గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Aug 26, 2020 , 00:37:44

కొందరు అనుమానంగా కనిపిస్తున్నారు..

కొందరు అనుమానంగా కనిపిస్తున్నారు..

రాష్ర్ట రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిన స్వల్ప కాలంలోనే ప్రధాని ఇందిరాగాంధీ మెప్పును పొందారు. తన రాజనీతిజ్ఞత, విదేయతలతో అత్యంత అంతరంగిక నమ్మకస్తుల్లో ఒకరయ్యారు. అటు తరువాత ఇందిరా కేబినెట్‌లో తొలుత విదేశాంగ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ఇందిరాగాంధీ హత్య సమయంలో హోంమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే  పీవీ హోంమంత్రిగా విఫలమయ్యారని అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పటికి చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ప్రధాని అంతర్గత భద్రత పూర్తిగా ప్రధాని చేతిలో ఉంటుందనేది. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో మీరు నియమిమంచుకున్న అంతర్గత భద్రతా సిబ్బందిలో కొందరు అనుమానంగా కనిపిస్తున్నారు అంటూ ఇందిరాగాంధీని హెచ్చరించారు. ఆ మాటలను ఆమె పెడచెవిన పెట్టారు. ఆ తరువాత ఆమె హత్య జరిగిన విధానం తెలిసిందే.

దగ్గరా కాదు.. దూరమూ కాదు..

పీవీ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఏపీ ముఖ్యమంత్రిగా నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి ఉన్నారు. ఆయన అనేక సందర్భాల్లో తాను పీవీ శిష్యుణ్ణని, పీవీ చలువ వల్లే సీఎం అయ్యానని పరోక్షంగా ప్రకటించుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో వేదికపై పీవీ సమక్షంలోనూ నేదురుమల్లి చెప్పారు. పీవీపై అభిమానంతో ఆయన కుమారుడు పీవీ రంగారావును తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. దీంతో వారి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని అప్పుడు జోరుగా ప్రచారం సాగింది.  మెడికల్‌, ఇంజనీరింగ్‌ కాలేజీలకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారంటూ నేదురుమల్లి ప్రభుత్వాన్ని హైకోర్టు  ధర్మాసనం తప్పుపట్టింది. అయితే తొలుత తాను సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని  ప్రకటించిన నేదురుమల్లి అదే రోజు రాత్రి పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఆ మరునాడు నేదురుమల్లి రాజీనామా చేయడం, ఆయన స్థానం లో కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి. దీంతో అప్పటి వరకు పీవీకి నేదురుమల్లి అత్యం త దగ్గర అనుకునే వాళ్ల అంచనాలు తలకిందులయ్యాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీ కారం చేసిన తర్వాత జూబ్లీహాలులో జరిగిన  అభినందన సభలో  ‘సీఎం కావాలని తనకు లేదని, పీవీ వత్తిడి చేసి నచ్చజెప్పడంతో కాదనలేక పోయానని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి చెప్పారంటే పీవీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవచ్చు.

అక్కడ నాకేముంది పని!

పీవీ నరసింహారావు ఎప్పుడూ తనకు అప్పగించిన పనికి నూటికి నూరుపాళ్లు న్యాయం చేయాలని భావిస్తుంటారు. ఆ దిశగా సాగిపోతుంటారు. ఇతరత్రా విషయాలను ఆయన పట్టించుకోరు. అంతేకాదు కాలక్షేపమూ ఆయనకు అలవాటు లేదు. ఆయనలోని ఈ లక్షణాలే పీవీని ఎంతో ఉన్నత స్థితికి చేర్చారు. ఇందిరాగాంధీకి దగ్గర చేశాయి. పీవీ పనితీరు ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. 1980లో గుహవాటిలో కాంగ్రెస్‌ పార్టీ మహాసభలు సాగుతున్నాయి. మహామహా నా యకులు, అధ్యక్షురాలు ఇందిరాగాంధీ ఆ సభలో ఉన్నారు. పీవీ మాత్రం సభావేదికపై లేకుండా, సభా ప్రాంగణానికి కొంచెం దూరంగా ఉన్న కుటీరంలో చుట్టూ పుస్తకాలను పేర్చుకుని కూర్చున్నారు. దీనిని గమనించిన ఓ మీడియా మిత్రుడు “ఇదేమిటండి మీరు అక్కడ ఉండకుండా. ఇక్కడ ఏదో చేస్తున్నారు” అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా పీవీ “అక్కడ నాకేముంది పని. పార్టీ తీర్మానానికి సంబంధించిన కాపీని రాసిచ్చాను కదా. ఇప్పుడు వేరే తీర్మానాన్ని తయారు చేయాల్సి ఉంది” అని తలపైకెత్తకుండానే బదులిచ్చి తిరిగి తన పనిలోకి నిమగ్నమయ్యారు. ఒకానొక సందర్భంలో ఆ పాత్రికేయుడే ఈ విషయాన్ని సభాముఖంగా గుర్తుచేసుకున్నారు.

