ఆదివారం 05 జూలై 2020
Zindagi - Jun 26, 2020 , 23:25:53

వందేండ్ల బాపు.. వందనాలు నీకు!

వందేండ్ల బాపు.. వందనాలు నీకు!

అపర చాణక్యుడు.. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు.. మైనారిటీ ప్రభుత్వాన్ని నిలబెట్టిన వ్యూహకర్త.. విలక్షణ రచయిత..తెలుగు సంప్రదాయానికి నిలువెత్తు సాక్షిసంతకం.. మౌనిబాబా... దివంగత ప్రధాని పీవీ నరసింహారావు గురించి ప్రపంచానికి తెలిసిన పైపై కోణమిది. పీవీ సాబ్‌లోని ‘ఇన్‌సైడర్‌' మాత్రం, ఆయన ముద్దుల కూతురు వాణీదేవికి మాత్రమే పరిచయం. ‘తెలంగాణ ఠీవి..పీవీ’ శతజయంతి వేడుకల ప్రారంభ వేళ... తండ్రిగా, మార్గదర్శిగా జీవితాన్నీ, వ్యక్తిత్వాన్నీ అపారంగాప్రభావితం చేసిన ప్రియమైన బాపుతో తన అనుబంధాన్ని పంచుకుంటున్నారు ఆమె..   

బాపు  పేరు తలుచుకోగానే... ఏ పుస్తకమో చదువుతూ కూర్చున్న గంభీర రూపమే కళ్లముందు మెదులుతుంది.  ఆయన అంత శ్రద్ధగా చదువుతున్నారంటే, ఆ పుస్తకాల్లో ఏదో గొప్ప విషయమే ఉందన్న సంగతి, బడి వయసు రాకముందే నా  చిన్న బుర్రకు అర్థమైపోయింది.  నేను కూడా  పెద్దపెద్ద పుస్తకాలు చదవాలని కలలు కనేదాన్ని. అలా,  పుస్తక పఠనం అలవాటైంది. ‘ఇలా చదవాలి... అలా చేయాలి’ అని బాపు ఎన్నడూ షరతులు పెట్టలేదు. కూర్చోబెట్టి మంచిచెడులూ బోధించలేదు. ఆయన్ని చూసే అన్నీ నేర్చుకున్నాం. ఎనిమిది మంది పిల్లలం.. అందరం బాగా చదువుకున్నాం. సంస్కారాన్నీ అలవరుచుకున్నాం. కళల మీదా, సాహిత్యం మీదా అవగాహన పెంచుకున్నాం. నాన్నకు వ్యవసాయం అంటే ఇష్టం. వంగరకు వచ్చారంటే, పొలానికి పోవాల్సిందే. మా ఊర్లో తొలి పత్తిపంట ఆయనదే. తొలి ద్రాక్షతోటా ఆయనదే.  

