మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Zindagi - Sep 16, 2020 , 00:15:16

మేము చేసిందీ స్వాతంత్య్ర పోరాటమే..

మేము చేసిందీ స్వాతంత్య్ర పోరాటమే..

పీవీ నరసింహారావు ఎంతటి వారినైనా తన బుద్ధిబలంతోనే మెప్పిస్తారు. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తారు. అనునయంగా మాట్లాడి కార్యాన్ని సాధిస్తారు. అందుకు ఈ సంఘటన ఓ చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి, త్యాగాలను చేసిన వాళ్లకు కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర సమ్మాన్‌ పింఛన్‌తో పాటు వివిధ రకాల సదుపాయాలను, రైల్వే, బస్సు ప్రయాణాల్లో రాయితీలను కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణకు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉండేది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం వారు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనలేదు. నిజాం రాజుకు వ్యతిరేకంగా, సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలని పోరాడారు. ఇదే కారణాన్ని చూపుతూ తెలంగాణ వారికి కేంద్రం స్వతంత్ర సమ్మాన్‌ పింఛన్‌ను ఇచ్చేందుకు కేంద్రం నిరాకరిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే పీవీ నరసింహారావు కొంతమందితో కలిసి సాయుధ రైతాంగ పోరాట సమరయోధుల సంఘాన్ని స్థాపించి పింఛన్‌ కోసం ఏళ్లుగా కృషిచేశారు. ఎట్టకేలకు పీవీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాక అందుకు మోక్షం లభించింది. అప్పుడు కూడా పలువురు ఉత్తరభారత నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారందరికీ పీవీ నరసింహారావు ఒక్కరే  సమాధానం చెప్పారు. భారత్‌కు స్వతంత్రం ఇవ్వాలని, దేశాన్ని విడిచివెళ్లాలని మీరు బ్రిటిష్‌ వారిమీద పోరాటం చేశారు. మేము కూడా నిజాం సంస్థానాన్ని భారత్‌లో కలపాలనే, భారత్‌లో భాగమైన ఓ నేలతల్లి విముక్తి కోసమే పోరాడాం. అందుకే మేం చేసింది కూడా స్వతంత్ర పోరాటమే అని బల్లగుద్ది వాదించి అభ్యంతరం వ్యక్తం చేసిన వారందరి నోళ్లను మూయించారు. పీవీ మాటలతో ఏకీభవించిన ప్రధాని ఇందిరాగాంధీ అటు తరువాత తెలంగాణ ప్రాంతంలోని స్వతంత్ర సమరయోధులకు పింఛన్‌ను మంజూరు చేశారంటే అదంతా పీవీ చలవే. ఆ తరువాత విదేశాంగమంత్రి హోదాలో స్వయంగా కరీంనగర్‌కు వెళ్లి తనతో పాటు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న మిత్రులకు స్వయంగా పింఛన్లను అందజేశారు.


logo