బుధవారం 30 సెప్టెంబర్ 2020
Zindagi - Sep 16, 2020 , 00:15:27

పండిత్‌జీతో ఇంకా మాట్లాడలేదు

పండిత్‌జీతో ఇంకా మాట్లాడలేదు

రాజనీతిజ్ఞతతో ప్రధాని ఇందిరాగాంధీకి అనతికాలంలోనే ము ఖ్యమైన వ్యక్తిగా మారారు పీవీ నరసింహారావు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్‌లో వర్గపోరు మొదలైంది. 1977లో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగగా అందులో ఇందిరా అనుచరుడిని ఏపీ నేత కాసు బ్రహ్మానందరెడ్డి ఓడించారు. దీంతో కాంగ్రెస్‌ రెండుగా చీలిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇందిరను కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించాలని కాసు వర్గం భావించింది. ఈ విషయం తెలిసిన ఇందిర అర్ధరాత్రి వేళ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పీవీ నివాసానికి వెళ్లారు. ఇందిరాగాంధీ రాకలోని ఆంతర్యమేమిటో ముందుగానే పీవీ గ్రహించినా తనంతటతానుగా ఆమెను ఏమీ అడగలేదు. కొద్దినిముషాల తరువాత ఇందిర ‘పండిత్‌జీ (యూపీ మాజీ ముఖ్యమంత్రి కమలాపాఠి త్రిపాఠి)తో మాట్లాడారా?’ అని అడిగారు. ‘లేదు మేడవ్‌ు ఇంకా మాట్లాడలేదు, మాట్లాడతాను’ అంటూ పీవీ సమాధానమిచ్చారు. కొద్దిసేపు ఇద్దరూ సంక్షోభం గురించి చర్చించుకున్నాక ఆమె తిరిగి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయమే ఇందిరాగాంధీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ నుంచి కాసు వర్గాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. 1978 జనవరి 1, 2 తేదీల్లో భేటీ అయిన ఇందిర వర్గం ఆమెను తమ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. ఆ తరువాత హేమాహేమీ నాయకులంతా బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్‌లో చేరగా.. ఇందిరా కాంగ్రెస్‌లో మర్రి చెన్నారెడ్డి, పీవీ నరసింహారావు మాత్రమే పెద్ద నేతలుగా మిగిలారు.


logo