మాకు బుద్ధి తెలిసే నాటికే నాన్న రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. నెలలో  పదిరోజులు బయట ఉంటే, పదిరోజులు ఇంట్లో ఉండేవారు. ఆయన వచ్చేసరికి మా అమ్మ కంప్లయింట్లతో సిద్ధంగా ఉండేది. భోజనం వడ్డిస్తూ ఫిర్యాదుల చిట్టా విప్పేది. మేమంతా.. భయంభయంగా గోడ అవతల నిలబడేవాళ్లం. బాపు పిలుస్తాడేమోనని, దండిస్తాడేమోనని భయం. ‘ఈ ఆడపిల్లలు చూశారా?  మగరాయుడిలా సైకిల్‌ నేర్చుకుంటున్నారు’ అనేది. దానికి ఆయన ‘సైకిల్‌ నేర్చుకోవడం మంచిదేగా. బ్యాలెన్స్‌ తెలుస్తుంది’ అంటూ నవ్వేసేవారు. అమ్మ ఊరుకుంటుందా... ‘ఈతలు కూడా కొడుతున్నారు’ అని మరో కంప్లయింట్‌. ‘నీళ్లలో పడితే ప్రాణం కాపాడుకోవాలి కదా!’ మరోసారి చిరునవ్వు. ఆడామగా వివక్ష చూపకుండా మమ్మల్ని పెంచారు. అల్లరిలో మగపిల్లలతో పోటీపడేవాళ్లం.  పరీక్షలూ మార్కుల గురించి  ఎప్పుడూ  ఒత్తిడి చేసేవారు కాదు. అంత  ప్రేమగా మెలిగారు కాబట్టే... అంత మంది పిల్లల మధ్య పెరిగినా, బాపు ప్రేమలో నాకు ఎప్పుడూ లోటు కనిపించలేదు. మమ్మల్ని కోప్పడిన సంఘటన ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. అసలు ఆయన ఒకర్ని కోప్పడటం నేనెప్పుడూ చూడలేదు. అది ఇల్లు కావచ్చు, ప్రధానమంత్రి కార్యాలయం కావచ్చు. అదే గాంభీర్యం. అంతే సహనం. నిజంగా  మౌనమునే. ఇంట్లో కూడా  మితంగానే మాట్లాడేవారు.  ఎప్పుడూ ఏవో ఆలోచనల్లో నిమగ్నమై ఉండేవారు. కానీ అవతలివారు మాట్లాడేది  మాత్రం చాలా శ్రద్ధగా వినేవారు. బాపు మితభాషే కాదు, మితాహారి కూడా. చాలా తక్కువ తినేవారు. అవసరాలు కూడా తక్కువే. ఓ డజను లాల్చీలు, పైజమాలు ఉంటే... సరిపోయేది.

వాటిలో ఓ పోగు పోయినా పట్టించుకునేవారు కాదు. తన స్వభావం చాలా సహజంగా ఉండేది. ఎవరి కోసమో మారడం, ఎవరి కోసమో దుస్తులు మార్చుకోవడం... నచ్చేవి కావు. స్వామీ రామానంద తీర్థను నాన్న మార్గదర్శకులుగా భావించేవారు. స్వామీజీ  నిరాడంబరుడు. రెండే జతల బట్టలు ఉండేవి. ఆయన మరణం తర్వాత నాన్న హైదరాబాదులో ఓ స్మృతి కేంద్రాన్ని స్థాపించారు. స్వామి రామానంద తీర్థ ట్రస్ట్‌ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించేవారు. తన పుస్తక సంపదనంతా ట్రస్ట్‌కు ఇచ్చేశారు.  ప్రధాని పీఠం ఎక్కినప్పుడు ఎలా ఉన్నారో, దిగిపోయినప్పుడూ అలానే ఉన్నారు.  అతిగా సంతోషపడటం కానీ, తీవ్రంగా బాధపడటం కానీ లేదు. స్థితప్రజ్ఞుడు! అలా అని, దేన్నీ పట్టించుకోకుండా ఉండే తత్వమూ కాదు. ఎక్కడ అవసరమో... అక్కడే  ధ్యాస పెడతారు. అదైపోగానే, మళ్లీ తన ప్రపంచంలోకి తాను వెళ్లిపోతారు. పట్టించుకోనట్టే అనిపిస్తుంది కానీ... అంతలోనే అంతటి స్పందనను చూసి ఆశ్చర్యం వేస్తుంది. నాకు పెయింటింగ్‌ అంటే ఇష్టమని బాపుతో ఎప్పుడూ చెప్పలేదు. తనే గ్రహించారు. పెద్దపెద్ద చిత్రకారులను పిలిపించి  సలహాలు ఇప్పించారు. 

