతర సంస్థల్లో మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నవారూ అనేకం. ఆర్జేలు కాకుండా మరో ఆరుగురితో కూడిన కోర్‌ టీమ్‌ ‘రేడియో ఉడాన్‌' బాధ్యతలను పర్యవేక్షిస్తున్నది. ‘సమష్టి కృషి ఫలితంగానే మా ప్రసారాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నాం. త్వరలో మరింత మందికి చేరువ అవుతాం’ అని చెబుతున్నది మినాల్‌ సింఘ్వి.

వినూత్న కార్యక్రమాలు

వారాంతాల్లో స్కైప్‌ ద్వారా సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై చర్చలు నిర్వహిస్తూ అంధులవాణిని ప్రపంచానికి చాటుతున్నది ‘రేడియో ఉడాన్‌'. ఈ చానల్‌లో అపార ఆదరణ పొందిన ‘మ్యాజిక్‌ ఆఫ్‌ మ్యాథ్స్‌', ‘మిస్టర్‌ కన్ఫ్యూజన్‌ మాస్టర్‌' లాంటి కార్యక్రమాలకు మినాల్‌ సింఘ్వి ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. రేడియో ఉడాన్‌ వార్షికోత్సవాన్ని ఒక్కో ఏడాది ఒక్కో రాష్ట్రంలో నిర్వహిస్తుంటారు. ప్రతి వార్షికోత్సవంలో ఎంతోమంది ప్రముఖులు పాల్గొంటారు. ఆ రేడియో శ్రోతలకు అదో పెద్ద పండుగ.

ఆత్మవిశ్వాసంతో లోపాలను జయించవచ్చు..

నా భర్త, పిల్లల సహకారంతోనే నా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నా. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని. దివ్యాంగులను ఆదరించి, ప్రోత్సహిస్తే వారు ఏ రంగంనైనా రాణించ గలుగుతారు. ఆత్మవిశ్వాసంతో ఏమైనా సాధించవచ్చు. దృష్టిలోపమే  కాదు, ఎంత తీవ్ర లోపాన్ని అయినా జయించవచ్చు. భవిష్యత్‌లో అంధుల కోసం మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని  భావిస్తున్నాం.

  • మినాల్‌ సింఘ్వి డైరెక్టర్‌, రేడియో ఉడాన్‌ 

-మ్యాకం రవికుమార్‌

VIDEOS

logo