టీడీపీ ఓట్ల చీలిక.. భగ్గుమన్న ఎన్టీఆర్‌

క్రియాశీల రాజకీయాల నుంచే తప్పుకోవాలనే యోచనలో ఉన్న పీవీ రాజీవ్‌గాంధీ హత్య నేపథ్యంలో ఊహించని రీతిలో ప్రధాని అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ప్రధాని హోదాలో పీవీ నంద్యాల నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేయగా, అప్పటి టీడీపీ అధినేత, అప్పుడు నేషనల్‌ ఫ్రంట్‌ చైర్మన్‌గా కూడా ఉన్న ఎన్టీఆర్‌ తెలుగువారు, దక్షిణాదివారు మొదటి సారి ప్రధాని అయ్యారంటూ పీవీపై ఎవరినీ పోటీకి పెట్టలేదు. అయితే ఆ తర్వాత పార్లమెంటులో విశ్వాసపరీక్ష ఎదుర్కోవాల్సి వ చ్చినప్పుడు టీడీపీ ఎంపీలతో పీవీ ఓట్లను వేయించుకున్నారు. ఉహించని ఈ సంఘటనతో పీవీపై  భగ్గుమన్నారు ఎన్టీఆర్‌. ఆ తర్వాత కొంత కాలానికే ఎన్టీఆర్‌ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆ సం దర్భంగా  పార్లమెంట్లో సంతాప ప్రకటన చేశారు. అప్పుడు తనను నిందించిన విషయాలేవి మనసులో పెట్టుకో కుండా ఎన్టీఆర్‌ సినీ, రాజకీయ జీవితం, వ్యక్తిత్వం, విజయాలపై పీవీ అద్భుతమైన ప్రసంగం చేశారు. ఆ ప్ర సంగానికి ముగ్ధులైన టీడీపీ ఎంపీలు పీవీని ప్రత్యేకంగా కలిసి బాగా మాట్లాడారని ప్రశంసలతో ముంచెత్తారు.

ఎవరికి చెప్పాలో వారికి చెప్పాను

భారతదేశం 1998లో ప్రధాని అటల్‌ బిహారి వాజపేయి, డీఆర్డీవో హె్‌డ అబ్దుల్‌ కలాం ఆధ్వర్యంలో ప్రోఖ్రాన్‌ వద్ద అణుపరీక్షలను జరిపింది. ఆ పరీక్షలు ప్రపంచ దేశాల ముందు భారత వైజ్ఞానిక ప్రతిభను చాటిచెప్పాయి. దేశదేశాల నిఘా వర్గాలకు కూడా చిక్కకుండా అంత్యంత గోప్యంగా ఆ పరీక్షలను నిర్వహించడం విశేషం. ఇక్కడ మరో ప్రత్యేకత కూడా ఉన్నది. 

అణుబాంబు తయారీ, పరీక్షలకు సంబంధించిన ప్రక్రియ అంతా కూడా అపర చాణక్యుడు పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న 1996లో పూర్తయింది. ఆ పరీక్షలను జరిపి ఎన్నికలకు వెళ్లి లబ్ధి పొందే అవకాశం ఎంతో ఉన్నా పీవీ అందుకు విముఖత చూపారు. ఆ తరువాత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి చెంది ప్రధానిగా వైదొలిగారు. అటు తరువాత ఒక సందర్భంలో పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అణుపరీక్షలకు సంబంధించిన అంశాలపై విలేకరులు పీవీని  ప్రశ్నించగా “ఆ విషయాలను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి చెప్పాలో వారికి చెప్పాను” అంటూ అక్కడితో ఆ చర్చను ముగించారు. 1998లో అణుపరీక్షలను నిర్వహించిన తరువాత ఇచ్చిన ఇంట ర్వ్యూలో అటల్‌ బిహారి వాజ్‌పేయ్‌ “ఈ ఘనత నాది కాదు. దీనివెనకున్న మాస్టర్‌ మైండ్‌ పీవీనే. నేను ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే శుభాకాంక్షలు తెలుపుతూ ఓ చీటిని అందించారు. అందులో ‘సామాన్‌ తయ్యార్‌ హై‘ అని రాసి ఉంది. అణు పరీక్షలకు సర్వం సిద్ధమైంది” అని వివరించారు. అందుకు సంబంధించిన ప్లాన్‌ను కూడా పీవీ అప్పుడే అందించారని అటల్‌ తెలపడం విశేషం. అప్పుడు గానీ గతంలో పీవీని ఇదే విషయమై ప్రశ్నించిన విలేకరులకు అర్థం కాలేదు అసలు విషయం. ఇదీ ఇద్దరు మహానేతల నిస్వార్థ నిరాడంబర తత్వానికి నిదర్శనం.
logo