రాజకీయాల్ని, కుటుంబాన్ని వేరువేరుగా చూసేవారు బాపు. ఇంట్లో రాజకీయాలు ప్రస్తావించేవారు కాదు. భూ సంస్కరణలు అయినా, ఆర్థిక సంస్కరణలు అయినా... అన్నీ పేపర్లలో చూసే తెలుసుకునేవాళ్లం! 1989-90లో ఆయనకు గుండె ఆపరేషన్‌ జరిగింది. నిదానంగా కోలుకుంటున్నారు. ఆ తర్వాత, సన్యాసం తీసుకుని.. కుర్తాళం పీఠాధిపతిగా బాధ్యతలు తీసుకుంటారని  అనుకునేవారు. అంతలోనే రాజీవ్‌గాంధీ దారుణ హత్య. ఆ మర్నాడు ఉదయం పదకొండు గంటలకి నాన్న ఏఐసీసీ అధ్యక్షులుగా ఎన్నిక అయ్యారని తెలిసింది. అయినా, ప్రధానమంత్రి అవుతారని అనుకోలేదు. ప్రమాణ స్వీకారానికి హాజరైనా అంతా కలలానే ఉంది. తాత్కాలిక బాధ్యతలేమో అనుకున్నాం. కానీ, అంతకాలం దేశాన్ని పాలిస్తారని ఊహించలేదు. ఆయన పీఠం ఎక్కిన మరుక్షణం నుంచీ మా జీవితాలు మారిపోయాయి. అప్పటి వరకూ నేను సిటీ బస్సులోనే కాలేజీకి వెళ్లేదాన్ని. క్లాస్‌రూమ్‌లో పాఠాలు చెప్పేదాన్ని. ఏ అనంతగిరి కొండలకో విద్యార్థులతో వెళ్లి లైవ్‌ డెమాన్‌స్ట్రేషన్‌ ఇచ్చేదాన్ని. బొమ్మలు వేసేదాన్ని.  ప్రధాని కూతురిగా అన్నీ ఆంక్షలే. బస్సు ప్రయాణం వద్దన్నారు. క్లాసులకు వెళ్లడానికి వీల్లేదన్నారు. చుట్టూ భద్రతా వలయయే. 

ఆ సమయంలో, ఆయనతో కలిసి విదేశాల్లో ప్రయాణించే అవకాశం వచ్చింది. అలా, ఎంతోమంది దేశాధ్యక్షులను అతిదగ్గర నుంచీ గమనించాను. కానీ, నాన్న లాంటి అరుదైన వ్యక్తి ఎక్కడా నాకు తారసపడలేదు. మహామహా నాయకులు కూడా నాన్నకు చాలా విలువ ఇచ్చేవారు. ఒక సామాన్యుడు కేవలం తన ప్రతిభతోనే.. ప్రధానమంత్రి స్థాయికి చేరుకోగలడని నిరూపించారు. 

నా పద్దెనిమిదేండ్ల వయసులో  అమ్మ పోయింది. అప్పటి నుంచీ అమ్మను కూడా నాన్నలోనే చూసుకున్నాం. చివరిరోజుల్లో ... వయసు రీత్యా వచ్చే చిన్నపాటి అనారోగ్యాలు మినహాయిస్తే,  హాయిగానే ఉన్నారు. ఓసారి ఆయనకు కంటి ఆపరేషన్‌ చేయించాల్సి వచ్చింది. అప్పుడు ఓ  వారం రోజులు తనతోనే ఉన్నాను. ఆ సమయంలో తన చిన్ననాటి సంగతులన్నీ నెమరేసుకున్నారు. వంగర నుంచి ఢిల్లీ వరకూ తన ప్రయాణాన్నంతా గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో  ఆయనలో నా చిన్నప్పటి బాపు కనిపించారు. ఆయనకు పిల్లలంటే ఇష్టం. మనవళ్లతో మనవరాళ్లతో ఉత్సాహంగా మాట్లాడేవారు. వాళ్ల ఫొటోలు తీసేవారు. ఆడమనేవారు, పాడమనేవారు. టెక్నాలజీ గురించి మాట్లాడేవారు.